Thursday, May 3, 2018

మద్యపానం మానండి, మానమర్యాదలు కాపాడుకో౦డి


మద్యపానం మానండి,  మానమర్యాదలు  కాపాడుకో౦డి

చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సప్త వ్యసనాల్లో మద్యపానం ఒకటి . ఇది చాల ప్రమాదకరమైనది . ఇది ఒక వ్యసనమే అయినా  అనేక ఇతర వ్యసనాలకు దారితీస్తుంది అని పెద్దలు చెబుతారు . దానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం పరిశీలిద్దాం .

ఒకనాడు భోజమహారాజు ప్రజలబాగోగులను ,కష్టసుఖాలను స్థితిగతులను స్వయంగా తెలుసుకోడానికి మారు వేషం ధరించి అర్థ రాత్రి సమయంలో నగరంలో సంచారం చేస్తున్నాడు . ఒక చోట ఒక బిచ్చగాడు మాంసం తింటున్న దృశ్యాన్ని చూశాడు . వెంటనే అతన్ని సమీపించి

ఏమయ్యా ! నువ్వు మాంసం తినడం ఏమైనా బాగుందా , ఇది నీకు న్యాయమా? (భిక్షో ! మా౦సనిషేవణ౦ ప్రకురుషే?) అని అడిగాడు .
అడిగిన వ్యక్తి మహారాజని తెలియని బిచ్చగాడు  మద్యం లేకుండా అదే౦ రుచిస్తు౦ది చెప్పండి (కిం తేన మద్యం వినా?) అన్నాడు .
 రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆహా! నువ్వు మద్యం కూడ తాగుతావన్నమాట (మద్యం చాపి తవ ప్రియం ?)అన్నాడు .
దానికి సమాధానంగా బిచ్చగాడు వేశ్యలతో కలిసి మద్యం సేవించడం నాకు చాల ఇష్టం  (ప్రియమహో వారా౦గనాభి: సహా) అన్నాడు .
రాజు మరీ ఆశ్చర్య చకితుడయ్యాడు . వెంటనే  అది సరేనయ్యా! వేశ్యలు డబ్బుని ప్రేమిస్తారు . డబ్బులిస్తే గాని రారు కదా ! మరినీకు డబ్బులెలా వస్తాయి? (వేశ్యా ద్రవ్యరుచి: కుతస్తవ ధనం?)అని అడిగాడు .
దానికి బిచ్చగాడు దానికేముందండి. దొంగతనం చేస్తాను లేదా జూదమాడతాను (ద్యూతేన చౌర్యేణ వా) అన్నాడు .
రాజు  నీకు జూదం దొంగతనం కూడ అలవాటుందా? (చౌర్యద్యూతపరిగ్రహోపి భవత:) అన్నాడు .
బిచ్చగాడు: భ్రష్ఠునికి వేరే దారేముంటు౦దండి. వాడు దేనికైనా తెగిస్తాడు . ఎంతకైనా దిగజారతాడు (భ్రష్టస్య కాన్యా గతి:? ) అన్నాడు .   

భిక్షో ! మా౦సనిషేవణ౦ ప్రకురుషే? కిం తేన మద్యం వినా?
మద్యం చాపి తవ ప్రియం ? ప్రియమహో వారా౦గనాభి: సహా
వేశ్యా ద్రవ్యరుచి: కుతస్తవ ధనం? ద్యూతేన చౌర్యేణ వా   
చౌర్యద్యూతపరిగ్రహోపి భవత: భ్రష్టస్య కాన్యా గతి:  ?


भिक्षो मांसनिषेवणं किमुचितं ? किं तेन मद्यं विना ?
मद्यं चाsपि तव प्रियं प्रियमहो वाराङ्गनाभि: सह |
वेश्या द्रव्यमति: कुतस्तव धनं ? द्यूतेन चौर्येण वा
चौर्यद्यूतपरिग्रहोsपि भवत: भ्रष्ठस्य का वा गति: ? 




మద్యపానం వల్ల కలిగే అనర్థాలను శుక్రాచార్యులు ఇలా వెల్లడించారు.

బుద్ధేర్మోహకరం, విపత్పరికరం, సత్కీర్తినాశంకరం,
మానప్రాణహరం, దశేంద్రిగుణగ్రామప్రభాతస్కరం,
విత్తధ్వంసకరం, భ్రమేణ యుగపత్త్రైలోక్యసాక్షాత్కరం
శ్రోతారోsద్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వత: 
        
                                                     మద్యపానం బుద్ధిని మోహపరుస్తుంది . ఎన్నో కష్టాలను తెచ్చి పెడుతుంది. కీర్తిని కలుషితం చేస్తుంది. మానప్రాణాలు హరిస్తుంది. ఇంద్రియ పటుత్వాన్ని శిథిలం చేస్తుంది. ధన నష్టాన్ని కలుగ(జేస్తుంది. మూడు లోకాలు ఒకే చోట ఉన్నట్లుగా భ్రమింప(జేస్తుంది. కాబట్టి మద్యపానం పూర్తిగా నిషేధిస్తున్నాను.                 



















No comments: