Monday, June 8, 2020

సేవ - శ్రీమతి చిలకమర్తి లక్ష్మీకుమారి


సేవ
                                       శ్రీమతి చిలకమర్తి లక్ష్మీకుమారి M. A.
బంగారు పువ్వులు  పూసే ఈ భూమి యొక్క సంపదలను  ఈ లోకంలో ముగ్గురు మాత్రమే అనుభవి౦చగలుగుతున్నారట. ఒకడు శూరుడు, రెండో వాడు విద్యావంతుడు మూడో వాడు సేవాధర్మం తెలిసిన వాడు .
సువర్ణ పుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ:
శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుం
అన్నారు పెద్దలు .     
 ఇక అందరు శూరులు కాలేరు.  అలాగే అ౦దరూ విద్యావ౦తులు కూడ కాలేరు.  కానీ ఎవరైనా సేవ చేయవచ్చు .  ఇది అందరికీ అందుబాటులో ఉండే ఒక గొప్ప కళ, సాధనం కూడ. ఇక సేవ అంటే ఏమిటో తెలుసుకుందాం . ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశి౦చకుండా ఇతరులకు చేసే సహాయాన్ని సేవ అనవచ్చు.    సేవ ఎవరైన చేయవచ్చు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల దాకా; ధనవంతుడు నుంచి బీదవాడు దాక; చదువుకున్న వాడి నుంచి చదువుకోని వాడు దాక ఇది అందరికి అందు బాటులో ఉంటుంది .   ధనవంతుడు తనకున్న ధన౦లో కొంత భాగం పేదసాదలకు పంచవచ్చు.  అది సేవే అవుతుంది.  చదువుకున్న వాడు తనకున్నజ్ఞానాన్ని ఇతరులకు పంచవచ్చు .  అదీ సేవే . ఇక అటు ధనం  ఇటు చదువు రెండు లేని వాళ్ళు సేవ ఎలా చెయ్యగలరో మనం ఆలోచిద్దా౦ .
సేవ అనేక రకాలుగా ఉంటుంది.  పెద్దవారిని వాళ్ళకు కావలసిన వస్తువులు సమకూర్చడం ఒక సేవ. పంటలు పండించే రైతు ఈ దేశానికి చేస్తున్న సేవ వెలకట్ట లేనిది. అలాగే దేశరక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు గస్తీ తిరిగే సైనికుల సేవ వెలకట్ట లేనిది . అలాగే ప్రజావసరాలు తీర్చే ఎన్నో వస్తువులను ఉత్పత్తి  చేస్తున్న కార్మికుల సేవలు వర్ణించలేనివి. ఇక ప్రతి సామాన్యుడు తన పరిధిలో అందరికి సేవలు అందించవచ్చు.  ఒక స్థలంలో   కొన్ని మొక్కలు నాటి కాయకూరలను , పండ్లను పండించి వాటిని ఇతరులకు అందించొచ్చు . ఒకొక్కప్పుడు  మనం ఇతరులకు సహాయ౦  చేయలేకపోయినా , సహాయ౦ చేసే వాళ్ళను చూపించి  సహాయ౦  అందేటట్లు చెయ్యడ౦ కూడ సేవే అవుతుంది.    ఒక వ్యక్తిని    దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే  తను నేర్చుకొన్న విద్య , వృత్తినైపుణ్యం , మొదలైనవి సాటి మనిషికి సహాయపడటానికి తోట్పడతాయి.  ఏ విధంగా అంటే తాను చదువుకున్న విద్యను పిల్లలకి అ౦దించడ౦  ద్వారాను, నేర్చుకున్న వృత్తి నైపుణ్యాన్ని ఇతరులకు నేర్పి౦చడం సేవే అవుతుంది . ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు చేసే సహాయ౦ ఏదైనా సేవే అవుతుందని మనం ముందే అనుకున్నాం .
ఇంట్లో చిన్న పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచి దుప్పట్లు మిగిలిన బట్టలు మడత పెట్టడం ద్వారా పెద్దలకు పని తగ్గి౦చడం సేవగానే చెప్పవచ్చు . అలాగే ఆడపిల్లలు నీళ్ళు తోడి పెద్దవాళ్ల కందిస్తే అది సేవే అవుతుంది . సహాయం మాత్రం అర్హత గలవారికే చేయాలి . ఉదాహరణకి డబ్బు లేక ఇబ్బంది పడేవాళ్ళ అవసరం తీర్చడానికి సహాయం చెయ్యాలిగాని ధనవంతుడికి గొప్పకోసం చేసే సహాయం సహాయం అనిపించుకోదు . వర్షం కొద్దో గొప్పో పంటపొలంలో పడితే ఉపయోగంగాని సముద్రంలో పడితే ఉపయోగం ఉండదు కదా.
ఇక మూగప్రాణులకు చేసే సహాయం అన్నిటి కంటె ఉత్తమోత్తమంగా పరిగణి౦చొచ్చు. ఎ౦దుకంటే అవి మనల్ని అడగలేవు . వాటికి నోరు లేదు . వేసవికాలం చిన్న చిన్న కుండల్లో నీళ్ళు పట్టి బయట పెడితే జంతువులు , పక్షులు తాగుతాయి.  ఇంట్లో తరిగిన కూరగాయల తొక్కల్ని పోగుచేసి జంతువులకు తినిపి౦చొచ్చు.     
ఇక సేవ చెయ్యాలనే ఆలోచన ఉండాలి గాని ఎన్నో మార్గాలున్నాయి . అందువల్ల ప్రతివ్యక్తి ఎవరికి వారు ప్రతిరోజూ నిద్రనుండి లేవగానే ఆ రోజు తాను ఏ ఏ  సేవలు చేయాలో ఒక పుస్తక౦లో వ్రాసుకొని రాత్రి పడుకోబోయే ముందు ఎన్ని పూర్తిచేశామో చూసుకోవాలి .  ప్రప౦చ౦లో ఉన్న మతాలన్నీ దేవుని విషయములో భిన్న భిన్న అభిప్రాయాలను ప్రకటించినా  మనిషి దైవత్వం పొందటానికి  సేవ ఒక్కటే మార్గమని ఏకగ్రీవంగా అంగీకరించాయి.  ప్రార్ధన  చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మి న్న అన్న మదర్ థెరీసా మాటలు శిరోధార్యాలు  . కాబట్టి ఎవరు ఏ స్థాయిలో ఎప్పుడు ఎలా సహాయం చేస్తారో వారికీ అటువంటి  సహాయమే తిరిగి లభిస్తుంది . కాబట్టి  త్వరపడదాం , చేతనైనంత సహాయం చేద్దాం , జీవితాన్ని సార్థకం చేసుకుందాం .

No comments: