Wednesday, August 27, 2014

సoపూర్ణ వ్యక్తిత్వo

                       సoపూర్ణ వ్యక్తిత్వo
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
91+9897959425

మనం సాధారణంగా నిత్యజీవితంలో ఎంతో మందిని చూస్తో ఉంటాం.  ఒక రంగంలో వారు చాల  ప్రగతి సాధిస్తే  మరో రంగంలో  వెనుకబడి  ఉoటున్నారు. ఇంట్లో ఈగలమోత బయట పల్లకి మోత అన్నట్లు   సంఘంలో గొప్పపేరు, ప్రఖ్యాతులు  గడించినవాళ్లే కుటుంబవ్యవహారాల్లో కుoటుబడిపోతున్నారు.   ఒక రంగంలో పురోగతి  మరో రంగంలో తిరోగతి ఇంకోరంగంలో అధోగతి   కన్పిస్తోoది  
ఒక వ్యక్తి అన్ని విషయాల్లోనూ ప్రగతిని సాధిస్తేనే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం అంటాం.  శరీరoలో అన్ని అంగాలు ఎదగవలసిన విధంగా ఎదిగితేనే ఆరోగ్యవంతుడంటాం గాని ఓ కాలో, చెయ్యో బాగా పెరిగి మిగిలినవి పెరగకపోతే ఆరోగ్యవంతుడనలేం.  అలాగే అన్ని అంగాల్లోను  ఎదుగుదల కనిపించి ఒక అంగం  ఎటువంటి ఎదుగుదలకు నోచుకోకపోయిన మనిషి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కాలేడు. వ్యక్తిత్వం  విషయంలో కూడ ఇదే నియమం వర్తిస్తుంది. ఇక  పరిపూర్ణమైన వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలో మహాకవి భర్తృహరి చాల సంక్షిప్తం గాను  సమగ్రంగాను  ఒక శ్లోకంలో ఇలా వివరించాడు.

1.    దాక్షిణ్యం స్వజనే:-      
ప్రతివ్యక్తి తనవారి పట్ల సమభావం కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని ఒకలాగా మరోవ్యక్తిని మరోలాగా చూడకూడదు. మనలో కొంతమంది డబ్బును బట్టి హోదాను బట్టి బంధువుల్లోనే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. అది మంచిది కాదు. కాబట్టి పై పై హంగులకు విలువియ్యకుoడ వ్యక్తిని  వ్యక్తిగా చూడ్డం నేర్చుకోవాలి. అప్పుడే మనపట్ల అందరికి గౌరవం ఏర్పడుతుంది.  
2.    దయా పరిజనే:-
  సేవకులపట్ల దయకల్గి ఉండాలి. ‘ వీడు నా దగ్గర పనిచేస్తున్నాడు. వీణ్ణి నేను పోషిస్తున్నాను. నేను ఏo చేసినా  సహించాలి  ఏ మన్నా భరించాలి’  అనుకోకూడదు. సాటి మనిషనే సానుభూతి కలిగి ఉండాలి. చేతనైతే సాహాయ్యం చెయ్యాలి గాని పొట్ట కొట్టకూడదు. వాడి ఉసురు పోసుకోకూడదు.   ‘ దుర్బలుణ్ణి ఎప్పుడు ఇబ్బంది పెట్టకు. వాడి ఉసురు (ఊపిరి) చాల బలమైనది.  కమ్మరి కొలిమిలో ప్రాణంలేని  తిత్తిలోoచి వచ్చే  గాలి ఇనుమును కరిగిస్తోంది. ఇక ప్రాణం ఉన్నవాడి ఊపిరుoదే అది నీ వంశాన్నే సమూలంగా దహిస్తుoది. జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తారు  కబీరుదాసు.  
3.    శాఠ్యo సదా దుర్జనే:-
 చెడ్డవారి పట్ల చెడుగానే వ్యవహరించాలి.  చెడ్డవాణ్ణి  చెడుమార్గంలోనే లొoగదీయాలి గాని మంచిదనం పనికి రాదు. అందుకే   ‘ శామయేత్ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన:’  అంటుoది మన  సనాతనధర్మం. అంటే మంచికి మంచి గాని, చెడుకి మంచితనo పనికి రాదు. వైద్యశాస్త్రం శ్లేష్మాన్ని చెడ్డవాడితో పోల్చింది.  
అహో ప్రకృతిసారూప్యం
 శ్లేష్మణో దుర్జనస్య చ
మధురై: తీవ్రతాం యాతి
కటుకైరుపశామ్యతే   
దుష్టుడు శ్లేష్మంతో సమానం.  ఏ విధంగా శ్లేష్మం తీపి పదార్థాలు తింటే ఎక్కువౌతుందో , కారంతో చేసిన పదార్థాలకు తగ్గుతుందో అలాగే చెడ్డవాడు  మనం మంచిగా ఉంటే రెచ్చిపోతాడు, కఠినంగా ఉంటేనే లొంగుతాడు.     
4.    ప్రీతిస్సాధుజనే:-
 మంచివారి పట్ల ఎల్లప్పుడూ  ప్రేమ కలిగి ఉండాలి. వారి మనస్సు ఎన్నడు నొప్పించ కూడదు. వారికి  ఎటువంటి మనస్తాపం కల్గించ కూడదు 
5.    నయోనృపజనే :-
 ప్రభుత్వం పట్ల , అధికారులపట్ల నీతి, నిజాయితీ లతోవ్యవహరిచాలి. ఎoదుకంటే ఓకే ప్రభుత్వం గాని అధికారి గాని మనల్ని సంపూర్ణంగా నమ్మి ఒక బాధ్యత అప్పగిస్తారు. అందువల్ల సక్రమంగా మన బాధ్యతల్ని నిర్వర్తించాలి . వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు.  ఎన్నడూ అవినీతికి పాల్పడకూడదు.  సాధారణంగా కొందరు    అందరూ అవినీతితో ఉంటున్నారు ఇక  నేను ఒక్కణ్ణే నిజాయితీగా ఉంటే ఏం లాభం? అనుకుంటూ ఉంటారు. కాని ఇది చాల పొరబాటు. ప్రతివ్యక్తి ఇలాగే అనుకుంటే  అందరు అవినీతిపరులు, లంచగొండులే అవుతారు. అందువల్ల ప్రతి వ్యక్తీ నేను నీతిగా వ్యవహరిస్తే అవినీతిపరులసంఖ్య కనీసం ఒకటైన తగ్గుతుoది కదా! అనుకోవాలి.  తన  కంటే పైవాడు ప్రోత్సహించినా  తప్పు చెయ్యకూడదు.   
6.    విద్వజ్జనే చార్జవo:-
 పండితులపట్ల చాల ఋజుప్రవర్తన కలిగి ఉండాలి. వారితో సవ్యంగా మాట్లాడ్డం ,     సక్రమంగా వ్యవహరించడం ఎంతో అవసరం . వెకిలిగా, అసభ్యంగా  ప్రవర్తిoచకూడదు. వ్యంగ్యంగా మాట్లాడకూడదు. తెలిసింది తెలిసినట్లుగా , తెలియంది తెలియనట్లుగా ప్రవర్తించాలి. అలా నడుచుకుంటే వాళ్ళ వల్ల మనం పొందవలసిన ప్రయోజనం పూర్తిగా పొందొచ్చు. అలా కాకుoటే ప్రయోజనం మాట అటుంచి నష్టపోయే ప్రమాదముంది.   
7. శౌర్యం శత్రుజనే:-
 ఇక శత్రువుల పట్ల శౌర్యం ప్రదర్శించాలి.  వీరోచితంగా పోరాడాలి. పిరికి పందవలె వెన్ను చూపకూడదు. యుద్ధంలో మరణించినా శౌర్యవంతుడౌతాడు గాని పారిపోయినవాడు ఎన్నటికి శౌర్యవంతువంతుడనిపించుకోడు.
 
8.  క్షమా గురుజనే
పెద్దవారి యెడ సహనంతో వ్యవహరించాలి. వారొకవేళ మనల్ని అనవసరంగా కోప్పడ్డా మనం వారియెడల కోపం ప్రదర్శిoచకూడదు. సహనంతో వ్యవహరించాలి.
9. కాoతాజనే  ధృష్టతా :-
ఇక  ధృష్టతా అంటే దిట్టదనం. స్త్రీల విషయంలో చాల గడుసుగా వ్యవహరించాలి. కొoతమంది ఉంటారు . వాళ్లు జీవితాంతం  భార్యా విధేయులుగానే మిగిలిపోతారు. ఆమె ‘క’ అంటే ‘క’ ‘కి’ అంటే ‘కి’. అటువంటి వాళ్లని  Hen- pecked husbands అంటారు. వారి జీవితం దుర్భరం . భార్య మాట వినడం తప్పుకాదు. కాని మంచి చెడు విచక్షణ లేకుండా చెప్పిందల్లా చెయ్యడం తప్పు.  కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుoటు , ఎవరిని ఎలా గౌరవించాలో ఆవిధంగా గౌరవిస్తూ మన గౌరవాన్ని దక్కించుకోవాలి. కుటుంబంలో తల్లికివ్వవసిన గౌరవం తల్లికివ్వాలి. చెల్లికివ్వవలసిన గౌరవం చెల్లికివ్వాలి.  భార్యకివ్వవలసిన గౌరవం భార్యకివ్వాలి. అందరికి సహకారం పంచుతూ, అందరి మధ్య సామరస్యం పెంచుతూ ముందుకు సాగాలి. అప్పుడే కుటుంబం సజావుగా నడుస్తుంది. అలా కాకుండా  ధృతరాష్ట్రుడు లాగ  గ్రుడ్డిగా ఒకరికి చేరువై మరొకరికి దూరమైతే కుటుంబం కురుక్షేత్రమే ఔతుంది.  
         ఈ విధంగా వివిధ వ్యక్తులతో వివిధ రకాలుగా నొప్పించక తానొవ్వక అన్నవిధంగా చాకచక్యంతో మసలుకునే వారే సకలకళా ప్రవీణులు సంపూర్ణ వ్యక్తిత్వం కలవారు ఔతున్నారు. అటువంటి వారివల్లనే ఈ లోకం సక్రమంగా మనగలుగుతోoది అంటాడు మహాకవి తత్త్వవేత్త  అయిన భర్తృహరి తన నీతిశతకంలో .    
దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యo సదా దుర్జనే
ప్రీతిస్సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవo
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాoతాజనే  ధృష్టతా
యే చైవం పురుషా: కళాసు కుశలా: తేష్వేవ లోకస్థితి:      
***











No comments: