Monday, April 24, 2017

సాహిత్యక్షేత్రంలో చిఱునవ్వుల జల్లులు

సాహిత్యక్షేత్రంలో చిఱునవ్వుల జల్లులు
L L L  L L L

 డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

             నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం
           దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
          పువ్వులవోలె ప్రేమరసముం గురిపి౦చు విశుద్ధమైన లే
         నవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్
అంటారు శ్రీ జాషువ మహాకవి.
నిజమే ఈ సృష్టిలో ఏ జంతువు నవ్వలేదు . మనిషి మాత్రమే  నవ్వగలడు.  నవ్వులు మానవ మనోవికాసానికి దివ్వెలు. కొంతమంది నవ్వుతారు ఎందుకు నవ్వుతారో ఎవరికీ తెలియదు . కొన్ని నవ్వులు విషపునవ్వులు. అలా కాకుండా పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు సమస్తదు:ఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా  పనిచేస్తాయి అని కవి అభిప్రాయం . అటువంటి విశుద్ధమైన లేత నవ్వుల స్వరూపస్వభావాలు తెలుసుకుందాం .

వాక్యం రాసాత్మకం కావ్యం అనే మాటను బట్టి కావ్యానికి రసం ఆత్మవంటిదని తెలుస్తోంది . కావ్యం యొక్క ప్రయోజనం పాఠకులను ఆనందింపజేయడమే. ఆవిధంగా ఆనందింప జేసే వస్తువు రసం మాత్రమే . శృ౦గారం , హాస్యం , కరుణం , వీరం , రౌద్ర౦ , భయానకం , భీభత్సం , అద్భుతం , శాంతం అని రసాలు తొమ్మిది. కావ్యంలో ఏ రసమైనా చివరకు కరుణరసమైనా సరే అది ఆనందానికే దారి తీస్తుంది . ఇక ఈ వ్యాసంలో హాస్య రసం గురించి తెలుసుకుందాం . అవయవ, వాక్య, చేష్టా వికారములను కనుగొన్నప్పుడు కలుగు మనోవికాసమే హాసం . ఈ హాసమే హాస్యంగా పరిణమిస్తుంది . హాస్యం స్థూల౦గా ఆఱు విధాలు .
1.       దంతాలు కనిపించకుండా నవ్వే నవ్వు స్మితం
2.       దంతాలు కొంచెం కనిపించే విధంగా నవ్వే నవ్వు హసితం
3.       శబ్దం చేస్తూ మధురంగా కొంచెం కనులు మూసుకొని మెల్లగా నవ్వితే అది విహసితం
4.       భుజాలు , తల వంచుకొని వంకర చూపులతో ముక్కుపుటాలెగరేస్తూ నవ్వే నవ్వు ఉపహసితం .
5.       కళ్ళల్లోంచి నీరు వచ్చేలా వికటస్వరంతో కాళ్ళు చేతులూ ఊగిపోయేలా నవ్వే నవ్వు అపహసితం .
6.       చెవులకు కటువుగా ఉండి కన్నీళ్ళు వచ్చేటట్లుగా నవ్వితే అది అతిహసితం . ఈ పై ఆఱి౦టిలో చివరి రెండు ప్రమాదకరమైనవి .    
హాస్యం సున్నితంగా మనోరంజకంగా ఉండాలే గాని కటువుగా , కర్ణకఠోరంగా  ఉండ కూడదు. ఒద్దికగా ఉండాలి గాని హద్దులు దాట కూడదు . ఇతరులలోని దోషాలను సుకుమారంగా ఎత్తి చూపిస్తూ వాటిని పోగొట్టే విధంగా ఉండాలే గాని ఎదుటివాడు ముఖం మాడ్చుకునే విధంగా ఉండకూడదు. మహాభారతంలో ఉత్తరుని ప్రగల్భాలు, కౌరవవీరులను చూసిన తరువాత అతడు ప్రదర్శించిన భయం, పిరికి వారి మనస్తత్వాన్ని తోపింప చేసే విధంగా ఉండరాదని బోధిస్తాయి . అలాగే కన్యాశుల్కంలో గిరీశం వంటి వారి మాటలు పెద్దమనుషులుగా ధర్మపన్నాలు వల్లిస్తూ అందరిని మోసం చేసే కొంతమంది మోసగాళ్ళ స్వరూపస్వభావాలను కళ్ళకు గట్టినట్లు చూపిస్తాయి . ఈ విధంగా ఒక ఆశయసాధనకు ఉపయోగపడేది ఉత్తమహాస్యం . కేవలం నవ్వించడానికే ఉపయోగపడేది మధ్యమహాస్యం . ఇతరుల దోషాలు మాత్రమే వెదకి వారిని గాయపరచడానికి మాత్రమే ఉపయోగపడేది అధమహాస్యం . ఇందులో అధమహాస్యం వల్ల ప్రమోదం కన్నా ప్రమాదం మిన్న .

నవరసాల్లో హాస్యానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది . ఉదా :-  శృ౦గారరసం యువకులకు ఆనందం చేకూర్చవచ్చునేమో గాని పసిపిల్లలకు , వృద్ధులకు ఎటువంటి ఆనందాన్ని చేకూర్చలేదు . అలాగే మిగిలిన రసాలకు కొన్ని పరిమితులున్నాయి . అవి కొంతమందికి మాత్రమే ఆనందాన్ని చేకూర్చగలుగుతాయి. ఇక హాస్యానికి ఎటువంటి పరిమితులు లేవు . అది ఆబాలగోపాలాన్ని ఆనందింపచేస్తుంది . మిగిలినరసాలకు కథావస్తువు మొదలైనవి కావాలి . ఇక హాస్యరసం మాటకొస్తే కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ గారు అనట్లుగా కాదేదీ హాస్యానికనర్హం .  దేనినుంచైనా హాస్యం రాబట్టవచ్చు . చివరకు అందరు అసహ్యించుకునే డోకు నుంచి కూడ హాస్యం రాబట్టవచ్చు . ఉదాహరణకు ఒక అవధానంలో పృచ్ఛకుడు అవధానిగారిని అయ్యా ! అవధానిగారూ! కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు కదండీ అనడిగాడు . దానికి సమాధానంగా ఆయన నిజమే! కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు, కానీ కక్కొస్తే మాత్రం కల్యాణం ఠక్కున ఆగిపోతుందన్నారు. .                  
అన్ని రసాలకు కొన్ని హద్దులున్నాయి .  ఇక  హాస్యానికి ఎటువంటి హద్దులు లేవు .  తక్కిన రసాలు ముందుగా ప్రేక్షకుని హృదయాన్ని బరువెక్కిస్తాయి . ఆతరువాత ఆనందాన్ని కలుగజేస్తాయి . కాని హాస్యరసం హృదయాన్ని తేలికపరుస్తూనే ఆనందాన్ని కలుగజేస్తుంది. మిగిలిన రసాలు ఆన౦దిచడానికి కొంత సమయం పడుతుంది . ఇక హాస్యరసం వెనువెంటనే ఆనందం కలుగ జేస్తుంది. హాస్యం మానసికమైన వత్తిడులను పోగొడుతుంది . మనిషికి మనిషికి మధ్యగల  సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది. మనిషి హాస్యరసానికి స్పందింఛినంత వేగంగా ఏ రసానికి స్పందించలేడు. ఈ విషయాలన్నీ Laughter is the best  medicine. Laughter serves as a safety valve for the over flow of redundant tensions మొ|| మాటల బట్టి వెల్లడౌతున్నాయి . పిబరే రామరసం అని త్యాగరాజు సెలవిస్తే పిబరే హ్యూమ(ర్)రసం అంటున్నారు నేటి యువకులు కొంతమంది .

ఇక హాస్యరసానికి కొన్ని నియమాలు కూడ లేకపోలేదు .
1. హాస్యానికి సమయం సందర్భం చాల అవసరం . సందర్భశుద్ధి లేని హాస్యం అపహాస్యానికి దారి తీస్తుంది .   
         ఒకాయన ఇలా అంటారు : Laughter is the best best medicine, there is no doubt about it. But if you laugh unnecessarly you need medicine. అందువల్ల హాస్యానికి సమయం, సందర్భం చాల అవసరం . విషాద సమయాల్లోనూ , వీరోచితమైన సందర్భాల్లోనూ హాస్యం తగదు.
2. హాస్యానికి మరో ముఖ్యమైన నియమం ఉంది . అదే౦టంటే నవ్వించేవాడు నవ్వకూడదు . మనం ఒక చేత్తో అన్నం తి౦టూ మరోచేత్తో ఇతరులకు వడ్డిస్తోంటే చూసేవారికి , తినేవారికి ఎంత అసహ్యంగా ఉంటుందో నవ్వుతూ నవ్విస్తోంటే చూసేవారికి వినేవారికి అంతే అసహ్యంగా అనిపిస్తుంది . ఈ మర్మం తెలిసిన వారు కాబట్టే శ్రీ రేలంగి వారు ప్రపంచంలోనే గొప్ప హాస్యనటులయ్యారు. ఇతరులను నవ్వించడమే గాని  ఆయనెప్పుడు నవ్వరు. ఆయన ముఖ కవళికలే నవ్వు పుట్టిస్తాయి .  ఇక ఆయన తెలుగునటులు కాకుండా ఆంగ్లభాషా నటులై ఉండి ఉంటే యావత్ప్రపంచం ఆయనకు బ్రహ్మరథం పట్టి ఉండేది . ఇక నేటి కొంతమంది హాస్యనటుల్ని చూస్తోంటే మనం నవ్వవలసిన నవ్వుని కూడా వాళ్ళే నవ్వేస్తారు . మనకవకాశం ఇవ్వరు.  

పూర్వం సంస్కృతనాటకాల్లో విదూషకపాత్ర ద్వారా కొంత హాస్యం పోషింపబడినప్పటికి హాస్యానికి ఎక్కువ ఆదరం లభించలేదనేది వాస్తవం . దానికి కారణాన్ని ఆలోచిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. ఏ సమాజంలో ఒడుదుడుకులు , వత్తిడులు ఉంటాయో ఆ సమాజంలో హాస్యం యొక్క అవసరం ఎక్కువగా కన్పిస్తుంది . పూర్వకాలంలో మన సమాజంలో వత్తిడులు చాల తక్కువగా ఉన్న కారణంగా హాస్యం అవసరం అంతగా లేకపోయి ఉండవచ్చు. రానురాను హాస్యం యొక్క అవసరం ఎక్కువైంది . ఉదాహరణకు మృచ్ఛకటికనాటకంలో ఉన్నంత హాస్యరసం అభిజ్ఞానశాకుంతలంలో లేదు . దానికి కారణం   ఆయా కాలాల సామాజికపరిస్థితులే అని చెప్పకతప్పదు .  ఇక దశరూపకాలలో ఒకటైన ప్రహసనంలో హాస్యానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ అది రాను రాను సభ్యసమాజానికి పనికిరాని మోటు హాస్యానికి చోటుగా మారిపోయింది .
ఇక  సంస్కృతసాహిత్యంలో హాస్యానికి సముచితస్థానం  కల్పించిన రూపకం మృచ్ఛకటికం . అది సమకాలీన సమాజానికొక దర్పణం .  కవి శూద్రకుడు. అతని కాలంలో రాజకీయ , సామాజిక పరిస్థితులు చాల అల్లకలోలంగా ఉన్నాయి . రాజు అవినీతిపరుడు, అసమర్థుడు , భోగలాలసుడున్ను . చివరకు రాజుకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం సాగుతో ఉంటుంది . ఆ రాజును తొలగించి ప్రహారంజకుడైన ఒక వ్యక్తి రాజౌతాడు . ఆ రూపకంలో శకారుడనే ఒక వ్యక్తి రాజుకు సన్ని హితుడుగా ఉండి స్త్రీలను బలాత్కరించడం , మంచివారికి ఇబ్బందులు కలిగించడం వంటి చెడ్డపనులు చేస్తూ ఉంటాడు . వాడికి ఏమి తెలియదు, కాని తనకు అన్ని తెలుసని అనుకుంటూ ఉంటాడు . వసంతసేన అనే వేశ్యను లోబరుచుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు . ఒక నాడు ఆమెను వెంబడిస్తాడు. ఓ వసంతసేనా! కు౦తీదేవి  రావణునకు దొరికినట్లుగా నువ్విప్పుడు నాకు దొరికావు . రామునిచే భయపెట్టబడిన సీతవలె నువ్వు ఎక్కడకు పాఱిపోతావు? విశ్వావసువు చెల్లెలు సుభద్రను హనుమంతుడు అపహరించినట్లుగా నిన్ను నేను అపహరిస్తాను . జమదగ్ని కుమారుడైన భానుసేనుడు గాని , కుంతీపుత్రుడైన రావణుడు గాని నిన్ను నాబారి నుండి కాపాడలేరు  అంటాడు. చీకటిలో వేరొకరిని పట్టుకొని వసంతసేనగా భావించి తన సహ చరునితో బావా ! చాణక్యుడు ద్రౌపదిని పట్టుకున్నట్లుగా నేను ఈమెను పట్టుకున్నాను  అంటాడు .   అలాగే మరో సందర్భంలో వసంతసేన తనకు చిక్కినపుడు ఓ వసంతసేనా! వాలి పుత్రుడైన ఇంద్రుడు గాని , రంభ కుమారుడైన మహేంద్రుడు గాని కాలనేమి గాని , జటాయువుగాని నిన్ను రక్షించలేరు . భారతయుద్ధంలో చాణక్యుడు సీతను చంపినట్లుగా , జటాయువు ద్రౌపదిని చంపినట్లుగా నిన్ను నేను చంపెదను అని తన పురాణ విజ్ఞానాన్ని చాటు కుంటాడు .
ఆ నాటకంలో చారుదత్తుని మిత్రుడు మైత్రేయుడు ఒకసారి వసంతసేన ఇంటికి వెడతాడు . అది చాల అందమైన భవనం . ఒక గదిలో వసంత సేన తల్లి ఉంటుంది . ఆమె   ఊహకందని విధంగా అంటే తలుపు పట్టనంత లావుగా ఉంటుంది .  ఆమెను చూచి ముందుగా ఈమెను గదిలో ఉంచి ఆ తరువాత తలుపులు కట్టి౦చారా? అంటాడు .    
ఒక వ్యక్తి యొక్క రూపాన్ని యథాతథంగా వర్ణించడ౦ వల్ల కూడ హాస్యం పుట్టి౦చొచ్చు .
పూర్వం తిరుమలరాయుడనే ఒక రాజుండేవాడు . ఒకనాడు శ్రీనాథ మహాకవి అతని ఆస్థానాన్ని దర్శించినప్పుడు ఆ రాజు తన అందాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమని కోరాడు . అంతా బాగానే ఉంది గాని అతనికి ఒక కన్ను లేదు . శ్రీ నాధుడు పద్యం అందుకున్నాడు .
అన్నాతి గూడ హరుడగు
అన్నాతిం గూడకున్న నసుర గురుడు నౌ
అన్నా తిరుమల రాయడు
కన్నొక్కటి లేదు గాని కంతుడు కాడే!
ఆరాజు తన భార్యతో కలిసి ఉంటే శివుడు ఔతాడట. ఇతనికి ఒక కన్ను అతని భార్యకు రెండుకళ్ళు, వెరసి మూడు. ఇక ఒంటరిగా ఉంటే (ఒంటికన్ను గల) శుక్రాచార్యుడు. ఆయనకు ఒక కన్ను లేదు గాని అదుంటే ఆయన మన్మథుడే. ఇక్కడ ఒక వైపు ఆక్షేపం రెండోవైపు పొగడ్త మనకు హాస్యాన్ని పుట్టిస్తాయి .
కొన్ని సాంఘికదురాచారాలను సునిశితంగా విమర్శించడం వల్లకూడ హాస్యం పుడుతుంది . వరకట్నదురాచారాన్ని శ్రీ మల్లాది శివరాం గారు ఎలా హాస్యాత్మకం గా విమర్శించారో చూడండి
గణపతికి పెండ్లి సేయవు
‘మని’ లేదా మాకు పంపు మగవాడు కదా !
కను ముక్కు తీరు లేకు
న్నను భువి కట్నంబు లెదురు నడచును శంభో !
 
  కొన్ని కవితాసాంప్రదాయాలను సునిశితంగా విమర్శి౦చడం వల్ల కూడ హాస్యం పుడుతుంది .
కావ్యాలలో స్త్రీ సౌందర్యవర్ణన ప్రధానమైనది . ప్రాచీనకవులు పాటించిన నియమాలను ప్రబంధకవులు పాటించలేదనే అనిపిస్తుంది. ప్రబంధకవుల ప్రబంధసుందరి చాల అసహ్యంగా కనిపిస్తుంది . నఖశిఖపర్యంతం ప్రతి అవయవాన్ని తామరలతో పోల్చి వర్ణించడాన్ని ఒక కవి సునిశితంగా వ్యాఖ్యానిస్తూ హాస్యం పండించారు . ముఖం తామరట, కన్ను తామరలో మరో తామరట, చేయి  తామరట, కాలు కూడ తామరయేనట. ఇంత విపరీతం ఎక్కడైనా  ఉంటుందా , మొలదగ్గరు౦డే (గోక్కునే ) తామర గురించి విన్నాం గాని ఈ విధంగా శరీరమంతా తామరలున్న వనిత నిజంగా దూలగొండియే (Forget me not) అవుతుంది .

అటుపయి మోము దామరట నక్షియు దామరలోన దామరే
యట చరణంబు తామరయె యంట కరంబును దామరంట యిం
తటి విపరీత మున్నె మొలదామర వింటిమిగాని మేనియం
తటనిటు దామరల్ గలుగు తన్వి నిజంబుగ దూలగొండియే

ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఒక మనిషికి అన్ని కష్టాలు ఒకేరోజున వస్తే ఆమనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా చెప్పమని అడిగాడట .    హాస్య కవులలో అగ్రగణ్యుడైన తెనాలి రామలింగడు ఇలా అందుకున్నాడట.
గురువుల రాక దాసి మృతి గుఱ్ఱపు దాడియు నల్లు నల్కయున్
వరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తియున్
పొరుగున నప్పుబాధ చెవిపోటును వీధిన దొమ్మరాటయున్
కరవు దరిద్రమాబ్దికము కల్గెనొకప్పుడు కృష్ణభూవరా !
అని ఆశువుగా చెప్పాడట .    ఒకని ఇంటికి ఒక రోజు గురువు గారు వచ్చారట . అదే రోజున ఇంట్లో పని చేసే దాసి చచ్చిపోయి౦దని కబురొచ్చింది . ఒక ప్రక్క దొంగలు గుఱ్ఱాలమీదొచ్చి ఇల్లంతా దోచేశారు . అదే సమయంలో అల్లుడు తనకేదో కొనివ్వలేదని అలిగాడు . ఒక గదిలో తన భార్య పురిటినెప్పులతో బాధపడుతోంది. ఒక ప్రక్క తనకూతురికి వివాహం జరుపవలసి ఉంది . అదే సమయంలో విత్తనాలు పొలంలో జల్లవలసిన తరుణం ఆసన్నమై౦ది. అప్పుడే ఒకాయనొచ్చి తనదగ్గర అప్పుగా తీసుకున్నా డబ్బు ఇస్తావా చస్తావా అంటూ గట్టిగా మాట్లాడుతున్నాడు . ఇంతలో చెవిపోటు ప్రారంభమైంది. చెవిలో ఏదో మందో మాకో వేసుకుని కాలక్షేపం చేద్దామనుకుంటే ఇంటి ముందు వీధిలో దొమ్మరోళ్ళు డప్పులు వాయిస్తూ భయంకరంగా శబ్దం చేస్తున్నారు . ఒకప్రక్క దేశమంతా కరవు , ఇంట్లో దరిద్ర౦ తాండవిస్తున్నాయి , అదేరోజున ఆబ్దికము . ఈ విధంగా ఇన్ని కష్టాలు ఒకేరోజున వచ్చాయట . ఇన్ని బాధలు వర్ణి౦చిన ఈ పద్యం మనకి హాస్యాన్నే పుట్టించడం ఒక విశేషం .

ఈ విధంగా ఎన్నో హాస్యరసగుళికలు మన సాహిత్యలో కనిపిస్తున్నాయి. నేడు ఎన్నోసినిమాలు  పత్రికలు T.V ఛానళ్లు హాస్యప్రాధాన్యాన్ని గుర్తించి హాస్యరసానికి పెద్దపీట వేస్తున్నాయి . నవ్వించడంకోసం ఎన్నో క్లబ్బులు కూడ వెలుస్తున్నాయి . కాని హాస్యం పేరుతో ఒక్కొక్క సందర్భంలో అపహాస్యం , వెకిలితనం చోటుచేసు కుంటున్నాయి . నేటి యువత అదే హాస్యమని భ్రమించి సున్నితమైన హాస్యాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతున్నారు .  ఆధునికయుగంలో సింహత్రయంగా పేరొందిన చిలకమర్తి, మొక్కపాటి, పానుగంటి వారే గాక మునిమాణిక్యం మొ|  మహానుభావులు తమ అమూల్యమైన రచనలతో సున్నితమైన హాస్యాన్ని అందించి ఆంధ్రదేశాన్ని హాస్యరసప్లావితం చేశారు .  కాబట్టి నేటి యువత వారి గ్రంథాలను చక్కగా చదువుకొని సున్నితమైన హాస్యాన్ని ఆస్వాదించి , ఇతరులకు అందిస్తే బాగుంటుంది.
శ్రీ జంధ్యాల వారు చెప్పినట్లు నవ్వడం భోగం , నవ్వించడం యోగం , నవ్వలేక పోవడం రోగం .
అందంగా హాయిగా నవ్వుకుందాం ,అందరిని నవ్విద్దాం .
L L L  L L L


No comments: