Wednesday, September 19, 2018

శైవ గురు పీఠ సేవలందించిన శివశ్రీ మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు


శైవ గురు పీఠ సేవలందించిన
శివశ్రీ మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు

రచన :- మల్లంపల్లి రామప్రసాద్
Cell:-      9940574183

ఆ రోజుల్లో శైవ మతారాధకుల శైవగురుపీఠాల్లో మల్లంపల్లి వారిది ఒకటి. మల్లంపల్లిలో ఎందరో మహానుభావులు లోకకల్యాణం కొరుతూ శైవమత ప్రాప్తికి ఎనలేని కృషి చేసిరి.
వారిలో ప్రాతస్మరణీయులు మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు ప్రసిద్ధులు.
భారతీదేవి వాగ్రూప భంగిగాను
శారదామాత దరహాస చంద్రికలన
వాణి శింజినీ కంకణ వ్రాత భంగి
పుట్టిరనగ మల్లమపల్లి పుత్రులవని
వేదవేదాంగ శాస్త్ర కావ్యేతి హాస
బహుపురాణనాటక నాట్య వైదికాది
మంత్ర తంత్ర నిష్ణాతులు మల్లమపల్లి
వంశజులు వాసి గాంచిరి  వసుధలోన

అటువంటి మల్లంపల్లి వారి వంశంలో ఎందరో మహాను భావులు , అఖండులు, ఉద్దండులు జన్మించిరి . పేరు ప్రతిష్ఠలు పొంది , ఎల్లరకు సహాయసహకారములందించి ధన్య జీవులైరి.
1850-1950 మధ్య కాలంలో ఇంకా ప్రాచీన సాహిత్య ధోరణులు వ్యాపించి ఉన్నాయి . ఆ కాలం సరస్వతీరూపులు , శతావధానులు తిరుపతివే౦కటకవులు కవితావాసనలు వెదజల్లిన కాలం .   వాసనలు ప్రతి సహృదయుణ్ణి తాకి కవితలు పులకింప చేశాయి. ఆ సమయంలో కవితలు సాగించిన వారిలో            మల్లంపల్లి మల్లికార్జునారాధ్యులు ఒకరు. వీరు దేశోద్ధారక, కృష్ణాజిల్లా ఎలకూరు గ్రామంలో 1875 సంవత్సరము విజయదశమినాడు  జన్మిం చారు .

ఈయన తల్లి దండ్రులు భ్రమరాంబ , వీరమల్లయారాధ్యులు . పుట్టిన పదోనెలలోనే తండ్రి , 18వ ఏటనే అన్న రామలింగ అయ్యవారు మరణి౦చడంతో  చదువుకోసం వీరు ఎన్నో ప్రాంతాలు తిరగవలసి వచ్చింది . విజయనగరంలో కొంతకాలం బ్రహ్మశ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి వద్ద , గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద విద్యాభ్యాసం చేశారు . తరువాత వక్కలంక వీరభద్రశాస్త్రిగారి వద్ద విద్యాభ్యాసం చేసి తర్కం అభ్యసించారు . ప్రకాశంజిల్లా చందవోలులో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద నైషధం చదివారు .వీరు సంస్కృతాంధ్రపండితులు . శివపూజా దురంధరులు . నిత్య సంధ్యావందనాసక్తులు. కావ్యజ్ఞులు. మంత్రశాస్త్రజ్ఞులు. శరభశాళవ, భేతాళపంచాక్షరి, మృత్యుంజయ గాయత్రీమహామంత్ర నిష్ణాతులు .. అంత్యేష్టి (అనగా చనిపోయిన వారికి చేసే కర్మకి అంత్యేష్టి అనిపేరు ) చిన్మయదీక్ష  లింగధారణలు చేయి౦చుటలో దిట్టలు .
ముఖాన విభూతి , నుదుట నల్లని బొట్టు , కంఠాన స్ఫటిక రుద్రాక్ష మాలలు , కర్ణములకు కుండలాలు , చేతులకు సింహతలాటాలు , చేతులకు పాదాలకు విభూతి రేఖలు , కాళ్ళకు గండపెండేరము కలిగియుండి బ్రహ్మతేజస్సు ఉట్టిపడే వీరిని ఒక్కసారి చూస్తేనే చాలు ఎవరూ మరిచిపోలేరు . వీరు భోగేశ్వరమాహాత్మ్యం, సత్యవత్యుపాఖ్యానం అనే రెండు శైవ ప్రబంధాలు; చోరేశ్వరము , తునిరాజసందర్శనము మొదలైనవి రచించారు .  వీరి సహధర్మచారిణి శ్రీమతి  కనకదుర్గాంబగారు కూడ  శైవమతధర్మాలనెరిగి, పతి అడుగు జాడలలో నడచిన ఉత్తమ ఇల్లాలు .
వీరు వ్రాసిన భోగేశ్వరమాహాత్మ్యం 1934 సం||లో బి.ఏ పట్టా పరీక్షకు, ఉభయభాషాప్రవీణ గ్రూపులకు పఠనీయాంశగ్రంథముగా బెట్టిరి . తిరుపతి వేంకట కవులంతటి వారే సంస్కృతభాషకు వీరి కవిత్వము వన్నె పెట్టుచున్నదని ప్రశంసించిరి . వీరు రచించిన భోగేశ్వరమాహాత్మ్యమునకు పీఠిక వ్రాసిరి . ఇంకా ఆ రోజుల్లో ఉద్దండులైన బ్రహ్మశ్రీ  శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు మొదలైన వారందరూ భోగేశ్వరమాహాత్మ్య గ్రంథపీఠికలో తమ తమ అభిప్రాయములను వ్రాసిరి .

వీరు విజయవాడ, రాజమండ్రి, తుని, అనకాపల్లి, విశాఖపట్టణం , రాజాం , విజయనగరం , శ్రీకాకుళం బరంపురం మొ|| ప్రదేశములలో సంచారం చేసి శైవమత ప్రబోధం , వేదాలసారము, సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు బోధిస్తూ ఎందరినో శిష్య ప్రశిష్యులుగా చేసుకొనిరి . తమకు 350 వంశాల వారు శిష్యులుగా  ఉన్నారని భోగేశ్వరమాహాత్మ్యంలో మల్లికార్జునారాధ్యులు  వెల్లడించిరి. వీరు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు  తమ తల్లిగారి పేరున స్థాపించిన శ్యామలా౦బాధర్మపాఠశాలలోను , బందరు హిందూహై స్కూలులోను  సంస్కృతాంధ్ర పండితులుగా పని చేశారు .
భోగేశ్వరమాహాత్మ్యంలో వీరి కవితా శైలికి ఉదాహరణ పద్యాలు .

ఉ|| తల్లికి నిర్జరీగణమతల్లికి భూవిజితాత్మభూ ధను
ర్వల్లికి బాల చంద్ర ధరు బాహుల పేరిటి మేటి శాఖలం
దల్లిన పుష్ప వల్లికి దయారమ గాంచిన పాల వెల్లికిన్
మెల్లన చేతులెత్తి ప్రణమిల్లెద నాశ్రిత కల్ప వల్లికిన్

శా|| శ్రీ రత్నాకరమేఖలామణిమయ గ్రీవాకలాపంబు ర
మ్యారామ ద్రువిహార చిత్తజ హయ వ్యాహార చౌర్య క్రియా
ధీరాధీర విలోకనా జన సముత్కీర్ణంబు సప్త స్థలా
గార ప్రాభవ మొప్పు నాపురము        భాగ్యస్థాన నామంబునన్

              సుమారుగా 80 ఏళ్ల  క్రిందట ఆనాటి ప్రముఖ కవి పండితుల చేత వీరు సన్మానాలు పొంది కవితా చక్రవర్తి కవి సార్వభౌమ అనే బిరుదులను పొంది, కాళ్ళకు గడపె౦ డేరములతో సత్కరి0పబడి విశాఖపట్నంలో ఏనుగుపై
ఊరేగి౦పబడిన మహానుభావుడాయన .

ఆంధ్రదేశంలో లబ్ధప్రతిష్ఠులైన సాంగవేదభాస్కర బ్రహ్మశ్రీ కుప్పా లక్ష్మణావధానులు గారు, వ్యాకరణస్థాపక బ్రహ్మశ్రీ  కుప్పా  ఆంజనేయశాస్త్రి గారు , బ్రహ్మశ్రీ మండలీక వేంకటశాస్త్రి మొదలైనవారు , రామాయణ, భారత, భాగవతాదులే కాక కావ్య ప్రబంధాలు మొదలైన వాటియందు వారికి ఉన్న సందేహాలను , విశేష అర్థాలను తెలుసుకొని వారి పాండిత్య ప్రతిభా విశేషాలను ప్రశంసించిన వారే. తిరుపతి వేంకట కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు , హరికథా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు మల్లికార్జునారాధ్యుల మీద వ్రాసిన శ్లోకాలు , సంచారము చేసినప్పుడు ఆనాటి ప్రముఖుల మీద శ్రీ మల్లికార్జునారాధ్యులు వ్రాసిన  పద్యాలు ఇవన్ని కాలగర్భంలో కలిసిపోయినందుకు చింతిస్తున్నాను .
వీరి పుత్రులలో ప్రథమ పుత్రులు శివశ్రీ మల్లంపల్లి వీర మల్లేశ్వర శర్మ గారు. (మా నాన్న గారు ) ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులే కాక  బందరు అయ్యవార్లుగా  ప్రసిద్ధులైన వారు. 3వ వారైన వీరేశ్వరశర్మ గారు అభినవ-పెద్దన , అభినవ-పోతన వంటి బిరుదములు పొందినవారు. 4వ వారు కవిరత్న రామలింగశర్మ గారు , 5వ వారు శ్రీ శరభేశ్వరశర్మగారు.  వీరు తమ 11వ ఏట శ్రీ విశ్వనాథవారిచే బాలకవి కేసరి  అని , శ్రీ కాశీ కృష్ణమాచార్యులు గారిచేత పుంభావసరస్వతి అని బిరుదులు పొందినవారు .  
మహాయోగులకు , సిద్ధపురుషులకు  బ్రహ్మకపాలం పగిలి ప్రాణం పోయిన విధంగానే మల్లికార్జునారాధ్యులకు కూడ బ్రహ్మకపాలం పగిలి  బందరులోని మా స్వగృహం లో 1951 వ సం||లో జనవరి 30న శివసాయుజ్యం ( మరణించారు ) చెందారు .   .  
మల్లికార్జునారాధ్యులు నాకు తాతగారు  కావడం నా అదృష్టం , నా పూర్వజన్మసుకృతం . వారి గురించి నాలుగు ముక్కలు నా చేత వ్రాయించి , వారిని మరల వెలుగులోనికి తీసుకొని వచ్చిన , నాకు ఎంతో ఆప్తులు , శ్రేయోభిలాషులు , శ్రీ గోటేటి  రామారావుగారికి నమస్కారములు , కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎనిమిది పదుల వయస్సు దాటినా ఇంకా ప్రముఖాంధ్ర పురోభి వృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న శ్రీరామారావు గారిని, వారి కుటుంబంలోని అందరిని నెల్లూరుకి సుమారుగా 12 కి||మీ|| దూరంలో ఉన్న ఆ జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు సంపూర్ణ ఆయురారోగ్య భోగ భాగ్యాలనొసగి సదా  కాపాడవలసి౦దిగా మన సారా ప్రార్థిస్తున్నాను .
( రచయిత అనుమతితో  మరియు ప్రముఖాంధ్రపత్రిక యాజమాన్యం వారి సౌజన్యంతో )

No comments: