Tuesday, May 29, 2018

అలకపానుపు


అలకపానుపు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సుశీలమ్మ సగటు మనిషి . ఆమె జీవితం పది స౦వత్సరాలు పసుపుతోనే సాగినా ఆ తరువాత  చాల సంవత్సరాలుగా ముసుగుతోనే సాగుతోంది. పది సంవత్సరాల దాంపత్య ఫలంగా అమ్మాయి,  అబ్బాయి కలిగారు .  అమ్మాయి వనజ పెద్దది అబ్బాయి వరుణ్ చిన్నవాడు . ఇక  భార్యా భర్తలలో ఏ ఒక్కరు లేకపోయినా మిగిలిన వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే .  అందులోనూ స్త్రీ జీవితం మరీ దుర్భరం . కాని భర్త గతి౦చినా  సుశీలమ్మ తన గౌరవానికి ఎటువంటి లోటు, తలవంపు రాకుండా  అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఎలాగో నెట్టు కొచ్చింది. పిల్లల్ని ప్రభుత్వ పాఠాశాలల్లోనే  చేర్పి౦చి  చదివి౦చింది . పిల్లలిద్దరు  ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఇపుడు సుశీలమ్మకు మూడు సమస్యలు . ఒకటి ఆడపిల్ల పెళ్లికెదిగింది, ఆమెను ఒక అయ్య చేతుల్లో పెట్టాలి . రెండు ఎంత ఖర్చైనా చదువుకున్నవాడికే పిల్లనివ్వాలి. ఇక పిల్లను పంపించాక కొడుకును చదివి౦చుకుంటూనే తన ముప్పు గడుపుకోవాలి ఇది మూడో సమస్య . ఇదంతా సుశీలమ్మకొక దిగులుగా తయారైంది. పెళ్ళంటే మాటలా ! ఎంతో ధనబలం, జనబలం  కావాలి . తల్లి ఇబ్బందులు   గమనించిన వనజ  కట్నం అడిగేవాణ్ణి చేసుకునే ప్రసక్తి లేదని తన నిర్ణయం ఖరాఖండిగా చెప్పేసింది . కట్నం లేకుండా చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారు? కాని లోకం ఇంకా గొడ్డు పోలేదని చెప్పడానికా అన్నట్లు  చిట్టచివరికి  ఒక సంబంధం వచ్చింది. అబ్బాయికి అమ్మాయి,  అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చారు . వరుడు చాల అందగాడు . ధనవంతుడు, చదువుకున్నవాడు. పెళ్లి చూపులయ్యాక   మీ అమ్మాయి నాకు నచ్చింది . నాకు   కట్నంతో పనిలేదు ఏవో  లాంఛనాలు జరిపిస్తే చాలు అని చిన్న మెలతపెట్టి  సుశీలమ్మకు మధ్యవర్తితో కబురెట్టాడు. సుశీలమ్మ ఒక ప్రక్క భయపడుతూనే వచ్చిన సంబంధం వదులుకోవడం ఇష్టం లేక సరే! అంది. కూతురికి చెప్పకుండానే  అల్లుడు పెట్టిన షరతు అంగీకరి౦చింది . కాని అబ్బాయి  ఏ౦ అడుగుతాడో! ఏం కొంప ముంచుతాడో!  అనే భయం సుశీలమ్మను ఒక ప్రక్క  పీడిస్తోనే ఉంది.  
  కాలం ఆగదుగా పెళ్లిరోజు రానే వచ్చింది . తన మంచితనం, ఇరుగుపొరుగు వారి సహాయసహకారాలతో పెళ్లి సజావుగా జరిగిపోయింది . పెళ్లి అయిన తరువాత  అలకపానుపు అనే తతంగం ఒకటుంది . వరుడు అందరి సమక్షంలో ఏదో ఒకటి  కోరుకోడం అత్తి౦టి  వారు అది  తీర్చడం రివాజు. ఒకవేళ తీర్చలేకపోతే అందరి సమక్షంలో అల్లుణ్ణి అవమాన పరచడమే అవుతుంది. వరకట్న సమస్య వేరు ఇది వేరు . కట్నం కాదనగలం కాని దీన్ని కాదనలేం .  ఎ౦దుకంటే ఇది వేడుక . తన తాహతుకి మించి ఏ౦ అడుగుతాడో తీర్చలేకపోతే అందరిలో ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కోవాలో తలుచుకు౦టే సుశీలమ్మ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి . సరే సాయంకాల వేళ నులకమంచం వేసి , దుప్పట్లు పరిచి చెరో ప్రక్క రెండు దిండ్లు అమర్చారు . వధూ వరులను కూర్చోబెట్టారు .  మ౦చం చుట్టు పెళ్లి జనం , పిల్లల కోలాహలంతో  చాల సందడిగా ఉంది .  సుశీలమ్మ భయంతో బిక్కుబిక్కు మంటూ ఒక మూల కూర్చుని ఉంది .  ఇదంతా గమనిస్తున్న వరుడు లోలోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు . అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లుగా పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అనట్లు౦ది సుశీలమ్మ పరిస్థితి . అందరి మనస్సులు ఉల్లాసభరిత౦గా  ఉంటే ఈమె మనసు ఉత్కంఠ భరితంగా ఉ౦ది.  అందరు ఆవ్యక్తి  ఏమడుగుతాడా అని ఎదురు చూస్తున్నారు . వరుడు నోరు విప్ప బోతున్నాడు . సుశీలమ్మ గుండె దడదడ లాడుతోంది . వరుడు నోరు విప్పాడు
నా కోరిక తప్పక తీరుస్తానని మా అత్తగారు ముందు గానే మాట ఇచ్చారు . ఆ ఒప్పందం మీదే ఈ పెళ్ళికి అంగీకరి౦చాను. నేను మీ అందరి సమక్షంలో ఒకటి కోరుకుంటున్నాను . మా అత్తగారు జీవితాంతం మా తోనే ఉండాలి . నాకు అన్నీ ఉన్నా అమ్మ నాన్న లేకపోవడంతో జీవితం ఇంతవరకు అసంతృప్తిగానే గడిచింది . ఆమె మా ఇంటికి వచ్చి నాకు తల్లి లేని లోటును కూడ తీరిస్తే అంతకంటే నాకు వేరే కావలసిందేదీ  లేదు .  ఆమె మాన మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది రానివ్వనని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను . ఇక ఆమె  తన కుమారుణ్ణి వదలి ఎలా రావాలా అని ఆలోచి౦చవలసిన పనికూడ లేదు. తల్లి ప్రేమకు మొహం వాచిన  నేను అతనికి తల్లి లేని లోటు రానిస్తానా ! అందువల్ల   అతనికి చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేసే  బాధ్యత కూడ నాదే మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను అని ముగించాడు.
 అందరి కళ్ళు ఆశ్చర్యంతోనూ సుశీలమ్మ ,  వరుణ్, వనజల కళ్ళు ఆనంద-ఆశ్చర్యాలతోను   చెమ్మగిల్లాయి .  సుశీలమ్మ కళ్ళు మాత్రం అంతటితో ఆగలేదు కృతజ్ఞతా సూచకంగా  ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి .        












No comments: