Sunday, September 10, 2017

అనుకున్నదొకటి - అయినదొకటి

అనుకున్నదొకటి - అయినదొకటి

డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు


గుండెనిబ్బరం గల వ్యక్తిగా సుబ్బాశాస్త్రికి తన ఊళ్లో మంచి పేరే ఉంది . ఆయనది సముద్రతీరం లోని ఒక కుగ్రామం . ఆయనకు వృత్తి, ప్రవృత్తి రెండూ పౌరోహిత్యమే . అందుకే ఎవరు, ఎప్పుడు, ఎక్కడకు పిలిచినా కాదనరు, ఎవరిని విసుక్కోరు, ఎవరేమిచ్చినా సంతోషంగా పుచ్చుకుంటారు.  ఈయనకసలు బుద్ధిలేదు, ఎవరు ఎప్పుడు ఎక్కడి రమ్మన్నా వెడతాడు, ఏమిచ్చినా పుచ్చుకుంటాడు అని తోటి పురోహితులు హేళన చేస్తున్నా ఆయన తన ధర్మం నిర్వర్తిస్తూనే ఉండేవాడు . ఆయనకు వయస్సు పైబడే కొద్దీ కంటి చూపు మందగి౦చింది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు సముద్రప్రాంతంలో నివసించే జాలరులలో ఒకాయన తనపిల్ల పెళ్లికి శాస్త్రి గారిచే ముహూర్తం పెట్టి౦చుకున్నాడు . అది అర్ధరాత్రి ముహూర్తం . సాధారణంగా ముహూర్తం పెట్టినవారే పెళ్లి కూడ చేయించాలి . అది రివాజు . అందువల్ల పెళ్లి చేయించవలసిన భాద్యత శాస్త్రిగారి పైనే పడింది . నాకు రాత్రి కన్ను కనిపించదని చెప్పినప్పటికీ వారు ఆయననే రమ్మని పట్టుబట్టారు . ఆయన కూడ ఎందుకో కాదనలేక సరే అన్నారు . అయ్యా ! మీకేమి శ్రమ కలిగించం, బండి పంపిస్తాం, ఆ బండెక్కి సమయానికి వచ్చేయండి అని చెప్పి వెళ్లి పోయారు.  కొన్నాళ్ళు గడిచాక పెళ్లి చేయించవలసిన రోజు రానే వచ్చింది . పెళ్ళివారు ముందుగానే బండి పంపించారు గాని ఆ బండి వాడు దారి తెలియక మరో చోటికి వెళ్ళిపోయాడు . శాస్త్రి గారు బండి కోసం చాల సేపు వేచిచూసి ఎప్పటికి రాకపోయేటప్పడికి ఇంక ఆలశ్యం చేస్తే ముహూర్తం వేళ దాటిపోతుందని కాలి నడకనే బయలుదేరారు . చీకటి పడుతోంది , చూపుకూడ మందగించడం చేత అడుగులో అడుగేసుకుంటు నడిచి వెడుతున్నారు . మధ్యలో స్మశానం కూడ కనిపించింది . ఇదేంటి ఇక్కడ స్మశానం ఎలా వచ్చింది అనుకున్నారు . ఆయన ముందుకు నడుస్తున్నారు . మెల్లగా దట్టమైన  చీకటి వ్యాపించింది . అంతలో నలుగురు వ్యక్తులు ఆయనను కలిసి శాస్తిగారూ! ఇంత రాత్రి వేళ ఎక్కడకు వెడుతున్నారు అని అడిగారు . ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్లికి బాబూ ! అన్నారాయన . శాస్త్రి గారు దారి తప్పిపోయారు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుని అయ్యా! మీరు వెళ్ళవలసిన దారి అటు కాదు ఇటు అని ఆయనను తమ వెంట తీసుకుపోయారు . కళ్యాణమంటపం దగ్గర కుర్చోపెట్టారు . అంతా కోలాహలంగా ఉంది . ముహూర్తం దగ్గరపడింది . పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. గౌరీపూజ చేయి౦చే  లోపులో పెళ్లికొడుకు కూడ ముచ్చటగా అలంకరించుకుని ముందుకొచ్చాడు .  ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది. పెళ్లిపెద్దలు తగిలీ తగలకుండా , అంటీ  అంటకుండా, ముట్టీముట్ట కుండా  అడిగిన వస్తువులు అందిస్తున్నారు . హంగు ఆర్భాటాలతో , బాజాభజంత్రీలతో పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది . పెళ్ళివారు పండ్లు , శాలువా ఇచ్చి  సత్కరించారు . బియ్యం, చిల్లరిడబ్బులు కూడ చాల బాగానే ముట్టచెప్పారు . వాళ్లు చేసిన  సత్కారానికి, ఇచ్చిన సంభావనలకు ఉక్కిరిబిక్కిరయ్యారు శాస్త్రి గారు .  వచ్చిన పెళ్ళివారు ఎవరి చోటికి వాళ్ళు వెళ్లి పోతున్నారు. సుబ్బాశాస్త్రి గారు కూడ ఇంటికి బయలుదేరడానికి సిద్ధం అయ్యారు .  కాని పెళ్లిపెద్దల్లో ఒకాయన శాస్త్రి గారూ! ఇంతరాత్రి వేళ ఎక్కడికి వెడతారు . రేపు వెడిదిరిగాని, ఈ రాత్రికి ఇక్కడే పడుక్కో౦ డి , మీకేమి లోటు చెయ్యం లెండి అన్నాడు  . శాస్త్రి గారికి కూడ ఆ పూట అక్కడ పడుక్కోవడమే మంచిదని పించింది. సరే అన్నారు . వాళ్ళు ఒక మంచం , తలగడ , కప్పుకోడానికి దుప్పట్లు ఇచ్చారు.  ఆయన అప్పటికే అలిసి పోయి ఉన్నారేమో ఆదమరచి నిద్ర పోయారు . ప్రొద్దుటే సూర్యకిరణాలు కళ్ళల్లో గుచ్చుకోవడం వల్ల మెలుకువొచ్చి లేచారు . పెళ్లి మడపం లేదు . అటు ఇటు అంతా కలయ చూశారు . కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం  లేదు. మంచం కేసి చూసి ఉలిక్కి పడ్డారు  . అది మంచం కాదు , శవాలు మోసుకొచ్చే పాడే . దుప్పట్లు చూశారు అవి శవాల మీద కప్పే గుడ్డలు . బియ్యమ్మూట విప్పేరు .  అదంతా  ఇసుక . చిల్లరి మూట విప్పేరు అవన్నీ కుండ పెంకులు . అరిటిపళ్ళ సంచి తీసి చూశారు, అవన్నీ ఎముకలే . రాత్రి సువాసనతో ఇంపుగా ఉన్న ఆ పళ్లే ఇప్పుడు కుళ్ళు కంపుకొడుతున్నాయి. ఛీ ఛీ అని విసిరేశారు. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేయి . ఆంజనేయ దండకం వల్లె వేసుకుంటూ  వెనక్కి చూడకుండా పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు . వట్టి చేతులతో వచ్చిన భర్తను చూసి ఏమండీ ! వాళ్లేం ఇవ్వలేదా  లేక మీరు మొయ్యలేరని బండి మీద పంపిస్తున్నారా  అని అడిగింది ఆ ఇల్లాలు . నీ అమ్మ కడుపు బంగారం గాను ప్రాణాలతో బయటపడ్డాను సంతోషించు అని ఆ రాత్రి  వధూవరుగాను , పెళ్లివారిగాను కొరివిదెయ్యాలు తనతో ఆడిన బాగోతాన్ని వివరించారు . అదంతా విని ఆమె నిలువెల్లా వణికి పోయింది . పోనీ లెండి , జరిగిందేదో జరిగింది . మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది అదే పదివేలు  అంది .  ఆమరునాడు  అసలు పెళ్లి పెద్దలొచ్చి పెళ్లి చేయించడానికి రానందుకు పంతులు గారిని నిలదీశారు . ఆయన చెప్పిందంతా విని విస్తుపోయారు .

    

Saturday, September 2, 2017

ఎంగిలి

ఎంగిలి
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

              సుబ్బారావుకి ఎన్నినియమనిష్ఠలున్నాయో, అంతకు మించిన చాదస్తం కూడ ఉంది .

ఎప్పుడు భార్యకంటే ముందుగానే భోజనం చేస్తాడు . ఒకసారి ఎందుకో  భార్యతో కలిసి భోజనానికి కూర్చున్నాడు . మంచినీళ్ళు త్రాగి గ్లాసు క్రి౦ద పెట్టబోతూ గ్లాసుకేసి చూశాడు . అందులో అన్నం మెతుకు కనిపించేసరికి గతుక్కుమన్నాడు .  తీరా చూస్తే అది వాళ్ళావిడ త్రాగిన గ్లాసు . ఎంగిలి గ్లాసుతో నీళ్ళు త్రాగినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి . మన భారతీయ సంస్కృతిలో ఎంగిలి తినడంగాని , ఇతరులకు పెట్టడంగాని మహాపాపం. అందుకు  ప్రాయశ్చిత్తం చేసుకోవాలి .  ఏమిటా ప్రాయశ్చిత్తం  అని గ్రంథాలన్నీ తిరగేశాడు. ఒక పుస్తకంలో ఎంగిలి తిన్నపాపం కాశీని సందర్శిస్తే పోతుందని వ్రాసి ఉంది . ఇక చేసేదేముంది. కాశికి బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు . పూర్వం కాశికి వెళ్ళడం కాటికి వెళ్ళడంతో సమానమనేవారు . ఎందుకంటే  కాశీకి బయలుదేరిన వాడు అక్కడకు ఎప్పుడు వెడతాడో తెలియదు. వెళ్ళినవాడు తిరిగి ఇంటికి చేరతాడో చేరడో తెలీదు. ఒకవేళ చేరితే  ఎప్పుడు చేరతాడో  ఏ స్థితిలో చేరతాడో  ఎవరికీ తెలీదు. కాని మన సుబ్బారావు అవన్నీ ఆలోచించకుండా ధైర్యంగా  కాలినడకనే  బయలుదేరాడు .   మధ్యాహ్నసమయానికి ఒక ప్రాంతం చేరుకున్నాడు . కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి . భోజనం కోసం ఒక ఇంటిలో దూరాడు . ఆ ఇంటి ఇల్లాలు సుబ్బారావుకి మంచి విందుభోజనం పెట్టింది . అమ్మా! భోజనం చాల బాగుంది . సేమ్యా పాయసం చెప్పలేనంత రుచిగా ఉంది . మీకు నా కృతజ్ఞతలు అంటూ అన్నదాత్రీ సుఖీ భవ అని ఆశీర్వదించాడు . ఆమె సంతోషంతో  తిన్నవాడా ఖుషీ భవ  అంటూ నాయనా ! నేను బయటకు వెళ్ళగా చూసి ఒక కుక్క ఇంట్లో దూరి పాయసంపై ఉన్న పాలతొరక తెట్టు  నాకేసింది. లేకపోతే ఇంకా రుచిగా ఉండేది బాబూ! అంది . అదివిని గతుక్కుమన్నాడు సుబ్బారావు . కాని ఏమీ మాట్లాడలేక అక్కడనుంచి ముందుకు నడిచాడు . నడవగా నడవగా కొంత సేపటికి చీకటి పడింది . రాత్రి భోజనానికి సమయం ఆసన్నమై౦ది. ఆకలితో కడుపు నకనకలాడుతో౦ది. ఒక సత్రం చేరుకున్నాడు . ఆ సత్రం యజమాని తనని పిలిచి ఆదరంగా భోజనం పెట్టాడు . తాంబూలం వేసుకోడానికి తమలపాకులు, పోకచెక్క , సున్నం అందించాడు . సుబ్బారావు అంతులేని ఆనందంతో ఆకులకి సున్నం రాసి పోక దట్టించి నోట్లో పెట్టుకుని నమలసాగాడు . ఎంత నమిలినా పోక నలగడం లేదు . అతని అవస్థను గమనించిన ఆ సత్రం యజమాని నాయనా! ఆ పోకను ఇప్పటికే సుమారు పదిమంది నోట్లో పెట్టుకుని నలగ్గొట్టడానికి ప్రయత్నించారు , ఎవరివల్ల కాలేదు అన్నాడు అసహనంగా . సుబ్బారావుకి మతిపోయినంత పనైంది. ఇంత దారుణ౦గా వ్రతభంగమైనందుకు లోలోపల చింతిస్తూ ముందుకు పొతే ఇంకా ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని భయపడుతూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు .

షడ్విధం స్నేహలక్షణం

Friendship is of six characteristics
షడ్విధం స్నేహలక్షణం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

ఈ సమాజంలో కొంతమంది స్నేహానికే విలువిస్తారు, స్నేహితులనే నమ్ముతారు బంధువులను నమ్మరు. మరికొంతమంది  బంధుత్వానికే విలువిస్తారు, వారినే నమ్ముతారు, స్నేహితుల్ని అంతగా పట్టించుకోరు . సాధారణంగా బంధుత్వం కంటే స్నేహానికే విలువిచ్చేవారు సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే స్నేహం స్వంత సెలక్షను. మనం మనకిష్టమైన వాళ్లనే  స్నేహితులుగా ఎన్నుకుంటాం కాబట్టి వారు ఎటువంటివారైనా మనకు నచ్చుతారు . అందుకే ముత్యాలొక చోటికి నత్తగుల్లలొక చోటికి చేరతాయని పెద్దలు చెబుతూ ఉంటారు . ఇక  బంధుత్వం భగవంతుని బలవంతపు సెలక్షను . మన ఇష్టానిష్టాలతో పనిలేదు . వారు మంచివారైతే చేరదీస్తాం. చెడ్డవారైతే దూరంగా ఉంచుతాం . ఇక మిత్రులు మన సెలక్షను కాబట్టి ఈ క్రింది లక్షణాలున్న వారిని సెలెక్ట్ చేసుకోవాలి . మన పెద్దలు మంచి స్నేహానికి ఆరు లక్షణాలు చెప్పారు.
దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తే భోజయతే చైవ షడ్విధం స్నేహలక్షణం (హితోపదేశం ) 
కొంతమంది చూడండి. అందరికి ఏవేవో ఇస్తూ ఉంటారు కాని ఎవరేమిచ్చినా పుచ్చుకోరు . మరికొ౦తమంది ఎప్పుడూ ఏదో ఒకటి  పుచ్చుకోవడమేగాని ఎవరికీ , ఎప్పుడు , ఏదీ ఇవ్వరు . మేమొస్తే మాకేం ఇస్తారు , మీరొస్తే మాకేం తెస్తారు అనే మంత్రాన్నే వల్లిస్తూ ఉంటారు . కొంతమంది వాళ్ళ ఇబ్బందులు చెబుతూ ఉ౦టారే గాని మన సంగతులు పట్టించుకోరు . కొంతమంది మన రహస్యాలు, మన సంగతులు అడుగుతారే గాని వాళ్ళ విషయాలు మనకి చెప్పరు, చాల గోప్యంగా ఉంచుతారు . కొంతమంది  ఇతరులు  పెట్టినవి తింటారే గాని వారికి  ఏమి పెట్టరు . ఎంగిలిచేత్తో కాకిని తోలితే దానికి ఒక మెతుకు ఎక్కడ అందుతుందో అని ఎంగిలి చెయ్యి కూడ విదపరు. కొంతమంది అందరికి అన్ని తినిపిస్తో ఉంటారు గాని ఎవరేమిచ్చి తినమన్నా తినరు .    ఇటువంటి స్నేహం ఆదర్శవంతమైన స్నేహం అనిపించుకోదు . ఎవరిమధ్య స్నేహం ఇవ్వడం , తీసుకోవడం , రహస్యాలు చెప్పడం , తెలుసుకోవడం , ఆహారం తినడం , తినిపించడమనే ఆరు అంశాలతో ఎల్లప్పుడూ నడుస్తుందో అది ఆదర్శవంతమైన స్నేహం అనిపించుకుంటుంది . అసలు సిసలైన స్నేహంలో ఆత్మాధిక్యానికి గాని  (superiority) ఆత్మన్యూనతాభావానికి (inferiority) కి గాని  ఎటువంటి తావు లేదు . అలా ఉన్నప్పుడే స్నేహం పదికాలాలపాటు నిలుస్తుంది , పదిమందికి ఆదర్శప్రాయం అవుతుంది . అటువంటి ఆదర్శవంతమైన స్నేహాన్ని ఆహ్వానిద్దాం , ప్రోత్సహిద్దాం . మహాభారతంలోని ద్రోణ-ద్రుపదుల స్నేహం అధమస్నేహానికి ; భాగవతంలోని కృష్ణ కుచేలుర మధ్య గల స్నేహం ఉత్తమస్నేహానికి ఉదాహరణలుగా చరిత్రప్రసిద్ధి పొందాయి. అధమస్నేహానికి దుష్ఫలితాన్ని ద్రోణద్రుపదులు; ఉత్తమస్నేహానికి సత్ఫలితాన్ని కృష్ణకుచేలురు అనుభవించడం మనకు తెలుసు .  మంచి స్నేహితుణ్ణి ఎంచుకుందాం మంచిస్నేహం పంచుకుందాం .
              Good friends are rare. Keep them with care.