Monday, July 7, 2014

వసుధైకకుటుంబకం

వసుధైకకుటుంబకం
                                           డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం
ఉదారచరితానాం తు వసుధైక కుటుoబకం
మనుషుల్లో రెండు రకాలవాళ్లుoటారు. కొంతమంది సంకుచితమైన మనస్తత్త్వం గలవాళ్లైతే మరికొంతమంది విశాలమైన మనస్తత్త్వం గలవాళ్లు. సంకుచితమైన మనస్తత్త్వం గలవాళ్ళు వీడు నా వాడు వీడు పరాయి వాడు అని భావిస్తూ ఉంటారు.  ఇక విశాలమైన  మనస్తత్త్వం గలవారికి ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం .
            తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు మొదలగు కొంతమంది వ్యక్తుల సముదాయం కుటుంబం అవుతుంది. ఈ భావన విశ్వవ్యాప్తమైతే  ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబంగా  తయారౌతుంది. అప్పుడు అందరికి భూమియే తల్లి భగవంతుడే  తండ్రి . జనులంతా సోదరులే .
               ఈ ప్రపంచం ఒక సృష్టి అనుకుంటే దానికొక కర్త ఉండి తీరాలి. సృష్టి కర్త   లేకుండా సృష్టి జరగదు.  ఆయన భగవంతుడు కాకుండ వేరొక వ్యక్తి అయ్యే అవకాశం కూడ  లేదు. సృష్టికర్త , స్థితికర్త, లయకర్త మూడు ఆయనే.   అలాగే భగవంతునికి ప్రపంచానికి ఎటువంటి భేదం కూడ లేదని భారతీయతత్వ శాస్తం చెబుతుoడి. ఏ విధంగా సాలెపురుగు తనలోని జిగురువంటి ఒక పదార్ధంతో గూడు నిర్మించి ఆ గూటికంటే  వేరుగా  నిల్చి ఉంటుందో అదేవిధంగా భగవంతుడు ఈ ప్రపంచాన్ని నిర్మించి దానికంటే వేరుగా కూడ నిల్చి ఉంటాడు. దీన్నిబట్టి చూస్తే ప్రపంచానికి భగవంతునికి మధ్య ఎటువంటి భేదం లేదు. ఇక సృష్టిలో భాగమైన మన మధ్య భేదం ఎoదుకుంటుంది ? అందరు పుడమితల్లి ముద్దుబిద్దలే. భగవంతుని ప్రతిరూపాలే.
భగవత్తత్త్వమైన చైతన్యం ఖనిజాల్లో నిద్రాణoగాను, వృక్షాల్లో ఒకస్థాయిలోను , జంతువుల్లో కొంచెం ఎక్కువ స్థాయిలోను, మనుషుల్లో అత్యధికస్థాయిలోను ఉంటుoదని శాస్త్రాలు చెబుతున్నాయి. వ్యక్తులు భిన్నంగా ఉన్నా , శారీరక మానసికస్థాయిల్లో వ్యత్యాసం కనిపిస్తున్నా  తాత్త్వికదృష్టితో చూస్తే  అందరు  ఒక్కటే. బంగారం  ఆభరణాలుగా వేరు వేరు పేర్లతోను , ఆకారాలతోను కన్పిస్తున్నా మూలరూపమైన  బంగారం ఒక్కటే . మట్టితో చేసిన వస్తువులు వేరువేరు ఆకారాలతోను పేర్లతోనూ కనిపిస్తున్నా మట్టి ఒక్కటే. బంగారునగలను బంగారం నుంచి  విడదీసి చూపిoచలేము. అలాగే మట్టితో చేసిన కుండను మట్టినుoచి విడదీసి చూపించలేము. ఈ విషయాన్నే ఉపనిషత్తులు వాచారంభణo వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం  మొదలైన వాక్యాల్లో పలుమార్లు నొక్కి చెప్పాయి.
   ఈ ప్రపంచం ఐదు అంశాలతో కూడి  ఉంది. ఒకటి  శాశ్వతమైన ఉనికి, రెండు స్వయంప్రకాశకత్త్వం, మూడు ఆనందం , నాల్గు పేరు, ఐదు రూపం. ఈ ఐదింటిలో మొదటి మూడు అంటే శాశ్వతత్వం , స్వయంప్రకాశకత్వం, ఆనందం అనేవి   భగవంతుని లక్షణాలు . చివరి రెండు అనగా పేరు, రూపం ప్రపంచలక్షణాలు. కాబట్టి పపంచం అంటే పేరు, ఆకారం ఈ రెoడే.  బాహ్యమైన ఈ రెండు మినహాయిస్తే  మూలతత్త్వం భగవత్స్వరూపం మాత్రమే .
అoదువల్ల  సృష్టికర్తబిడ్డలమైన మనలో కూడ బాహ్యంగా కనిపించే భేదాల వెనుక మౌలికమైన అభేదం దాగి ఉంది. అందువల్ల ఈ సృష్టిలో ఒకరి కంటే మరొకరు ఎక్కువ కాదు తక్కువా కాదు.అందరు సమానమే. ఒకవేళ లోకవ్యవహారంలో హేచ్చుతగ్గులున్నట్లు కన్పిo చినా తాత్త్వికంగా అంతా ఒక్కటే. 
           ఉదాహరణకు మానవశరీరం తీసుకుందాం . శరీరాంగాల్లో ఇది ఎక్కువ అది తక్కువ అని ఎలా నిర్నయిoచి చెప్పాగలం. మూతికెoత ప్రాముఖ్యం ఉందో ముడ్డికి కూడ అంతే ప్రాముఖ్యం ఉంది.  అన్ని సమానమే. అవన్ని కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ శరీరం మనగలుగుతుంది. ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుoదనుకోoడి. కన్ను ఆ ముల్లును చూస్తోంది . చెయ్యి ఆ ముల్లును తీస్తోంది.   ముల్లు గుచ్చు కుంది కాలికి కదా! నేనెందుకు చూడాలి అని కన్ను అనుకున్నా, నేనెందుకు తియ్యాలి అని చెయ్యి భీష్మించుకుని కూర్చున్నా కాల్లో గుచ్చుకున్న ముల్లు తొలగదు. ముల్లు తీస్తే మాకేంటి లాభం ? అని ఆ రెండు ఎన్నడు అనుకోవు. తమపని తాము చేస్తాయి. మరో విషయమేమిటంటే మానవ శరీరంలో సుమారు కోటికోట్ల జీవకణాలున్నాయి   అవన్నీ సమన్వయoతో తమపని తాము చేసుకుపోతున్నాయి కాబట్టే మనిషి  ఆరోగ్యంతో జీవిస్తున్నాడు. వాటిలో సమన్వయo లోపిస్తే ఆరోగ్యం యావత్తు పోయి ఆ రోగం మిగుల్తుంది. ఇదే నియమం సంఘానికి కూడ వర్తిస్తుంది. అందువల్ల సమాజంలోని వ్యక్తులందరూ హెచ్చుతగ్గులు తలపోయక  ఒకరికొకరు తోడై  ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తిస్తే సమాజం పది కాలాలు మనగలుగుతుంది. ఒకటికి మరో ఒకటి కలిస్తే రెండు అవుతుంది . ఒకటికి మరో ఒకటి ప్రక్కన నిలిస్తే పదకొoడౌతుంది. ఇదే పరస్పరసహకారంలో ఉన్న గొప్పదనం .
       కాని నేటి మానవుడు తన సహజస్వరూపాన్ని విస్మరించి కల్పితమైన  దేశ, జాతి, మతపరమైన భేదభావాలు సృష్టించి ప్రపంచశాంతికి విఘాతం తలపెడుతున్నాడు.  ఒకప్రక్క  సాంకేతికవిజ్ఞానాభివృద్ధి వల్ల దేశాల మధ్య అంతరాలు మెల్ల మెల్లగా తొలగిపోతొంటే మరోప్రక్క    స్వార్థశక్తులు  ఎన్నో విభేదాలు సృష్టిస్తూ ఒకర్ని మరొకరికి దూరం చేస్తున్నాయి.
కాబట్టి  మనిషి పైపైకి కనిపించే తారతమ్యాలు లెక్కచేయక  వాస్తవికమైన ఏకత్వాన్ని గుర్తించి సర్వమానవసౌభ్రాత్రాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  లేకపోతే ఏ క్షణంలోనైన ప్రపంచశాంతికి భంగం వాటిల్లవచ్చు.
అటువంటి పరిస్థితి  రాకుండా ఉండాలంటే సంగచ్ఛధ్వం సంవదధ్వం సంనోమనాంసి జానతాం ( మనందరం కలుద్దాం . మాట్లాడుకుందాం ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుందాం . మన మాటలు,మనసులు, చేతలు ఒకేలా ఉoడేవిధంగ కలసిమెలసి నడుద్దాం ) అనే వైదికనినాదాన్ని ఆచరణాత్మకంగా నిరూపించడానికి మరోసారి ప్రయత్నం చేద్దాం .
కోటానుకోట్ల నరులీ
మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం
బాటిoపుమీ సువార్తన్
చాటింపుము నీదుజన్మసార్థక్యమగున్
అన్న ప్రజాకవి శ్రీ జాషువ గారి ప్రబోధాన్ని  దశదిశల మారుమ్రోగిద్దాం.
********




No comments: