Thursday, July 24, 2025

'పాదరక్షోపాఖ్యానం' డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 పాదరక్షోపాఖ్యానం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

ఒక రోజున ఒక కాన్వెంట్ కుర్రవాడు క్లాసుకి చాల ఆలస్యంగా వెళ్ళాడు . టీచర్,  వాడితో  ఎరా !  ఈ రోజు ఎందుకు ఆలస్యం అయింది? అని అడిగారు. వాడు అయ్యా! ఇంట్లో మా అమ్మ, నాన్న  ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు  అన్నాడు.  సరేలేరా! మీ అమ్మ, మీ నాన్న దెబ్బలాటకు నీ ఆలస్యానికి ఏమిటి సంబంధం ? అని అడిగారు .

ఏమీ లేదు సార్ ! నా చెప్పు ఒకటి మా అమ్మ చేతుల్లోను , మరొకటి మా నాన్న చేతుల్లోను ఉండిపోయాయి . నాకు చెప్పుల జత ఒక్కటే ఉంది వారి తగవులాట పూర్తయ్యే దాక రాలేకపోయాను అన్నాడు . 

 

నా మిత్రునికి ప్రతి రోజూ గుడికి వెళ్ళే అలవాటుంది .

రోజుకో చెప్పుల జత పోతూ ఉండేది . అవి పోతూనే ఉండేవి . వీడు గుడికి వెళ్ళడం మానలేదు వెడుతూనే ఉండేవాడు. రోజూ కొత్త చెప్పులే కాబట్టి అవి పోవడం అనివార్యం అయింది .  

ఒకసారి నాతొ ఎలాగరా! ఇలాగైతే అన్నాడు . నేనో సలహా చెప్పాను. ఒరేయ్! ఒక చెప్పు ఒకచోట, మరో చెప్పు దూరంగా ఇంకో చోట పెట్టి చూడరా! రెండోది ఎక్కడ పెట్టావో మాత్రం నువ్వు మరిచి పోకు  అన్నాను. అప్పటినుంచి వాడి పరిస్థితి  కొంత మెరుగు పడింది .

నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు. వాడి గురించి  చెప్పాలంటే ‘చిత్తం శివుని మీద భక్తి  చెప్పుల మీద  అనే సూక్తి వాడికి వర్తిస్తుంది’ అని చెప్పక తప్పదు. ఒకసారి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించు కుంటున్నాడు . అర్చక స్వామి మీ గోత్రం ఏమిటని అడిగారు . వెంటనే తడుముకోకుండా   చెప్పులు అని చెప్పేశాడు . అర్చక స్వామి,  ఆయనతో బాటుగా అక్కడున్న భక్త బృందం  ఆశ్చర్య పోయారు .  

 

ఒకసారి ఒక కుర్రవాడిని యజమాని తన ఇంట్లోంచి  పంపించేశాడు  . ఎందుకండీ! అలా చేశారు అన్నాను. వాడు చెప్పుతింటల్లేదండీ ! అన్నారు .

నాకేమీ అర్థం కాలేదు . నా మిత్రుడు చెప్పాడు . చెపితే వినడం లేదట అని .

మనం బూట్లు కొనుక్కోవడానికి షాపులోకి వెళతాం.    

అక్కడ యజమాని బూట్లు చూపిస్తారు. మనకు ఒక కాలికి సరిపోయినట్లు , మరో కాలికి కొంచెం బిగువో, లూజో అయినట్లుగా అని పిస్తుంది . అది బూటుల్లో లోపం కాదు కేవలం మన feetల్లో  లోపం . ఆ విషయం షాపు యజమాని మనతో అనడు , అంటే మనకు కోపం వస్తుందని. మనమే అర్థ చేసుకోవాలి. కుడి చేతికి ఎడం చేతికి మనం గమనించలేనంతగా కొంత తేడా ఉన్నట్లే కుడి కాలికి ఎడమ కాలికీ ఎంతో కొంత తేడా ఉండక మానదు.

ఒకాయన నన్ను రామాయణంలో దశరథునికి భరతునికి తేడా ఏమిటని అడిగారు. ఏముంది ? దశరథుడు రాజ్యం  లేకుండా చేస్తే, భరతుడు చెప్పులు కూడ లేకుండా చేశాడు అన్నాను.

ఒకసారి మహాకవి శ్రీ శ్రీ గారు  ఒక సభలో ప్రసంగం చెయ్యడానికి వచ్చారు. ఒక కాలికి ఒక రంగు చెప్పు ; మరో కాలికి మరో రంగు చెప్పు. నాకు చాల ఆశ్చర్యం అనిపించింది . ఎందుకంటే ఆయనకు సభాలో అందరికీ  ఏదో చెప్పాలనే ధ్యాసే గాని తాను వేసుకున్న చెప్పుల మీద ధ్యాస లేదు . అందుకే ఆయన మహాకవి అయ్యారేమో అనిపించింది .

ఒక విధంగా ఆలోచిస్తే మనం కూడు కి గూడుకి కంటే జోడు కే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని నాకు అని పిస్తోంది . ఒక్కొక్కరికి పది జతలు , ఇరవై జతలు ఉంటున్నాయి . ఏ వస్తువైనా మనం ఆవసరం మించి అతిగా కొంటే దాని ప్రభావం చాల తీవ్రంగా ఉంటుంది. అందుకే సామాన్యుడు జోళ్లు కొనుక్కోవడం కూడ కష్టంగా మారుతోంది . ఈ విధానం మారాలి .      

ఒకసారి ఒక చిన్నపిల్ల తండ్రిని నాన్నా! నాకు బూతులు కావాలి నాకు బూతులు కావాలి అని పేచీ పెట్టిందట.  దాని కేముందమ్మా అనుకుని సినిమాకు తీసుకు పోయాడట! ఇది కాదు నాన్నా  ఇది కాదు నాన్నా అని ఏడుస్తోందట!. అపుడు వాళ్ళ అమ్మ ఆ పిల్ల మనసులోని మాటలు అర్థం చేసుకుని బూట్లు అని సెప్పిందట.

ఒక అవధానంలో శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు నేటి సినిమాల గురించి చెప్పమని ఒకరు అడిగినప్పుడు ఈ విషయం చక్కని పద్యంలో చెప్పేరు . పద్యం వినండి.

బూతులు కావలెనని యొక

కూతురు తన తండ్రినడుగ గూతున్సినిమా

 చూతువు రమ్మనె విని సతి

బూతులనగ బూటులనియె మురిపెము తోడన్ .

 

నేటి సినిమాల మీద ఇంత కంటే గొప్పగా ఎవరు చెప్పలేదేమో!

నాకు అనిపిస్తుంది. పూర్వం సినిమాల్లో ఎన్నో అనుభూతులు ,  మరి నేటి సినిమాల్లోనో ఎన్నెన్నో బూతులు అని .    

        

ఒకసారి నేను నా భార్య రైల్లో ప్రయాణం చేస్తున్నాం .

ఒక స్టేషన్ లో  క్రిందకు దిగుదామనుకుంటే ఒక చెప్పు ఎంత వెదికినా కనబడ లేదు. నాకు చాల బాధనిపించింది . రెండు  చెప్పులూ  పోవడం వేరు ఒక చెప్పు పోవడం వేరు . నేను బుద్ధిలో బృహస్పతిని కదా ! ఆ చెప్పు  రైల్లోంచి బయటకు విసిరేశాను. ఇక మా చివరి స్టేషన్ నరసాపురంలో దిగేటప్పుడు సామాను బయటకు తీస్తో ఉంటే  రెండో చెప్పు కనిపించింది . అది కనబడగానే నాకు చాల బాధ కలిగింది . మొదటిది విసిరేసినందుకు కాదు, రెండోది తరువాత కనిపించినందుకు . సరే! ఇక చెప్పుల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే  తప్పదు మీ సమయానికి ముప్పు . ఇంతటితో విరమిస్తాను. సెలవు .         

      

No comments: