ఉచిత
సలహాలు
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
మన సమాజంలో కొంత మందిని చూడండి . ఏదోఒకటి మాట్లాడుతూ ఉంటారు , ఏవేవో సలహాలు
ఇస్తూ ఉంటారు . సలహాలు ఇవ్వడం మంచిదేగాని అడిగినా అడగకపోయినా సలహాలు ఇవ్వడం అంత
మంచిది కాదు . అడిగినప్పుడు సలహా ఇస్తేనే దానికొక విలువ ఉంటుంది . లేకపోతే దానికి
విలువ లేకపోవడం మాట అటుంచి ఆ వ్యక్తి చులకన
అవుతాడు . మన సంస్కృతి అపృష్టో బహు భాషతే అని అడగకుండా సలహా
చెప్పేవాణ్ణి నిందించింది.
ముఖ్యంగా వైద్యవిషయంలోనూ, జ్యోతిష0 విషయంలోనూ అందరు
అందరికి సలహాలిస్తూ ఉంటారు . ఈ ప్రపంచంలో కొద్దో గొప్పో ఈ రెండు తెలియనివారుండరట.
“ ఆపి సాగరపర్యంతా విచేతవ్యా వసుంధరా దేశోహ్యరత్ని మాత్రోపి
నాస్తి దైవజ్ఞవర్జిత: ”
అంటారు నీలకంఠ దీక్షితులు . చతుస్సముద్రముద్రితమైన ఈ భూమండలం అంతా వెదకి
చూచినా జ్యోతిష్కుడు లేని చోటు జానెడైనా కనిపించదట. ఇక అడగని వారికి సలహాలు చెప్పడం మంచిదికాదని
మామిత్రులు డాక్టర్ . బండ్లమూడి ఆంజనేయులు గారు చాల చక్కని పద్యంలో సూచించారు .
అడగనంతవరకు నాప్తున కైనను
చేరి హితము నెపుడు చెప్పరాదు
అడగకుండ పెట్ట నన్నంబు విషమౌను
గుణ్య రామ రాయ గురు విధేయ
కాబట్టి ఉచితసలహాలు చెప్పేముందు ఒక్క నిముషం ఆలోచించాలి . ఇక
ముఖరతాsవసరే హి విరాజతే అంటే ఒక్కొక్కప్పుడు వాచాలత కూడ శోభిస్తుంది
అంటాడు భారవి . ఉదాహరణకు ఒక వ్యక్తి
ఉన్నాడు అతనికి కొన్ని సందేహాలున్నాయి . అవి ప్రక్కనున్న వ్యక్తిని అడిగితెలుసుకోవచ్చు
కాని అడగడానికి భయం, అడిగితే ఏమనుకుంటాడో నని సంశయం . అటువంటి సందర్భాల్లో వాళ్ళ
అవసరం తెలుసుకొని సలహాలివ్వడం తప్పులేదు .
కాని సాధారణ పరిస్థితిల్లో మాత్రం ఇతరులు అడుగకుండ
సలహాలు చెప్పి అనవసరంగా నోరు పారేసుకోకూడదు.
No comments:
Post a Comment