Tuesday, August 29, 2017

The Yoga Sutras of Patanjali- 5,6 &7

     The Yoga Sutras of Patanjali- 5,6 &7
(పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi Durgaprasada Rao

5. वृत्तय: पञ्चतय्य: क्लिष्टा: अक्लिष्टा:
There are five kinds of mental modifications of which some are painful while the others are painless                  
సూ.5. వృత్తయః పంచతయ్యః క్లిష్టా: అక్లిష్టాః .
వృత్తయః = చిత్తవృత్తులు, పంచతయ్యః =  ఐదు విధములు , (ఆవృత్తులు) క్లిష్టాః =  క్లిష్టములనియు, అక్లిష్టాః = అక్లిష్టములని (రెండు విధాలు)  క్లిష్ట వృత్తులు కర్మవాసనకు క్షేత్రీభూతమై, అనేక విధాలుగా మనల్ని పరిగెత్తిస్తూ మనకు   దుఃఖ౦ కలిగిస్తాయి . అవిగాక మరికొన్ని వృత్తులున్నాయి . అవి  నేను వేఱు ప్రపంచ౦ నా మనస్సును విక్షిప్త౦ చేస్తోంది అని జీవునకు వివేకాన్ని కలిగిస్తాయి . అవి  అక్లిష్టవృత్తులు . పురి శేతే ఇతి పురుషః  అనే వ్యుత్పత్తిని బట్టి  దేహమందు, దాగియున్న సాక్షీ భూతమైన , దృగ్రూపమైనది  చైతన్య౦ .  అగ్నిని పొగవలె, మనస్సు ఈ విశుద్ధ చైతన్యాన్ని  గప్పివేసి   ప్రపంచవస్తు భోగమందు ప్రవర్తింపచేస్తుంది. భోగాలాలసమైన మనస్సు జీవుని జననమరణ రూపమైన సంసారచక్రమందు పరిభ్రమింపజేస్తుంది .
I.6. प्रमाणविपर्ययविकल्पनिद्रा स्मृतय:
  6.  ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతయ:
అవి  అంటే  చిత్తవృత్తులు , ప్రమాణం , విపర్యయం , వికల్పం , నిద్ర , స్మృతి అని ఐదు విధాలు . అవెలా ఉంటాయో వరుసగా తెలుసుకుందాం . ముందుగా ప్రమాణాల గురించి తెలుసుకుందాం .
7. प्रत्यक्षानुमानागमा : प्रमाणानि
సూ.7.ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని
ప్రమాణాని = ప్రమాణములు; ప్రత్యక్షానుమానాగమాః = ప్రత్యక్ష౦ , అనుమాన౦ , ఆగమ౦ (శబ్ద౦) అని మూడు విధాలు .                   
 తా. జ్ఞానo పొందడానికి కొన్ని సాధనాలున్నాయి. వాటిని ప్రమాణాలు అంటారు. వాటిలో మొదటిది ప్రత్యక్షప్రమాణం.  అక్షములనగా ఇంద్రియాలు . ఇంద్రియాల వల్ల పుట్టిన జ్ఞానాన్ని  ప్రత్యక్షo అంటాం  . రెండోది అనుమానం . అనుమానమంటే  హేతువాద౦ చేత తెలిసేది . పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ అనగా పర్వతమందు నిప్పుఉండియుండవలె ; ఎందుకంటే  పొగ ఉంది కాబట్టి అనే హేతువాద౦  అనుమానo . ఇక   ఆగమమమంటే  శబ్దప్రమాణ౦. ఆప్తవాక్యం శబ్ద: .ఆప్తుడు చెప్పిన మాట గాని, వేదవాక్య గాని శబ్దప్రమాణ౦ అవుతుంది . విశ్వసింపదగినవాడు ఆప్తుడు. అతని వాక్య౦ మనం నమ్మాలి . వేదవాఙ్మయ౦ ఆప్తుని కంటే ఎక్కువది గావున వేదవాక్యo ఆగమ (శబ్ద )ప్రమాణo . సంఖ్య , యోగ దర్శనాలు ఈ ప్రమాణాలనే నమ్ముతాయి .
 ప్ర త్యక్ష ప్రమాణమంటే జ్ఞానేంద్రియాలకు వస్తువులతో సంయోగంద్వారా  కలిగే జ్ఞానం . ఈ  జ్ఞానేంద్రియాలు కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం  అని ఐదు . ఈ  వస్త్రం తెల్లగా ఉంది అని కన్ను వల్ల ; ఈ పుష్పం మంచివాసనతో ఉంది  అని ముక్కు వల్ల; ఈ సంగీతం వినసొంపుగా ఉంది అని చెవి వల్ల ఈ పండు చాల రుచిగా ఉంది అని నాలుక వల్ల ఈ గాలి చల్లగా ఉంది అని చర్మం వల్ల మనం తెలుసుకుంటాం . ఇక్కడ ఇంద్రియాలకు ఆయా విషయాలతో ఏర్పడిన సంయోగం వల్ల జ్ఞానం కలిగింది . ఈ  ప్రత్యక్షజ్ఞానం నిర్దుష్టమే అయినా దానికి కొన్ని పరిమితులు (limitations) ఉన్నాయి. ఉదాహరణకు:
 1.  అతిదగ్గరగా ఉన్న మన కంటిరెప్పలు మనకు కనిపించవు.
 2. అతిదూరంగా ఎక్కడో ఎగురుతున్న పక్షి మనకు కనిపించదు.
౩. కన్ను పోతే మనకు  ఏమి కనిపించదు.
4. మనస్సు వేరే వస్తువుపై లగ్నమైనా  , స్థిరంగా లేకపోయినా  ఏమి కనిపించదు.
5. అతిచిన్నవైన అణువులు , పరమాణువులు మనకు కనిపించవు.
6. మనకు మనింటి గోడవతల ఉన్న వస్తువు కనిపించదు.
7. సూర్యుని వెలుగు ముందు నక్షత్రాలు కనిపించవు.
8. పెద్ద మినుగుల రాశిలో ఒక బెడ్డ కనిపించదు.
ప్రత్యక్ష ప్రమాణానికి ఇన్ని లోపాలున్నాయి . అంతే కాకుండ ప్రత్యక్షంగా కనిపిoచేవన్నీ  నిజం కావు. ప్రక్క రైలు బండి కదులుతుంటే మన రైలుబండి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే చంద్రుడు మనకు చూడడానికి చాల చిన్నగా కన్పిస్తాడు. ఇవన్ని నిజాలు కావు. అంతే కాకుండా ప్రత్యక్ష ప్రమాణం
ఈశ్వరుని ఉనికిని ఋజువు చెయ్యలేదు . ఎందుకంటే ఆయన ఇంద్రియాలకు కనిపించడు. అందువల్ల మరో ప్రమాణాన్ని ఆశ్రయించక తప్పదు . అది అనుమాన ప్రమాణం . ఉదాహరణకు  కొంతమంది ఇలా    ఆలోచిస్తూ ఉంటారు . పర్వతం  మీద అగ్ని ఉంది.    పొగ కనిపిస్తోంది కాబట్టి . (ఇక్కడ పర్వతం పక్షం .అగ్ని సాధ్యం . పొగ హేతువు).  ఎక్కడెక్కడ పొగ ఉoటుoదో అక్కడక్కడ నిప్పు ఉంటుంది . ఉదాహరణ వంటిల్లు . పర్వతం మీద పొగ కనిపిస్తోoది కాబట్టి అక్కడ నిప్పు ఉంది  అని తార్కికులు నిప్పు చూడకుండానే బుద్ధిబలంతో పొగను బట్టి నిప్పుయొక్క ఉనికిని  ఊహిస్తారు. ఈ ప్రమాణంతో ఈశ్వరుణ్ణి సాధించొచ్చు . ఎలాగో చూద్దాం .
ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు చేసిన వాడొకడుండి తీరాలి . అలాగే ఈ ప్రపంచం కనిపిస్తో౦ది కాబట్టి ఈ ప్రపంచాన్ని సృష్టిచేసిన వాడొకడుండి తీరాలి , ఆయనే
ఈశ్వరుడు . ఈ విధంగా అనుమానప్రమాణం ఈశ్వరుణ్ణి నిరూపిస్తు౦ది కాని అందులో కూడ మరొక్క పెద్ద చిక్కు ఉంది . సరే! ఈ ప్రపంచాన్ని సృష్టిచేసిన వాడు ఈశ్వరుడు , మరి ఆయన్నెవరు సృష్టించారు? దానికి సమాధానం x అనుకొండి  . ఆ x ను ఎవరు సృష్టించారు? దానికి సమాధానం y అనుకొండి ; ఇక ఆ y ని ఎవరు  సృష్టించారు? z అని ఇలా ప్రశ్నించుకు౦టు పొతే అంతు చిక్కదు . దీన్నే అనవస్థ ( ad infinitum ) అని అంటారు . అప్రామాణిక అనంత పదార్థ కల్పనాయా:  విశ్రాంత్యభావో అనవస్థా అని శాస్త్రకారులు .    అందువల్ల ఆగమప్రామాణ్యాన్ని అంగీకరించాలి .  కాని ఈ పై మూడు ప్రమాణముల వలన  పుట్టిన జ్ఞాన౦ మన బాహ్యదృష్టికి న్యాయమైన జ్ఞాన౦గా కన్పడినా అది  యోగశాస్త్ర౦ ప్రకారం ఈ జ్ఞాన౦ చిత్తవ్యాపారమువలన బుట్టి౦ది కాబట్టి  దీన్ని కూడ నిరోధించాలి . అంటే  చిత్తాన్ని అన్నివిధాల  దృశ్యములనుండి మరల్చాలని సారాంశం .

(To be continued)

No comments: