Tuesday, July 17, 2012

తలుపు తీసేది లేదు పో


తలుపు తీసేది లేదు పో!

Dr.chilakamarthi Durgaprasada Rao
చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
09897959425
శివుడు బోళాశంకరుడు. ఎవరు ప్రార్థించినా పొంగిపోతాడు. ఎవరేమి కోరినా లొంగిపోతాడు. ఒకసారి ముసలి ఎద్దు మీద కూర్చుని భక్తుల కోరికలు తీరుస్తూ ఇంటికి చేరే సమయాన్ని కూడ మర్చిపోయాడు. ఆయన ఇల్లాలైన పార్వతి తన భర్త ఎప్పుడొస్తాడా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది . ఎంతసేపైన రాకపోయేటప్పడికి విసిగి వేసారి పోయింది. ఒకవేళ వచ్చినా తలుపు తీయకూడదని ఒక నిర్ణయానికొచ్చేసింది. ఇంచుమించు అర్థ రాత్రి కావొచ్చింది. అంతలో ఆమెకు కునుకు పట్టింది. ఆయనగారు అప్పుడే ఇల్లు చేరాడు. కాలింగ్ బెల్ లేకపోవడం వల్ల తలుపు దబదబా బాదవలసి వచ్చింది . ఇప్పుడు ఆమెకు నిద్ర కూడ చెడింది. అసలే కోపంతో ఉందేమో..
ఎవరివయ్యా నువ్వు? అంది తలుపు తీయకుండానే లోపలనుంచి. ఆయన 'శూలీ' అన్నాడు. శూలం కలవాణ్ణి (శివుణ్ణి)అన్నాడు. ధనంకలవాణ్ణి ధనీ అన్నట్లే శూలరోగం(డొక్కలో పోటు) కలవాణ్ణి కూడ 'శూలీ' అనొచ్చు. పార్వతి ఆ అర్థం తీసింది. అటైతే వైద్యుడి దగ్గరకెళ్లవయ్యా! ఇక్కడికెందుకొచ్చావు? అంది.
వెంటనే శివుడు ఆమెతో 'నీలకంఠ ప్రియేహం' అన్నాడు. ఓ ప్రియురాలా! నేను నీలకంఠుణ్ణి (శివుణ్ణి) గుర్తుపట్టలేదా! అన్నాడు. 'నీలకంఠ' అనే పదానికి నెమలి అనే అర్థం కూడ ఉంది. అటైతే ఒకకేక వెయ్యమంది. నెమలి కూతను 'కేక' అని కూడా పిలుస్తారు. అందుకే నెమలిని 'కేకి' అంటాం.
ఆమె నిద్రలో ఉండడం వల్ల తనని గుర్తు పట్టలేకపోతోందనుకున్నాడు అమాయకచక్రవర్తి. ఈసారి 'పశుపతి:' అన్నాడు. నేనే పశుపతిని (శివుణ్ణి) గుర్తుపట్టలేదా!అన్నాదు. ఆమె 'పశుపతి' పదానికి ఎద్దు అనేఅర్థం తీసింది. పశువుల్లో మగది అంటే ఎద్దే అవుతుంది కదా! వెంటనే ''నువ్వు పశుపతివైతే కొమ్ములేవీ ఎక్కడ కనిపించడం లేదే'' అంది. శివుడికి మతిపోయినంతపనయింది. కాని ఏంచేస్తాడు. ఎలాగైనా తనని గుర్తు పట్టేలా చేసుకోవాలి . ఓఅమాయకురాలా! నన్ను గుర్తు పట్టలేదా! నేను స్థాణువుని (శివుణ్ణి) అన్నాడు.'స్థాణు:' అంటే శివుడని అర్థం. ఆయన దురదృష్టమో లేక ఆమె అదృష్టమో తెలియదు గాని 'స్థాణు:' అంటే 'చెట్టు' అనే అర్థం కూడ ఉంది. వెంటనే ఆమె "చెట్టు మాట్లాడదు కదా నువ్వు మాట్లాడు తున్నావు స్థాణువునంటావేమిటి”? అంది.
శివుడికి తలతిరిగిపోయింది. ఎలా సమాధానంచెప్పాలో తెలియలేదు. చాలసేపు ఆలోచించాడు. చివరికి 'జీవితేశ: శివాయా:' అన్నాడు. 'శివా 'అంటే పార్వతి . జీవితేశ: అంటే భర్త. నేనే పార్వతీపతిని (నీమొగుణ్ణి) ఆనమాలు కట్టలేదా అన్నాడు. ఈ సారి ఆమె తప్పక గుర్తు పడుతుందనుకున్నాడు. కాని ఈసారి కూడ నిరాశే ఎదురయింది. శివా అంటే ఆడు నక్క అనే అర్థం కూడ ఉంది . అది పార్వతికి లాభించింది. '' ఓహో! అలాగా! నువ్వు మగనక్కవన్నమాట. అటైతే అడవుల్లోకి పోయి నీ జంటను వెతుక్కో ఇక్కడకెందుకు రావడం'' ? అంది.
ఆయన ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఓటమినంగీకరించి తలొంచుకున్నాడు. ఆమె కరుణాంతరంగిణి, కరుణాతరంగిణి కదా! తలుపు తీసే ఉంటుందని ఊహిద్దాం.
ఇంత రసవత్తరమైన సంభాషణను తనలో పొందుపరచుకున్న ఈ శ్లోకం చూడండి.
కస్త్వం? శూలీ మృగయ భిషజం నీలకంఠ: ప్రియేహం
కేకామేకాంకురు పశుపతి:నైవదృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే న వదతి తరుర్జీవితేశ: శివాయా:
గచ్ఛాటవ్యామితి హతవచ: పాతున: చంద్రచూడ:


No comments: