శాస్త్రాల మనుగడ సందేహాస్పదమే
(పండితులు నాడు -నేడు)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
పూర్వకాలంలో మనదేశంలో పండితులు ప్రజా సదస్సుల్లోను
రాజాస్థానాల్లోను పాల్గొని తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తో ఉండేవారు. ప్రజా
సదస్సుల్లో గెలిచినవారికి వదాన్యశేఖరులు సన్మానం చెయ్యగా, రాజసభల్లో గెలిచిన
వారిని రాజులు సన్మానించి మణులు ,
మాన్యాలు అగ్రహారాలు బహూకరి౦చే వారు.
మొత్తం మీద పండితులు, వారు ఏ శాస్త్రం చదివినా ఆ శాస్త్రంలో మంచి ప్రతిభా
పాటవాలను సంపాదించేవారు. ఇక కవుల సంగ తి చెప్పక్కర్లేదు . రాజే స్వయంగా సేవలు చేసే
వాడు. అందుకే సుకవితా యద్యస్తి రాజ్యేన కిం ? అనే మాట ప్రచారం పొoదింది . మంచికవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు.
ముఖ్యంగా తర్కవ్యాకరణశాస్త్రాల్లో పోటీలు జరుగుతు ఉండేవి.
తర్క పండితులకు వ్యాకరణ శాస్త్రంలో పాండిత్యం లేక పోవడం వల్ల వాళ్ళు తప్పులు
మాట్లాడుతూ ఉండే వారు.
ఒకసారి ఒక వ్యాకరణ పండితుడు “నైయాయికా: పశవ:” అన్నాడు. అంటే
తర్కశాస్త్రం చదువుకున్న వాళ్ళు పశువులు అని అర్థం . అలా అనగానే తర్క పండితుడికి
కోపం వచ్చింది . “వైయాకరణా: తృణవ:” అన్నాడు . అంటే వ్యాకరణశాస్త్రం చదువుకున్నవాళ్ళు
గడ్డిపరకలు అంటే మేం మిమ్మల్ని నమిలేస్తాం అని అర్థం వచ్చేలాగ అన్నాడు . కానీ
పొరబాటే౦టంటే తృణా: అనాలి కాని తర్క పండితునకు శబ్ద జ్ఞానం లేకపోవడం వల్ల
పశవ: మాదిరి గానే తృణవ: అన్నాడు. వాళ్ళు అతన్ని ఆక్షేపిస్తూ
అత ఏవ యూయం పశవ: అన్నాడు ( అందుకే మీరు పశువులు) . ఈ విధంగా తార్కికులకు వ్యాకరణపండితులకు మధ్య
వాద వివాదాలు జరుగుతూ ఉండేవి.
ఇక ఆడవాళ్ళు కూడ మగవాడి జ్ఞానాన్ని పరిశీలించే పెళ్లి చేసుకునే వారు. ఒక వ్యక్తి పెళ్లి చూపులకోసం
ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాడు . ఇరు పక్షాల బంధువులు సమావేశం అయ్యారు. ఆ అమ్మాయి
వరుణ్ణి కొన్ని ప్రశ్నలడుగుతానంది. సరే ! అడగమన్నాడు.
‘విహస్య’ అనే పదానికి విభక్తి చెప్పమంది. విహస్య అనేది
అవ్యయం (indeclinable) దానికి లింగం , గాని
వచనం గాని , విభక్తి గాని ఉండదు. ఆ పదానికి నవ్వి (having laughed) అని అర్థం . వాడికది తెలియదు . వాడు రామ శబ్దం ఒక్కటే చదువుకున్నాడు
రామస్య తెలుసు . అందుకని రామస్య లాంటిదే అనుకున్నాడు . షష్ఠీ విభక్తి అన్నాడు.
ఇంకో chance ఇద్దామను కుంది. ‘విహాయ’ అని అడిగింది . అదీ అవ్యయమే .
విడిచి పెట్టి (having left) అని దాని కర్థం. వాడు
రామాయ లాగ ఉంది. కాబట్టి చతుర్థీ విభక్తి అన్నాడు. అదీ తప్పే . ఆమె
ముచ్చటగా మూడో chance ఇద్దామను కుంది . ‘అహం’ ఏ విభక్తి అని అడిగింది. అది సర్వ నామం (pronoun) , అహం ప్రథమా విభక్తి , నేను అని దానికర్థం . వీడికది
తెలిసేడవదు. వాడికొచ్చిoదల్లా రామ శబ్దం ఒక్కటే
. ‘అహం’ అనే పదం ‘రామం’ లాగా ఉంది కాబట్టి ద్వితీయావిభక్తి అన్నాడు. వాడి తెలివితక్కువతనానికి ఆమె తట్టుకోలేక
పోయింది. వెంటనే బయటకు దయచేయ మంది. ఏమ్మా ! అబ్బాయి అందంగా లేడా అన్నారు వాళ్ళు
అమాయకంగా . అబ్బాయి అందగాడే కావచ్చు గాని , బుద్ధి మాత్రం మందం అంది . అదేంటని వాళ్ళు
అడిగారు.
యస్య షష్ఠీ ద్వితీయా స్యాత్ విహస్య చ విహాయ చ
‘అహం’ కథం ద్వితీయా స్యాత్ ద్వితీ యా స్యామహం కథం ?
అని శ్లోకంలో తన గోడునంతా ఏకరువు పెట్టింది.
ఎవడికి ‘విహస్య’ షష్ఠీ, ‘విహాయ’ చతుర్థి అవుతుందో, ‘అహం’ ద్వితీయ
ఔతుందో అటువంటి వాడికి నేను ద్వితీయ(
భార్య)నెందు కౌతాను? అంది.
పూర్వం ఆడవారు కూడ ఎంతో పాండిత్యం
చూపించేవారు.
ఆవిధంగా మనవారు తమ తమ శాస్త్రాలను కొన్ని వేల సంవత్సరాల
పాటు రక్షిస్తూ వచ్చారు. కాని నేడు
శాస్త్రాల పట్ల ఆసక్తి క్రమక్రమంగా తగ్గుతోంది.
నేడు విద్యాలయాలలోను విశ్వవిద్యాలయాల్లోనూ
శాస్త్రాలకుండవలసినంత ప్రాధాన్యం లేదు. విద్యార్ధు లు
డిగ్రీల కోసమే చదువు తున్నారు. డిగ్రీ ,తరువాత ఉద్యోగo వచ్చాక చదివిన శాస్త్రం మరిచి పోతున్నారు . “అనభ్యాసే విషం శాస్త్రం” అన్నారు పెద్దలు ఏ శాస్త్ర మైనా రోజూ చదవక పోతే పరిచి పోతాం .
ఇప్పుడు శాస్త్రాలు శాస్త్రచర్చలు యువకుల్లో జరగడం లేదు.
యత్ర యత్ర శాబ్దికా: తత్ర తత్ర తార్కికా:
యత్ర యాత్ర తార్కికా: తత్ర తత్ర శాబ్దికా:
యత్ర యత్ర చోభయం తత్ర తత్ర నోభయం
యత్ర యత్ర నోభయం తత్ర తత్ర చోభయం
దీని
తాత్పర్య మేoటంటే మీరు
వ్యాకరణంలో పండితులైతే, మేము తర్క శాస్త్రంలో పండితులం . మీరు తర్కశాస్త్రంలో
పండితులైతే మేము వ్యాకరణంలో పండితుల౦ .
ఒకవేళ మీకు రెండు తెలిస్తే మాకు రెండు తెలియదు. మీకు రెండు తెలియక పొతే
మాకు రెండు తెలుసు. మీకు మాకు ఎటువంటి వాడ వివాదాలు వద్దు. హాయిగా కాలం గడిపెద్దాం. ఇదీ నేటి పరిస్థితి.
ఎవరికి, వారు చదువుకున్న శాస్త్రం
పై గౌరవం లేదు. అందరు అలా ఉన్నారని నేననడం లేదు , నూటికి తొంబై శాతం ఇలాగే
ఉన్నారు. శాస్త్రాల మనుగడ సందేహాస్పదమే . తస్మాత్
జాగ్రత జాగ్రత
No comments:
Post a Comment