Friday, October 9, 2020

बालस्तात्क्रीडासक्त:

 

बालस्तात्क्रीडासक्त:

(బాలస్తావత్క్రీడాసక్త:)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

బాలస్తావత్క్రీడాసక్త: తరుణస్తావత్తరుణీ సక్త:

వృద్ధస్తావచ్చింతా మగ్న: పరమే బ్రాహ్మణి కోsపి న మగ్న: 

మనిషికి బాల్యంలో ఆటలపట్ల ఆసక్తి. వయసొచ్చాక  స్త్రీలపట్ల ఆసక్తి. వయస్సుడిగిపోయాక   విచారం. కాని పరమాత్మను ఏనాడు స్మరి౦చడంలేదని ఆ మాటల్లోని తాత్పర్యం . సరే ! ఆసమయం సందర్భం వేరు . ఆవిషయాన్ని అలా ఉంచుదాం . ప్రస్తుతం మనం తీసుకోవలసిన అంశం ఏ0టంటే మనిషి చిన్నతనంలో ఆటల పట్ల ఆసక్తి కలిగి ఉ౦టాడనేదే. నిజమే ఆటలు వారికి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలగ చేస్తాయి.  ఇది బాగా తెలిసిన వారు కావడంవల్లనేమో పాశ్చాత్యదేశాలు పాఠ్య ప్రణాళికలో ఆటలకు సముచితస్థానం కల్పించడం మనం గమనిస్తాం . ముఖ్యంగా ప్రైమరీపాఠశాలల్లో పాఠాలకన్నా ఆటలకే ప్రాముఖ్యం మిన్న . నేను చికాగో , లండన్ , దుబాయ్ నగరాల్లో  చాల నెలలపాటు ఉండే అవకాశం దొరికింది . నాకు దేవాలయాలు పాఠశాలలే కావడం వల్ల అవకాశమున్నప్పుడల్లా  అక్కడకు వెళ్ళడం జరుగుతో ఉండేది . నేను గమని౦చిందేమిటంటే వారు పాఠాలకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో ఆటలకు కూడ అంతే ప్రాముఖ్యం ఇస్తున్నారు . ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొన్నిచోట్ల పాఠాలకంటే  ఆటలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం కనిపిస్తోంది . మొదటి కాలాంశ౦ (పీరియడ్) ఆటలతోనే మొదలౌతుంది . ఒక ఆంగ్లకవి చెప్పినట్లు

Boys of spirit, Boys of will

Boys of muscles brain and power

Fit to cope with any thing

These are wanted every hour.          

శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నావాళ్లే మనకు కావాలి గాని ఎంత చదువుకున్నా శరీరం, మనస్సు  దృఢంగా లేకపోతే సమాజానికి ఆట్టే ఉపయోగం లేదు . ‘A sound mind in a sound body’ అనే సంగతి అందరికీ తెలిసిందే . అంతేకాక సమయోచితమైన ఆలోచనలకు , సమయోచితమైన నిర్ణయాలకు క్రీడాకారులు  పెట్టింది పేరు . అంతేకాకుండా జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు వస్తాయి వాటిని తట్టుకుని నిలబడాలంటే క్రీడాస్ఫుర్తి చాల అవసరం .  మన దేశంలో ఆటలకు ఇవ్వవలసినంత ప్రాముఖ్యం ఇవ్వడంలేదు సరికదా ! నిరుత్సాహపరచడం కూడ జరుగుతోంది . ఆటా లేదు గీటా లేదు, ఆటలాడేవంటే తాట తీస్తాను, పోయి చదువుకో అనే తల్లి దండ్రులిప్పటికీ చాల మంది ఉన్నారు .     సరైన క్రీడా స్థలాలు లేని ఎన్నో ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలిప్పటికీ మన దేశంలో ఉన్నాయి . ఒక వేళ క్రీడాస్థలాలున్నా  ఆటలాడించడానికి అధ్యాపకులు లు౦డరు. ఒక వేళ ఉన్నా ఒక్కరే ఉంటారు .ఇతర దేశాల్లో అలా కాదు. ఉదాహరణకి  నేను లండన్ లో కొన్నాళ్ళు ఉన్నప్పుడు మేం ఉన్న ఇంటి చుట్టూ మూడు స్కూళ్లుండేవి పిల్లలు నిర్దేశించిన సమయాల్లో ఆడుకునే వారు . ముగ్గురేసి అధ్యాపకులు౦డి పిల్లల్ని ఆడించేవారు .

మన జాతిపిత మహాత్మా గాంధీ నేను నాజీవితంలో రెండు తప్పులు చేశాను . ఒకటి ఆటలపట్ల ఆసక్తి కనపరచకపోవడం రెండు సంస్కృతం నేర్చుకోకపోవడం . ఈ కారణాల వల్ల చాల నష్టపోయాను అని  ఒక సందర్భంలో అన్నారు.  కాబట్టి ప్రతి వ్యక్తి ఆటల యొక్క ప్రాముఖ్యం అందరికి వివరించి పిల్లల శారీరక , మానసిక , బౌద్ధిక ,ఆధ్యాత్మిక రూపమైన సమగ్రాభి వృద్ధికి దోహదం చెయ్యాలని రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు మరింత దోహదం చేసి యువత సమగ్రాభివృద్ధికి బంగారు బాటలు వేయ్యాలని ఆశిద్దాం .             

 

 

No comments: