భారతీయసంస్కృతి-కొన్ని
ముఖ్యాంశాలు
(మొదటిభాగం)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
అపభ్రంశప్రాకృతభాషలో హేమచంద్రుడు అనే గొప్ప
కవి ఉన్నాడు. ఆయన ఇలా అంటాడు.
సరహిం న సరేహిం
న సరవరేహిం ణ వి ఉజ్ఝాణవణేహిం
దేస రవణ్ణా హోంతి
వఢ! నివసంతేహిం సుఅణేహిం
ఓ మూర్ఖుడా! ఏ దేశమైన నదులవల్ల గాని , సరస్సులు వల్ల గాని , పెద్ద పెద్ద తటాకములవల్ల గాని
ఉద్యానవనములవల్ల గాని గొప్పది కాజాలదు.
కేవలం సంస్కారవంతులైన ప్రజలవల్లనే గొప్పదౌతుంది. బహుశ ఈ అభిప్రాయమే ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ వారికి స్ఫూర్తి కల్గించి యుండవచ్చు . దీన్నిబట్టి
ఒక దేశం యొక్క గొప్పదనo ఆ
దేశంలో నివసించే ప్రజల మీదనే ఆధారపడి ఉంటుoదనేది నిర్వివాదాంశం .
ఈ సందర్భంలో మనదేశపూర్వవైభవాన్ని ఒకసారి నెమరు
వేసుకుందాం. పాశ్చాత్యనాగరికత కళ్ళు తెరవకముందే మనదేశం విశ్వజనీనమైన సత్యాలను
బోధించే వేదాలను సంతరిoచుకుంది. అన్ని రంగాల్లోను గణనీయమైన ప్రగతిని సాధించి
ప్రపంచదేశాల్లోనే అగ్రగామి అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీనకాలంలోనే మనమెంతో
ఉన్నతస్థితిలో ఉండేవాళ్ళం . మధ్యయుగంలోనే చాల వెనకబడిపోయాం .
ఉదాహరణకు నైతిక విలువల విషయానికొద్దాం. నైతిక విలువలు సమాజానికి వెన్నెముక వంటివి. పూర్వం మనదేశాన్ని
సందర్శించిన విదేశీయులు మన గొప్పదనo వర్ణిస్తూ Indians are so honest that they don’t need any
locks on their doors . Neither do they
need any document in writing for the proof of an agreement, (Mr. Strebo, Famous Greek Historian).
కాని నేడు బ్యాంకుల్లోను, ఆఫీసుల్లోను ఒక రూపాయి పెన్నుకు పది రూ||లు గొలుసు కట్టి రక్షించవలసిన దుస్థితి
ఏర్పడింది.
విద్యావిషయానికొస్తే
పూర్వకాలంలో మనదేశంలో నలంద, తక్షశిల,
విక్రమశీల మొదలైన ఎన్నో
విశ్వవిద్యాలయాలుoడేవి. మన విద్యార్థులతోపాటు వందలాది విద్యార్థులు విదేశాల నుండి వచ్చి
చదువుకునేవారు. మరో ముఖ్యవిశేషo ఏంటంటే విదేశాలనుండి వచ్చిన విద్యార్థులు
ఇక్కడున్న సంస్కృతీసాంప్రదాయాలకు ముగ్ధులై తమ పేర్లు కూడా మార్చుకున్నవార్లు
కొందరైతే , చదువు పూర్తయ్యాక విద్యాసేవ చేస్తూ శాశ్వతంగా ఇక్కడే స్థిరపడిపోయిన
వారు మరికొందరు. ఉదాహరణకు Huan-Tchao ప్రకాశమతి, Tao-hi శ్రీదేవుడు , Tao-cheng చంద్రదేవుడు , Tacheng-Teng మహాయానప్రదీపుడు , Tao-lin శీలభద్రుడు , Ling-yun ప్రాజ్ఞదేవుడు గాను పేర్లు మార్చుకున్నారు. వీరిలో
కొంతమంది ఇక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు. ఇక గణిత , ఖగోళ, వైద్యశాస్త్రాల్లో
భారతీయుల ప్రతిభ సాటిలేనిది. కాని నేడు మనం పైచదువులకోసం విదేశాలకు పోతున్నాం.
ఇక ఆర్ధికరంగానికొస్తే మనదేశం పూర్వకాలంలో కలప, బియ్యం, మంచిగంధం,
ఆహారధాన్యాలు మొ||వస్తువుల్ని సముద్రయానం ద్వారా ఎన్నో దేశాలకు ఎగుమతి చేసి విదేశాల
నుండి కోట్లాది రూపాయలు సంపాదించేది. కుషానురాజులకాలంలోనే
మనకు లక్షలకొలది బంగారు నాణాలు విదేశాలనుoడి
లభించేవి. కానీ నేడు మనం ఎన్నో అప్పుల్లో మునిగి తేల్తున్నాం.
ఒకప్పుడు అన్ని రంగాల్లోనూ ముందoజలో ఉన్న మనదేశం నేడు
ఎన్నో రంగాల్లో వెనుకంజలో ఉoడడానికి గల కారణాలు పరిశీలిస్తే మనం మన సాoస్కృతికమైన విలువల్ని మరచిపోవడo
వల్లనేనని అనిపిoచక మానదు.
మానవ జీవితానికి సంస్కృతికి గల సంబంధం శరీరం ఆత్మకు గల సంబంధం వలె
విడదీయరానిది. సంస్కృతి లేని జాతి ఆత్మలేని శరీరం వలే మృతప్రాయమే అవుతుంది. ఒక
సంఘం లేదా జాతికి చెందిన ఆధిభౌతిక , ఆధిదైవిక , ఆధ్యాత్మిక విలువల సముదాయమే
సంస్కృతి. వ్యక్తి పరమైన విలువలు సంస్కారం
అనుకుంటే అదే సమాజపరం ఐతే సంస్కృతి
అంటాం. కొంతమంది సంస్కృతిని నాగరికతను ఒకటిగా పరిగణిస్తారు. కాని రెంటికి మధ్య భేదం
ఉంది. నాగరికత బాహ్యజీవితానికి సంబంధించిoదైతే సంస్కృతి బాహ్యంతో పాటు ఆంతరికజీవితానికి
కూడా సంబంధించిoది. నాగరికత దేహధర్మమైతే, సంస్కృతి ఆత్మధర్మం అని చెప్పవచ్చు. నాగరికత
వేషభాషలకు , ఆచార వ్యవహారాలకు సంబంధించిoదనుకుoటే, సంస్కృతి మనస్సు, బుద్ధి,
ఆత్మధర్మాలకు సంబంధించిoదని స్థూలంగా చెప్పుకోవచ్చు.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఒక సంఘంలోని అధికజనాభా యొక్క జీవనవిలువల సముదాయం సంస్కృతి. భౌతికాభివృద్ధి, సాంకేతికప్రగతి, సాహిత్యం,
కళలు, ఆధ్యాత్మికచింతన, విద్య, నైతికవిలువలు మొ| అంశాలు సంస్కృతిలో అంతర్భాగాలుగా
పరిగణిoచవచ్చు.
ఇక ఒక దేశం గొప్పదా కాదా అని నిర్ణయించవలసి వచ్చినప్పుడు
ఆ దేశం ఆమోదించిన సాంఘిక , సామాజిక , ఆధ్యాత్మిక విలువలను పరిశీలిస్తే
తెలుస్తుంది. ఒక సమాజం ఆమోదించిన విలువలు
మంచివైతే ఆ సమాజంలో తాత్కాలికంగా దుష్టుల శాతం ఎక్కువగానే ఉన్నా అది మంచి సమాజమే.
ఎందుకంటే వారు తాత్కాలికంగా చెడ్డవారైనప్పటికీ ఆమోదించిన విలువలు మంచివి కాబట్టి ఎప్పటికైనా ఆ సమాజానికి
నిష్కృతి లభిస్తుంది. ఒక దశాబ్దంలో కాకపోయినా మరో దశాబ్దంలోనో, ఒక శతాబ్దంలో
కాకపోయినా మరో శతాబ్దంలోనో సమాజం ఉన్నతదశకు చేరుకోవచ్చు. కాని ఉన్నతవిలువలు
ఆమోదించని సమాజానికి ఎన్నటికి నిష్కృతి లేదనేది సామాజికశాస్త్రవేత్తల అభిప్రాయం.
అది యథార్థమే. ఉదాహరణకి లంచం తీసుకోవడం
తప్పు అని సమాజం అంగీకరిoచిoదనుకోoడి. ఒకవేళ ఒకవ్యక్తి తప్పనిసరి పరిస్థితిలో
గత్యంతరం లేక లంచం తీసుకున్నా సిగ్గుతో చస్తూ ఆపని మరెన్నడూ చెయ్యడు. కాని ‘ ఎంతో కొంత తినకుండా ఎవడు పని చేస్తాడు’ అని సమాజమే లంచానికి వంతపలికిoదను కోండి. ఆ సమాజాన్ని
ఎవరూ రక్షించలేరు.
ఇప్పుడు మన వేదాలు , ఉపనిషత్తులు , పురాణాలు, కావ్యనాటకాలు ఆధారం చేసుకుని
సంస్కృతిలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
స్థూలoగా పరిశీలిస్తే భిన్నత్వంలో ఏకత్వం, ప్రకృతిపట్ల
దైవభావన, సర్వమానవసౌభ్రాత్రం వైదికసంస్కృతి. శ్రేయస్సు, ప్రేయస్సులలో శ్రేయస్సునే కోరుకోవడం
ఉపనిషత్కాలీనసంస్కృతి. శ్రేయస్సు అంటే
మనకు మేలు కల్గించేది. ప్రేయస్సు అంటే మనం కోరుకునేది. చెడ్డపనికి చెడుఫలం మంచిపనికి మంచిఫలం
పురాణకాలీనసంస్కృతి. ఆశ్రమధర్మవ్యవస్థ, పరస్త్రీలయెడ
మాతృభావన, నిరాడంబరత, వృత్తిపట్ల గౌరవం, పాపభీతి మొదలైనవి భారతీయసంస్కృతిలోని
మరికొన్నిముఖ్యమైన అంశాలు. వీటి గురించి కొంచెం
వివరంగా తెలుసుకుందాం. (సశేషం)