పురాణమిత్యేవ
న సాధు సర్వం
రచన:
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
కాళిదాసు మనకు జాతీయ కవి. ఆయనకు మన
జాతి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా ఆయన ఋణం తీరదు . ఆయనకు ముందు, భాసుడు, సౌమిల్లకుడు , కవిపుత్రుడు వంటి ఎంతో
మంది గొప్ప గొప్ప కవులు ఉండేవారు . కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’ అనే ఒక నాటకం
వ్రాస్తూ భాస,
సౌమిల్లక , కవిపుత్రాదుల వంటి ఎంతో ప్రసిద్ధులైన కవులుండగా నా నాటకాన్ని ఎవరు
చదువుతారు? అని ఒక
ప్రశ్నవేసుకుని దానికి తానే సమాధానం చెప్పుకుంటూ ఒక అమూల్యమైన విషయాన్ని మనకు
అందించాడు.
పురాణమిత్యేవ న సాధు సర్వం
న
చాపి కావ్యం నవమిత్యవద్యం
సంత: పరీక్ష్యాన్యతరద్భజంతే
మూఢ: పరప్రత్యయనేయ బుద్ధి:
ఇది పాతది కదా! అని ప్రతి దానిని మంచిదిగా
భావించ కూడదు . అలాగే ఇది క్రొత్తది కదా! అని ప్రతి దానిని పనికి రానిదిగా భావించకూడదు.
ప్రాచీనంలో పనికి రానివి, నూతనంలో పనికి వచ్చేవి కూడ ఉంటాయి . సత్పురుషులు ఏది మంచి , ఏది చెడు అనే విషయాలను
బేరీజు వేసుకుని చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు . మూర్ఖుడు తన బుర్రతో
ఆలోచించకుండా ఇతరులు చెప్పిన మాటలు నమ్ముతాడు అని కాళిదాసు మాటలలోని అభిప్రాయం . కాళిదాసు
ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిం చినా ఇది సార్వకాలిక సత్యం .
కాబట్టి ప్రతివ్యక్తి, ఒక వస్తువు లేదా సిద్ధాంతం యొక్క మంచి, చెడులు మాత్రమే ఆలోచించాలి
గాని, పాతదే మంచిది, క్రొత్తది చెత్తది అని మూర్ఖుని వలె వాదించకూడదని సారాంశం .
పాత సినిమాలన్నీ మంచివి; క్రొత్త సినిమాలన్నీ చెత్తవి అని మనం అనగలమా ? అనలేం .
ఎందుకంటే పాత సినిమాలలో చెత్త సినిమాలూ
చాల ఉంటాయి అలాగే క్రొత్త
సినిమాలలో మంచివి కూడా చాల ఉంటాయి . కాబట్టి మనకు మంచి, చెడు అనేవి ముఖ్యం గాని పాతదా , క్రొత్తదా అనేది ముఖ్యం కాదు . చెడు పాతదైనా తీసి
వెయ్యాలి , మంచి ఎంత క్రొత్తదైనా ఆహ్వానించాలి. ఇక ప్రపంచ సాహిత్యం లోనే మొట్ట
మొదటిదైన ఋగ్వేదం “ ఆ నో భద్రా: క్రతవో యాంతు విశ్వత: అంటే let noble thoughts come from all sides “అన్ని
దిక్కులనుండి ఉన్నతమైన ఆలోచనలు ప్రసరించు గాక” అని ఉదాత్తమైన ఆలోచనలకు పెద్ద పీట
వేసింది.
అంతే కాకుండా మన పెద్దలు “తాతస్య కూపోsయమితి బ్రువాణా: తిక్తం జలం
కాపురుషా: పిబంతి” అన్నారు .
ఇది మా
తాత తండ్రులు త్రవ్వించిన బావి అని గొప్పలు చెప్పుకుంటూ ఆ బావిలోనుంచి వెలువడే
చెత్త నీటిని త్రాగే వాళ్ళు మూర్ఖులని నిరసించారు .
ఇక ఈ ప్రపంచం పరిణామ శీలం . ఎప్పుడు
మారుతూనే ఉంటుంది. బుద్ధ భగవానుడు ఒక మాట అంటాడు . ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు ,
మార్పు ఒక్కటే శాశ్వతం అని . Nothing is permanent but change. మార్పును ఆహ్వానించడం ఆరోగ్య
లక్షణం, ఆహ్వానించక పోవడం అనారోగ్య లక్షణం . కాని ఆ మార్పు మంచికి దారి తీస్తోందా?
చెడుకి దారి తీస్తోందా? అనేదే మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి.
మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలి .
చెడు మన దైనా పరిహరించాలి . కాళిదాసు రఘువంశ రాజుల పరిపాలనా విధానాన్ని వర్ణిస్తూ...
ఆ దిలీపుడు తన శత్రువైనా వాడు
మంచివాడైతే అతనిని గౌరవించేవాడట. ఇక
చెడ్డవాడు, తన మిత్రుడైనా వాణ్ణి విడిచిపెట్టే వాడట . అతనికి మంచి, చెడులే గాని;
తనవాడు , పరాయివాడు అనే భేదం లేదు. ఇది
అసలు సిసలైన ఆచరణ యోగ్యమైన భారతీయ సిద్ధాంతం.