Friday, August 18, 2017

63 vs 36

63 vs 36

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

నా మిత్రుడొకసారి  నన్ను తన పెళ్లికి ఆహ్వానించి పెళ్లైన తరువాత నన్ను దగ్గరకు పిలిచి   ఏరా! మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఏమైనా నాలుగు మాటలు చెప్పమని అడిగాడు . దానికి నేను నాలుగు మాటలు చెప్పలేను గాని నాలుగు చరణాలు గల ఒక పద్యం చెబుతానని అప్పటికప్పుడు ఈ పద్యం వ్రాసి ఇచ్చాను . ఆ పద్యమే ఈ పద్యం.

అరమరిక లేక మీరలు
నరువది మూడై చెలంగు డానందముగన్
ధరలో ముప్పదియార్వలె
పరగకుడీ విరసమైన భావముతోడన్ 

మీరు ఎటువంటి సంకోచం , భేదభావం లేకుండా 63 వలే ఉండండి.
ఎట్టి పరిస్థితులలోను విరసంతో 36 వలే ఉండ వద్దు అని ఆ పద్యం తాత్పర్యం .

అరవైమూడులో ఉన్న అంకెలు రెండు . మొదటిది ఆఱు రెండోది మూడు . అవి  ఎప్పుడు ఒకదాన్నొకటి చూసుకుంటూ ప్రేమగా ఉంటాయి . ఇంటి ఇల్లాలు కూడ ఆఱులో సగభాగమైన  మూడు వలె  కుటు౦బయజమానికి  అర్థాంగిగా ప్రవర్తిస్తూ ఆయన గౌరవం కాపాడుతూ తన గౌరవం కాపాడుకుంటు ఉంటే కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభి వృద్ధిచెందుతూ ఉంటుంది . ఇక ముప్పై ఆరు (36) చూడండి. అందులో మూడు ఆరును తోసేసి ఆస్థానాన్ని ఆక్రమిస్తే ఒక్కసారి సరసం విరసంగా మారిపోతుంది . అంతే ఆరెండు  ఎడ మొగం పెడ మొగం అయినట్లే వీరిద్దరూ కూడ . ఇక అరవైమూడు కున్న ఆధిక్యం ముప్పై ఆరుకు లేదు . కారణం మూడు ఆరును గౌరవించడమే . ఇక ముప్పైఆఱులో తమతమ స్థానాలు తప్పడమే అని వేరుగా చెప్పనక్కరలేదు .  ఇతరులను గౌరవించడం మనల్ని గౌరవి౦చు కోవడమే , మన గౌరవం తరగదు ,పెరుగుతుంది . అందుచేత అరవై మూడు ముద్దు , ముప్పైఆఱు వద్దు . 

2 comments:

Anonymous said...

చాలా బాగుంది సార్.
కాపీ రాయళ్లున్నారు! జాగ్రత్త :)

Durga Prasada Rao Chilakamarthi said...

పాఠకులే రక్షించాలి .