Sunday, August 5, 2012

ఆ ఒక్కటి వదిలెయ్యి నీకు పుణ్యం ఉంటుంది.


ఆ ఒక్కటీ వదిలెయ్యి నీకు పుణ్యం ఉంటుంది.

Dr. Chilakamarthi DurgaprasadaRao
91+9897959425
మనం దైనందిన జీవితంలో ఆహారం కోసం, ఆరోగ్యంకోసం, విజ్ఞానం కోసం. అందంకోసం, వినోదంకోసం ఎన్నో మూగ జీవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాం. కొన్ని ప్రాణుల్ని అవసరం కోసం చంపుతున్నాం . మరికొన్నింటిని అనవసరంగా చంపుతున్నాం. జీవహింస అనివార్యమే అయినప్పటికి దానికో హద్దు ఉంది. ఒక విధానం ఉంది. అనవసరంగా దేన్నీ చంపకూడదు ఒక వేళ చంపవలసిన అగత్యం ఏర్పడితే సాధ్యమైనంత తక్కువ బాధపడే విధంగా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఒక జంతువుని చంపినప్పుడు దాన్ని ఆశ్రయించుకుని కొన్ని జీవిస్తూ ఉంటాయని, అవన్నీ అనాథలైపోతాయని, దానికీ ఒక మనసుంటుందని, ఆ మనసుకు ఒక స్పందన ఉంటుందని అవేమీ మనం ఆలోచించం. దాన్ని చంపడమే మన లక్ష్యం. బండరాయి వంటి గుండెను కూడ కరగించే ఒక మూగ ప్రాణి మనోవేదన ఎలా ఉంటుందో స్వయంగా చూడండి.
అది ఒక అరణ్యం . అరణ్యం లో ఒక వేటగాడు. ఒక లేడి అతని కంటబడింది.పదునైన బాణం తీశాడు . గురి పెట్టాడు. బాణం వదిలాడు. సరిగ్గా అది గొంతులో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడి పోతోంది. కొంతసేపట్లో తాను మరణించడం ఖాయం.ఇంతలో తనపిల్లలు గుర్తుకొచ్చారు. తన స్థితికి చలించిపోయింది. దు:ఖం ఇబ్బడి ముబ్బడయింది. ఆ వేటగాణ్ణి ఎంతదీనంగా వేడుకుంటోందో గమనించండి.
ఓ వేటగాడా! నువ్వు నాశరీరం లో ఉన్న అన్ని అంగాల్ని కోసుకుపో. నాకేనీ అభ్యంతరం లేదు. కాని ఆ పొదుగు మాత్రం ఒక్కటి వదిలి పెట్టు. నీకు చాల పుణ్యముంటుంది. ఎందుకంటే లేత పచ్చగడ్డి కూడ తినడం రాని నా పసిపిల్లలు నేనెప్పుడు తిరిగి వస్తానా అని నేను వెళ్లిన దిశ వైపే ఆశతో ఎదురుచూస్తూ ఉంటాయి. అందువల్ల పొదుగొక్కటీ వదిలేసి మిగిలినవన్నీ కోసుకుపో. ఆ మూగ జీవి శోకాన్ని ఈ క్రింది శ్లోకం లో చూడండి.
ఆదాయ మాంసమఖిలం స్తనవర్జమంగాన్
మాం ముంచ వాగురిక యామి కురుప్రసాదం
సీదంతి శష్పకబళగ్రహణానభిజ్ఞా:
మన్మార్గ వీక్షణపరా: శిశవో మదీయా:
(జీవుల మూగ బాధ తెలుసుకోండి. జీవహింస మానండి.) ...
.

No comments: