సీతారామ కళ్యాణం
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
సాధారణoగా మనం ఏ శుభలేఖ తెరిచి చూసినా
వధూవరుల పేర్ల కంటే ముందుగా ఒక సంస్కృత శ్లోకం దర్శనం ఇస్తుంది. అది ఎవరు వ్రాశారో
తెలియదు గాని సంస్కృత శ్లోకాలలో దానికున్న ప్రశస్తి దేనికీ లేదు . అది ప్రింట్
అయినన్ని సార్లు బహుశా మరేశ్లోకం ప్రింట్ అయి ఉండదు. అది ఇంతవరకు గిన్నిస్ బుక్కు
లోకి ఎందుకెక్కలేదో కారణం తెలియదు. అంత విశిష్టమైoది ఆ శ్లోకం . ముందుగా శ్లోకం
చూద్దాం .
జానక్యా :
కమలామలాoజలిపుటే యా : పద్మరాగాయితా:
న్యస్తా
రాఘవమస్తకే చ విలసత్కుoదప్రసూనాయితా:
స్రస్తా:
శ్యామలకాయకాంతికలితా: యా: ఇంద్రనీలాయితా:
ముక్తాస్తా: శుభదా
భవంతు భవతాం శ్రీరామవైవాహికా:
ఇది సీతారాముల వివాహ సందర్భంలోది. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం .
యా: = ఏవి
జానక్యా: = జానకీదేవి యొక్క
కమల= పద్మమువంటి
అమల= స్వచ్ఛ మైన
అంజలిపుటే= చేతియందు
పద్మరాగాయితా: = పద్మరాగమణుల వలె మెరయుచున్నవో
రాఘవ మస్తకే = రామచంద్రుని తలపై
న్యస్తా: = ఉంచబడిన(వై)ప్పుడు
కుందప్రసూనాయితా: =మల్లె మొగ్గలవలె మెరయుచున్నవో
స్రస్తా : జారుచున్నవై
శ్యామల= (రామచంద్రముర్తి యొక్క) నల్లనైన
కాయకాంతి= శరీరపు కాంతితో
కలితా:= కూడియుండుట వలన
ఇంద్రనీలాయితా: = ఇంద్ర నీల మణులవలె మెరయు చున్నవో
తా: = అటువంటి (పవిత్రమైన)
శ్రీరామ వైవాహికా: = శ్రీ రామచంద్రమూర్తి వివాహమునకు
సంబంధించిన
ముక్తా: = ముత్యములు
భవతాం = మీ అందరకు
శుభదా: = శుభములు చేకూర్చునవి
భవంతు = అగుగాక
జానకీదేవియొక్క పద్మదళముల వంటి అరచేతులలో నున్నప్పుడు పద్మరాగ మణులవలె మెరుస్తున్నవియు , ఆమె శ్రీరామచంద్రమూర్తి తలపై పోస్తున్నప్పుడు
మల్లెమొగ్గలవలె ప్రకాశించుచువియు, శ్రీరామచంద్రుని శరీరంపై జాలువారుచున్నప్పుడు నీలమేఘచ్ఛాయగల
దేహకాంతిచే ఇంద్రనీలమణుల వలె భాసించు ఆ ముత్తెపు తలంబ్రాలు మీకందరకు శుభములు కలుగ
జేయుగాక.
ఈ శ్లోకంలో తద్గుణాలంకారం ప్రయోగించ బడింది.
“తద్గుణస్వగుణత్యాగాదన్యదీయగుణగ్రహ:
పద్మరాగాయతే నాసామౌక్తికం తేsధరత్విషా”
అని దాని లక్షణం .ఎక్కడ ఒకవస్తువు తనధర్మాన్ని విడిచిపెట్టి
సమీపంలో ఉన్న వేరొక వస్తువు యొక్క
ధర్మాన్ని స్వీకరి౦చడం వర్ణించబడుతు౦దో అది తద్గుణాలంకారం . ఓ యువతీ! నీ నాసాభరణములోని ముత్యము నీ పెదవియొక్క
కాంతిచే పద్మరాగము వలె ప్రకాశించుచున్నది .
ఇక్కడ ముత్యం పారదర్శకం . అందువల్ల సమీపంలో ఉన్న వస్తువు ఏ
రంగులో ఉంటే ఆ రంగు దానిలో ప్రతిఫలిస్తుంది . ఇక్కడ ఆ వనిత పెదవి పద్మరాగంలా
మెరుస్తోంది కాబట్టి ఆరంగు నాసామౌక్తికంలో
ప్రతిఫలించి అది కూడ పద్మరాగంలా మెరుస్తోంది .
ఇక్కడ సీతారాముల వివాహసందర్భంలో తలంబ్రాలుగా ఉపయోగించ బడిన
ముత్యాలు కమలదలములవంటి ఎర్రనైన సీతాదేవి దోసిలిలో పద్మరాగ మణులవలెను; ఆమె
చేతులనుండి శ్రీరామచంద్రుని తలమీద పడుతున్నప్పుడు తమ సహజ మైన కాంతితో మల్లెమొగ్గలవలెను; ఆ పిదప రామచంద్రుని శరీరం
నుండి జాలువారుచున్నప్పుడు ఆయన శరీర కాంతి ప్రతిఫలించి ఇంద్రనీల మణులవలెను మెరయు
చున్నవని తాత్పర్యం . అటువంటి ముత్యాలు అందరికి శుభం కలుగ జెయ్యాలని కవి ఆశంస .
******
No comments:
Post a Comment