Sunday, November 1, 2020

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన ప్రేమాంబుధి శతకం ఒక సమీక్ష

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన ప్రేమాంబుధి శతకం

ఒక సమీక్ష

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

3/106, ప్రేమనగర్, దయాల్బాగ్, ఆగ్రా

 

నేను Science of Consciousness కు సంబధించిన  ఒక అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనడానికి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు శ్రీ నేమాని సోమయాజులు గారు  నాకు పరిచయం అయ్యారు. వారు కూడ ఆ కాన్ఫరెన్సులో పాల్గొనడానికే విచ్చేశారు . అక్కడ మేం ఇద్దరం ఎప్పుడు కలుసుకున్నా సాహిత్యం గురించే చర్చించుకునే వాళ్ళం . వారు కంప్యూటర్ సైన్సులో నిపుణులైనా సాహిత్యం పట్ల వారు కనపరిచే ఆసక్తి నాకు ఆనందసంభ్రమాలను కలిగించేది . వారు  వృత్తి రీత్యా విజ్ఞానశాస్త్రం s(software) లో నిపుణులు, ప్రవృత్తి రీత్యా గొప్ప సాహితీ వేత్త , కవి , పండితులు , అవధానవిద్యలో ఆరితేరిన వారు . వారిని కవిత్వం వరిచడం చూస్తే ‘చతురకవిత్వ తత్త్వ పటుసంపద ఒక్కరి సొమ్ముగాదు భారతి దయ’ అన్న కనుపర్తి అబ్బయామాత్యుని మాట అక్షరాలా నిజమనిపిస్తుంది . అమెరికాలో ఉ౦టూనే అటు వృత్తిపరంగాను ఇటు ప్రవృత్తిపరంగాను ఆహర్నిశలూ శ్రమిస్తూ  ఆంధ్రుల గొప్పదనాన్ని, ప్రతిభాపాటవాలను  ప్రపంచ౦ నలుమూలలా  విస్తరింపజేస్తున్న  మహామనీషి, సాటిలేని మేటి పండితులు శ్రీ నేమాని వారు .  

 

 

ఇక వారు రచించిన ప్రేమాంబుధిశతకం ఆమూలాగ్రం ఆసక్తితో చదివాను. నేను చిదివాను అనడంకంటే ఆ గ్రంథం నన్ను మొదటినుంచి చివరిదాకా  చదివేలా చేసింది అనడమే సబబని నాకు తోస్తోంది . ప్రతిపద్యం చాల హృద్యం, శైలి ప్రసన్నగంభీరం అంటే  మాటల్లో ప్రసన్నం భావంలో గంభీరం అన్న మాట . ప్రతిపద్యంలోను భాష , భావం రెండు శివపార్వతుల్లా పెనవేసుకు పోయాయి .    రచన పరిణతి చెందినదనడానికి ఇదొక ఉదాహరణ . 

ఇక ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం సర్వశ్రేష్ఠ౦.  అందుకే అది పరమపురుషార్థమై౦ది . మానవుడు తన యథార్థస్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది సిద్ధిస్తుంది . అందుకే  ఆపస్తంబమహర్షి ‘ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్’ అనే మాటల్లో  మానవుడు తన యథార్థస్వరూపాన్ని తెలుసుకోవడం కంటే  ఉన్నతమైన పరమార్థం మరొకటి లేదన్నారు  . ఈ మోక్షప్రాప్తికి  కర్మ, భక్తి, జ్ఞానం అనే   మూడు మార్గాలున్నాయి . కర్మలు ఎన్నో విధాలుగా ఉన్నాయి , వాటికి పరిమితి లేదు . అంతే కాక కర్మలు ధనవ్యయంతో ముడిపడ్డాయి , అందరు ఆచరించ లేరు . కర్మకాండకు ఎన్నో నియమనిబంధనలున్నాయి . యజ్ఞయాగాది కర్మలు అన్ని కులాలవారు ఆచరి౦చలేరు. కర్మకాండకు వయోపరిమితి , ఆశ్రమనిబంధనలు  ఎన్నో ఉన్నాయి . పోనీ ఎలాగో కష్టపడి కర్మల నాచరి౦చినా కర్మలవలన పొందేది ఏదీ శాశ్వతం కాదు .  ఇక జ్ఞానకాండ విషయానికొస్తే అది అందరికీ అందుబాటులో ఉండదు . నిత్యానిత్యవస్తువివేకం కావాలి  . లౌకిక సుఖాల పట్ల పారలౌకిక సుఖాల  పట్ల వైరాగ్యం కావాలి . ఇంద్రియనిగ్రహం( శమం) ,  మనో నిగ్రహం(దమం ) , కర్మఫలత్యాగం(ఉపరతి )  , శీతోష్ణ , సుఖదు: ఖాది ద్వంద్వాలను  సహించగలగడం (తితిక్ష )  , శాస్త్ర వాక్యాలపట్ల గురువాక్యాలపట్ల అచంచలమైన విశ్వాసం (శ్రద్ధ) , ఎటువంటి ఏమరుపాటులేని నిశ్చలమైన మనస్సు (సమాధానం) మొదలైన గుణాలు అలవరచుకోవాలి  . మోక్షంపట్ల కోరిక (ముముక్షుత్వం)  కలిగి ఉండాలి . ఇవన్నీ అలవడడం అంత సులభమేమీ కాదు . అందువల్లనే మోక్షసాధనాల్లో భక్తి  చాల గొప్పదని శ్రీశంకరుల వంటి  మహాజ్ఞాని స్వయంగా అంగీకరించారు.  అంతేగాక మనకు భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం భక్తిమార్గంలో ప్రయాణం చేసేవారికి  పుష్కలంగా లభిస్తోంది . ప్రతివ్యక్తి  భక్తి భావాలను  ప్రకటి౦చు కోడానికి శతకసాహిత్యం ఎంతో బాసటగా నిలుస్తోంది .

 ప్రేమాంబుధిశతకంలో  “రాధాస్వామి! ప్రేమాంబుధీ!” అనే మకుటంతో నూటతొమ్మిది పద్యాలున్నాయి . రచయిత తాను స్వయంగా  రాధాస్వామిసత్సంగ మతానుయాయి   కావడం వల్ల దేవాధిదేవుడైన రాధాస్వామీదయాళురను ప్రేమసముద్రునిగా వర్ణించి మనసారా  స్తుతించారు .

మోక్షం పూజలు,  దానధర్మాలు చేయడం వల్ల సిద్ధి౦చదని ధ్యానం వల్లనే సిద్ధిస్తుందని చాటి చెప్పే ఈ పద్యం ముముక్షువుల పాలిట ఒక కల్పవృక్షం .

“ విరిరాశుల్గొని పూజలన్ సలుపగన్, వేవేలు దానమ్మిడన్,
బురముల్ మెచ్చ వ్రతమ్ములన్ సలుపగన్ మోక్షమ్ము సిద్ధించునే?
స్థిరచిత్తమ్మున నొక్కలిప్తనయినన్ జేయంగ నీధ్యానమున్
దరియింపందగు విశ్వవారిధిని రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 4 ||

భగవంతుడు (GOD) సృష్టి, స్థితి ,లయకారకుడని(Generator Operator and Destroyer) అని అభివర్ణించిన ఈ పద్యం భగవంతుని యథార్థ స్వరూపాన్ని మనకు వెల్లడి చేస్తోంది.

“ నీవే విశ్వమునెల్లఁ గూర్చితివి తండ్రీ! తాల్చి ప్రీతిన్ మదిన్
నీవే సంస్థితికారణంబు విపదానీకంబు నీమాయయే
నీవే విశ్వవినాశకారణముగా నిత్యానుకంపానిధీ!
దైవంబున్నదె నిన్నుమించునది? రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 5 ||
రచయిత సత్సంగసాహిత్యాన్ని ఆపోశనం పట్టిన వారవడం చేత వాటిలోని ఎన్నో అంశాలను తెలుగులో తేటతెల్లం చేశారు.

సూర్యేందుల్ శతకోటులైనను   సుమీ క్షుద్రంబు నీ కంటె*****(7) 17,19,20,27

అండదేశం , పిండదేశం, బ్రహ్మాండం మొదలైన పదునెనిమిది లోకాలు వాటన్నిటికి కారణ భూతుడైన రాధాస్వామీ దయాళుని స్తుతించిన తీరు  చాల హృద్యం.

“ తుండల్ చూడఁగ నాఱు పిండమునఁ బ్రద్యోతించుచుండంగ, బ్ర
హ్మాండంబందున నాఱుభాగములు, నిర్మాయాప్రదేశంబునన్
ఖండంబుల్గన నాఱు కల్గినవి నీగర్భంబునుండే ప్రభూ!
దండంబుల్ శతకోటి కైకొనుము రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 12 ||

రాధాస్వామీ మతంలో గురువే దైవం ఆ గురువు, వారి అనుగ్రహం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే పద్యాలు ఈ శతకంలో ఎన్నో ఉన్నాయి . గురువే తల్లి ,తండ్రి, ప్రియుడు , మిత్రుడు , బంధువు . గురువే ఆత్మను తెలుసుకోడానికి అనువైన శబ్దమార్గాన్ని బోధించే యాప్తుడు  అటువంటి గురువు అన్నికోరికలు తీర్చే కల్పవృక్షం . హరిహరబ్రహ్మాదులకు గూడ గురువే  ఆరాధింపదగినవాడు . ఆ గురువు శబ్దస్వరూపుడు. అంత్యకాలంలో మనకు గురువే రక్షకుడు , అతడే దిక్సూచి.  తరణోపాయము , తరుణోపాయము కూడ గురువే . ఎవరు సుఖదు:ఖాలను గురువు యొక్క  దివ్యేచ్ఛగా భావించి తదనుగుణంగా మసులు కుంటారో వారికి స్వార్థపరమార్థాలు రెండు సిద్ధిస్తాయి . మోక్షం కరతలామలకం అవుతుంది . ఇక  విశ్వవ్యాప్తమైన చైతన్యం (Universal Consciousness) మానవలోకాన్ని రక్షించడానికి ఒక శరీరాన్ని ఆశ్రయిస్తుంది . ఆయనే సద్గురువు .   

రచయిత రాధాస్వామీసత్సంగ మతానికి సారభూతమైన శబ్దాభ్యాస (sound practice) విధానాన్ని చక్కగా వివరించారు .  సృష్టికి మూలం శబ్దం . ఈ విషయాన్ని ఇంచుమించు అన్ని మతాలూ అoగీకరిస్తున్నాయి . ఇక రాధాస్వామీ మతానుయాయులు సద్గురువు వలన ఆ శబ్దరహస్యాన్ని  తెలుసుకుని శబ్దాభ్యాసంతో ఆత్మధామాన్ని అనాయాసంగా , సునాయాసంగా చేరుకోగలుగుతున్నారు . ఇదే రాధాస్వామీమత౦ ప్రత్యేకత , ప్రాశస్త్యం  కూడ.   సమస్తసృష్టికి ధ్వనియే మూలమని అది  అందరికీ ఆంతర్యంలో మార్మోగుతూ ఉంటుందని భక్తుడు ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని ఆ ధ్వనిని వి౦టూ అందులో  లీనమైతే అదే అన్ని కష్టాలను నాశనం చేస్తుందని అదే ముక్తికి మార్గదర్శకమని వివరించారు .

ధ్వనిలో లీనముఁ జేయగావలయు నాత్మన్ సర్వలోకస్థులున్
ధ్వనితోఁ గాలును గాలకర్మములు రాధాస్వామి! ప్రేమాంబుధీ!”

 ధ్వని సద్గురువు మనకిచ్చే దానం . అది అన్ని  కష్టాల్ని తొలగించి మోక్షాన్నిస్తు౦ది.
“ సృష్టికి మందు ధ్వనియే ఉంది . సమస్త సృష్టి ధ్వని నుంచి పుట్టింది సమస్త కార్యములు
ధ్వని వల్లనే నెరవేరతాయి . ధ్వని సర్వకాల సర్వావస్థలలో అందరినీ రక్షిస్తుంది. భ్రమలు తొలగిస్తుంది . అన్ని నాదములు ఆ ధ్వని నుంచే పుడుతున్నాయి  అటువంటి ధ్వని ఈ లోకంలో హాగ్యశాలురకు మాత్రమే లభిస్తోంది. ఆ  ధ్వనిలో ఆత్మను లీనo చేస్తే సర్వకర్మలు నశిస్తాయి. ధ్వని అమృతంతో సమానం. అది అందరు పానం చేయాలి. ధ్వనిమార్గాన్ని సద్గురువే బోధిస్తారు. ధ్వనియే కర్త ,కర్మ , క్రియ , ధ్వనియే ద్రష్ట , దృశ్యం , దర్శనం .ధ్వనియే సమస్తం.  ధ్వని వశం చేసుకున్నవాడే భాగ్యవంతుడు .  ధ్వని అహంకారాన్ని,  భయాల్ని , బాధల్ని పోగొడుతుంది . గురుకృపతో ధ్వనిరహస్యం తెలుసుకున్న వాడు సులభంగా  ముక్తి పొందగలడు. కాబట్టి ధ్వనిశూన్యంబగు జ్ఞానమాగడము అన్నారు  (58,59,60, 61,62,63,64,65)
ఇక భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియని స్థితిలో భక్తుడు తన ఆవేదనను వ్యకం చేస్తూ ప్రార్థించే ఈ పద్యం సర్వసిద్దాంత సమానత్వానికొక దర్పణంగా కనిపిస్తోంది.

“ నీవెట్లుందువు? బ్రహ్మవిష్ణుహరవాణీలక్ష్మికాత్యాయినో
త్రోవంజూపు దయాస్వరూపుఁడగు క్రీస్తుంబోలియో లేక య
హ్హోవావోలెనొ జ్ఞానిమహ్మదుగ జీవోద్ధారమున్ జేతువో
దైవంబన్నది యెట్టులుండుఁగద రాధాస్వామి! ప్రేమాంబుధీ!”  || 85 ||

ఈ శతకంలో ఎన్నో దుష్కరప్రాస పద్యాలను రచయిత చాల సుకరంగా , సహజరమణీయంగా ప్రయోగించారు . ఇది భాషపై వారికి గల అపరిమితమైన అధికారాన్ని నిరూపిస్తోంది. ఇంకా ఈ శతకంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి. అవన్నీ వివరిస్తే అదొక పెద్ద గ్రంథమే అవుతుంది .   సిద్ధాంతనిరూపణ, భాషాపటిమ , భావవ్యక్తీకరణ సమపాళ్ళతో నిండిన ఈ శతకం ఒక  త్రివేణీ సంగమం. 

భక్తిభావాలతో బాటుగా రాధాస్వామీ సత్సంగసిద్ధాంతాలను రంగరించి వివరించే ఈ శతకం  రాధాస్వామీమతానుయాయులకే గాక  సమస్తభక్తజనాళికి మార్గదర్శకంగా నిలిచి వారి ఆధ్యాత్మిక అభ్యున్నతికి దోహదం చేస్తు౦దని నా ప్రగాఢ విశ్వాసం . వ్యాస విస్తర భీతిచే ఇంతటితో విరమిస్తున్నాను .  భక్తులకు, జిజ్ఞాసువులకు నిత్యపారాయణ గ్రంథంగా నిలువదగిన ఈ శతకాన్ని రచించి మనకందించిన శ్రీ నేమానివారు సర్వదా , సర్వధా అభినందనీయులు .   

చిలకమర్తి దుర్గాప్రసాదరావు

12.5.20.

********

 

No comments: