Wednesday, July 2, 2014

పర్యావరణమే పరమేశ్వరుడు

పర్యావరణమే పరమేశ్వరుడు
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో పర్యావరణకాలుష్యం చాల ముఖ్యమైoది. ఈ ప్రపంచం భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం  అనే పంచభూతాలతో నిండి ఉంది.  ఈ ఐదిoటిలో    అగ్ని , ఆకాశం కాలుష్యానికి లోనుగాకపోయినా భూమి, నీరు, వాయువు కాలుష్యానికి లోనవుతాయి. ఏ కాలుష్యం పర్యావరణసమతౌల్యాన్ని దెబ్బతీసి ప్రాణికోటికి తీవ్రమైన నష్టం కల్గిస్తుందో దాన్ని పర్యావరణ కాలుష్యంగా పేర్కొనవచ్చు.   
                      ప్రాచీనకాలంలో మానవుడు ప్రకృతితో పాటు సహజీవనం చేస్తూ ఉండేవాడు. ప్రకృతికి ఎటువంటి హాని కల్గిoచకుండా తాను పొందవలసిన ప్రయోజనాలు పొందుతూ ఉండే వాడు. భయంతోనో, భక్తితోనో ప్రకృతిలో ఉండే అగ్ని, వాయువు, నీరు  మొ|| వానిని దేవతలుగా భావించి ఆరాధించే వాడు.. చివరికి ప్రాణాలు తీసే విషసర్పాన్ని కూడ నాగదేవతగా భావించే ఉత్తమసంస్కారాన్ని అలవరచుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే  ప్రకృతిలోని ఆణువణువూ దైవంగా భావించి, ఆరాధించి  తరించాడు. 
              కాని నేటి ఆధునికయుగంలో మానవుడు తన అవసరాలతో సంతృప్తిపడక మితిమీరిన ఆశల్ని తీర్చుకోవడం కోసం  ప్రాకృతికసంపదలను నాశనం చెయ్యడం మొదలు పెట్టాడు. అభివృద్ధి, ఆధునికీకరణ అనే అందమైన ముసుగులో ప్రకృతివిధ్వంసానికి పాలుపడుతున్నాడు. పారిశ్రామికీకరణ, అడవులను తొలగించడం, అధికరసాయనాల వాడకం ద్వార వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు.                                                     నేటి మానవుడు గడచిన తరానికి రాబోయే  తరానికి వారధిలాంటి  వాడు. అందువల్ల ముందుతరం నుండి మనం అందిపుచ్చుకున్న ప్రాకృతిక సంపదలను, సామాజికవిలువలను రాబోయే తరానికందిoచవలసిన గురుతరమైన బాధ్యత  మనపై ఉంది. అది గమనించకుండా ప్రకృతిని దోచుకోడం కొనసాగిస్తే మానవజాతి   ఎంతోకాలం మనుగడ సాగించలేదు.                
                    ఏ వ్యక్తీ , ఏ సమాజం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కాని అది ఆరోగ్యవంతమైన అభివృద్ధి కావాలి.  ఒకదాన్ని సమాధి చేసి దానిపై పునాదులు లేపితే అది అభివృద్ధి అనిపించుకోదు. ఎవరికీ ,దేనికి ఎటువంటి నష్టాన్ని కల్గిoచకుండ సాధించే   అభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధి అనిపిoచుకుంటుంది.   
                       ఇటువంటి ఆరోగ్యవంతమైన అభివృద్ధి సాధించాలంటే ప్రకృతితో సహజీవనo చెయ్యడం ఒక్కటే మార్గం. ఇటువంటి జీవనవిధానం మనదేశంలో వేదకాలo నుంచి అమలులో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అందువల్ల మనం ఆరోగ్యవంతమైన అభివృద్ధికోసం  ప్రాచీనజీవన విధానం వైపు తొంగి చూడవలసిందే. ప్రకృతిని పరిరక్షిoచ వలసిందే. ఇక  ప్రకృతికి రెండు పార్శ్వాలు . ఒకటి వృక్ష జాలం . రెండు జంతుజాలం.
  
       వేదకాలంనాటి ప్రాచీన మానవుడు ప్రకృతిని తల్లిగా భావించి ఆరాధించేవాడు.  మాతా పృధివీ, పుత్రోsహం పృథివ్యా: (నా తల్లి భూమి నేను ఆమె కుమారుడను). ఈ పవిత్రభావనతోనే ప్రకృతిని పరిశుద్ధంగా ఉంచడానికి యజ్ఞాలు యాగాలు కూడ నిర్వహించేవాడు . పచ్చని ఆకులు గల చెట్లను దైవస్వరూపంగా భావించి ఆరాధింఛి తరించిన జాతి మనది. వృక్షేభ్యో హరికేశేభ్యశ్చ నమోనమ:   అనే వేదవాక్యం ఈ విషయాన్ని వెల్లడి చేస్తోoది. అంతే గాక చెట్లు  పెంచడం ఒక పుణ్యకార్యం గాను చెట్లు నరకడం ఒక పాపకార్యం గాను భావించబడింది. మన ప్రాచీనకవులు కూడ ప్రకృతిని ప్రేమించి తన్మయత్వం పొందారు. మానవుడు వృక్షాల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో కాళిదాసమహాకవి  ఒక సన్నివేశంలో ఇలా వివరించాడు .
               రఘువంశమహాకావ్యంలో ఒక సింహం దిలీపమహారాజుతో  ఓ మహారాజా! నువ్వు,  ఎదురుగా కనిపించే ఆ దేవదారువృక్షాన్ని చూస్తున్నావు కదా ! ఆ చెట్టును శివుడు తన కొడుకైన  కుమారస్వామిని పెంచినట్లుగా కన్నబిడ్డలా పెంచాడు. ఇక పార్వతి కూడ  కుమారస్వామికి పాలిచ్చి పెంచినట్లుగా ఆ చెట్టుకు నీరు పోసి పెంచింది.   ఒకనాడు ఒక అడవి ఏనుగు  తనకు దురద పుట్టి ఈ చెట్టుకు రాసుకోగా  ఆ రాపిడికి బెరడు ఊడిపోయిందట. అది గమనించిన పార్వతి పూర్వం   రాక్షసులు కుమారస్వామిని బాణాలతో  గాయపరచినప్పుడు ఎంత హృదయవిదారకంగా విలపించిందో,  ఏనుగుపెట్టిన  రాపిడికి ఈ చెట్టుబెరడు ఊడిపోయినపుడు కూడ అంతే హృదయవిదారకంగా విలపించింది అంటుంది.   దీన్ని బట్టి చెట్టుకి సైతం చిన్న గాయమైనా తట్టుకోలేని సున్నితమైన మనస్సు మన ప్రాచీనులకుండేదని  తెలుస్తోంది . అంతేగాక  స్వయంగా పెంచిన చెట్టు ఎంతటి విషవృక్షమైనా దాన్ని నరకడం మంచిది కాదంటాడు కాళిదాసు.     విషవృక్షోsపి సంవర్ధ్య స్వయం ఛేత్తుమసాoప్రతం( కుమారసంభవo).
                                అభిజ్ఞానశాకుంతలనాటకంలో అనసూయ తన సఖియగు శకుంతలతో వేలాకోళంగా ఓ సఖి! నీ తండ్రి కణ్వముని అతి సుకుమారివైన  నీతో ఈ మొక్కలకు నీళ్ళు పోయిస్తున్నాడంటే నీకంటే ఈ మొక్కలయందే ఆయనకు  ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది అంటుంది . అది విని శకుంతల అనసూయతో నేను కేవలం తండ్రి ఆజ్ఞ వల్ల  మాత్రమే నీళ్ళు పోయడం లేదు నాకు కూడ యీ మొక్కలపట్ల  సోదర ప్రేమ ఉందని సమాధానం చెబుతుంది. అలాగే శకుంతల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆశ్రమంలోని చెట్లన్నీ ఆమెకు బహుమతులివ్వడం, లతలు విచార సూచకంగా ఎండుటాకులను కన్నీటి బొట్లుగా రాల్చడం, కణ్వుడు శకుంతలను పంపేటప్పుడు ఆశ్రమవృక్షముల అనుమతి కోరడం మొదలగు సన్నివేశాలు చెట్లకు మానవులకు మధ్య గల గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే శకుంతల కూడ తాను పెంచుతున్న  వృక్షాలు మరియు జంతువుల   బాధ్యతను తన చెలులకప్పగించి కదలడం హృదయాన్ని కుదిపివేసే సన్నివేశం.
  చెట్లు, ఒకవేళ పువ్వులు పళ్ళు ఇవ్వకపోయినా నీడనిస్తాయి కాబట్టి  వాటిని తప్పకుండా రక్షించాలంటాడు చాణక్యుడు.    
సేవితవ్యో మహావృక్ష:
 ఫలచ్ఛాయా సమన్విత:
యది దైవాత్ఫలం న స్యాత్
ఛాయా కేన నివార్యతే
 మరో ముఖ్యమైన విశేష మేమిటంటే   కొన్ని కొన్ని సమయాల్లో మొక్కలు అనివార్యంగా నాశనమైతే ఆ నష్టానికి కారకుడైన వాడే దాన్ని భర్తీ చెయ్యాలి . అందుకే ఉపనయనం, వివాహం, దహన సంస్కారం   మొదలగు  కార్యాల్లో  విధిగా మొక్కల్ని  పెంచమనడం  ఆయా  సమయాల్లో  అగ్నిహోత్రం ద్వారా కొన్ని మొక్కలు నాశనం కావడమే.
       ఇక ప్రకృతిలో మరొక పార్శ్వం  జంతుజాలం. మానవుడు ఆహారం కోసం, అందం కోసం, వినోదం కోసం,  పరిశోధనలకోసం కోట్లాది అమాయకపు ప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నాడు. ఆహారం కోసం జంతువులను చంపడం అనివార్యం కావచ్చు . కాని ఆ హింస సాధ్యమైనంత సున్నితంగా ఉండాలి . ఇక మాంసం, చర్మం మొదలగు వాటి నాణ్యత కోసం జంతువులను  చంపడానికి ముందుగానే అనేక సాధనాలతో  అతిక్రూరంగా హింసించడం మానవత్వానికే అవమానకరమైన విషయం. శారీరకశక్తి మాంసాహారం వల్లనే కాకుండా శాకాహారం వల్ల కూడ లభిస్తుంది. కాబట్టి మనిషి  సాధ్యమైనంత వరకు మాంసాహరాన్ని విడిచిపెట్టి శాకాహారాన్ని అలవరచుకోవాలి. ఇక శాస్త్రవిజ్ఞానం పేరుతో మూగ ప్రాణులపై జరిపే ప్రయోగాలను సాధ్యమైనంత తగ్గించాలి. దైవం పేరుతో జంతువులను బలివ్వడం పూర్తిగా నిలిపివేయాలి .  హృదయ విదారకంగా రోదించే మూగప్రాణుల పట్ల కరుణ దయ చూపించాలి. కొంతమంది దుండగులు  ఒక మూగప్రాణిని క్రూరంగా చంపుతున్న దృశ్యం శివాజీహృదయాన్ని  ఎంత కలచివేసిందో , ఆయన ఎలా స్పందించాడో గమనించండి.
 ఇది యే ధర్మపథమ్ము? మానవులుగారే జాలి లేదయ్యెనే
మది మీకాలికి ముల్లు గుచ్చుకొన అమ్మా!యంచు వాపోదురే
కద మీ బిడ్డలనెవ్వరైన చెనకంగా వాదుకుంబోదురే
కద! యేదిక్కును లేని జంతువని యేగా కత్తులన్ నూరుటల్ (శివభారతం)
       ఇంకో దారుణమైన విషయమేమిటంటే సౌందర్యం కోసం, ఫ్యాషన్ కోసం లక్షలాది జీవులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. ఇది అమానుషమే కాదు అతిరాక్షసం, హీనాతిహీనం . ప్రభుత్వం  ఎన్ని చట్టాలు శాసనాలు చేసినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. మనుషుల్లో కారుణ్యం, పాపభీతి, వాత్సల్యం ఉన్నప్పుడే ఈ అమానుష త్యాలను ఆపగలం. దీనికి హృదయ పరివర్తనమే శాశ్వతమైన పరిష్కారం.
              మన ప్రాచీన ఋషులు తమ ఆశ్రమాల్లో అన్ని జంతువులను కన్నబిడ్డల కంటే ఎక్కువగా పోషించడం ఒక విశేషం. ఒక పావురాన్ని రక్షించడం కోసం శిబి  , ఆవును రక్షించడం కోసం దివీపుడు, పామును రక్షించడం కోసం జీమూతవాహనుడు ఆత్మత్యాగానికి సిద్ధమయ్యారు . ఆ విలువలను కాపాడుకుంటు మనం సుఖజీవనం చెయ్యాలి. ఈ జీవనవిధానాన్ని రాబోవు తరానికి అందివ్వాలి. అప్పుడే ప్రకృతి సమతుల్యాన్ని కాపాడగలం. అలా కాకపొతే ముందుముందు కొన్ని  జంతువుల పేర్లు మాత్రమే మనకు వినిపిస్తాయి. జంతువులు మచ్చుకుకూడా కనిపించవు. అలా జరిగితే ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని  మానవుని మనుగడ కూడ కష్టమే అవుతుంది.
ఇక భూకాలుష్యo, జలకాలుష్యo, వాయుకాలుష్యాల వల్ల మనం భూకంపాలు, సునామీలు, భోపాల్ గ్యాస్ ట్రేజీడీల వంటి ఎన్నో దుష్ఫలితాలనుభవిస్తునాం. ఉచితంగా లభించే మంచినీరు డబ్బు వెచ్చించి కొనుక్కో వలసిన దు:స్థితికి చేరుకున్నాం .
 ఇక ఈ అన్ని కాలుష్యాలకు మూలం బుద్ధికాలుష్యo  . ఈ బుద్ధి కాలుష్యాన్ని యోగాభ్యాసం తదితర ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నివారించుకోవచ్చు.        

               గాంధీ మహాత్ముడు చెప్పినట్లు ప్రకృతి మానవుని అవసరాలను మాత్రమే తీర్చగలదు గాని ఆశలను తీర్చలేదు.  అందువల్ల ప్రతి వ్యక్తి  అత్యాశ విడిచిపెట్టి  ప్రకృతి ప్రసాదించు వనరులతో సంతృప్తి పడి జీవిస్తే  ఈ ప్రపంచం భూతల స్వర్గం అవుతుంది. ధర్మో రక్షతి రక్షిత: అనేది మన జాతీయ ఆదర్శం.  మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని  రక్షిస్తుంది. ఈ నియమం అన్నిటికి వర్తిస్తుంది. మనం  వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని  రక్షిస్తుంది. మనం  పర్యావరణాన్ని రక్షిస్తే ఆ పర్యావరణం మనల్ని  రక్షిస్తుంది . అది ప్రకృతి పట్ల దైవ భావన కల్గి ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. అందుకే పర్యావరణమే పరమేశ్వరుడు అని మనం భావిద్దాం. ఆరాధిద్దాం. పర్యావరణ పరిరక్షణ ద్వారా  ప్రపంచ శాంతికి మన వంతు కృషి చేద్దాం .                           లోకా: సమస్తా: సుఖినో భవంతు .

No comments: