Thursday, September 25, 2014

మఱువబోకు చిలకమర్తి మాట (రెండవ భాగం)

                                                           మఱువబోకు చిలకమర్తి మాట
                                                                   (రెండవ భాగం)
                                                                                                  చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
                                                                                                                 నరసాపురం

26. బలము కల్గినపుడు పరమాత్మనెప్పుడు
       నిలుపలేదు మదిని నిముసమైన
       కష్టమొదవునాడు కలుగునే రక్షణ
       మఱువ బోకు చిలకమర్తి మాట

27. తనువు నిత్యమనుచు తలపోసి తలపోసి
       చేయరాని పనులు చేసి చేసి
       మంచ మెక్కి నపుడు మది కుంద భావ్యమా
       మఱువ బోకు చిలకమర్తి మాట

28. సకల జీవులందు సర్వేశుడొక్కడే
       నిలచినాడటంచు నిజమునెఱిగి
      చిత్తశుద్ధి సకలజీవుల ప్రేమించు  
      మఱువబోకు చిలకమర్తి మాట

29 .   మనసు నందు దాగు మమకారమును వీడి
          చిత్తమందు పరమశివుని నిలిపి
          ప్రతిఫలంబు వీడి భజియింపు పరమాత్మ
          మఱువబోకు చిలకమర్తి మాట

30 . అం‌తరంగశత్రులార్వుర నడగించి
       కదలకుంద శివుని కట్టివైచి
       నిండుభక్తి తోడ నిరతంబు సేవించు
       మఱువబోకు చిలకమర్తి మాట

31. సర్వ విద్యలెఱిగి  సతతంబు గర్వించి
       కుండలములతోడ కులుకుచుండి
       దైవచింత లేక దక్కునే మోక్షంబు
       మఱువ బోకు చిలకమర్తి మాట

32 . నిత్యమైన  శివుని నీమది నుంచక
        ఉన్న   తెలివినంత సున్న జేసి
        చింతతోడ సతము జీవింప భావ్యమే                
        మఱువబోకు చిలకమర్తి మాట

33 . చిత్తమందు పరమ శివుని సంస్థాపించి
       అంతరంగమందు నాశ వీడి
       చిత్తశుద్ధి తోడ జీవించు హాయిగా .
       మఱువబోకు చిలకమర్తి మాట

34. దేవుడొసగినట్టి తెలివని తెలియక
       వెర్రి వాడ వగుచు విర్రవీగి
      కాలయాపనంబు గావింప భావ్యమా
      మఱువబోకు చిలకమర్తి మాట

35. కుటిలబుద్ధితోడ కోటి గోవులదెచ్చి
       దానమీయగానె దైవ మఱసి
       కనికరించి మనకు ఘనపుణ్య   మేమిచ్చు
       మఱువబోకు చిలకమర్తి మాట

36 . శక్తి యున్ననాడు సర్వేశునెప్పుడు
       నిముషమైన మదిని నిలుపలేదు
       బాధ కలుగునాడు ప్రార్థింప ధర్మమా
       మఱువబోకు చిలకమర్తి మాట

37 . సత్యధర్మములను సర్వదా పాటించి
       నిత్యజీవనంబు నెరపు మెపుడు
       శ్రీనివాసు డెపుడు చేయూతనందించు
       మఱువబోకు చిలకమర్తి మాట

38.  ఐదు గాలులిచ్చు నద్భుతశక్తితో
        కాయమనెడు బండి కదలుచుoడు
        గాలులంతరించ కాటిలో బూదెయౌ
        మఱువ బోకు చిలకమర్తి మాట

39 . దివ్య మైన జ్ఞాన తీర్థంబు తోడను
        మనసు బాగ కడుగు మరువకుండ
        చిత్తమందు పరమ శివుని స్థాపింపుము
        మఱువ బోకు చిలకమర్తి మాట

40. సంశయంబు వీడి సర్వవేళలయందు
        అంతరాత్మజపము నాచరించు
        మంచిచెడ్డలెంచ మరియేమి పని లేదు
       మఱువబోకు చిలకమర్తి మాట

41. చేసుకున్న పడతి జేబులు వీక్షిoచు
      కన్నతల్లి ప్రేమ కడుపు జూచు
     తెలుసుకున్ననీవె దివ్యసుజ్ఞానివి
    మఱువమరువ బోకు చిలకమర్తి మాట

42.  దైవశాసనంబు దాటకు మెప్పుడు
       శిరమువంచి యమలు సేయు మెపుడు
        శివుని యాజ్ఞ లేక చీమైన కుట్టదు
        మఱువబోకు చిలకమర్తి మాట

43. తనదు ప్రాణములను ధారవోయుచు    సాకు
       కన్నతల్లి నెపుడు గౌరవించు
       కష్టబెట్టకుండ కాచుమామెను ప్రేమ  
      మఱువబోకు చిలకమర్తి మాట

44. కాటి కేగునట్టి కాయంబు స్థిరమని  
      పిచ్చి వాడ వగుచు పెంచినావు
     సత్యమెరిగి నీవు నిత్యంబు మసలుకో
    మఱువబోకు చిలకమర్తి మాట

45 . కన్న వారె నీకు కనిపించు దైవాలు
       నిజముసుమ్ము వారి నిండు ప్రేమ  
       పూజ చేయ నీవె పూర్ణ సుజ్ఞానివి
       మఱువ బోకు చిలకమర్తి మాట

46. సర్వజీవులందు సర్వేశుడొకడని
       నిoడు మదిని నిజము నెరుగునాడు
       శివుడు మెచ్చి నీదు చింతలనెడబాపు
       మఱువబోకు చిలకమర్తి మాట

47. పట్టు వీడ కుండ పద్మాసనము వైచి
     గాలి పైకి లాగు కదలకుండ
     తలుపులన్నిమూసితలపులు విడనాడు
     మఱువబోకు చిలకమర్తి మాట

48. తల్లి కడుపునుoడి ధరణికి  దిగగానే
      ఏడ్పు విద్యనీవు  నెరిగి నావు
      కాంచు వారలెల్లకడుముదమొందిరి
     మఱువమరువబోకు చిలకమర్తి మాట

49.  ఎన్నిజన్మలెత్తి యిలకొచ్చినారమో
     యెఱిగినట్టివారలెవరు లేరు
     తెలుసుకొన్నవాడె స్థితప్రజ్ఞుoడయా
    మఱువ బోకు చిలకమర్తి మాట

50. అమృతరసము కంటె నధికమౌ శక్తులు
     అమ్మ పాలలోన నలరె గాన
    తల్లిపాలు గ్రోల తానబ్బు సౌఖ్యముల్
    మఱువబోకు చిలకమర్తి మాట
**********

No comments: