కలిస్తే నిలుస్తాం -విడిపోతే
పడిపోతాం
Unite we stand - Divide we fall
ఏకత్వం లోకమోహనం - భిన్నత్వం
భయావహం
రచన:
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద
రావు
9897959425
ఏకం
విష రసో హంతి శస్త్రేణైకశ్చ హన్యతే
స రాష్ట్రబంధుం రాజానం హంత్యేకో భావవిప్లవ:
అన్నారు
మన పెద్దలు .
నిజమే!
విషం ఒక వ్యక్తినే చంపుతుంది ఎందు కంటే
అది విషమని తెలిశాక దాన్ని తొలగించవచ్చు. అలాగే కత్తి ఒక్క వ్యక్తిని మాత్రమే చంపగలుగుతుంది.
మిగిలినవారు ఎదిరించి పోరాడతారు లేదా
తప్పించుకుని పారిపోతారు. ఇక విప్లవాత్మకమైన భావజాలం మాత్రం దేశాన్ని, ప్రభుత్వాన్ని,
రాజును, ప్రజలను అందరినీ నాశనం చేసేస్తుంది. అది పైకి కనబడని పదునైనకత్తి, సులువుగా
పసిగట్టలేని సొగసైన విషం . ఇటువంటి విప్లవాత్మకమైన భావజాలం నేటి భారత దేశాన్ని పట్టి,
పీడిస్తోంది. ఇటువంటి పైకి కానరాని, సులభంగా పసిగట్టలేని, భావజాలాన్ని నిర్మూలించ గలిగేది
ఒక్క విచక్షణ గల బుద్ధి మాత్రమే.
పూర్వం మన భారతదేశం అంగ , వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌవీర, సౌరాష్ట్ర
, మహారాష్ట్ర , మగధ , మాళవ, నేపాల, కేరళ, చోళ, గౌడ , మళయాళ , సింహళ , ద్రవిడ ,
ద్రావిడ, కర్ణాట , నాట , పానాట, పాండ్య, పులింద
, హూణ, దశార్ణ , భోజ, కుక్కురు, కురు, గాంధార, విదర్భ , విదేహ , బాహ్లీక , బర్బర, కేకయ,
కోసల, కుంతల, కిరాత, శూరసేన, సేవన, టెంకణ, కొంకణ, మత్స్య, మద్ర, పార్శ్వ, ఘూర్జర,
యవన , ఆంధ్ర , సాళ్వ, చేది, సింధుమతి మొదలైన అనేక దేశాలతో సర్వాంగ సుందరంగా ఉండేది. అందరిలో నెలకొన్న
సంస్కృతులు , ఆచారాలు, భాషలు, వేరు వేరుగా ఉన్నా జాతీయభావాలు చెక్కు చెదరలేదు.
అందరు కలసిమెలసి ఉండేవారని ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆనాటి మనలోని కొంతమంది
స్వార్థపరుల వలన విదేశీయులు మనల్ని ఆక్రమించారు. “ ఒప్పుల కుప్పా ఒయ్యారి భామ గా
ఉన్న దేశాన్ని అప్పులకుప్ప అయ్యో రామాగా” మార్చేశారు. ఒక చెట్టును, గొడ్డలి నరకాలంటే అది స్వయంగా ఆ
పని చెయ్యలేదు, చెట్టులో ఒక భాగం, గొడ్డలిలో దూరితేనే అది సాధ్యపడుతుంది. అటువంటి కొంతమంది స్వార్థపరుల విషపూరితమైన
ఆలోచనలకు జాతి ఎన్నో కష్టనష్టాలు అనుభవించింది. మనం ఎన్ని ఆటు పోటులకు గురి అయినా మన
వైదిక ఋషులు అందించిన ధర్మాలు మనల్ని ఒకటిగా
కట్టి పడవేశాయని నా విశ్వాసం.
ఋగ్వేదానికి ఉన్నంత విశాలమైన దృక్పథం మరే గ్రంథానికి లేదని నా నమ్మకం
. ఋగ్వేదం
“ఆనో భద్రా: క్రతవో యాంతు విశ్వత:” అని కోరింది.
Let noble thoughts come from all sides. అని ఆ మాటలకు అర్థం.
ఇంకా ఏమందో చూడండి . ‘ సంగచ్ఛధ్వం” అందరు ఒకచోట సమావేశం కండి. “సంవదధ్వం”,
ఒకరితో ఒకరు మాట్లాడు కొంటూ
చర్చించుకోండి, “ సం నో మనాంసి జానతాం” , ఒకరి మనస్సును మరొకరు
తెలుసుకోండి. “ దేవాభాగం యథా పూర్వే
సంజానానా ఉపాసతే “ అంటే
విద్యావంతులు, పెద్దవారైన మీ పూర్వీకులు,
ఆచరణ రూపంగా చెప్పిన ధర్మాలను అనుసరించండి .
“సమానీవ
ఆకూతి:”
మీ అభిప్రాయాలు ఒకేవిధంగా
ఉండేలాగా , “ సమానా హృదయాని వ: “ మీ హృదయాలు ఒకేవిధంగా ఉండేలాగా,
“సమానమస్తు వో మనో” మీ మనస్సులు ఒకే విధంగా మెలగండి .
‘యథా వ: సుసహాసతి’ పరస్పర సహకారంతో
మెలగండి . ఇది ఋగ్వేదం మనకిచ్చిన సందేశం.
ఋగ్వేదం, పదో మండలం నూట అరవై ఒకటవ మంత్రం.
ఆ మొత్తం ఉపదేశాలు మరోసారి విందాం.
1. Associate
you all in public meetings.
2. Have
you all free discussions.
3. Acquire
you all through wisdom.
4. Follow
the footsteps of your learned elders who have shown by their exemplary devotion
to duty or dharma.
5. Let
all your actions are according to the dictates of duty.
6. Don’t
injure the feelings of others.
7. Consider
thoroughly before taking any step.
8. Help
and give aid to
మంత్రం కూడ మరో సారి విందామా !
संगच्छध्वं , संवदध्वं, सं नो मनांसि जानताम् |
देवाभागं यथा पूर्वे
संजानाना उपासते
समानीव आकूति: समाना हृदयानि व:
समानमस्तु वो मनो यथा व: सुसहासति
ఇక మనం పరస్పరం విడిపోతే దానివల్ల కలిగే నష్టాన్ని వివరించే ఒక అందమైన
ఆంగ్లపద్యం కూడ తెలుసుకుందాం.
First, they came for the Jews
I did not speak out
Because I was not a Jew.
ముందుగా కొంతమంది సైనికులు యూదులను చంపడానికి వాళ్ళ కోసం వచ్చారు. నేనేమీ ప్రశ్నించ లేదు, నాకెందుకులే
అనుకున్నాను . ఎందుకంటే నేను యూదును కాదు కాబట్టి .
Next, they came for the communists
But I did not speak out
Because I was not a communist.
కొంతకాలం తరువాత
వాళ్ళు కమ్యునిష్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడ నేను నోరు మెదపలేదు . ఎందుకంటే
నేను కమ్యునిష్టును కాదుగా, నాకెందుకులే అనుకున్నాను .
Then they came for the trade
unionists
And I did not speak out
Because I was not a trade unionist
ఆ తరువాత వాళ్ళే ట్రేడ్ యూనియన్ సభ్యులకోసం వచ్చారు . అప్పుడు కూడ
నేను మౌనంగానే ఉన్నాను . ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ సభ్యుడను కాదు కదా, నాకేమీ పరవాలేదులే అనుకున్నాను.
Then they came for the Catholics
And I did not speak out
Because I was not catholic
ఇంకా కొంతకాలం గడిచాక వాళ్ళు కేథలిక్కుల కోసం వచ్చారు. నేను కేథలిక్కును
కాదు కాబట్టి అప్పుడు కూడ నాకెందుకులే అనుకున్నాను. ఎవర్నీ ప్రశ్నించలేదు .
Ten they came for me
And there were no one left
To speak out for me.
కొంతకాలం తరువాత చివరకు ఒక రోజున వాళ్ళు నా కోసం వచ్చారు .
ఇక నా కోసం మాట్లాడడానికి ఒక్కడు కూడ అక్కడ మిగలలేదు .
ఇక ఒకప్పుడు చవకబారు ఆలోచనలతో, స్వార్థ బుద్ధితో విదేశీయుల పాలనకు అవకాశం ఇచ్చి
ఎన్నో
ఇబ్బందులు పడ్డ మనకు మహాత్ముని నాయకత్వం వలన స్వాతంత్ర్యం లభిస్తే , పటేల్
మహాశయుని వలన ఏకత్వం సిద్ధించింది. దేన్ని సాధించాలన్నా ఏకత్వం అనివార్యం. అందుకే
మహాత్మాగాంధి స్వాతంత్ర్యం కోసం అందరిని రాట్నం పుచ్చుకోమన్నారు. హిందువులను గీత , క్రైస్తవులను బైబిలు,
మహమ్మదీయులను ఖురాను మిగిలిన మతాల వారిని వారి వారి పవిత్రగ్రంథాలను పట్టుకొమ్మని చెప్పలేదు . అలాగే చెప్పి ఉంటే మనం ఇంకా బానిసత్వంతో బాధపడుతూనే ఉండేవాళ్లం. ఒకవేళ
మీరందరు కర్ర పట్టుకోండి, లేదా కత్తి పట్టుకోండి అని చెప్పి ఉంటే
స్వతంత్రభారతం దాదాపు స్మశానం గానే మారి ఉండేది .
ఇక అభిప్రాయ భేదాలు
మనుషులకే ఉంటాయి . జంతువులకు ఉండవు ఎందుకంటే వాటికి ఒక అభిప్రాయమే ఉండదు కాబట్టి .
మనలో అనేక సంప్రదాయాలు , విశ్వాసాలు, ఆచార వ్యవహారాలూ ఉన్నా అంతర్లీనంగా ఏకత్వం
ఉంది.
ఒకసారి సమాజాన్ని మానవ
శరీరంతో పోల్చి చూద్దాం.
మన శరీరంలో nervous system ,
respiratory system , digestive system , circulatory system , excretory system వంటి ఎన్నో ఎన్నెన్నో భిన్న భిన్నమైన సిస్టమ్స్ ఉన్నాయి . వాటి పనులు, వేరైనా లక్ష్యం
శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే . ఇంతే గాక
మన శరీరంలో కోటానుకోట్ల రక్త కణాలు ఉన్నాయి . అవి వేటి పని అవి చేసుకుంటూనే పోతున్నాయి. అలాగే ఒక
సంస్థలో ఎన్నోశాఖలుంటాయి, ఎంతో మంది వ్యక్తులు వివిధమైన బాధ్యతలు కలిగి ఉంటారు .
అందరి లక్ష్యం సంస్థ అభివృద్ధి మాత్రమే . అలాగే మనలో ఎన్నెన్ని భేద భావాలున్నా మన
దృష్టిమాత్రం, దేశహితం, సౌభాగ్యం,
సార్వభౌమత్వం మీదే ఉండాలి. అంతేగాని “ ఎవడి
కొంప తీతునా” అనే ఆధునిక అష్టాక్షరీ
మంత్రాన్ని ; “మాకారోగ్యం , మాకైశ్వర్యం; మాకు ధనం, మీకు ఋణం” అనే ఆధునిక ద్వాదశాక్షరీ
మంత్రాన్ని జపం చేస్తూ కూర్చోకూడదు . ఏది ఏమైనా నేను చెప్పే ఈ రెండు, మూడు మాటలు నిత్యసత్యాలు. ఇవి అందరికీ తెలిసినవే. కొత్తవి కావు. ఒకటి, మనం
వచ్చినప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు మంచి, చెడు, ఈ రెండు తప్ప మరేమీ మన వెంట రావు.
ఇక రెండోది, మనకంటే గొప్పవాడు
ఎవడు లేడు, అలాగే మనకంటే తక్కువ వాడు కూడ ఎవడు
లేడు.
ఇక ముఖ్యమైన మూడోవిషయం.
మనకు ప్రపంచంలో భారతీయుడుగానే గుర్తింపు ఉంది . మరో విధంగా గుర్తింపు లేదు. . ఐక్యరాజ్యసమితిలో
మన చిరునామా India, also known as Bharat అనే ఉంటుంది. మరో విధంగా ఉండదు అని ఎవరో చెపితే
విన్నాను. భారతీయ సమగ్రతకు సమైక్యానికి మనం
కృషి చేద్దాం, బంగారు బాటలు వేద్దాం . ‘ జననీ, జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ’ అనే మహానినాదాన్ని మారు దశదిశలు మ్రోగేలా
చేద్దాం .
నమస్కారం.