The Yoga Sutras of Patanjali-8,9,10
&11
(పతంజలి
యోగసూత్రములు)
Dr. Chilakamarthi Durgaprasada Rao
8. विपर्ययो
मिथ्याज्ञानमतद्रूपप्रतिष्टम्
(విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూపప్రతిష్ఠ౦)
విపర్యయం అంటే తప్పుడు జ్ఞానం . అది కాని దాని యందు అది అనే బుద్ధి . ఏ వస్తువైనా ఆ వస్తువును ఆ వస్తువుగా చూస్తే లేదా కనిపిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు . ఉదాహరణకి ఒక పాము పాముగా, త్రాడు త్రాడుగ మనకు కనిపిస్తే ఎటువంటి ప్రమాదం లేదు; అలాగే ఆవు, ఆవుగా ; పెద్దపులి, పెద్దపులిగా కనిపిస్తే ప్రమాదం లేదు . మనం జాగ్రత్త
పడొచ్చు . కాని పాము, త్రాడుగా; త్రాడు, పాముగా; అలాగే ఆవు, పులిగా పులి, ఆవుగా కనిపిస్తే మాత్రం ప్రమాదం . దీన్ని శాస్త్రీయంగా అవిద్య అంటారు . అనిత్య , అశుచి , దు:ఖ, అనాత్మసు నిత్య, శుచి, సుఖ , ఆత్మఖ్యాతి రవిద్యా” అని దాని నిర్వచనం . దీన్ని బట్టి అనిత్యమైన దానిని నిత్యం
గాను , ఆశుచిని శుచిగాను , దు:ఖాన్ని సుఖంగాను , అనాత్మను ఆత్మగాను భావించడమే అవిద్య. ఇదే విపరీత జ్ఞానం. ఈ విపర్యయ జ్ఞానంలో మనస్సు ప్రవర్తించుట ఎలా ప్రమాదమో ప్రత్యక్ష , అనుమాన ములందు కూడ మనస్సు ప్రవర్తించుట
ప్రమాదమే కాబట్టి అది తగదని యోగశాస్త్రం చెబుతోంది . అందుకే
“అనాత్మని చ దేహాదావాత్మ బుద్ధిస్తు దేహినా
మవిద్యా తత్కృతో
బంధ: తన్నాశో మోక్ష ఉచ్యతే” అన్నారు శాస్త్ర కారులు. అనాత్మలైన శరీరాదులందు ఆత్మబుద్ధి కలిగియు౦డడం అవిద్యా . అది బంధానికి దారితీస్తుంది
. అది తొలగడమే మోక్ష౦ .
I.9. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्प:
శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్ప:
శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్ప:
వికల్పమంటే ఒక పదం/శబ్దం మనకు తెలుసుగాని దానికి సంబంధించిన వస్తువు ఉండదు. వంధ్యాపుత్రుడు (గొడ్రాలిబిడ్డ) అనే పదం వినడానికి బాగానే ఉంది గాని ఆ వ్యక్తి కనిపించడు . అలాగే ఆకాశకుసుమం అనే పదం వినడానికి బాగానే ఉంది గాని అది కనిపించదు . మన మనస్సులో ఇటు వంటి జ్ఞానం కూడ కలుగుతో ఉంటుంది . ఇపుడు ‘నిద్ర’ అంటే ఏంటో తెలుసు కుందాం.
I.10. अभावप्रत्ययालम्बना वृत्त्ति: निद्रा
(అభావ ప్రత్యయాలంబనా నిద్రా)
అభావప్రత్యయ= శూన్య జ్ఞానం , ఆలంబనా = ఆలంబనముగాగల వృత్తి:= చిత్తవృత్తి ; నిద్రా = నిద్ర అనబడును . మనకు నిత్యజీవితంలో మెలకువ , కల , నిద్ర అనే మూడు దశలు ఉంటాయి . మెలకువ, స్వప్నం (కల) కాక చిత్తమునకు కలుగు వృత్తియే నిద్ర . నేను నిద్ర పోయాను నాకేమి తెలియదు అనే అనుభవానికి శూన్యజ్ఞానమే ఆలంబన . చిత్తము ఆ నిద్ర
యందు ఎల్లప్పుడు లగ్నం ఔతుంది కాబట్టి ఈ నిద్రను కూడ జయించాలని యోగశాస్త్రం చెబుతోంది .
1.
11. अनुभूतविषयासंप्रमोष:स्मृति:
(అనుభూతవిషయాసంప్రమోష: స్మృతి:)
अनुभूत= అనుభవించిన ; विषय= విషయములయొక్క ; असंप्रमोष:= తుడిచి వేయ బడకపోవుటయే ( మాటి మాటికి జ్ఞాపకమునకు వచ్చుటయే ; स्मृति:=స్మృతి . దీన్ని కూడ నివారించాలని యోగశాస్త్రం భావిస్తోంది . అంటే జ్ఞాపక శక్తిగల
మన మనస్సు ఎప్పుడో జరిగిపోయిన విషయములను కూడ మాటిమాటికి స్మరిస్తూ ఉంటుంది . దీన్ని
కూడఅదుపులో ఉంచుకోవాలని యోగశాస్త్రం భావిస్తోంది .
No comments:
Post a Comment