ఉపనిషత్తులు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
అవి
ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తున్న రోజులు. మచిలీపట్టణంలో హిందూమహాసభ
జరిగింది. డాక్టర్. అనిబిసెంట్ గారు
ఆ సభకు అధ్యక్షురాలిగా ఉన్నారు. శ్రీ
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి వంటి ప్రముఖపండితులు, శతావధాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సభ
పూర్తయింది. చివర్లో సభాసదులు కొందరు, భారతీయ సనాతన ధర్మం నానాటికి క్షీణించిపోతోందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
పరిష్కారమార్గం సూచించమని ప్రాధేయపడ్డారు. శ్రీ
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు అంతా విని
అందమయిన పద్యం ఆశువుగా ఇలా చెప్పారు .
టోపీల్వెట్టి షరాయిలందొడిగి యెట్లో
పొట్టకై వేషముల్
వేపూనుండొక గంటయేని నెలకున్వేదంబు( దానెట్టిదే
వ్యాపారంబటనుండు దాని చిగురే యర్థంబు బోధించునం
చీపట్లన్ వ్యయముంబొనర్చుడది
మీకిప్పించునుచ్ఛ స్థితిన్
మీరంతా టోపీలు పెట్టుకోండి ( టోపీ ఆంగ్ల సంప్రదాయానికి ప్రతీక). అలాగే షరాయిలు తొడుక్కోండి ( షరాయిలు మహమ్మదీయుల
సంప్రదాయానికి ప్రతీక). పొట్ట కోసం ఏదో ఒక పని చేసుకోండి.
కనీసం నెలకో గంట సేపు వేదం అంటే ఏమిటి? అందులో
ఏం ఉంటుంది ? దాని సారాంశమైన ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి
అనే విషయాలు చర్చించండి. అది మనకి ఎంతో మేలు చేకూరుస్తుంది. మన హిందూధర్మానికి ఎటువంటి నష్టం కలుగదు. అని ఆ
మాటల్లోని సారాంశం. ఉపనిషత్తులన్నీ
ఆత్మతత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి .
అన్ని ఉపనిషత్తులు ఈ వ్యాసంలో చర్చించడం సాధ్యం
కాదు కాబట్టి వాటి సారాoశరూపమైన మహావాక్యాల్లో ఆత్మతత్త్వం ఎలా ప్రతిపాదించారో తెలుసుకుందాం.
మహావాక్యాల్లో
మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది
ఋగ్వేదమునకు సంబంధించిన ఐతరేయోపనిషత్తు లోనిది. ఇది ఆదేశ
వాక్యం. ఇది బ్రహ్మ స్వరూపం సత్, చిత్ , ఆనందమని తెలియ( జేస్తుంది. సత్ అంటే అన్ని కాలాల్లో ఉండేది . చిత్ అంటే స్వయంప్రకాశకం . ఆనందం అంటే ఆనంద స్వరూపం.
మరియు ఏకం , అద్వితీయం. ఏకం
అంటే ఒకే పదార్థం. అద్వితీయం అంటే రెండో వస్తువు లేనిది.
అంటే బ్రహ్మతో సమానమైన వస్తువు మరొక్కటి లేదు. బ్రహ్మ కంటే
భిన్నమైన వస్తువు కూడ మరొక్కటి లేదు.
అంతే గాక బ్రహ్మలో కూడ ఎటువంటి భేదం లేదు. అది
శుద్ధ చైతన్య స్వరూపం.
ఇక రెండవది అయమాత్మా బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మమే. ఇది అథర్వణ వేదానికి సంబంధించిన మాండుక్య
ఉపనిషత్తు లోనిది. ఇది అనుసంధాన వాక్యం. ఇది ఆత్మకు బ్రహ్మకు ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది.
మన స్వరూపమైన ఆత్మ బ్రహ్మమే అని దీనికర్థం.
ఇక మూడవది తత్త్వమసి. ఇది సామవేదానికి చెందిన ఛాందోగ్యఉపనిషత్తు
లోనిది. (6/8/7). ఇది ఉపదేశ వాక్యం . తత్
అనే పదం సర్వజ్ఞవిశిష్ట చైతన్యమైన
బ్రహ్మను చెబుతుంది. త్వం అనే పదం కించిజ్ఞ విశిష్టమైన
జీవుణ్ణి చెబుతుంది. అసి అంటే అగుచున్నావు అని అర్థం. ఇక సర్వజ్ఞ, కించిజ్ఞ అనే
రెండు విశేషణాలు తొలగిస్తే చైతన్యం రెంటిలోనూ ఒక్కటే. ఇది జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తుంది. అజ్ఞానం వల్ల స్వరూపజ్ఞానం తెలియక సంసారసాగరంలో కొట్టుమిట్టాడే జీవునికి “
నువ్వు జీవుడవు కాదు . సాక్షాత్తుగా ఆ
పరమేశ్వరుడవే ( బ్రహ్మమే) అని నొక్కి
చెబుతుంది.
ఇక నాల్గోది ‘అహం బ్రహ్మాస్మి’. అనేది. ఇది
యజుర్వేదానికి సంబంధించిన ‘బృహదారణ్యక ఉపనిషత్తు’
లోనిది . ఇది అనుభవ వాక్యం. ‘తత్త్వమసి’ అనే వాక్యం ద్వారా నువ్వే ఆ బ్రహ్మవు అని గురువు చెప్పగానే
శిష్యుడు విని మననం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకున్నాక తానే బ్రహ్మగా మారి పోతాడు.
ఈ విధంగా ఉపనిషత్తులు
బ్రహ్మతత్త్వాన్ని బోధించి, అనుభవింపజేయడం ద్వారా
జీవత్త్వ౦ నుంచి బ్రహ్మత్త్వానికి
రాచబాట నిర్మిస్తాయి.
ఇవి ఆత్మతత్త్వాన్ని బోధించేవి
కావడం వల్ల ఒక మతానికి గాని, ఒక జాతికి
గాని ఒక సంస్కృతికి గాని సంబంధించినవి
కావు . అవి సార్వకాలికాలు, సార్వభౌమికాలు. అవి ఒక హిందువును అత్యుత్తమహిందువు
గాను, మహమ్మదీయుని అత్యుత్తమమహమ్మదీయుని గాను, క్రైస్తవుని అత్యుత్తమక్రైస్తవుని గాను,
చివరకు నాస్తికుని కూడా అత్యుత్తమమైన నాస్తికుని గాను తీర్చిదిద్దుతాయనడంలో ఎటువంటి
సందేహం లేదు.
****
No comments:
Post a Comment