Thursday, May 25, 2017

భట్టి(రామాయణ)కావ్యం - విశిష్టత

భట్టి(రామాయణ)కావ్యం - విశిష్టత
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
సంస్కృతసాహిత్యానికి సంబంధించిన పండితకవులలో భట్టికవి ప్రధానగణనీయుడు . ఇతడు రావణవధ అను పేరుగల 22 సర్గల మహాకావ్యాన్ని రచించాడు . ఈ కావ్యాన్ని కవిపేరు మీదుగా భట్టికావ్యం అని కూడ పిలుస్తారు . కొంతమంది విమర్శకులు భట్టి, భర్తృహరి ఒక్కరే అని అభిప్రాయపడగా మరికొంతమంది వారిద్దరు భిన్నభిన్న వ్యక్తులని భావిస్తున్నారు. ఒకవేళ భట్టి, భర్తృహరి ఒక్కరే అయినచో భర్తృహరి విక్రమాదిత్యునికి సోదరుడు కాబట్టి అతని కాలం క్రీ ||పూ|| ప్రథమశతాబ్ది అని నిర్ణయించవచ్చు . అట్లుగాక వారిరువురు భిన్న భిన్న వ్యక్తులైనచో కొన్ని చారిత్రక ఆధారములనుబట్టి అతని కాలం 6వ శతాబ్దంగా నిర్ధారించవచ్చు.
ఇక కావ్యం స్వభావాన్ని బట్టి కావ్యశాస్త్రమని, శాస్త్రకావ్యమని రెండు రకాలుగా ఉంటుంది . భట్టి కావ్యమైన రావణవధను కావ్యశాస్త్రంగా పరిగణి౦ప వచ్చు. ఎందుకంటే ఇందలి రామాయణకథ అప్రధానం, వ్యాకరణశాస్త్రాన్ని బోధించడమే ప్రధానం . కావ్యం ద్వారా వ్యాకరణశాస్త్రాన్ని సరళంగా పాఠకులకు బోధించడమే ఈ కావ్యం యొక్క ముఖ్యోద్దేశం . వ్యాకరణశాస్త్రజ్ఞానం సుతరాం లేనివారికి తన కావ్యం అగమ్యగోచరమని కవి తానే స్వయంగా చెప్పుకున్నాడు . కవి కావ్యంలో ప్రధానకథతో బాటుగా అనేక వ్యాకరణ , అలంకార శాస్త్రవిశేషాల్ని జోడించి కావ్యాన్ని రచించాడు . అనగా ఈ కవి శాస్త్రం, కావ్యం అనే రెండు గుఱ్ఱాలపై ఒకే కాలంలో ఎంతో నైపుణ్యంతో ప్రయాణం చేసి తరువాతి శాస్త్రకవులకు మార్గదర్శకుడయ్యాడు . ఈ విధంగా కవి కావ్యాన్ని , శాస్త్రాన్ని  రెంటిని జోడించి రచన చేయడం వల్ల శైలిలో కొంత కృత్రిమత్వం కనిపించినా చాలవరకు ధారాశుద్ధితో ప్రసన్నగంభీరంగా నడిచిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ కావ్యం కేవలం పండితుల కోసం మాత్రమే వ్రాయబడిందని చెప్పక తప్పదు. ఈ కావ్యంలో కవి యొక్క కావ్యనిర్మాణకౌశలాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం .
ఈ కవి వాల్మీకిచే 24౦౦౦ శ్లోకాలలో నిబద్ధమైన రామకథను 1650 శ్లోకాలలో వెల్లడించాడు . కవి తాను ఆశించిన ప్రయోజనం సాధించడం కోసం మూలకథకు కొన్ని మార్పులు చేశాడు .  ఉత్తరరామాయణకథను పూర్తిగా వదలి వేశాడు .
1. వాల్మీకిరామాయణంలో అయోధ్యానగరవర్ణనతో కథ ప్రారంభమౌతుంది. ఈ కావ్యంలో దశరథుని వర్ణనతో కథ ప్రారంభమౌతుంది .
2. రామాయణంలో రామలక్ష్మణభారతశత్రుఘ్నుల వివాహం వర్ణింపబడగా భట్టికావ్యంలో కేవలం రాముని యొక్క వివాహం మాత్రమే వర్ణింపబడింది .
3. రామాయణకావ్యంలోని మంథరావృత్తాంతం భట్టికావ్యంలో లేదు . రాముని పట్టాభిషేకవార్తను విని సహింపలేని కైకయే  తన దుష్టబుద్ధిని ప్రదర్శించింది .
4. వాల్మీకిరామాయణంలో గల సీతాదేవి ఆభరణములను వానరులు రాముని ముందు ప్రదర్శించుట , వాలిసుగ్రీవుల వైరం , వాలివధ, తారావిలాపం మొదలైన విశేషాలు భట్టికావ్యంలో లేవు .
5. రామాయణంలోని యుద్ధకాండలో లేని సాగరవర్ణనం భట్టికావ్యంలో కనిపిస్తోంది . ఇందులో కవి అనేక అలంకారవిశేషాలను ప్రదర్శించడం మనం గమనించవచ్చు .
6. రామాయణంలోని సుగ్రీవరావణుల యుద్ధం , రామ మకరాక్షుల యుద్ధం భట్టికావ్యంలో లేవు
7. కుంభకర్ణుడు మరణించిన పిమ్మట రావణుని శోకం రామాయణంలో వర్ణింపబడింది. భట్టికవికూడ ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ అనేక వ్యాకరణశాస్త్రవిశేషాలను ప్రదర్శించాడు .
8. రామాయణంలోని సుశేణవృత్తాంతాన్ని భట్టి పూర్తిగా వదలివేశాడు .
9. భట్టికావ్యం యుద్ధకాండతోనే సమాప్తమౌతుంది .
ఈ కావ్యంలో నాయకుడైన రాముడు ధీరోదాత్తుడు . ప్రధానరసం వీరం . సందర్భానుసారంగా అనేక రసాలు పోషింపబడ్డాయి . ధర్మపరాయణుడైన రాముని జయం , ధర్మవిముఖుడైన రావణుని పరాజయం వర్ణించడం వల్ల ధర్మం యొక్క గొప్పదనం సూచించబడుతోంది.    
ఈ కవి ప్రకృతిని వర్ణించడంలో ఎంతో నిపుణుడు .
ఈయన వర్ణనలు సందర్భోచితాలు, సహజరమణీయాలున్నూ. కవి శరదృతువును వర్ణించిన తీరు గమనించండి ..

న తజ్జలం యన్న సుచారుపంకజం   న పంకజం తద్యదళీనషట్పదం
న షట్పదోsసౌ న జుగుంజ య: కలం న గుంజితం తన్న జహార యన్మన:     
అందమైన పద్మములతో వికసించని జలం జలమే కాదు . తుమ్మెదలు మూగని పద్మ౦ పద్మమే కాదు . ఏ తుమ్మెద  అవ్యక్తమధురంగా ఝంకారం చేయదో అది తుమ్మెదయే కాదు. హృదయాన్ని ఆకర్షి౦చని ఝంకారం ఝంకారమే కాదు . అంటే ఆ శరదృతువులో వికసించని కమలాలు లేని సరస్సులు గాని , తుమ్మెదలు మూగని కమలాలు గాని , అవ్యక్తమధురంగా ధ్వనిచేయని తుమ్మెదలు గాని , సర్వజన హృదయాలను ఆకర్షి౦చని తుమ్మెదల  నాదాలు గాని  లేవని తాత్పర్యం  .
ఈ కవి కావ్యంలో అష్టాదశవర్ణనలు చేసినట్లు మనం గమనించవచ్చు. ఉత్ప్రేక్షాలంకారంతో కూడిన ఈ శ్లోకం సూర్యోదయాన్ని సహృదయహృదయానురంజకంగా వర్ణించింది .

దరుత్తరే పంక ఇవాంధకారే మగ్నం జగత్సంతత రశ్మిరజ్జు:
ప్రణష్టమూర్తి ప్రవిభాగముద్యన్ ప్రత్యుజ్జహారేవ తతో వివస్వాన్                                

ప్రపంచమంతా దట్టమైన చీకటి అనే బురదలో కూరుకుపోగా తూర్పుకొండపై ఉదయించిన సూర్యుడు కిరణములనెడి త్రాళ్లను పఱచి ప్రాణులను పైకి లాగుతున్నాడా అన్నట్లున్నాడు .  
ఈ కవి సులభగ్రాహ్యమైన వైదర్భీ రీతినే ఇష్టపడినప్పటికీ ఇది శాస్త్రకావ్యం కావడం వల్ల అక్కడక్కడ కఠినమైన గౌడీరీతినే ఆశ్రయించవలసి వచ్చింది .               
ఈ కవి అందమైన అలంకారాలను ఉపయోగించడం లో  చేయితిరిగిన చతురుడు . ఈ కావ్యంలో 20 యమకాలంకారరీతులను ప్రయోగించాడు . చక్రవాళమనే పేరుగల ఈ క్రింది యమకాలంకారభేదాన్ని గమనించండి.
అవసితం హసితం ప్రసితం ముదా  విలసితం విసితం స్మరవాసితం
న సమాదా: ప్రమదా: హతసంమదా: స్మరహితం నిహితం న సమాహితం       
ఈ కవి శబ్దాలంకారాలను ప్రయోగించడంలో ఎంత చతురుడో అర్థాలంకారరచనలో కూడ అంతే నిపుణుడు . అర్థా౦తరన్యాసాలంకారశోభితమైన ఈ క్రింది పద్యం తిలకించండి .
ప్రభాతవాతాహతకంపితాకృతి: కుముద్వతీ రేణుపిశంగవిగ్రహం
నిరాస భ్రుంగం కుపితేవ పద్మినీ న మానినీ సంసహతేsన్యసంగమం
ఇది    ప్రభాతకాలవర్ణన. ఆ సమయంలో కలువలు ముడుచుకోవడం, పద్మాలు వికసించడం మొదలెడతాయి . ఒక పద్మం పూర్తిగా వికసించ లేదు . తన ప్రియుడగు తుమ్మెదను ఆహ్వానించలేదు.    ఆ దృశ్యాన్ని కవి చాల చక్కగా వర్ణిస్తున్నాడు.
ప్రభాతకాలంలో గాలి కలువపూవులగుండా వీచి పుప్పొడిని వెంటతెచ్చు కొనుటచే ఆ తుమ్మెద పుప్పోడిచే దూసరితమైనది. పద్మము ఆ విధంగా    కలువనుండి వచ్చిన పుప్పొడి(దుమ్ము)చేత మలినమైన తన ప్రియుని (తుమ్మెదను) గాంచి అతడు వేరొక కాంతతో (కుముదిని) కూడెనని భావించి అతనిని నిరాకరిస్తోంది . అది సమంజసమే . అభిమానవతియైన ఏ వనితయు తనభర్త (ప్రియుడు) పరకాంతతో కూడుటను సహి౦పలేదు కదా!     ఈ కల్పన ఎంత రమణీయ౦గా ఉంది.
హనుమంతుడు లంకను కాలుస్తున్నప్పుడు కవి శబ్దాలంకారాలతో వర్ణించిన తీరు అర్థం తెలియనివారికి కూడా ఆ సన్నివేశం ఎంత గందరగోళంగా ఉందో వ్యక్తం చేస్తోంది .

సరసాం సరసాం పరిముచ్య తనుం  పతతాం పతతాం కకుభో బహుళ:
సకలై: సకలై: పరిత: కరుణై: ఉదితైరుదితైరివ ఖం నిచితం
నగజా: నగజా : దయితా దయితా: విగతం విగతం లలితం లలితం
ప్రమదా : ప్రమదా: మహతా మహతా: మరణం మరణం సమయాత్ సమయాత్
      
ఈ కవి యొక్క  వ్యాకరణశాస్త్రపాండిత్యం గ్రంథమంతా కన్పిస్తుంది . మచ్చునకు ఒక శ్లోకం :

నిరాకరిష్ణూ  వర్తిష్ణూ వర్ధిష్ణూ  పరితో రణం
ఉత్పతిష్ణూ  సహిష్ణూ చ చేరతు:  ఖరదూషణౌ

కవి ఈ శ్లోకంలో ఇష్ణుచ్  ప్రత్యయరూపాలను అధికంగా ప్రయోగి౦చాడు . పాత్రపోషణలో కూడా ఈ కవి సిద్ధహస్తుడు. రాముని ధీరోదాత్తత, సీత పాతివ్రత్యం , ఆంజనేయుని ఉత్తమ దౌత్యం, రావణుని దౌష్ట్యం , భరతుని సోదరప్రేమ , లక్ష్మణుని సోదరభక్తి , కైక దుష్టబుద్ధి , సుగ్రీవుని మైత్రి , విభీషణుని పాపభీతి మొదలగు అంశాలు ఆయా పాత్రల స్వరూపస్వభావాల్ని వెల్లడిస్తున్నాయి .      
అంతేగాక దశరథ , రావణుల అంత్యేష్టి విశేషాలు , రాజనీతి విశేషాలు , కోశాభివృద్ధి, పంచాంగనిర్ణయం, దండనీతి మొదలగు విశేషాలు కవియొక్క ఇతరశాస్త్ర పరిచయాన్ని తెలియ జేస్తోంది .
ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఆధునికకాలంలో కూడ ఎందరో కవులు రావణార్జునీయ౦ కౌముదీకథాకల్లోలినీ మొదలగు ఎన్నో గ్రంథాలను రచించారు . అనేక కావ్యవిశేషాలతో బాటుగా వ్యాకరణశాస్త్రవిశేషాలతో నిండిన ఈ కావ్యం పాఠకులకు శాస్త్రవిజ్ఞానాన్ని , వినోదాత్మకంగా అందింస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు .
ఉపయుక్త గ్రంథములు :
.                      ౧. రావణ వధ భట్టికవి
.                      ౨ . సంస్కృత సాహిత్య చరిత్ర శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి
.                      ౩. సంస్కృత సాహిత్య చరిత్ర డా|| ముదిగొండ గోపాలరెడ్డి  

.                      & డా|| ముదిగొండ సుజాతారెడ్డి.  --          

2 comments:

Veerabhadram said...

ఈ పుస్తకానికి తెలుగులో టీకా,తాత్పర్య,వ్యాఖ్యానం దొరుకుతుందాండీ?

Durga Prasada Rao Chilakamarthi said...

It is available in Sanskrit . I do not know about telugu commentary.