Friday, December 18, 2020

జ్ఞానవిజ్ఞాననిధి - ప్రేమానురాగాల పెన్నిధి డాక్టర్ వై.వి.రావు

 

జ్ఞానవిజ్ఞాననిధి -  ప్రేమానురాగాల పెన్నిధి డాక్టర్ వై.వి.రావు

Dr. Chilakamarthi Durga prasada Rao

3/106, Premnagar,  Dayalbagh –AGRA

8279469419   

dr.cdprao@gmail.com

.

ఈ సమాజoలో ఎంతోమoది విద్యావoతులుంటారు. కానీ విద్యకు తగిన వివేకo వారిలో  కనిపించదు . విద్యావoతుల్లోనే శాస్త్రవేత్తలుoటారు. కానీ వారికి సాహిత్యవాసనలు తక్కువ. అలాగే ఎంతోమoది సాహితీవేత్తలుoటారు. కానీ వారిలో శాస్త్రీయదృక్పథo కంచుకాగడా పెట్టి వెతికినా కనిపించదు . ఇక  మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యెర్నేని వేంకటేశ్వరరావు గారిలో  అన్నీ ఒకచోట చోటు చేసుకున్నాయి. ఆయన ఏ విషయాన్ని ప్రస్తావించినా ఆ విషయం కూలంకషంగా చర్చించేవారు . భౌతికశాస్త్రం వారికి అభిమానవిషయమైనా అన్ని  శాస్త్రాల్లోనూ ఆయనకు పరిచయమే గాక  ప్రావీణ్యo కూడ ఉండడం చాల అరుదైన విషయం.  ఒక్క మాటలో చెప్పాలంటే He  is  Jack of  all  trades  and  master  of  many  అనాలి.        

శ్రీరావుగారితో నాకున్న అనుబంధం, ఆత్మీయత చాల ఎక్కువనే చెప్పుకోవాలి.

1-2-1985 లో, నేను ANR. College లో లెక్చరరుగా చేరిన రోజునుంచి 29-11-20 న నేను వారిని కలసిన చివరిరోజు వరకు నాకు వారితో చక్కని, చిక్కని అనుబంధం కొనసాగుతూనే ఉంది. నేను గుడివాడలో ఉన్నంతకాలం   మా  ఇల్లు వారి ఇంటికి చాల చేరువలో ఉండడం వల్ల తరచుగా వారింటికి వెడుతూ ఉండేవాణ్ణి . 2009 లో నేను V.R.S తీసుకుని ఆగ్రా వెళ్లిపోయాక నేను ఆంధ్రదేశం  వచ్చినప్పుడు తప్పకుండా వారిని కలిసే తిరిగి  వెళ్ళేవాణ్ణి. ఆయన ఆరోగ్యం పట్ల అత్యంతశ్రద్ధ వహించే వారి సతీమణి ఏమనుకుంటారో అనే సందేహం మనస్సులో ఉన్నా ఎన్నో గంటలసమయం వారితో గడిపేవాణ్ణి .

వారికి సంస్కృతo పట్ల వేదాంతశాస్త్రం పట్ల గల ఆసక్తి  మా ఇరువురి సాన్నిహిత్యానికి మంచి పునాది వేసింది. మా ఇరువురికీ మధ్య రెండున్నర దశాబ్దాలు అంతరం ఉన్నా నన్ను ప్రేమతో ఆదరించేవారు . 

ఆయన ఉత్తమ అధ్యాపకులు .  ఎంతటి క్లిష్టమైన శాస్త్రీయవిషయాన్నైనా ఏమీ తెలియని వ్యక్తికి సులభంగా అర్థం అయ్యేటట్లు బోధించడంలో ఆయన చాల నిపుణులు .    వారు విద్యలో అత్యున్నతశిఖరాలు అధిరోహించినప్పటికీ  ఎంత చిన్నవాడు వచ్చి ఎటువంటి సందేహం అడిగినా తన స్థాయిని ప్రక్కకు నెట్టి సందేహం తీర్చే విశాలహృదయులు . 

      వేదానికి నిఘంటువు సమకూర్చిన యాస్కమహర్షి అధ్యాపకుని అర్థంలో వాడే ఆచార్య పదాన్ని  మూడు విధాలుగా  వ్యాఖ్యానించారు . 

 ఆచరతి ఇతి ఆచార్య: ( మంచి నడవడిక కలవాడు ) ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్య: ( మంచి నడవడికను శిష్యులకు నేర్పేవాడు )

ఆచినోతి అర్థాన్ ఇతి ఆచార్య: (ఎల్లప్పుడూ విద్యార్థుల కోసం అనేక విషయాలను సేకరిస్తూ ఉండే వాడు). ఈ మూడు లక్షణాలు ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికీ అధ్యాపకునకుo డవలసినవి.   ఇవి వారిలో సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన అధ్యాపకునిగా అత్యున్నత స్థాయినందుకున్నారు. వారి శిష్య,  ప్రశిష్యులు వేలాదిమంది  దేశవిదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనం.  పరిశోధకునిగా దేశవిదేశాల్లో వీరు గడించిన కీర్తి అనితరసాధ్యం.  

ఆయన మూర్తీభవించిన సద్గుణరాశి.  ఆచరణ పూర్వకంగానే  ఇతరులకు  మంచి గుణాలను బోధించే వారు. ఇక ఎప్పుడూ ఎన్నో పుస్తకాలు చదువుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, తెలియచేస్తూ ఉండేవారు. ఒక గదిలోంచి మరొక గదిలోకి నడిచి వెళ్ళే టప్పుడు కూడ తెరిచిన పుస్తకం చేతిలోనే ఉండేది.  అధ్యాపకునిగా ఆయన జీవితం నిరుపమానం .

   ఇక కళాశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు , త్యాగాలు మఱపురానివి, మఱు వలేనివి . ఒక్క మాటలో చెప్పాలంటే  Every brick of A.N.R. college glorifies the  greatness  of  Dr. Y.V. Rao అని చెప్పడo అతిశయోక్తి కాదు,  స్వభావోక్తి మాత్రమే. ఇక కళాశాల అడ్మినిస్ట్రేటర్ గా కులమతవర్గాలకతీతంగా వారందించిన నిష్పాక్షికమైన సేవలు పలువురి ప్రశంసలనందుకున్నాయి . ఏది ఏమైనా వారి జీవితం అంతా  పూలబాటగా సాగలేదు, ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు . కానీ ఎన్ని ఇబ్బందులెదురైనా దేనికీ తలవంచకుండా అధర్మానికి , అవినీతికి కొంచెం కూడ చోటివ్వకుండా  కళాశాలను ప్రగతిపథం  వైపునకు నడిపించిన ధీరులు డాక్టర్ . వై . వి. రావు గారు .  

మేము సంస్కృత భాషాభివృద్ధికి సంబంధించిన  ఏ సభకు పిలిచినా కాదనకుండా వచ్చేవారు . ఎన్ని సార్లు పిలిచినా కాదనకుండా వస్తానని కూడ అనేవారు. సంస్కృత భాషపై వారికున్న ప్రేమ అటువంటిది . ఇక  ఆయన గొప్ప వక్త . తమకు ఎంతో విషయ పరిజ్ఞాo  ఉన్నా ఏ విషయాన్ని, ఎక్కడ, ఏ స్థాయిలో, ఎంత వఱకు మాట్లాడాలో వారికి బాగా తెలుసు.  నేను చాల విషయాలు  వారి దగ్గర నేర్చుకున్నాను . గుడివాడ , చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మేమిద్దరం కలిసి పాల్గొన్న సాహిత్య సభలు వందకు పైగానే ఉంటాయి . నేనెప్పుడైనా అదుపుతప్పి అతిగా మాట్లాడుతోంటే  ఆపమని నా వీపు తట్టేవారు. నేను జాతీయ, అంతర్జాతీయసభల్లో పాల్గొన్నప్పుడు నేను సమర్పించిన  పరిశోధనాంశాలు చాలవరకు  వారిని సంప్రదించి వారి సహాయసహకారాలతో వ్రాసినవే .  ఇక నేను వారితో మూడు నాలుగు గంటలు కూర్చునేవాణ్ణి.  ఎన్నో సందర్భాల్లో వారి సతీమణి డాక్టర్ సరోజినమ్మగారి  చేతి వంట తిన్నవారిలో నేనొకణ్ణి.

ఆయనకు గురుభక్తి చాల ఎక్కువ. తనకు విద్య, పరిశోధనరహస్యాలు నేర్పిన ఆచార్య వెంకటేశ్వర్లు , అశుoడివంటి మహనీయులను తలుచుకుంటూ వారి గురించి నాకు చెబుతూ ఉండేవారు. ఆయన పరిశోధన చేస్తున్నపుడు ఎదురైన ఇబ్బందులు , సవాళ్ళు వాటిని ఎదుర్కొని విజయవంతంగా బయట పడడం పూసగుచ్చినట్లు చాల  ఆసక్తికరంగా వివరించేవారు. అవన్నీ రికార్డు చేసుకోలేక పోవడo  నా దురదృష్టం .  ఇక వారి గురువులు , మిత్రులు కొంతమంది నోబెల్ ప్రైజు పొందిన శాస్త్రవేత్తలు  కావడం చాల గొప్ప  విషయం .

ఆయనను ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా తాను పెద్దలకిచ్చిన కళాశాలాభివృద్ధి అనే  మాటకు  కట్టుబడి  వాటిని వదులు కోవడం చిన్న విషయమేమీ కాదు . వారెన్నో సంస్థలకు ఆర్థికసహాయం చేసి వాటి అభి వృద్ధికి దోహదం చేయడం వదాన్యతకు నిదర్శనం . వారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే . వారు తమ జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని 90 వ ఏట మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు . ఒక్కటిమాత్రం నిజం. ఎంతోజ్ఞాo  కలిగి ఉన్నా వినయం చూపించడం, సామర్థ్యం కలిగినా సహనంగా ఉoడడం, త్యాగగుణం  కలిగినా ఆత్మశ్లాఘ లేకపోవడమనే పరస్పర విరుద్ధగుణాలు ఆయనలో అన్నదమ్ముల్లా కలసి ఉండడం చాల ఆశ్చర్యకరమైన విషయం . వారి గుణగణాలు ఒక వ్యాసంలో కుదించడం సముద్రాన్ని కూజాలో బంధించడానికి ప్రయత్నించడమే అవుతుంది. ఇక వారు భౌతికంగా మనకు దూరమైనా వారి ఆదర్శాలు మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయని భావితరాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయని విశ్వసిస్తూ వారి కుటుంబసభ్యులకు  నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసుకుంటూ..

                     చిలకమర్తి దుర్గాప్రసాదరావు     

                                      08-12-20

 

 

1 comment:

Unknown said...

Very nicely articulated with facts. Totally agree with the content.