Thursday, July 26, 2012

అభినందన

-->
అభినందనమందారమాల

Dr. Chilakamarthi Durga prasadaRao
Bhashapraveena, Vedanta Vidyapraveena,
M.A. ( Sanskrit), M.A.(Telugu), M.A. (Philosophy)
Ph.D. ( Sanskrit)
Dayalbagh, AGRA-282005,
09897959425
"ఉదయంతు శతాదిత్యా :ఉదయంత్విందవశ్శతం
న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:”
వందలకొలదీ సూర్యులు ఉదయించవచ్చు . అలాగే వందలకొలదీ చంద్రులు ఉదయించవచ్చు. కాని మనిషిలోనున్న అజ్ఞానమనే చీకటి కవి వాక్కు వల్ల మాత్రమే నశిస్తుంది. కవి కలానికి అటువంటి మహత్తరమైన శక్తి ఉంది. ఎందుకంటే ఒక్క సిరాచుక్క కొన్ని లక్షల మందిని ఆలోచించేలా చేస్తుంది. ఆంగ్లమహాకవి బైరన్ మాటల్లో చెప్పాలంటే..
But words are things ; and a small drop of ink
Falling, like dew upon a thought, produces
That which makes thousands, perhaps millions think.
(Byron-Don Juan, canto III, st.88)
ఆ శక్తి శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి కలంలో కావలసినంత ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన రచించిన 'హరివిల్లు' ఆమూలాగ్రం చదివాను. ఈ కావ్యానికి 'హరివిల్లు' అని పేరు పెట్టడం ఎంతో ముదావహం. ఇంద్ర ధనుస్సులో నున్న రామణీయకం, వైవిధ్యం , నైశిత్యం అనే మూడు గుణాలు ఈయన కవితల్లో దర్శనమిస్తున్నాయి. ప్రతి పద్యం ఉక్తి వైచిత్రితో ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని సంతరించుకుంది. కవి ఎన్నో సామాజిక అంశాలమీద తన దృష్టిని సారించడం వల్ల వైవిధ్యం గోచరిస్తోంది. కవి ప్రతి సామాజిక దురాచారాన్ని తీవ్రంగా ఖండించడం వల్ల నైశిత్యం కనిపిస్తోంది. ప్రతి ఖండికలోను ప్రతి పద్యంలోను ప్రతిపాదంలోను నేడు సమాజంలో దిగజారుతున్న విలువలపట్ల ఆయన పొందిన మనస్తాపం ప్రతిబింబిస్తోంది సూచించిన పరిష్కార ముద్రల వల్ల కావ్య ప్రయోజనం కూడ నెరవేరినట్లే..
మతం మనోగతం అనే ఖండికలో మతం కంటే ధర్మమే గొప్పదన్న విషయాన్ని వివరిస్తూ మతమౌఢ్యాన్ని దుయ్యబట్టేరు.సద్గతులకు బాటవైచుకొని ధార్మిక బుద్ధిని పాదుకొల్పమని హితంచెప్పడం ఆయన ధర్మతత్పరతకు ఒక ఉదాహరణ. వేంకటేశ్వరా అనే మకుటంతో వ్రాసిన పద్యాలలో సామాజిక దృక్పథం దర్శనమిస్తోంది
ఇక ఈ కావ్యంలో నాకు బాగ నచ్చిన ఖండిక వినరా విస్సన్న. నేటి సమాజంలోని వింతపోకడ లను చాల సున్నితంగా ధ్వనిప్రధానంగా దుయ్యబట్టడం ఇందులో కన్పిస్తోంది.
పొగ-సెగ అనే ఖండికలో కందపద్యాలన్నీ చాల అందంగా ఒదిగాయి. ఇంచుమించు ప్రతిపద్యంలోను దిగజారుతున్న విలువలపట్ల ఆయన పొందిన ఆవేదన తొంగిచూస్తోంది. కొన్ని పద్యాల్లో పరిష్కారం కనిపిస్తోంది . మరికొన్ని పద్యాల్లో అది సమాజానికే వదిలేసినట్లుగా అనిపిస్తోంది. ఈ గ్రంథం లో ఒకటి రెండు యతి దోషాలు, ముద్రణ దోషాలు కన్పిస్తునాయి.
.'నడచుచునుండు వారి చరణంబులకే కద రాళ్ల తాకుడుల్ ' అన్నట్లుగా వ్రాసే వాళ్లకే అప్పుడప్పుడు తప్పులొస్తాయి. వ్రాయని వాళ్లకేమీ రావు. కాబట్టి వాటిని పట్టించుకోనక్కరలేదు
మొత్తం మీద ప్రజాకవిగా ఈ చిలకమర్తి, కళాప్రపూర్ణుడైన ఆ చిలకమర్తి వారికి వారసుడనడంలో ఎటువంటి సందేహం లేదు. సమాజాన్ని మెరుగు పరిచేధోరణిలో వీరి కలంనుండి మరెన్నో కావ్యాలు వెలుడాలని ఆకాంక్షిస్తూ, నేను మిడి మిడి జ్ఞానంతో వ్రాసిన దాంట్లో ఏవైన తప్పులుంటే మన్నించమని కోరుతూ ...
దుర్గాప్రసాదరావు.

No comments: