Wednesday, August 27, 2014

పరగనొజ్జలు మాకు శ్రీపాదవారు

పరగనొజ్జలు మాకు శ్రీపాదవారు
చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                                       అది ఒక   ఓరియంటల్ కళాశాల . ఊరు పాలకొల్లు. శ్రీ క్షీరారామలిoగేశ్వరస్వామి యొక్క  కృపాకటాక్షవీక్షణాల  వలన ఏర్పడింది .  ప్రిన్సిపాల్ శ్రీ లంక. విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు. శ్రీ మoడలీక. వేంకటరావుగారు,  శ్రీ మల్లంపల్లి. వీరేశ్వరశర్మ గారు, శ్రీ వేదుల. సుందరరామ శాస్త్రి గారు,  డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి గారు, శ్రీ సోమంచి. సత్యనారాయణ గారు, శ్రీ వీరుభొట్ల. కుటుంబ సత్యనారాయణ గారు  వి. ప్రభాకరం గార్ల వంటి మహామహులు , ఉద్దండపండితులు కళాశాలలో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దేరు.   అందరు సంస్కృతాంధ్రభాషల్లో నిష్ణాతులు కావడంతో బాటుగా ఒక్కొక్కరు ఒక్కొక్కశాస్త్రంలో పరిపూర్ణమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు. అందరు విద్యార్థులను సుతనిర్విశేషంగా ప్రేమించేవారు.

      వారిలో అందరు ఒక  ఎత్తైతే డాక్టర్ శ్రీపాద వారు మరొక  ఎత్తు. ఆయన మా కళాశాలలో పని చేయడానికి ముందు నరసాపురం మిషన్ హైస్కూల్లో తెలుగు పండితులుగా పనిచేసేవారట. వారు సంస్కృతాంధ్రాoగ్లభాషలలో సమానమైన ప్రతిభాపాటవాలు కలవారు.
                     సాధారణoగా ఓరియంటల్ కళాశాలల్లో సoస్కృతాంధ్రభాషల్లోను, వివిధశాస్త్రాల్లోను ఆరితేరినవారు కనిపిస్తారు. కాని ఆంగ్లభాషాభిజ్ఞులు చాల అరుదుగా కనిపిస్తారు. అటువంటి అరుదైన వారిలో శ్రీపాదవారు ఒకరు.  వీరికి    సoస్కృతాంధ్రభాషల్లో ఎంత వైదుష్యం ఉందో ఆంగ్లంలో కూడ అంతే వైదుష్యం ఉంది. మరో ముఖ్యమైన విశేషమేమంటే వారికి ఇంచుమించు ఆధునిక కవులందరితోను స్నేహసంబంధాలున్నాయి. అందుకేనేమో  ఆధునిక తెలుగుకవితారీతులు  ఆయనకు కరతలామలకాలు.  అటు నన్నయ్య గారి నుండి ఇటు నారాయణ రెడ్డి గారి వరకు అందరి కవితారీతులు ఆయన  అలవోకగా వివరించేవారు. ప్రాచీన సాహిత్యాన్ని  ఎంత ఆసక్తికరంగా బోధించేవారో ఆధునిక సాహిత్యాన్ని కూడ అంతే ఆసక్తికరంగా బోధించే వారు. ప్రతి పద్యాన్ని రసానుగుణంగా చదివేవారు. ఇప్పటికి వారి గురుదేవులైన శ్రీమధునాపంతులవారి ఆంధ్రపురాణం చదువుతోంటే శ్రోతలు తన్మయులైపోవడo మనం గమనించొచ్చు.  ఇక ఆంధ్రసాహిత్యచరిత్ర ఏ గ్రంథo చూడకుండానే  అలవోకగా డిక్టేట్ చేసేవారు. మాకు చాల ఆశ్చర్యంగ ఉండేది.       
        ఇక  రాత్రివేళల్లో  మేము చదువుతున్నామో లేక సినిమాలకు , షికార్లకు పోతున్నామో తెలుసుకోడానికి తరచుగా వస్తూ ఉండేవారు. తప్పు చేస్తే తిట్టే వారు కాదు. మృదువుగా మందలి౦చేవారు.  యాస్కమహర్షి ఉపాధ్యాయుని లక్షణాలు వివరిస్తూ ‘ ఆచరతీతి ఆచార్య:’ , ‘ఆచారం గ్రాహయతీతి ఆచార్య:’ , ‘ ఆచినోతి అర్థానితి ఆచార్య:’ అంటారు . ఈ మూడు లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉన్నాయి. ఈ విధంగా ఒక ఆదర్శ ఉపాధ్యాయునికు౦డవలసిన లక్షణాలు వారిలో ఉన్నాయి. వారి ఆచరణే ఇతరులకు బోధ . ఇక విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని ఎప్పుడు సేకరిoచి అందిస్తూ ఉండేవారు.
            వారి రచన శ్రీ రామలిoగేశ్వరోదాహరణం కవిగా వారికి మంచి పేరు తెచ్చింది. ఇది రాసిలో చిన్నదైనా వాసిలో గొప్పది.
ఇది చేయితిరిగిన రచన, శైలి నవనవోన్మేషo  అని స్వయంగా వారి గురుదేవులు శ్రీమధునాపంతులవారు చెప్పడం గమనిoచదగినది. ఇక్కడ చెప్పవలసిన మరొక సంగతేమిటంటే శ్రీమధునాపంతులవారు ఎవరిని పొగడరు. ఇక శిష్యుణ్ణి పొగిడే ప్రసక్తే లేదు. శ్రీ విశ్వనాథ వారు తమగురుదేవులైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గార్ని స్తుతిస్తూ---
తన యెద యెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
తన తన శిష్యులన్న యెడదంగల ప్రేముడి  చెప్పలేని మె
త్తన యగు శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ల వేం
కనగురువంచు చెప్పుకొనగా నది గొప్ప తెనుంగునాడునన్
అంటారు. ఈ విశేషణాల్లో ‘శత్రుపర్వతశతారం’ అనే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాగురుదేవులకు వర్తిస్తాయి. అటువంటి సాహితీమూర్తి  మా గురువని చెప్పుకోవడం వారి శిష్యబృందమైన మేము  అదృష్టంగా భావిస్తాం. వారికి భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలిచ్చి రక్షించాలని  ఆకాoక్షిస్తూ ఉంటాం. ఈ విధంగా మా గురుదేవులనందరిని గురుపూర్ణిమ శుభదినాన మేము గుర్తుచేసుకునే అవకాశం కలగడం మా అదృష్టంగా భావిoచుకుoటున్నాం.
శ్రీపాదవారి శిష్యబృందం
         

No comments: