Sunday, November 1, 2020

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన సద్గురూత్తమ శతకం – ఒక సమీక్ష

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన సద్గురూత్తమ శతకం – ఒక సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

3/106, ప్రేమనగర్ , దయాల్బాగ్, ఆగ్రా

శ్రీ నేమాని సోమయాజులుగారు రచించిన సద్గురూత్తమశతకం నేను ఆమూలాగ్రం చదివేను . ఇది ఒక అపూర్వమైన రచన . 1౦8 పద్యాలు గల  ఈ శతకంలో గురువు యొక్క గొప్పదనం కొనియాడబదిండి .   భారతీయసంస్కృతీసాంప్రదాయాలు గురువును భగవంతునితో సమానం గాను  భగవంతునికన్నా ఉన్నతునిగా కూడ  విశ్వసిస్తున్నాయి .

మోక్షమార్గానికి గురుభక్తి ఒక్కటే శరణ్యమని ఉపనిషత్తులు పేర్కొన్నాయి.

“ తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం (ముండకోపనిషత్తు) ఆ బ్రహ్మజ్ఞానంకోసం గురువును మాత్రమే ఆశ్రయి౦చాలి. ఆ గురువు శాస్త్రజ్ఞానం గలవాడు , బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి  అని   చెబుతోంటే ఉపనిషత్తుల సారా౦శరూపమైన భగవద్గీత కూడ  తద్విద్ధి  ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన: తత్వదర్శిన:  ( ఓ అర్జునా! వినయపూర్వకమైన నమస్కారం వలన , తెలుసుకోవాలనే కోరికతో కూడిన ప్రశ్న వలన , సేవ ద్వారా నీకు జ్ఞాని , తత్త్వదర్శి అయిన గురువు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని తెలుసుకో )  అంటో౦ది .

యస్య దేవే పరాభక్తి: యథా దేవే తాథా గురౌ

తస్యైతే కథితా హ్యర్థా: ప్రకాశంతే మహాత్మన:

ఎవడికైతే భగవంతునియందు , గురువునందు అచంచలమైన భక్తి ఉంటుందో అట్టి మహాత్మునకు సమస్త అభీష్టములు నెరవేరతాయని శ్వేతాశ్వతర ఉపనిషత్తు ముక్తకంఠంతో ఘోషిస్తోంది .

శ్రీ శంకర భగవత్పాదులు:

గురోరంఘ్రి పద్మేమనశ్చేదలగ్నం

తత: కిం ? తత: కిం ?తత: కిం ?తత: కిం ?

అనే మాటలద్వారా గురుభక్తి లేకపోతే అంతా   వ్యర్థమే అని తమ అభిప్రాయాన్ని ప్రకటించారు .

గురువు భగవంతుని కన్నా ఉన్నతుడని భాగవతం సూచిస్తోంది .

భాగవతంలో రుక్మిణి శ్రీ కృష్ణుని వద్దకు అగ్నిద్యోతనుడనే ఒక బ్రాహ్మణుని రాయబారిగా పంపుతుంది . ఆయన కృష్ణుని వద్దకు చేరుకుని అతనితో :

ఓ కృష్ణ! ఆ రుక్మిణి నీకు తగినది . నీవు ఆమెకు తగిన వాడవు . మీ ఈ డు జోడు సరైనది . మా గురువుగారి మీద ఒట్టు అంటాడు .  (ఆ యెలనాగ నీకు తగునంగనకుందగుదీవు మా యుపాధ్యాయుల యాన) దేవుని మీద ఒట్టు అనొచ్చు లేదా సాక్షాత్తు భగవత్స్వరూపమైన ఆ కృష్ణునిపై ఒట్టు

పెట్టవచ్చు కానీ అలా అనకుండా మా గురువుగారిపై ఒట్టు అనడం ఇక్కడ  గమనించవలసిన అంశం .

అటు ఉపనిషత్తులు, ఇటు భగవద్గీత, మరో ప్రక్క భాగవతాది పురాణాలు   పూర్తిగా అర్థం చేసుకున్న   శ్రీ నేమాని వారు రాధాస్వామీసత్సంగ సిద్ధాంతానికి కేంద్రబిందువైన గురువు యొక్క గొప్పదనం అందరికి చాటి చెప్పడానికి ఈ శతకరచన చేపట్టి ఉంటారని నాకనిపిస్తుంది.

 రచయిత ఈ శతకంలో గురువుయొక్క వైశిష్ట్యం , సంసారం యొక్క క్లేశాలు , సంసారక్లేశాలనుండి విముక్తిని ప్రసాదించే గురువుబోధలు , ధ్వని రూపమైన శబ్దాభ్యాస విధానం , ఉపాసనా పద్ధతి, భక్తిస్వరూపం మొదలైన విశేషాలు పొందుపరిచారు .

గురువుయొక్క గొప్పదనాన్ని ప్రస్తుతిస్తూ సంసారసాగరాన్ని తరింపయ్యడానికి గురువే సర్వసమర్థుడని,  గురుకృప కొంగుబంగారం వంటిదని, గుర్వనుగ్రహం శతకోటి జన్మలపాపాల్ని హరిస్తుందని, గురువు మానవరూపంలో కనపడే పరమాత్మయని  గురువు మట్టిముద్దను కూడ కుందనపు బొమ్మగా తీర్చిదిద్దగల మహిమాన్వితుడని వర్ణి౦చారు. సంసారం చీకటి కూపం, సముద్రం వలే భయంకరమైన అఘాదం, ఆ సంసారం నుంచి బయటపడవేయగల ఏకైకసాధన గురుభక్తి, గురువు సర్వోన్నతుడు , వేదవేద్యుడు  , భక్తజనుల పాలిట కల్పవృక్షం , దేవతలకే దైవం , చైతన్యస్వరూపుడు, దుష్టులను సంహరించే వాడు ,   అనాధులకు దిక్కు , ఎల్లప్పుడు ఆనందాన్ని ప్రసాది౦చేవాడు, శుభములు చేకూర్చే వాడు, అత్యున్నత స్థానాన్ని పొందినవాడున్నూ అని అభివర్ణించారు  .   

పరుఁడవు వేదవేద్యుఁడవు భక్తులపాలిట కల్పవృక్షమున్
స్థిరుఁడవు దేవదేవుఁడవుఁ జిన్మయరూపుఁడవున్ దురాత్మసం
హరుఁడ వనాథనాథుఁడవు హ్లాదనసంతతదాతవున్ శుభం
కరుఁడ వగమ్యగమ్యుఁడవు గావవె నన్నిక సద్గురూత్తమా! 19


గురునామ స్మరణ ఎలా ఉండాలో చెబుతూ చంద్రునికోసం చాతకపక్షి  , స్వాతిచినుకులకోసం ముత్యపు చిప్ప , లేత మామిడి కోసం పికం , భర్త కోసం సాధ్వి, అలాగే తల్లి బిడ్డల్ని చేప నీటిని తలచే విధంగా ఉ౦డాలని వర్ణించిన పద్యం చాల హృద్యంగా ఉంది .

చాతకపక్షి చందురుని, స్వచ్ఛపుముత్యము స్వాతిచిన్కులన్
లేతరసాలమున్ బికము, ప్రేముడి సాధ్వియు ప్రాణనాథునిన్
మాత సదా తనూజులను, మత్స్య ముదమ్ముఁ దలంచునట్లుగాఁ
బ్రీతిగ నిన్ను నేఁదలఁతుఁ బ్రేమసుధాంబుధి! సద్గురూత్తమా!!” 59

   గురునామస్మరణ సమస్తపాపాలు నశి౦పచేస్తుంది, కర్మవాసనలు తొలగిస్తుంది , సంసార బంధాల్ని పోగొడుతుంది . కాబట్టి గురునామ స్మరణ తప్పక చెయ్యాలని తెలియ జేశారు.

తావకనామసంస్మృతివిధానముచే నశియించుఁ బాపముల్
దావకనామసంస్మృతివితానముచే నశియించుఁ గర్మముల్
దావకనామసంస్మృతియుదంచనచే నశియించు బంధముల్
దావకనామసంస్మృతినిఁ దప్పక చేసెద సద్గురూత్తమా!” 23

నేడు సమాజంలో భక్తి వెఱ్ఱి తలలు వేస్తోంది .

“ తెనుగునాట భక్తిరసం తెప్పలుగా పాఱుతోంది

డ్రైనేజీ స్కీము లేక డే౦జరుగా మారుతోంది”

అని శ్రీ గజ్జెల మల్లారెడ్డి గారు ఆవేదన చెందడం మనందరికీ తెలిసిన విషయమే . ఇటువంటి తరుణంలో     భక్తి యొక్క నిజమైన స్వరూపాన్ని వివరించే ఈ పద్యం రచయిత ఆధ్యాత్మికపరిణతికి ఒక దర్పణంగా కనిపిస్తోంది . పరమాత్మయందు ఆసక్తి ,  ప్రత్యగాత్మ(జీవాత్మ) పయి సఖ్యము , వీడరాని ప్రేమ, పరిపక్వతన౦దిన భావబంధము ముక్తికి యుక్తమైన మార్గంగా చెప్పడం నేటి సమాజానికి  ఎంతో మేలు కల్గిస్తుంది

భక్తియనంగ నా పరమపావనమౌ పరమాత్మయందు నా
సక్తియు, ప్రత్యగాత్మపయి సఖ్యత, వీడఁగరాని ప్రేమ,
వ్యక్తమనోజ్ఞమైన పరిపక్వతనందిన భావబంధమున్
ముక్తికి యుక్తమార్గమును బొచ్చెములేనిది సద్గురూత్తమా! 103


సాధన లేని సిద్ధి స్వప్నసమానమని చెబుతూ ఆధ్యాత్మిక పురోగతికి సాధనయొక్క ఆవశ్యకతను చాటి చెప్పేరు. (106)

కులమత భేదాలు కుత్సిత భావాలని , హింసను ప్రోత్సహి౦చే  మతం వ్యర్థమని ఉద్బోధించారు .  (107)

తచయిత యమకాలంకార ప్రయోగంలో చాల నిపుణులు .

సారములేని కాలుని ప్రసారము లోతగు కష్టపూర్ణ కా

సారము (87) మానము హేయ మాన మవమానములం గలిగింప నోపు (94) మొదలైన పద్యాలు ఇందుకుదాహరణలుగా పేర్కోవచ్చు.

రచయిత సందర్భానుసారంగా ‘పినతనమండు కాకర పెద్దయినంతనె కీకర’ మొదలైన ఆమెత వంటి సామెతలను పొందుపరిచి శతకానికి వింత సొబగులు చేకూర్చారు . రాజాజ్ఞలో ఒదిగిన  భటులమాదిరిగా అందమైన పదాలు ఛందస్సులో ఎటువంటి క్లేశం లేకుండా పొందికగా ఇమిడి పోయాయి .    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శతకం గురుభక్తి ప్రతిపాదకం ప్రతిపద్యరమణీయం .  నేమాని వారు ‘ప్రేమాంబుధిశతకము’ ద్వారా దేవ ఋణాన్ని   ఈ శతకరచనతో తన గురు ఋణాన్ని  కొంతవఱకు తీర్చుకున్నారని నాకనిపిస్తోంది . 

విషయ ప్రతిపాదనలోను , భావప్రకటనలోను , భాషాసారళ్య౦లోను ఈ శతకం  నిరుపమానం . ఈ శతకం ఆంధ్ర సాహిత్య చరిత్ర పుటలలో విశిష్య శతకసాహిత్యచరిత్రపుటలలో శాశ్వతస్థానాన్ని సంపాదిస్తు౦దనడంలో ఎటువంటి సందేహంలేదు .  ఇటువంటి అమూల్యమైన శతకాన్ని మనకందించిన శ్రీ నేమానివారు సదా అభినందనీయులు .

చిలకమర్తి దుర్గాప్రసాద రావు

3/106, ప్రేమనగర్ , దయాల్బాగ్.ఆగ్రా 

<><><><> 

 

 

 

 

 

  

No comments: