Saturday, August 30, 2014

శ్రీ రామలింగేశ్వరోదాహరణము -- శ్రీపాద కృష్ణమూర్తి

శ్రీ
రామలింగేశ్వరోదాహరణము
శ్రీపాద కృష్ణమూర్తి
***
పండితాభిప్రాయము
హైదరాబాదు,
13-6-1973.
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారికి –
మీరు వ్రాసిన ఉత్తరము అందులో పంపిన “ శ్రీరామలిoగేశ్వరోదాహరణము “ అందినవి. వానిని పరిశీలిoచినాను.
ఇంతవఱకును పంచారామములపైని ఆ క్షేత్రాధిదైవమైన శివుని పేరిట ఉదాహరణలు లేవు. మీరు క్షీరారామలిoగేశ్వరునిపై ఉదాహరణ వ్రాసినందులకెంతయు మిమ్ములనభినందిoచుచున్నాను.
మీరీ “ శ్రీ రామలింగేశ్వరోదాహరణము” ను సలక్షణముగా రచించిరి . పద్యములన్నియు హృద్యముగా నున్నవి . మీ ఉదాహరణమును తప్పక ప్రకటింపుడు.              నిడుదవోలు వేంకటరావు
***
నాందీవాణి

శ్రీపాద కృష్ణమూర్తి కవి ప్రణీతమైన శ్రీరామలింగేశ్వరోదాహరణమిది సాధు మధురమైన రచన ; భక్తిరసార్ద్రమైనరచన. స్వరూపత: కావ్యము లఘువైనను  గుణ విశేషముచే బరువు గలది.
‘ఉదాహరణలు’ సంస్కృతములో ( దెనుగులో లెక్కకునై యున్నను, రాను రాను వానికి నిడుదయైన  సాహిత్యచరిత్రశాఖాప్రసిద్ధి  యేర్పడినది. బసవోదాహరణము , త్రిపురాంతకో దాహరణము  మున్నుగానున్న  ప్రాక్తనములటుoడె; అద్యతనాంధ్రకవులు వ్రాసినవియు నుదాహరణ కావ్యకతిపయము కలదు.
ఒక విధముగా, శ్రీ రామలింగేశ్వరోదాహరణమిది ప్రత్యగ్రమైనది. తెలు(గునా(ట ( బంచారామ క్షేత్రములున్నవి. భీమారామము , ద్రాక్షారామము , క్షీరారామము, సోమారామము , అమరారామము – ఈ యైదును యథా సoఖ్యము చాళుక్య భీమవరము , దాక్షారామము , పాలకొల్లు , గుణపూడి, ధరణాలకోట యను గ్రామములకు సంబంధపడినవి.  పంచారామములను గూర్చి శాసనముల వ్రాతకును , ‘ భీమఖండము’ లోని వ్రాతకును ఒండు  రెండు  ఆరామముల యె డాటమున విసంవాదము చెప్పబడినటులు పరిశోధకులు వ్రాసిరి . అది అప్రకృతము.

శ్రీరామలింగేశ్వరుడు విజయంచేసియున్న  పాలకొల్లు  క్షీరారామక్షేత్రముగా యావదాంధ్ర విషయ ప్రసిద్ధము.  రామలింగేశ్వరుడు జనార్దన ప్రతిష్ఠితుడైన సనాతనుడు. అభ్రంకషమగు నీ యాలయ గోపురాగ్రమును  నరసాపురము నుo డియు  దర్శిం పవచ్చునన్నది  యతిశయకథనము కాదు.
చోళరాజుల కాలము నాటి  నిర్మాణపద్ధతులిoదు(గన్పట్టుచున్నవని పెద్దలు చెప్పుదురు. ఇంతదాకభీమాది పంచారామక్షేత్ర స్థు లైన వేల్పులను గురించి ఉదాహరణ కావ్యములు వచ్చినటులు లేదు.    ఇపుడీ క్షీరారామలింగేశ్వరునిపయి  వచ్చిన యీ యుదాహరణ మొక విధముగా నభినవమగుచున్నది. ఈ కావ్యమునందలి వృత్తములు, కళికోత్కళికలు లలిత వచోబంధములై యున్నవి. తెలుగు పల్కుబడిలో గడుసుదనమున్నది.  వలరాచ దొరవారి పదటు చేసిన వాని, వినుసికను జుక్కలను  విరులు తుఱిమిన ప్రోడగొల్ల పడుచు నుల్లమెల్ల( గొల్ల గొన్న  విహితునందు- మున్నుగా నుదాహరణలు చూపవచ్చును. చతుర్థీ విభక్తి  యుత్కళిక నడక ప్రోడతనము తోడి యొయ్యారము నొరసికొని యున్నది. అది యటుల వ్రాయుట చేయిదిరిగిన వానికి గాని సాధ్యము గాదు.

“వాసి గాంచిన మేటి కై – లాస వాసు (గొల్వక  కై
కొనను  గూడని వ్రతము  గై – కొనగ సఖులు గొని చని   కై
తవపు లింగము ( జూప (  గై - కవ మొగిచిన, లింగము కై
వడి తనరిన మాన్యునకై – కడు మెఱసిన ధన్యునకై “

ఇటులు నవనవోన్మేషమగుచున్న యేతత్కృతికర్త  కవితా శక్తికి, పరమేశ్వర భక్తికి నీ యుదాహరణమొక  ప్రథమోదాహరణమగుగాత మని యాశీర్వదించుచున్నాను.
రాజమహేంద్రవరము,
11 -6-1973.               మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
***

ప్రస్తావన

ఇది చిరకాంక్షితము. నేటి కిటులు నెఱవేఱి నందులకు సంతసించుచున్నాను.పంచారామక్షేత్రస్థులైన వేల్పులపయి  తెనుగుకవులెవ్వరును ప్రాచీనులు కాని, నవీనులు కాని – నా యెఱిగినంత దాక ఉదాహ రణకావ్యములు రచిoపరైరను చింతయు, క్షీరారామమందు వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి యందలి భక్తియు నన్నీ రచనకు ( బ్రేరేపిoచినవి. ఇందలి రగడలరచనయందు నాకు ( గల్గిన సందేహములను తొల(గించి, యీ “ యుదాహరణము” పై తమ అభిప్రాయము నొస(గిన “ ఉదాహరణ సాహిత్య చరిత్ర”  కర్తలు “ విద్యారత్న”  నిడుదవోలు వేంకటరావు గారికి కృతజ్ఞతాపూర్వ క ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
ఇ(క నీ “ యుదాహరణము” ను సావధానముగ( బరిశీలించి, అమూల్యములగు సవరణలను సూచిoచుటయే కాక, యీ కృతి కనర్ఘ మగు  “నాందీవాణి” రచియించిన నా గురుదేవులు కోవిదకవికుంజరులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారికి నా భక్తిపూర్వక నమోవాకములు సమర్పించుచున్నాను.
ఈ రచన యిటులు వెలు(గు చూచుటకు తోట్పడిన  “నవజ్యోతి” ముద్రణాలయము వారికి  నా కృతజ్ఞతలు వెల్లడించుచున్నాను.
రసజ్ఞులగు తెనుగు చదువరులుదారహృదయముతో నీ చిరుత కబ్బమును చిత్తగిoప(గలరని నమ్మిక.
పాలకొల్లు,
11-7-1973.                                              శ్రీపాద కృష్ణమూర్తి
***






శ్రీరామలింగేశ్వరోదాహరణము

ప్రథమావిభక్తి

ఉ|| శ్రీ శ్వసనాశనాoగదు(డ శేష జగజ్జన రక్షకుండు స
     ర్వేశ్వరు( డిoదుశేఖరుడు శ్రీశ సురేశ ధనేశ ముఖ్య దే
    వేశ్వర సన్నుతుండు గిరిజేశ్వరుడార్తిహరుండు రామలిం
    గేశ్వరు( డాంధ్రభూప్రజలనేలుత సర్వశుభంబులిచ్చుచున్.

కళిక (వృషభగతిరగడ)

    పరమనిష్ఠ  జనార్దనుడు తా( ప్రతిష్ఠిoచిన దివ్యరూపుడు
అరయ(గన్నులు వేయు ( జాలని  యమృతలింగమహస్స్వరూపుడు
అజగజాననమాతృసవితృషడాస్యభాసురపార్శ్వభాగు(డు
రజతభూధరశిఖరరేఖారమ్యగోపుర పురోభాగుడు
చేరి వేడిన బ్రహ్మచారికి క్షీరతటాక మిడిన సదయుడు
కోరి కొల్చిన గుండమాంబిక కొలుపులందిన సుధాహృదయు(డు
చోళ రాజ హృదబ్జమధువును జూఱలాడిన  భ్రుoగరాజము*   పాలకొల్లను క్షేత్రరాజపు భక్తజనహిత కల్పభూజము

ఉత్కళిక
అమరదానవగణములొకటై
అమృతకలశము పడయుటకునై
క్షీరకంధిని తరువ (గడ(గిన
ఘోరమగు గరళమ్ము పొడమిన
సురలుగొల్చుచు శరణు చొచ్చిన
గరిమ గరళం బఱుత ( దాల్చిన
దేవతాకులసార్వభౌము(డు
పావనగుణగణాభిరాముడు
*
ద్వితీయావిభక్తి
ఉ||  పుట్టుచుగిట్టుచున్ మరల (బుట్టుచు గిట్టుచు ( బాపభితి  “మా
పుట్టి మునుoగునే” యనుచు( బొక్కుచు (జొక్కుచు మమ్మెవండు చే
పట్టు” నటంచు నేల వగవన్నరులార ! బిరాన ( గొల్వరే
పుట్టువులూడ్చు శంకరుని భూతపతిన్ గిరిజా మన:పతిన్.

కళిక (జయభద్ర రగడ)
కరితోలు మేని పయి( గప్పి మసలెడివాని
సురగంగజడ యందు( జొనిపి యెస(గెడి వాని
ఉమకు మేనున సగం బొస(గి మురిసెడి వాని
ప్రమథగణముల నతులు వడసి మెఱసెడి వాని
బుసపుర్వు మెడచుట్టు ( బొరల భాసిలు వాని
పొసగ మిక్కిలికన్ను బొట్టు రాజిలు వాని
వెలిబూది యొడలెల్ల వెలయ బూసిన వాని
వలరాచదొరవారి పదటు చేసిన వాని .

ఉత్కళిక
నగజాతయై పుట్టి
మగనిగా (జేపట్ట(
దపము సల్పగ మెచ్చి
కపట వటువై చొచ్చి
ఛలమునన్ వాక్రుచ్చి
అలుగ దర్శనమిచ్చి
తరుణి వలచిన వాని
గిరిజ గొలిచిన వాని
**
తృతీయా విభక్తి
ఉ|| ఎవ్విభు పాదపంకజము లిచ్చ దలంచినమాత్ర(గోరికల్
నివ్వటిలంగ( జేకొనియె లీలగ ( దానుపమన్యు(డా గతిన్
జివ్వున మీరలవ్విభుని చేత ( బయస్సరసీపురీశుచే
నవ్విధుమౌళి చేత  సకలాభ్యుదయంబులు పొoదుడీ జనుల్

కళిక (హయప్రచారరగడ)

పడుపువృత్తి రోయు వేశ్యభామల గను సర్వు చేత
పుడమి తేర నిగమహరుల ( బూన్చు కొన్న శర్వు చేత
మంచు(గొండ యనుగు( జూలి మరులుగొన్న వరుని చేత
చెంచు కరణి నరుని( జేరి చివ్వ సల్పు  హరుని చేత
తపము సల్పు యక్షసూను( దనియ( జేయు శుభదు చేత
నెపము లెంచ కుండ జనుల నియతి నేలు వరదు చేత
మొదలు నడుమ తుదయు లేక పొగడు వడయు భీముచేత
మొదలి నుడుల ( దెలియ(బడుచు ( బొదలు పరంధాము చేత

ఉత్కళిక

ఇంద్రు ధరను నొక్కి పెట్టి
చంద్రు నిలను ద్రొక్కి పట్టి
వరుణు నేల( గూలగొట్టి
తరణి పండ్లు డుల్ల (గొట్టి
క్రుద్ధవీరభద్రుడగుచు
వృద్ధదక్షు మఖము చెఱచు
శత్రుభయంకరుని చేత
మిత్రశుభంకరుని చేత
***
చతుర్థీవిభక్తి

ఉ|| క్రొవ్విన వైరులం దునుమ( గోరి భజించి , నుతించి , భక్తిమై(
బువ్వుల (బూజసల్పి యుడి వోవని పాశుపతాస్త్రమంత్రమున్

గవ్వడి వేడగా ( గరుణ( గైకొనుమిచ్చితినన్న సామికై
నవ్వుల వెన్నెలల్ గురియు నాథునకై సుమనో నమస్కృతుల్
కళిక (హయప్రచారరగడ)

ముదిమి బాపి గుండయ కతి ముదము (గూర్చు భద్రునకై
ముదిత కొఱకు జంగమమై భువిని వెలయు రుద్రునకై
శరభరూపమెత్తి నృహరి సడల(జేయు యోధునకై
సురలనొoచు నసురపతుల స్రుక్క(జేయు సాధునకై
భరతమునికి నాట్యశాస్త్ర ఫణితి( జూపు  గణ్యునకై
వరము వేడ( గరుణతోడ( బరము నొసగు పుణ్యునకై
పుత్తడిమల విల్లుదాల్చి పొల్చునట్టి తేజునకై
సత్తు ( జిత్తు (దాన యైన సత్యనిత్య బీజునకై

ఉత్కళిక
వాసి గాంచిన మేటి కై
లాస వాసు (గొల్వక  కై
     కొనను  గూడని వ్రతము  గై
 కొనగ సఖులు గొని చని   కై
  తవపు లింగము ( జూప (  గై
కవ మొగిచిన, లింగము కై
వడి తనరిన మాన్యునకై
కడు మెఱసిన ధన్యునకై “
****

పంచమీవిభక్తి
 ఉ || “ నశ్వరమైన కాయము వినాశము గాదు , స్థిరంబు సంపదల్
         శాశ్వతమంచు నమ్మి భవసాగరమందు మునింగి తేలుచున్
       విశ్వరహస్యముం గనని  వెంగలివిత్తులకేని రామలిం
      గేశ్వరు వల్ల ముక్తి లభియించును, దూలును గర్మబంధముల్.

కళిక (హయప్రచారరగడ)
బిల్వపత్ర పూజలంది ప్రీతి( జెందు కరుణి వలన
కల్వమిత్రు మౌళి(దాల్చి క్రాలునట్టి  సుగుణి వలన
 మూడు మొనల పోటు ముట్టు( బూని మించు వీరువలన
మూడు పురములగ్గి చేత బుగ్గి చేయు ధీరువలన
వెండి కొండ మీద విడిసి విశ్వ మేలు భోగివలన
  తిండి కొఱకు( బునుక ( దాల్చి తిరిప మెత్తు జోగివలన
భక్తి ( దలచు సాధుజనుల( బాయకుండు ప్రభువు వలన
ముక్తి వలచు యోగివరుల( బ్రోచి కాచు ఋభువు వలన.
కళిక (హయప్రచారరగడ)
తెరువు గొట్టి దోచుకొనుచు
బరమభక్తి ( దన్ను (గొలుచు
ఎఱుకు భక్తి( జూడ వలచి
మెఱయ మహిమ ( జూప(దలచి
పూలు దొరకకుండ( జేయ
రాల తోడ ( బూజసేయ
నలరు విజితమదను వలన
వెలయు పంచవదను వలన
******

షష్ఠీవిభక్తి

ఉ||  కోరినదిచ్చి యర్థులను గొంకక వేడిన దిచ్చి యాప్తులన్
     గోరిక లిచ్చి భక్తులను గూరిమి బంధము లూడ్చి యోగులన్
    భారము మోచి దీనులను వంతలు ద్రోచి ప్రజాళి ( బ్రోచు శ్రీ
    క్షీరపురీవిహారునకు( జిత్తజవైరికి  సాటిలేరిలన్

కళిక (వృషభగతిరగడ)

దుష్ట గుణనిధి దొసగులన్నియు( దొలగ( జేసిన దయాశాలికి
భ్రష్టసుకుమారు దురితములను బాయ( జేసిన వినుతశీలికి
తిన్నని భక్తి ( గన ( గనులుగొని తిరిగి యొసగిన వేల్పుఱేనికి
కిన్నర బ్రహ్మయ పిలుపులకు( గృపను పలికిన ఉమాజానికి
బెజ్జ మహాదేవి సేవ కలరి ప్రీతి( బ్రోచిన జగన్నేతకు
విజ్జునకు( దగరూపము జూపి పెరిమ( గాచిన త్రిపురజేతకు
అల మృకండు మహర్షి తనయున కాయు వొసగిన జితవిధాతకు
శిలలవైచిన  సాంఖ్యతొoడని(  జెలిమినేలిన నతత్రాతకు

ఉత్కళిక

మాయ జంగము కరణి యుబ్బున
జాయ తోడుత నరిగి గొబ్బున (
గొడుకు మాంసము వండిపెట్టిన(
గుడుతు మంచును బ్రతిన పట్టిన
నెలమి గోరిక తీర్చ  సెట్టిని
అలరి ప్రాణములిచ్చి పట్టిని
కరుణ బ్రోచిన  సదాశివునకు
గరిమ గాంచిన స్వయంభువునకు
******
సప్తమీ విభక్తి

ఉ|| ఉల్లములోన దైన్యమున నూరక మ్రగ్గగ నేల? జింతలం
         బల్లటిలంగ నేల? ధర మానవులార! శుభంబు లొంద ( గా (
     జల్లని చూపులన్ సుధలు చల్లుచు లోకము లోము  శ్రీ శివా
వల్లభునందు  క్షీరపురవాసునియందు నెడంద లుంచరే !

కళిక (హయప్రచార రగడ)

దరిసెనం బొస(గి వసిష్ఠు దయను గనిన సుదతి యందు
కురులు మొలవ(జేసి దాసి ( గూర్మినోము సుమతి యందు
వెడదయేన్గు మోము తాల్పు వేల్పు గన్న యజరునందు
కడలు నాల్గు వాసములుగ ( గట్టుకొన్న యమరునందు
వల్లకాటి యందు సతము వాసముండు మహితునందు
గొల్ల పడుచు నుల్ల మెల్ల ( గొల్ల గొన్న విహితునందు
అలక  నేలు యక్షరాజు నను(గు( జెలిమి కాని యందు
అలరి సురలు నుతులు పాడనాడు నట్టి వాని యందు

ఉత్కళిక

మొప్పె వోలె కవిత యందు
తప్పువట్టి కొలువునందు
వాదులాడి శాపమొoది
“ఏది తె”న్నటంచు (గుంది
శాపముడుప  భక్తి గొలువ(
గోప ముడిగి కరుణ చలువ(
గవిని మనుచు శూలియoదు
భువనవినుతశీలియoదు .
*******

సoబోధన ప్రథమావిభక్తి

శా|| శ్రీకంజాక్ష పయోజసంభవ శునాసీరాది బృందారకా
      నీకాభ్యర్చితపాదనీరజ! భవానీనాధ! శూలాయుధా!
        లోకత్రాణపరాయణాశ్రిత! దయాళూ! సోమచూడామణీ !
      నీకారుణ్య మొకిoత  మా దెసకు రానీ రామలిoగేశ్వరా!

కళిక (జయభద్రరగడ)

బలుపాప  తలపాగ (బరగ ( జుట్టిన యభవ !
పుళితోలు   హొoబట్టు పుట్టమొప్పెడి దేవ!
పునుకతమ్మంటులన్ బొలుచు వీనులఱేడ!
వినుసికను జుక్కలను  విరులు తుఱిమిన ప్రోడ!
కొమ్ము తేజీ నెక్కి గునిసియాడెడి వీర!
కమ్మవిలుతుని నొసటి కంట ( గాల్చిన ధీర!
గజదైత్యుమదమడ(చి ఘనత మించిన యీశ!
భుజగేంద్రశయన శరము నొగి( దాల్చు గిరీశ!

ఉత్కళిక

ఇష్ట దాన వ్రతము
కష్ట మైనను సతము
సల్పుచుoడుట యెఱి(గి
పొల్పు మీఱగ నరిగి
రతుల జొక్కని పొలతి
సతికి (జిక్కమి; స్వసతి(
బనుప దయగను  స్వామి!
వినత దివిజ స్వామి!
********
సార్వవిభక్తికము

శా || నీవే దైవతసార్వభౌము(డవెదన్నిన్నే ( బ్రశంసింతు నీ
      చే విశ్వంబులు గల్గు నీ కయి తమిన్ జేమోడ్తు సద్భక్తి మై
     నీ వల్లన్ భవబంధముల్ తొలగుతన్ నీ కే సురల్ సాటి ? నా
     సేవల్ నీ పదయుగ్మమందె యెసగున్ శ్రీరామలింగేశ్వరా!

అంకితాంక పద్యము

ఉ|| ద్రాక్షల మాధురిన్ దెగడు దత్తున “ నాంధ్ర పురాణ “ కావ్యమున్
     దక్షత వ్రాసి మించు కవితల్లజు శిష్యుడు కృష్ణమూర్తి ఫా
     లాక్షుని మీద ( దెన్గున నుదాహరణంబు జగద్ధితంబుగా
     దీక్ష రచించి కాన్కయిడె దీని రసజ్ఞులనుగ్రహింపుడీ!

*********

Friday, August 29, 2014

तर्जनी अभूत् सार्थकनामधेया

तर्जनी अभूत्  सार्थकनामधेया
डाक्टर्. चिलकमर्ति दुर्गाप्रसादरावु
3/106, प्रेम नगर,
 दयालबाग, आगरा.
कालिदासमहाकवे: वैशिष्ट्यं सर्वे जानन्त्येव | अङ्गुलिगणनीयेषु अन्यतम: स:|  तद्वैशिष्ट्यविषये विरचित: श्लोक: अपि सरस: सुप्रसिद्धश्च |

पुरा कवीनां गणनाप्रसङ्गे
कनिष्ठिकाधिष्ठितकालिदासा ||
अद्यापि तत्तुल्यकवेरभावात्
अनामिका सार्थवती बभूव||

अत्र विषय: तावदयम् | केचन अङ्गुलिकागणनावसरे  कनिष्ठिकात: आरभ्य गणनां कुर्वन्ति | पूर्वोक्त: श्लोक: तेषाम् आनुकूल्याय भवति | पुन: केचन सन्ति , ये च अङ्गुष्ठादारभ्य गणनां कुर्यु: | तेषामप्यानुकूल्यं कल्पयितुम् आन्ध्रदेशीयेन लब्धप्रतिष्ठेन स्वर्गीयेण श्रीमदत्तिलि गोपालकृष्णमाचार्येण महाकविना विरचित: अधोनिर्दिष्ट: श्लोक: अतीव प्रसिद्धोsपि नातिपरिचित: इति कृत्वा अत्र प्रस्तूयते |

पुरा कवीनां गणनाप्रसङ्गे
त्वङ्गुष्ठिकाधिष्ठितकालिदासा ||
तत्तौल्यमुद्भावयितृन्प्रतर्ज्याs
भूत्तर्जनी सार्थकनामधेया ||

एकेन अनामिकाया: सर्धकता प्रतिपाद्यते , अपरेण  च तर्जन्या: |

अहो ! कविताचातुरी नाम || 

Wednesday, August 27, 2014

పరగనొజ్జలు మాకు శ్రీపాదవారు

పరగనొజ్జలు మాకు శ్రీపాదవారు
చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                                       అది ఒక   ఓరియంటల్ కళాశాల . ఊరు పాలకొల్లు. శ్రీ క్షీరారామలిoగేశ్వరస్వామి యొక్క  కృపాకటాక్షవీక్షణాల  వలన ఏర్పడింది .  ప్రిన్సిపాల్ శ్రీ లంక. విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు. శ్రీ మoడలీక. వేంకటరావుగారు,  శ్రీ మల్లంపల్లి. వీరేశ్వరశర్మ గారు, శ్రీ వేదుల. సుందరరామ శాస్త్రి గారు,  డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి గారు, శ్రీ సోమంచి. సత్యనారాయణ గారు, శ్రీ వీరుభొట్ల. కుటుంబ సత్యనారాయణ గారు  వి. ప్రభాకరం గార్ల వంటి మహామహులు , ఉద్దండపండితులు కళాశాలలో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దేరు.   అందరు సంస్కృతాంధ్రభాషల్లో నిష్ణాతులు కావడంతో బాటుగా ఒక్కొక్కరు ఒక్కొక్కశాస్త్రంలో పరిపూర్ణమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు. అందరు విద్యార్థులను సుతనిర్విశేషంగా ప్రేమించేవారు.

      వారిలో అందరు ఒక  ఎత్తైతే డాక్టర్ శ్రీపాద వారు మరొక  ఎత్తు. ఆయన మా కళాశాలలో పని చేయడానికి ముందు నరసాపురం మిషన్ హైస్కూల్లో తెలుగు పండితులుగా పనిచేసేవారట. వారు సంస్కృతాంధ్రాoగ్లభాషలలో సమానమైన ప్రతిభాపాటవాలు కలవారు.
                     సాధారణoగా ఓరియంటల్ కళాశాలల్లో సoస్కృతాంధ్రభాషల్లోను, వివిధశాస్త్రాల్లోను ఆరితేరినవారు కనిపిస్తారు. కాని ఆంగ్లభాషాభిజ్ఞులు చాల అరుదుగా కనిపిస్తారు. అటువంటి అరుదైన వారిలో శ్రీపాదవారు ఒకరు.  వీరికి    సoస్కృతాంధ్రభాషల్లో ఎంత వైదుష్యం ఉందో ఆంగ్లంలో కూడ అంతే వైదుష్యం ఉంది. మరో ముఖ్యమైన విశేషమేమంటే వారికి ఇంచుమించు ఆధునిక కవులందరితోను స్నేహసంబంధాలున్నాయి. అందుకేనేమో  ఆధునిక తెలుగుకవితారీతులు  ఆయనకు కరతలామలకాలు.  అటు నన్నయ్య గారి నుండి ఇటు నారాయణ రెడ్డి గారి వరకు అందరి కవితారీతులు ఆయన  అలవోకగా వివరించేవారు. ప్రాచీన సాహిత్యాన్ని  ఎంత ఆసక్తికరంగా బోధించేవారో ఆధునిక సాహిత్యాన్ని కూడ అంతే ఆసక్తికరంగా బోధించే వారు. ప్రతి పద్యాన్ని రసానుగుణంగా చదివేవారు. ఇప్పటికి వారి గురుదేవులైన శ్రీమధునాపంతులవారి ఆంధ్రపురాణం చదువుతోంటే శ్రోతలు తన్మయులైపోవడo మనం గమనించొచ్చు.  ఇక ఆంధ్రసాహిత్యచరిత్ర ఏ గ్రంథo చూడకుండానే  అలవోకగా డిక్టేట్ చేసేవారు. మాకు చాల ఆశ్చర్యంగ ఉండేది.       
        ఇక  రాత్రివేళల్లో  మేము చదువుతున్నామో లేక సినిమాలకు , షికార్లకు పోతున్నామో తెలుసుకోడానికి తరచుగా వస్తూ ఉండేవారు. తప్పు చేస్తే తిట్టే వారు కాదు. మృదువుగా మందలి౦చేవారు.  యాస్కమహర్షి ఉపాధ్యాయుని లక్షణాలు వివరిస్తూ ‘ ఆచరతీతి ఆచార్య:’ , ‘ఆచారం గ్రాహయతీతి ఆచార్య:’ , ‘ ఆచినోతి అర్థానితి ఆచార్య:’ అంటారు . ఈ మూడు లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉన్నాయి. ఈ విధంగా ఒక ఆదర్శ ఉపాధ్యాయునికు౦డవలసిన లక్షణాలు వారిలో ఉన్నాయి. వారి ఆచరణే ఇతరులకు బోధ . ఇక విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని ఎప్పుడు సేకరిoచి అందిస్తూ ఉండేవారు.
            వారి రచన శ్రీ రామలిoగేశ్వరోదాహరణం కవిగా వారికి మంచి పేరు తెచ్చింది. ఇది రాసిలో చిన్నదైనా వాసిలో గొప్పది.
ఇది చేయితిరిగిన రచన, శైలి నవనవోన్మేషo  అని స్వయంగా వారి గురుదేవులు శ్రీమధునాపంతులవారు చెప్పడం గమనిoచదగినది. ఇక్కడ చెప్పవలసిన మరొక సంగతేమిటంటే శ్రీమధునాపంతులవారు ఎవరిని పొగడరు. ఇక శిష్యుణ్ణి పొగిడే ప్రసక్తే లేదు. శ్రీ విశ్వనాథ వారు తమగురుదేవులైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గార్ని స్తుతిస్తూ---
తన యెద యెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
తన తన శిష్యులన్న యెడదంగల ప్రేముడి  చెప్పలేని మె
త్తన యగు శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ల వేం
కనగురువంచు చెప్పుకొనగా నది గొప్ప తెనుంగునాడునన్
అంటారు. ఈ విశేషణాల్లో ‘శత్రుపర్వతశతారం’ అనే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాగురుదేవులకు వర్తిస్తాయి. అటువంటి సాహితీమూర్తి  మా గురువని చెప్పుకోవడం వారి శిష్యబృందమైన మేము  అదృష్టంగా భావిస్తాం. వారికి భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలిచ్చి రక్షించాలని  ఆకాoక్షిస్తూ ఉంటాం. ఈ విధంగా మా గురుదేవులనందరిని గురుపూర్ణిమ శుభదినాన మేము గుర్తుచేసుకునే అవకాశం కలగడం మా అదృష్టంగా భావిoచుకుoటున్నాం.
శ్రీపాదవారి శిష్యబృందం