Saturday, July 21, 2012

పెళ్లంటే నూరేళ్ల వంట


పెళ్లంటే నూఱేళ్ల వంట
(మగవారికి మాత్రమే)
Dr.Chilakamarthi Durgaprasada Rao,
3/106, Premnagar,
Dayalbagh, AGRA-5
పెళ్లంటే కొంతమందికి నూఱేళ్ల పంట. మరి కొంతమందికి నూఱేళ్ల వంట . ఇంకా కొంతమందికి నూఱేళ్ల పెంట. ఒకాయన తన స్నేహితునితో ' ఒరేయ్ నేను ఇంటికి వెళ్లే దాక నా భార్యాపిల్లలు భోజనమేచెయ్యరు' అన్నాడట. ఆ స్నేహితుడు చాలసంబరపడిపోతూ
' అబ్బా! నువ్వంటే నీ భార్యాపిల్లలకు ఎంత ప్రేమరా! నువ్వు నిజంగా చాల అదృష్ట వంతుడివి' అని మెచ్చుకున్నాడట. వెంటనే వాడు ప్రేమాకాదు దోమాకాదు. ఇంటికెళ్లి నేనే వంటచెయ్యాలి' అన్నాడట తాపీగా. నిజానికి మానవజీవితానికి వంటకి అవినాభావసంబంధం ఉంది. కాబట్టి ఎంతటి బంగారు పళ్లేనికైనా గోడచేర్పు ఎలా అవసరమో ఎంతటి గొప్పమగాడికైనా వంట నేర్పు కూడ అంతే అవసరం
ఒక విధంగా ఆలోచిస్తే దమయంతి ఇంద్రాది దేవతలందర్ని త్రోసిరాజని సామాన్యుడైన నలమహారాజునే పెళ్లి చేసుకోడానికి అలాగే ద్రౌపది పాండవుల్లో అందరికంటే భీముణ్ణే ఎక్కువగా ఇష్ట పడడానికి కారణం వారికి గల పాకశాస్త్ర ప్రావీణ్యమే అని అనిపించక మానదు. ఏది ఏమైన she లో he ఒదిగి నట్లుగా woman లో man ఒదిగినట్లుగా వంటపనిలో పురుషుడు భార్య వెనుక ఒదిగే ఉంటున్నాడు. వంట చెయ్యనంటే జీవితంలో మిగిలేది పెంటే.
వంట పేరుతో తమ జీవితాల్ని పెంట పాలు చేసుకున్న ఒక జంట మధ్య జరిగిన వాగ్వివాదం ఇక్కడ పొందుపరచ బడింది. సరదాగా చదువుకుని ఆనందించండి. ఇది చదివేక వంటరాని వారు కొద్దో గొప్పో వంట నేర్చుకోండి. కనీసం వంటచేసేవారికి సహాయసహకారాలు అందజెయ్యండి.
ఒకాయన పాపం ఎప్పుడూ ఇంట్లో ఆయనే వంట చేసేవాడు. అనుకోకుండా ఒకరోజు పొరుగూరు వెడుతూ ఆపని భార్యకు పురమాయించాడు. ఆమె అయిష్టంగానే తలూపింది
తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. కడుపు నకనక లాడుతోంది. వంటచేశావా? అన్నాడు. వెంటనే 'నో'' అంది. అసలే ఆకలితో ఉన్నాడేమో ఒళ్లు మండి పోయింది.
పాపాత్మురాలా! వంట ఎందుకుచెయ్యలేదే ? అన్నాడు.
ఏంటి నేను పాపాత్మురాలనా! కాదు మీనాన్నే పాపాత్ముడు అంది.
ఏమే తప్పుడుదానా ఏంటి వాగుతున్నావు అన్నాడు.
ఆ పదం మీఅమ్మకి మీచెల్లి కి వర్తిస్తుంది నాక్కాదు అంది.
వెంటనే ఈ ఇంట్లోంచి బయటికి పోవే అన్నాడు .
ఇది నీ ఇల్లు కాదు పొమ్మనడానికి నీకు హక్కు లేదంది.
భగవంతుడా ! నాకు కనీసం చావునైన ప్రసాదించవయ్యా అన్నాడు .
ఆవిడ కూడ తక్కువదేమీకాదు. 'మీలో తప్పుంటే మీరు పోతారు నాలో తప్పుంటే నా మాంగళ్యం పోతుంది ' అనేంతటి గొప్ప ఇల్లాలు . అందుకే ఏమీ తడుముకోకుండా నాకంత అదృ ష్టమా అంది.
ఇంతటి భీకరమైన వాగ్వివాదం తనలో పొందుపరచుకున్న ఈ మనోహర శ్లోకం చదవండి.

: పాకం న కరోషి పాపిని? కథం పాపీ త్వదీయ: పితా
రండే జల్పసి కిం తవైవ జననీ రండా త్వదీయా స్వసా
నిర్గచ్ఛ త్వరితం గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం
హాహా ! నాథ ! మమాద్య దేహి మరణం తావన్న భాగ్యోదయ:
............................

No comments: