Thursday, October 1, 2020

శ్రీ చంద్రం గారి ‘మహాత్మ శతకం’ (ఒక సమీక్ష)

 

శ్రీ చంద్రం గారి ‘మహాత్మ శతకం’

(ఒక సమీక్ష)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

        యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన:

       స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

అని గీతావచనం . దానర్థం ఏ౦టంటే లోకంలో శ్రేష్ఠుడైన మానవుడు ఏ విధంగా ఆచరిస్తాడో , ఇతరులు కూడ అదే విధంగా ఆచరిస్తారు. అతడు ఆచరణాత్మకంగా ఏది ప్రమాణంగా నిరూపిస్తాడో దాన్ని లోకం అంతా అనుసరిస్తు౦ది . ఈ ప్రపంచంలో  అటువంటి వారు చాల అరుదుగా ఉంటారు . అట్టి అరుదైన వారిలో మహాత్మా గాంధీ ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అందుకే కాబోలు  విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త Albert Einstein మహాశయుడు గాంధీ మహాత్ముని ప్రశంశిస్తూ 'Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth అన్నారు.

ఇక అటువంటి నమ్మలేని, నమ్మశక్యంకాని మహితాత్ముడైన  మహాత్మునిపై ‘ మహాత్మ శతకం అనే పేరుతో  శ్రీచంద్రం గారు ఒక శతకాన్ని రచించారు . శ్రీ చంద్రం గారు కళలకు కాణాచి యైన గుడివాడ పట్టణ నివాసి. ఈయన శతాధిక శతక కర్త . ఈయన  పేరు ఇప్పటికే శతకానికి పర్యాయపదం అయిపోయింది .  ఎ౦దుకంటే ఆయన సమకాలీన సమాజాన్ని ఎన్నో కోణాల్లో పరిశీలించి ఒక్కొక్క విషయాన్ని విశ్లేషిస్తూ సుమారు వందకు పైగా  శతకాలు రచించారు. శతకం అని పేరుపెట్టినా పద్యాలు శతాధికంగానే ఉంటాయి. రెండు మూడొ౦దల పద్యాలతో ద్విశతులు, త్రిశతులు కూడ ఉన్నాయి . ఈ విధంగా అక్షర లక్షలు ఆయన గ్రంథాలు.  సమాజం అక్షరాలక్షలిచ్చినా ఆయన  ఋణం తీర్చు కోలేదు. ఇక ఈయన శతకాలు చాల విలక్షణంగా ఉంటాయి.

కుర్చీ శతకం , సైకిల్ శతకం , టి.వి శతకం మొదలైనవి కొన్నైతే , క్రైస్తవసూక్తి శతకం , మహమ్మదీయసూక్తి శతకం , బౌద్ధసూక్తి శతకం , గీతాసూక్తి శతకం మొదలైన ధార్మిక పరమైనవి మరికొన్ని. అలాగే షేక్స్పియర్ శతకం మొదలైన కవిపరమైన శతకాలు కొన్నైతే    గుడివాడ శతకం మొదలైన ఊళ్లపేరులతో కూడినవి మరికొన్ని  

  ఇంగ్లీషు శతకం మొ|| భాషాపరమైన శతకాలు మరి కొన్ని. ఈ విధంగా  శతక సాహిత్యంలో ఇంత వైవిధ్యం ప్రదర్శించిన వారు చాల అరుదుగా కనిపిస్తారు. నాకు తెలిసినంతలో వీరు తప్ప మరొకరు లేరేమో .  ఈ విధంగా శతాధికా౦శాలపై శతాధిక శతకాలను రచించిన ఈ గొప్ప రచయిత గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించాలని నా ఆకాంక్ష .

ఈయన శతకానికే పేరు పెట్టినా ఆ విషయాన్ని సాధ్యమైనంత  సమగ్రంగా చర్చించడం ఒక ప్రత్యేకత. ఉదాహరణకి షేక్స్పియర్ , శతకంలో కేవలం ఆ మహాకవిని పొగడడమే కాకుండా ఆయన వెలువరించిన సూక్తులను పొందు పరచి పాఠకుల కంది౦చారు . ఈ విధంగా మత సామరస్యానికి , భావ సామరస్యానికి , భాషా సామరస్యానికి, సంస్కృతీసామరస్యానికి వీరి రచనలు పేరు పొందాయి . వీరి రచనలు చాల వరకు జాను తెనుగులో ఉండడం వల్ల వీరికి మాతృభాష పట్ల మక్కువ ఎంత మిక్కుటమైనదో ఎక్కువగా నొక్కి వక్కాణింపనక్కర లేదు. ఛందస్సు మాటకొస్తే   ఈయన శతకాలు చాల వరకు దేశి చందస్సులోనే ఉంటాయి. ముఖ్యంగా ఆటవెలదిలో ఈయన చేయితిరిగిన చతురులు . ఆటవెలది ఒక ఆటవెలదిలా ఈయన కనుసన్నల్లో మెలగుతూ ఎలా చెబితే అలా వింటుంది. ఇక వీరి శతకాలు  చాలమంది పరిశోధకులకు Ph.D డిగ్రీని తెచ్చి పెట్టాయంటే వాటి శక్తి ఎంత గొప్పదో ఊహి౦చవచ్చు. వీరి  రచనలు వాసిలోనే కాక  రాశిలోకూడ గొప్పవే . ఇక ఈయన ఇటీవల రచించిన ‘మహాత్మశతకం’ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో 116 పద్యాలున్నాయి .    వందనము మహాత్మ అ౦దుకొనుము అనేది మకుటం.  ఈ శతకం మనం పూర్తిగా చదివితే ఆ మహాత్మునికి నూట పదహారు పర్యాయాలు నమస్కారం చేసిన వాళ్ళం ఔతాం.       

   ఇక ‘ఉత్తమశ్లోకస్యచరితముదాహరణమర్హతి’ అని ప్రాచీనుల సూక్తి. అటువంటి ఉత్తమశ్లోకుడు , విశ్వనరుడునగు మహాత్ముని మహనీయతను వర్ణించిన ఈ శతకం చాల గొప్పదని నా అభిప్రాయం.  మహాత్ముని మాతృఋణం తీర్చుకున్న మహనీయునిగా కీర్తించారు.

“పుట్టినావు నీవు పోరుబందరు నందు

భారతంబ పుణ్య ఫలమవగుచు

తీర్చు కొంటి వయ్య దేశ మాతృ ఋణము

వందనము మహాత్మ అ౦దుకొనుము”

మహాత్ముని చరిత్రను రచించిన పూర్వ రచయితలైన వేలూరి శివరామ శాస్త్రిగారిని,

తెలుగులెంక తుమ్మలవారిని వీరు ప్రశంసించడం ముదావహం .

 “స్వాతంత్ర్యమ్మునకై తెగించి తన సర్వస్వమ్ము గోల్పోవునే పూతాత్ముండతడొక్కడే త్రిభువనీ పుజ్యు౦డు” అంటారు ఎక్కడో ఎదో సందర్భంలో శ్రీ యేటుకూరి వేంకట నరసయ్య గారు . ఆ విధంగా దేశస్వాతంత్ర్యానికి తన సర్వస్వం ధారపోసిన ఎంతో మంది మహనీయుల్లో ఒక్కరవ్వడమే కాకుండ అందరికీ మార్గదర్శియైన మహాత్ముని స్తుతించడం ఎవరికీ సాధ్యం కాదు . ఎంత ఎక్కువ చెప్పినా అది చాల తక్కువే అవుతుంది  . కొండంత చెప్పినా అది గోరంతే ఔతుంది .    

కలరు దేశభక్తి కలవారు బహుసంఖ్య

నాడు,స్ఫూర్తి నిచ్చి నావు నీవు

స్ఫూర్తి నిచ్చు వారు కీర్తనీయులు గదా

వందనమ్ము మహాత్మ అ౦దుకొనుము

గుడివాడను మహాత్ముడడుగు పెట్టిన మహానగరంగా వర్ణించి ప్రశంసించడం ముదావహం.

గాంధీ మహాత్ముని సాక్షాత్తు భగవంతునిగా వర్ణించిన ఈ పద్యం చాల హృద్యం.

దాస్యస్యశృంఖలాలు తప్పించి  దేశవా

సులకు స్వేచ్ఛ నొసగ గలిగి నావు

 కాన అతిశయోక్తి కాదు దేవుడవన్న

వందనము మహాత్మ అ౦దుకొనుము.

ఈ విధంగా కవి చంద్రులు , కవితా చంద్రులైన శ్రీ చంద్రం గారు గాంధీజీని విశ్వమానవుని గాను, కారణజన్ముని గాను, జాతిపిత గాను, కర్మయోగి గాను, దేహాకృతిదాల్చిన దేశభక్తి గాను, ప్రత్యక్ష దైవం గాను, అర్థదిగంబరేశ్వరుడు గాను, యుగకర్త గాను, విఖ్యాతజననేత గాను, అజేయుని గాను, ధీరుని గాను వర్ణించారు .నేటి సమాజం మహాత్ముని మార్గాన్ని విడిచి పెట్టి పెడత్రోవ పట్టడ౦ పట్ల తన బాధను కవి ఇంచుమించు  ప్రతిపద్యంలోను వ్యక్తం చేశారు .

ఈ రచయిత మహనీయమైన మహాత్ముని సూక్తులను శతకంతో బాటుగా  పొందుపరచి మనకందించారు. అవి సుమారు ముప్పదివరకు  ఉన్నాయి. పాఠకులు శతకంతో పాటు రోజుకో సూక్తిని చదివి ఆచరించడానికి ప్రయత్నిస్తే అది మహాత్మునకు  అసలైన నివాళి అవుతుంది.

‘కష్టపడి పని చెయ్యని వ్యక్తికి తిండి తినే హక్కులేదు’ భయం వల్ల  ఉపయోగం ఉంది గాని , పిరికి తనం  వల్ల  కాదు’ , ‘ సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడి పిస్తుంది’ ,  ‘ సహాయం చేస్తే మరిచిపో , సహాయం పొందితే గుర్తుంచుకో’ , ‘మితిమీరిన ఓర్పు పిరికి తనం ఔతుంది’ ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకు౦టావో దానికి నువ్వే నాంది పలకాలి ’  ‘ ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు గాని కోరికలను తీర్చ లేదు ‘ మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్ద లేని విద్య విలువ లేనిది , ‘ విధి నిర్వహణకు మించిన దేశసేవ లేదు’ , ఎక్కువ తక్కువలు కులమత భేదాలు ఉండటం మానవ జాతికి అవమానకరం, వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి  తన సర్వస్వాన్నీ కోల్పోయినట్లే ‘, ‘  చెడుకు సహాయనిరాకరణ చెయ్యడం ప్రతిమనిషి పవిత్ర కర్తవ్య౦ ‘ , ‘ గెలవక పోవడం ఓటమి కాదు మరల ప్రయత్నించక పోవడమే అసలైన ఓటమి మొదలైన సూక్తులు సార్వదేశికాలు , సార్వకాలికాలైన సత్యాలు. శ్రీ చంద్రంగారు మరెంతో మంది మహనీయులను శతకాల్లో బంధించాలని కోరుతూ , వీరి శతకాలు ఆంధ్రసాహిత్యానికి , అందులోనూ శతక సాహిత్యానికి తుష్టిని, పుష్టిని చేకూర్చాలని ఆశిస్తూ......

దుర్గాప్రసాద రావు చిలకమర్తి .

 

 

 

 

 

No comments: