Saturday, May 27, 2017

తెలివైన కోడలు ( ప్రాకృతకథ)

తెలివైన  కోడలు
( ప్రాకృతకథ)
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
   
పూర్వం రాజగృహం అనే నగరంలో ధన్యుడు అనే పేరుగల వ్యాపారి ఉండేవాడు  . ఆయన ధర్మపరుడు,  నీతిమంతుడు . ఆయన భార్య భద్ర . ఆమె చాల గుణవతి . సౌందర్యవతి . ఆయనకు ధనపాలుడు, ధనదేవుడు, ధనగోపుడు, ధనరక్షితుడు అనే నలుగురు కుమారులు; ఉజ్ఝిక , భోగవతిక , రక్షిక , రోహిణిక అనే నలుగురు కోడళ్ళు ఉన్నారు .
ఒకనాడు ఆ వ్యాపారికి అర్థరాత్రి సమయంలో ఒక ఆలోచన వచ్చింది . ఒకవేళ నేను మరణించినా , లేదా దేశా౦తరాలకు  వెళ్లిపోయినా ఈ కుటు౦బం బరువు బాధ్యతలు ఎవరు వహిస్తారు?  ఎవరు చక్కగా నడుపగలరు?  అని ఆలోచించాడు .
ఆ మరునాడు లేచి, స్నానం చేసి , భోజనశాలలో సుఖంగా ఆసీనుడై బంధుమిత్రులను, కుమారులను, కోడండ్రను పిలిచి అందరికి రుచికరమైన విందు ఏర్పాటు చేసి, అందరికి కొత్తబట్టలిచ్చి, వారందరూ సంతోషపడిన తరువాత వారి సమక్షంలో కోడండ్రను పిలిచి వారికి ఒక్కొక్కరికి ఐదు ధాన్యంగింజలు పంచుతూ  ముందుగా పెద్దకోడలైన ఉజ్ఝికతో అమ్మాయీ ! నేను నీకు ఐదు ధాన్యం గింజలిస్తున్నాను . నువ్వు వీటిని సంరక్షించు . నేను మరల అడిగినప్పుడు నాకు వాటిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పేడు . ఆమె సరే అని  మామగారిచ్చిన ఆ గింజలను అందుకుని తనలో మామగారి ధాన్యాగారంలో ఎన్నో పెద్దపెద్ద ధాన్యపు  రాసులున్నాయి , ఆయన అడిగినప్పుడు అందులోంచి ఐదు గింజలు తీసి ఇవ్వవచ్చు అని అనుకుని ఆ గింజల్ని ఎక్కడో  పారేసింది . ఆ తరువాత తనపనిలో తాను మునిగిపోయింది .
అలాగే రెండో కోడలు భోగవతిక మామగారిచ్చిన ఆ ధాన్యం గింజల్ని ఒలిచి తినేసింది .  ఆ తరువాత తన పనిలో తాను నిమగ్నమై౦ది . మూడో కోడలు రక్షిక ,  మామగారిచ్చిన ధాన్యం గింజలు అందుకున్న వెంటనే తనలో మామ గారు ఈ గింజల్ని తన కిస్తూ  వీటిని జాగ్రత్తగా రక్షించమన్నారు . ఇందులో ఎదో మర్మం ఉండి ఉంటుంది అని భావించి ఆ గింజల్ని గుడ్డలో మూటగట్టి , రత్నాలు చెక్కిన పెట్టెలో పెట్టి , తలాపుదిక్కున దాచిపెట్టి౦ది . ప్రతిరోజూ మూడు పూటలా తెరచి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోంది . అదే విధంగా ఆ వ్యాపారి, నాల్గవ కోడలు రోహిణికకు  కూడ ఐదు గింజలధాన్యం ఇచ్చి రక్షించమని అడిగాడు . రోహిణిక ఆలోచించింది  మామగారి మాటలలో ఏదో ఆంతర్యం ఉంటుంది . నేను ఈ గింజల్ని రక్షించి అభివృద్ధి చెయ్యాలి అని ఆలోచించుకుంది. తన పుట్టింటి వారిని పిలిచి వారికి ఆ గింజలిచ్చి వర్షాలు పడ్డాక ఒక క్షేత్రంలో వీటిని నాటండి. మొలకెత్తిన గింజల్ని మరల మరల నాటండి . ఈ విధంగా వృద్ధి చేయండి అని కోరింది . అవి నాలుగేళ్ళకే కొన్ని వందల కుండలు సరిపోయే గింజలయ్యాయి .     నాలుగేళ్ళు గడిచి ఐదో ఏడు నడుస్తోంది . ఒకనాడు ఆ వ్యాపారి తనలో కోడళ్ళకు ధాన్యం గింజలు దాచమని ఇచ్చి ఐదేళ్లైంది. ఎవరు దాచారో , ఎవరు సంరక్షించారో , ఎవరు అభివృద్ధి చేశారో తెలుసుకోవలసిన సమయం వచ్చింది అని భావించి బంధుమిత్రులను రప్పించి వారి సమక్షంలో పెద్ద కోడల్ని పిలిచి అమ్మాయీ ! ఐదేళ్ళ క్రితం అందరి సమక్షంలో నీకు దాచమని ఐదు ధాన్యం గింజ లిచ్చాను , వాటిని  నాకు తిరిగి ఇచ్చెయ్యి అని అడిగాడు . ఆమె సరే అని ధాన్యాగారం దగ్గరకెళ్ళి అందులోంచి ఐదు గింజల్ని తీసి మామగారూ! మీరిచ్చిన గింజలివిగో అని చెప్పి ఆయనకు ఇచ్చేసింది . అపుడు ఆయన కోడలితో అమ్మాయీ ! ఇవి నేనిచ్చినవేనా లేక వేరే గింజలా ప్రమాణం చేసి చెప్పమని అడిగాడు . ఆ ప్రశ్నకు ఆమె మామగారితో అయ్యా! మీరు తిరిగి గింజల్ని ఇమ్మని అడిగినప్పుడు కోష్టాగారం నుంచి ఐదు గింజలు తీసి ఇవ్వవచ్చని భావించి అవి ఎక్కడో పారేశాను . ఇవి మీరిచ్చినవి కావు . వేరే గింజలని చెప్పింది . ఆమెమాటలు విన్న మామకు పట్టరాని కోపం వచ్చింది . అందరిని పిలిచి వారి సమక్షంలో ఆమెను ఆ ఇంటిలో బూడిద ఎత్తడం , ఇల్లు అలకడం,  పాచిపనులు చెయ్యడం , కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు సిద్ధం చెయ్యడం , స్నానానికి నీరు ఏర్పాటుచెయ్యడం మొదలైన బయటి పనులు చేసే దాసిగా నియమించాడు . ఆమె ఇంటిలో  బయటి పనులకే పరిమితమైంది .
(వర్ధమాన మహావీరుడు ఈ విషయం చెప్పి తన శిష్యులతో ఓ శ్రమణులారా! ఆ వ్యాపారి యొక్క పెద్దకోడలు మామగారిచ్చిన ఐదు గింజల్ని వదిలి వేసినట్లు మీరు ఐదు వ్రతాలను అంటే అహింసా , సత్యం , అస్తేయం (దొంగతనం చేయకుండుట ) , బ్రహ్మచర్యం , అపరిగ్రహం ( ఉచితంగా ఎవరినుండి ఏది పుచ్చుకొనకుండుట) అనే ఐదు నియమాలను విడిచిపెట్టారో మీరు సంసారంలో చిక్కుకొని ఆమె వలె నీచమైన పనులు చేస్తూ అందరిలో నిందలపాలౌతారు అని హితబోధ చేస్తాడు )
అదే విధంగా ఇచ్చిన గింజల్ని తినేసిన రెండవకోడలు   భోగవతికను ఆ వ్యాపారి పప్పురుబ్బడం , ధాన్యం దంచడం , అన్న౦ వండడం ,  వడ్డించడం మొ|| వంటింటికే పరిమితమై పనులు చేసే దాసిగా నియమించాడు . ఆమె తన ఇంటిలో వంటి౦టికి మాత్రమే పరిమితం చేయబడింది .
(వర్ధమానమహావీరుడు ఇలా అంటున్నాడు. ఓ శ్రమణులారా ! ఎవరైతే ఇంద్రియాలకు బానిసలై  ఈ పంచ మహావ్రతాలు విడిచిపెడతారో వారు ఈ భోగవతిలా సంసార౦లో చిక్కుకొని హీనంగా జీవిస్తారు)
ఇక మూడవకోడలు తన  పెట్టె తెరచి మామగారిచ్చిన ఆ ఐదు గింజల్ని తీసి ఆయన చేతిలో పెట్టింది. ఆ వ్యాపారి కోడలితో ఆమ్మాయీ ! ఇవి నేనిచ్చిన గింజలేనా వేరే గింజలా అని అడిగాడు. ఆమె అవే గింజలని చెప్పింది . ఆయన ఆమెతో అదెలా అని అడిగాడు.  ఔను మామగారు!  మీరు నాకు ఐదేళ్ల క్రితం ఈ ఐదు  గింజలు ఇచ్చి దాచమన్నారు . నేను మీ మాటల్లో ఎదో విశేషం  ఉంటు౦దని భావించి ఆ గింజల్ని ఒక తెల్లటి గుడ్డలో మూటకట్టి పెట్టిలో పెట్టి జాగ్రత్తగా దాచాను . మీ రిచ్చిన ఆ గింజలే  ఈ గింజలు మామగారు ! అంది . అదివిని ఆయన చాల సంతోషించి ఆమెను బంగారం , వెండి , మొ|| ఆభరణాలు,  విలువైన పాత్ర సామానులు ఉండే గదికి సంరక్షకురాలిగా నియమి౦చాడు.
(వర్ధమానమహావీరుడు తన శిష్యులతో ఓ శ్రమణులారా ! మీరు మీ వ్రతములను జాగ్రత్తగా అనుసరిస్తూ వాటిని రక్షిస్తే మీరు రక్షిత వలే అందరికి గౌరవపాత్రులౌతారు అన్నాడు .
ఇక నాలుగో కోడలు వ్యాపారితో మామగారు! మీరు నాకు దయతో  ఒక చిన్న బండి , ఒక పెద్ద బండి ఇప్పించండి మీ గింజలు  మీకు అప్పగిస్తాను అంది . దానికి వ్యాపారి ఆమెతో అదేంటమ్మా! నా గింజలు నా కివ్వడానికి నీకు బళ్ళు కావాలా అదెలాగో వివరించమని అడిగాడు . దానికి సమాధానంగా ఆమె మామగారూ ! మీరు నాకు అందరి సమక్షంలో ఐదు ధాన్యం గింజలిచ్చారు . అవిప్పుడు కొన్ని వందల కుండలు పట్టే ధాన్యం అయ్యాయి . మీరు నాకు బళ్ళు ఇస్తే నేను ఆ ధాన్యం మీకు తీసుకురా గలను  అంది . ఆవ్యాపారి ఆమె కోరిన విధంగా బండ్లను పంపించాడు . ఆమె ఆ బండ్లను తన పుట్టి౦టికి తీసుకెళ్ళి , ధాన్యాగారంలో దాచిన ధాన్యాన్ని బళ్ళల్లోకెత్తించి రాజగృహం చేర్చింది .
ఆనగర వీధుల్లోని జనమంతా ఈ ధన్యుడు చాల ధన్యుడు . ఇతని కోడలు ఐదు గింజల్నిధాన్యపు రాసిగా  పెంచి బండ్లలో నింపి ఇలా తీసుకొస్తో౦ది అని వేనోళ్ళ పొగిడారు . ఆ తరువాత వ్యాపారి తానిచ్చిన అయిదు గింజల్ని వృద్ధిచేసి బండ్లలో  నింపి తెచ్చిన కోడలి నైపుణ్యానికి మిక్కిలి సంతోషించి ఆమెకు సమున్నతస్థానం ఇవ్వడమే కాకుండా  ఆ ఇంటిలో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అర్హతగల ఒక ప్రథానమైన వ్యక్తిగా నియమించాడు .
(వర్ధమాన మహావీరుడు తనశిష్యులతో ఓ శ్రమణులారా! ఈ విధంగా ఎవరు పంచ వ్రతాలను పెంచి పోషిస్తారో వారు  అందరి మన్ననలు పొంది ఈ జన్మలోనే  రోహిణిక వలే ఉన్నతస్థానం పొంది చివరకు సంసార౦ నుంఛి  ముక్తి పొందుతారు .         
                                తెలివిగా ఉండండి విలువైన స్థానం పొందండి  
Note :-  This is a free translation of a story in Prakrit language entitled रोहिणिया सुण्हा compiled and edited by Dr. Sudarsan lal Jain.   ఇది रोहिणिया सुण्हा అనే జైనప్రాకృత కథకు స్వేచ్ఛానువాదం.

No comments: