Saturday, June 13, 2020

The views of Vemana on the importance of guru.


The views of Vemana on the importance of guru
వేమన అభిప్రాయంలో గురువు యొక్క ప్రాముఖ్యం

Smt . Ch Lakshmi Kumari. M.A.        

మానవజీవితంలో సాధించవలసిన ధర్మం , అర్ధం, కామం, మోక్షం, అనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం చాల ముఖ్యమై౦ది . మనిషి తన యొక్క నిజస్వరూపమైన ఆత్మను  తెలుసుకోవడమే మోక్షం.  ఆ మోక్షానికి గురువు ఎంతో  అవసరం .  అందుకే ఉపనిషత్తులు  ఆత్మజ్ఞాన౦  కోస౦, గురువునే ఆశ్రయించాలని చెప్పడం మనం గమనిస్తా౦ . అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటో ముందుగా తెలుసుకుందాం.   గు అంటే  అజ్ఞాన౦  రు అ౦టే  పోగొట్టేవాడు.  గురువు, మనలో దాగిన అజ్ఞానాన్ని రూపుమాపడం ద్వారా  యదార్ధస్వరూప౦ తెలుసుకోడానికి దోహదం చేస్తున్నాడు . ఈ విషయాన్ని వేమన ఎంత  చక్కగా వివరిస్తున్నాడో  గమనిద్దాం.
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు ,
ఆత్మ కలుష పంక మడుగుబట్టు
తేరి నిలిచెనేని  దివ్యామృత౦బురా    
విశ్వదాభిరామ వినుర వేమ
నీరు బురదతో ఉన్నప్పుడు ఆ బురద పోవటానికి ఇ౦డుపుగింజ (చిల్లగింజ )నీళ్లల్లో అరగతీసి ఆ గుజ్జును బురదనీళ్లల్లో కలిపినపుడు బురద క్రిందకు చేరి, స్వచ్ఛమైన నీరు పైకి  తేరుతుంది . అదే విధంగా గురువు జ్ఞానాన్ని భోధించగానే అజ్ఞాన౦  తొలగి పోతుంది.  ఆత్మనిర్మల౦గా ప్రకాశిస్తుంది .

సాధారణంగా ఏ విద్యైనా మనం గురువు వద్ద నేర్చు కోవాలి. ఒక విద్యను మనం స్వయంగా నేర్చుకోడానికి గురువు వద్ద నేర్చుకోడానికి చాల తేడా ఉంది. గురువు ఆ విద్యలోని అన్ని మర్మాలు చక్కగా తెలియచేస్తాడు అంటారు వేమన .
ఛాత్ర ధర్మమెఱిగి చక్కని భక్తితో
  గురుని సేవ జేయ గుదిరినపుడె
సర్వమర్మములును జక్కగా విడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ
దైవ౦  కంటే  గురువే ఒక మెట్టు పైన ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే గురువు ప్రత్యక్ష దైవ౦.  గురువు దైవాన్ని చూపించ గలడు. దైవ౦ గురువుని చూపి౦చలేకపోవచ్చు.  అ౦దువల్ల ప్రతి శిష్యుడు తన శిష్యధర్మాన్ని అవల౦భిస్తూ గురువును ధ్యానించి ఆయన సమీపంలో  ఉంటూ ఆయన మాటలు వింటూ  ఆయన్ని సంతృప్తి పరిస్తే గురువు అనుగ్రహ౦ వలన అన్ని బంధాలు విడిపోయి ఆత్మ స్వరూపుడు అవుతాడని వేమన గారు చెబుతున్నారు.
తనివిదీఱ గురుని ధ్యానించి మదిలోన
దనువు మఱచి గురుని దాకినపుడె
తనరుచుండు బ్రహ్మతత్త్వ మ౦దురు దాని
విశ్వదాభి రామ వినుర వేమ.
గురుభక్తి ఎలా ఉండాలో వేమన సూచన ప్రాయంగా చెబుతున్నారు. శిష్యుడు తనను తాను మరచి పోయి ఎల్లప్పుడు  గురువునే ధ్యాన౦ చెయ్యాలట .  ఆ తరువాత గురువు పాదపద్మాలను   భక్తితో తాకినపుడే  ఆ గురువు యొక్క అనుగ్రహ౦ వల్ల శిష్యుడు  బహ్మతత్వాన్ని తెలుసుకో గలుగుతాడు.
సంస్కృత౦లో   శిష్యుణ్ణి అంతేవాసి అంటారు.  అంటే సమీపంలో నివసించే వాడని అర్థం . అందువల్ల శిష్యుడు ఎల్లప్పుడు మానసికంగాను శారీరకంగాను గురువునే అంటిపెట్టు కొని ఉండాలి.
పాలగలియు  నీరు పాలెయై రాజిల్లు
నట్లు గురుని వలన కోవిదుడగు
సాధు సజ్జనముల సంగతులిట్లురా
విశ్వదాభిరామ వినుర వేమ .
పాలు వేఱు   నీరు వేఱు  , కానీ నీళ్ళు పాలల్లో కలిస్తే తన ఉనికిని  కోల్పోయి పాలుగానే కనిపిస్తాయి . అదే విధంగా గురువు వేరు శిష్యుడు వేరు. కానీ శిష్యుడు గురువుచెంత చేరగానే గురువుతో సమానమై పోతాడు. అందువలన ప్రతి వ్యక్తి గురువుని చేరుకొని గొప్ప తనాన్ని పొందాలని వేమన అభి ప్రాయం.

శిష్యునికి  వినయం ఎంతో అవసర౦ .గురువు సమీపించి నపుడు వినయంతో లేచి నిలబడాలి . సర్వకాల సర్వావస్థలలోను శిష్యుడు  వినయంతోనే ఉండాలి . ఎట్టిపరిస్ధి తుల లోను అహ౦  ప్రదర్శించ కూడదు .
గురువు వచ్చుచున్న గూర్చుండి లేవని
తు౦టరులకు నెట్లు దొరకు ముక్తి
మగని లెక్కగొనని ముగుదకాగతి పట్టు
విశ్వదాభిరామ వినుర వేమ   
గురువు గురువే శిష్యుడు  శిష్యుడే . ఇద్దరూ ఎప్పుడు ఒకటి కారు.  అలాగే మగనిని లెక్కచేయని భార్యకు కూడ దుర్గతి  కలుగుతుందని వేమన ఈపద్యం ద్వారా మనకు  తెలియజేస్తున్నారు.
బ్రహ్మ సృష్టి చేసి ఆత్మను ఎక్కడదాయాలా అని తికమకపడుతున్నాడు . అప్పుడు ఆయనతో సరస్వతి అంది . స్వామీ! మనిషి చాల తెలివైనవాడు .ఎక్కడదాచినా వెతుక్కునే సామర్థ్యం అతని కుంది . అందువల్ల అతనిలోనే దాచేస్తే వెతుక్కోలేడు . మీరాపని చెయ్యండి అందిట . అందువల్ల బ్రహ్మ ఆత్మను మనలోనే దాచి ఉంచాడని చిన్నప్పుడు ఎవరో చెబుతుండగా విన్నాను. ఇక ప్రస్తుత విషయానికొస్తే మనిషి తనలో దాగి యుండే భగవ౦తుని తెలు సుకోకుండా అజ్ఞాన౦తో దేవుని కోసం చుట్టు  ప్రక్కల వెతుకుతూ ఉంటాడు. అతని అజ్ఞాన౦ గురువు ఒక్కడే తొలగి౦చ  గలడ౦టాడు వేమన.

తిత్తి లోని శివుని స్థిరముగా దెలియక
తిక్కపట్టి నరుడు తిరుగుచు౦డు
దిక్క దెల్ప గురుడి కొక్కడెదిక్కురా
విశ్వదాభి రామ వినురవేమ .
గురువు ఉపదేశించే విద్య ఈ జీవిత౦ అనే మార్గానికి దారి చూపించే  రాచబాట అందు వలన మోక్షమార్గ మునకు గురూపదేశ మే సరియైన విధానము
నిజగురూపదేశ నిశ్చయాత్మకవిద్య
రక్షక భటండ్రు రాజవీధి
మధ్యమార్గ మందుమాన్యత జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.
మనకు వాక్కులో గురువు దాగి యున్నాడు . వక్తృతలో (మాటలలో) గురువున్నాడు. చీకటికి ఆవల గురువున్నాడు . అంతేగాక అఖిలమునకు గురువు ఆధారంగా ఉన్నాడని వేమన గురువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని ప్రతిపాదించారు .
వాక్కు నందు గురువు వక్తృతనుగురువు
 చీకటినటు గురుడు చిక్కి యుండు
అఖిలమునకు  గురువె యాధారమై యుండు
విశ్వదాభి రామ వినువేమ.                    

ఆత్మపదార్ధం మనలోనే ఉన్నా అది తెలుసుకోడానికి గురువు సహాయం అవసరం . బీరువా మనదే అయినా బంగారం మనదే అయినా తాళం ఉ౦టే గాని బీరువా తెరవలేం. ఆ తాళం గురువు వద్ద ఉంటుంది . అందుకే హరిహర బ్రహ్మాదులకు కూడ గురువు అవసరం అంటారు వేమన .
గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో
అజునికైన వాని యబ్బకైన
తాళపుచెవి లేక తలుపెట్టులూడును?
విశ్వదాభిరామ వినురవేమ .
వేమన గురువు యొక్క గొప్పదనం గురించి ఇంకా ఎన్నో విషయాలు వివరించారు .   అవన్నీ నేను ప్రస్తావి౦చడం లేదు .
  కాబట్టి విజ్ఞులైనవారు ఉత్తమగురువునందే భగవంతుని దర్శించి , ఆశ్రయి౦చి, సేవిస్తే  ఉత్తమగతులు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు .        

No comments: