జీవన్ముక్తి – స్వరూపస్వభావాలు
Dr. Chilakamarthi Durga
Prasada Rao
3/106,Premnagar, Dayalbagh,
AGRA-282005 INDIA.
-: ఇది ఆరిజోనాలో (USA) జరిగిన అంతర్జాతీయసదస్సులో
నేను సమర్పించిన LEVELS OF CONSCIOUSNESS
OF JIVANMUKTA అనే వ్యాసానికి నేను చేసిన సంక్షిప్త స్వతంత్రానువాదం:--
మానవుడు తన జీవితంలో
సాధించవలసిన వానిని పురుషార్థములు అంటారు
. అవి ధర్మం , అర్థం , కామం , మోక్షం అని నాలుగు . ఇందులో మొదటి
మూడు ఆచరించేవి . నాల్గోది పొందేది . ఇది అత్యున్నతమైన పురుషార్థంగా పేర్కొన
బడింది . దీన్నే ముక్తి అని కూడ పిలుస్తారు . మానవుడు జన్మమరణరూపమైన ఈ సంసారచక్రం
నుండి బయటపడడమే ముక్తి . ఇది మానవుడు తన ఆత్మస్వరూపాన్ని
తెలుసుకోవడం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది, వేరొకమార్గం లేదు
. తమేవ విదిత్వాsతిమృత్యుమేతి
నాsన్య: పంథా: విద్యతే s యనాయ అనే శ్రుతి ఈ విషయాన్ని సమర్ధిస్తోంది. ఈ ముక్తి జీవన్ముక్తి, విదేహముక్తి అని
రెండు విధాలు. మనిషి జీవించి యు౦డగానే ముక్తిని పొందితే అది జీవన్ముక్తి అని,
మరణించిన తరువాత ముక్తి పొందితే అది విదేహముక్తి అని అంటాం. భారతీయతత్త్వశాస్త్రంలో
ఈ జీవన్ముక్తికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
ఇక పైపైన
ఆలోచిస్తే ఈ జీవన్ముక్తి అనే అంశం పరస్పరవిరుద్ధంగా కన్పిస్తుంది. ఎ౦దుకంటే
జీవించియున్నంత కాలం ముక్తి లభించదు, ముక్తి పొందితే మనిషి జీవి౦చడం సాధ్యం కాదు.
కాని మహర్షుల మాటలు, వారి అనుభవం ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తున్నాయి
. ఉపనిషత్తులు మోక్షం అంటే ఆశరీరత్వం (bodiless-ness) అని పేర్కొన్నాయి . ఆత్మ
ఆశరీరి. అది దేహేంద్రియాలతో తాదాత్మ్యం పొందడం వల్ల సశరీరిగా గోచరిస్తొంది . ఆత్మ దేశకాలాలకు అతితమైనది . కాని అది శరీరంతో కూడి ఉ౦డడం వల్ల పరిచ్ఛిన్నంగా
కనిపించి జీవత్వబ్రాంతిని కల్పిస్తో౦ది. కాబట్టి ఆత్మ యొక్క యథార్థస్వరూపాన్ని
గుర్తిస్తే జీవించి యుండగానే ముక్తి పొందే అవకాశం ఉంది. ఆత్మ తెలియబడే వస్తువు
కాదు. అందువల్ల ఆత్మ కంటే భిన్నమైన వస్తువులను గుర్తించి వాటిని విసర్జిస్తే ఆత్మ
అనుభవగోచరం అవుతుంది. కాబట్టి ఆత్మను గుర్తించాలంటే
దానినావరించియున్న శరీరాలు, కోశాలు గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం .
ఈ ఆత్మ 1. అన్నమయ
2 ప్రాణమయ 3 మనోమయ 4. విజ్ఞానమయ 5. ఆనందమయమనే ఐదు కోశాలతోను; 1. స్థూలశరీరం 2.
సూక్ష్మశరీరం 3. కారణశరీరం అనే మూడు శరీరాలతోను ఆవరించబడి ఉంది. కాని ఆత్మకు వీటితో ఎటువంటి సంబంధం లేదు.
1. అన్నమయకోశం: ఇది పంచభూతాలతో
నిర్మి౦చబడింది. మనం తిన్న ఆహార౦తో ఈ
అన్నమయకోశం ఏర్పడుతుంది. మనకు పైకి కనిపించే ఈ శరీరమే అన్నమయ కోశం .
2. ప్రాణమయకోశం: మనకు కనిపించే ఈ
అన్నమయకోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది . ఇది ప్రాణ౦, అపాన౦, వ్యాన౦, ఉదాన౦, సమాన౦
అనే ఐదు వాయువులతోను ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధన౦జయమనే ఐదు ఉపవాయువులతోను
కూడి ఉంటుంది . ప్రాణం హృదయంలోను , అపానం గుదస్థానం లోను. సమానం బొడ్డులోను, ఉదానం
కంఠ౦లోను, వ్యానం శరీరమంతటను వ్యాపించి ఉంటాయి.
హృది ప్రాణే
గుదేsపాన: సమానో నాభిమండలే
ఉదాన: కంఠదేశస్థ:
ప్రాణ: సర్వశరీరగ: అని శాస్త్రకారులు పేర్కొన్నారు. ఇక వాటితోపాటు నాగ, కూర్మ, కృకర, దేవదత్త , ధన౦జయమనే
ఉపవాయువులు కూడ ఉంటాయి. నాగం అనే వాయువు
ముక్కులో ఉంటుంది . కూర్మం కంటి రెప్పలలో ఉంటుంది. కృకరం నేత్ర వలయంలోను , దేవదత్తం కంఠద్వారమందు,
ధనంజయం శరీరమంతటను నిండి ఉంటుంది . ఇక ఉపవాయువుల మాటకొస్తే నాగ౦ వాంతి మొ|| వాటికి
కారణ౦ అవుతుంది . కూర్మ౦ కనురెప్పలు
తెరుచుకోడం, మూసుకోడం మొదలైన పనులకు తోట్పడుతుంది. కృకరం ఆకలిదప్పికలను
అదుపులో ఉంచుతుంది. దేవదత్తం అనే వాయువు ఆవులింత మొదలైన వాటికి
కారణం అవుతుంది . ధనంజయం శరీరానికి పోషకంగా ఉండి కాంతిని చేకూరుస్తు౦ది. ఈ ధనంజయం అనే వాయువు మనిషి మరణించిన తరువాత కూడ
మృతకళేబరానికి స్నానం చేయి౦చే వరకు శరీరాన్నే అంటి పెట్టుకుని ఉంటుంది. అందుకే
స్నానం చేయి౦చాకనే దహనసంస్కారాలు నెరవేరుస్తారు.
3. మనోమయకోశం: ఇది ఐదు జ్ఞానే౦ద్రియాలతోను, ఐదు
కర్మేంద్రియాలతోను, మనసుతోను కలసి ఏర్పడుతుంది.
చర్మం , కన్ను , ముక్కు, చెవి, నాలుక, అనేవి జ్ఞానేంద్రియాలు, ఎందుకంటే
మనం వీటి ద్వారానే జ్ఞానం
సంపాదిస్తా౦. కాలు, చేయి, నోరు, జననే౦ద్రియం, విసర్జనేం ద్రియం, అనే ఈ ఐదు కర్మేంద్రియాలు . ఈ పది మనసుతో కలసి మనోమయకోశంగా ఏర్పడతాయి.
4. విజ్ఞానమయకోశం
ఇది ఐదు జ్ఞానేంద్రియాలు,
ఐదు కర్మేంద్రియాలు బుద్ధితో కలిసి ఏర్పడుతుంది
. ఇది మనోమయకోశం లోపల ఉంటు౦ది .
5. ఆనందమయ కోశం
:
విజ్ఞానమయకోశం లోపల ఆనందమయకోశం ఉ౦టు౦ది.ఈ ఆనందమయ
కోశంలో పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ సంస్కారరూపంలో ఉంటాయి. ఇక అన్నమయకోశంకంటే
ప్రాణమయకోశం , ప్రాణమయకోశంకంటే మనోమయకోశం, మనోమయకోశం కంటే విజ్ఞానమయకోశం,
విజ్ఞానమయకోశం కంటే ఆనందమయకోశం సూక్ష్మమైనవి, ప్రియమైనవికూడ. ఉదాహరణకి మనం
అన్నంకోసం పొట్టచేతపుచ్చుకుని తిరుగుతాం. ఎక్కడ ఉద్యోగమొస్తే అక్కడకు పోతాం. కాని
అక్కడ ప్రాణానికి ముప్పువచ్చే పరిస్థితి ఎదురైతే ప్రాణంకోసం అన్నాన్ని
విదిచిపెట్టేస్తా౦. ఇక్కడ అన్నం కంటే ప్రాణం ముఖ్యమని తెలుస్తోంది. అల్లాగే
ఎప్పుడైనా మన మనస్సుకు గాని, అభిమానానికి గాని ముప్పు వాటిల్లితే ప్రాణం విడిచి
పెట్టడానికైనా సిద్ధ పడతాం గాని మనస్సును సమాధానపరచం. దీన్ని బట్టి ప్రాణం కంటే
మనస్సు గొప్పదని తెలుస్తోంది . ఒక్కొక్కప్పుడు మనం విజ్ఞానంకోసం మనస్సు చంపుకుని ఎన్ని
అవమాలైనా భరిస్తాం. గురువు ఎన్ని తిట్టినా ఎంత కొట్టినా ఓర్చుకుంటాం. ఎందుకు?
విజ్ఞానం కోసం. దీన్ని బట్టి మనోమయకోశంకన్నా విజ్ఞానమయకోశం గొప్పదని తెలుస్తో౦ది.
ఇక ఆనందం కోసం అన్ని విదిచిపెట్టేస్తాం . ఎందుకంటే అదే జీవిత పరమావధి. దీన్నిబట్టి
ఆనందమయకోశం అన్నిటికన్న గొప్పదని తెలుస్తోంది. ఈ ఆనందమయకోశం ఆత్మకు చాల దగ్గరలో
ఉండడం వల్ల ఆనందమయకోశాన్నే ఆత్మ అని భ్రమించే అవకాశం కూడ ఉంది.
ఇక అన్నమయకోశమే స్థూలశరీర౦. ప్రాణ, మనో, విజ్ఞానమయ కోశాలు
సూక్ష్మశరీర౦. ఈ సూక్ష్మశరీరాన్నే యాతనాశరీరం అని కూడ పిలుస్తారు. ఇది మనిషి మరణించిన తరువాత స్వర్గనరకాదులు చేరుకొని
పుణ్య పాప ఫలాలను అనుభవిస్తుంది. ఇక ఆనందమయకోశమే కారణశరీరo. స్థూలశరీరం జాగ్రదవస్థ (మెళుకువ)లోను;
సూక్ష్మశరీరం స్వప్నావస్థ(కల)లోను; కారణశరీరం సుషుప్త్యవస్థ(నిద్ర)లోను మనకు
అనుభవగోచరమౌతాయి.
ఆత్మస్వరూపం వీటితో సంబంధంలేనిది. ఈ మూడిటి
కంటే అతీతమై౦ది. ఏ క్షణ౦లో జీవుడు ‘ నేను ఈ
మూడిటికంటే విలక్షణమైన ఆత్మతత్త్వాన్ని’ అని
అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే ముక్తుడౌతాడు .
ఈ విషయాన్నే తేజోబి౦దూపనిషత్తు ఇలా
తెలియజేస్తోంది .
దేహత్రయాతిరిక్తోsహం
శుద్ధచైతన్యమస్మ్యహం|
బ్రహ్మాsహమితి య:
శాంత: స జీవన్ముక్త ఉచ్యతే ||
నేను స్థూల, సూక్ష్మ, కారణశరీరముల కంటే అతీతుడను, శుద్ధ, బుద్ధ,
ముక్త స్వభావమైన పరబ్రహ్మమును, శాంతస్వభావుడను అని అనుభవపూర్వకంగా తెలుసుకు౦టాడో
అట్టి వాడే జీవన్ముక్తుడు.
ఈ అనుభవం కేవలం
గురూపదేశంవల్లనే సిద్ధిస్తుంది . అందుకే శ్రుతి “ తద్విజ్ఞానార్థం
స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్ఠ౦” అని చెబుతోంది.
స్మృతి కూడ తదనుగుణంగా “తద్విద్ధి
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన: తత్త్వ దర్శిన:” అంటో౦ది.
ఈ జీవన్ముక్తస్థితికి
ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని సందేహం వస్తే “ బ్రహ్మవేద
బ్రహ్మైవ భవతి” ( బ్రహ్మవేత్త స్వయంగా బ్రహ్మమే అయి
ఉన్నాడు ) “తస్య తావదేవ చిరం
యావన్న విమోక్ష్యేsథ సంపత్స్యే” (ఛాందోగ్య౦-6-14-2)
మొదలైన శ్రుతులు ప్రమాణాలుగా
కనిపిస్తున్నాయి.
ముండకోపనిషత్తు
జీవన్ముక్తి స్వరూపాన్ని ఇలా వర్ణిస్తోంది.
భిద్యతే
హృదయగ్రంధి: ఛిద్యంతే సర్వసంశయా:
క్షీయంతే చాస్య కర్మాణి
తస్మిన్ దృష్టే పరావరే (2-2-8)
(పరతత్త్వమైన ఆత్మ
అనుభవగోచరం కాగానే హృదయగ్రంధి విడిపోతుంది . సమస్త సంశయాలు తొలగిపోతాయి . సంచిత
ప్రారబ్ధాగామికర్మలు తక్షణమే నశిస్తాయి).
ఇక్కడ ప్రారబ్ధ ,
సంచిత , ఆగామి కర్మలు నశిస్తే శరీరం ఎలా నిలుస్తుంది అనే ఒక సందేహం మనకు కలుగక మానదు .
ఆ సందేహానికి ఇది సమాధానం. కర్మలు సంచితం, ప్రారబ్ధం, ఆగామి
అని మూడు విధాలు. అనేక జన్మల నుండి పేరుకుపోయిన కర్మజాలాన్ని సంచితకర్మ అనుకుందాం.
అవన్నీ మనం ఒకజన్మలో అనుభవి౦చలేము కాబట్టి కొంత తీసుకుని మనం జన్మ ఎత్తుతాం . మరల
ఈ జన్మలో కొన్ని కర్మలు చేస్తాం . సులభమైన
పరిభాషలో చెప్పుకోవాలంటే మనకు మనపేర బ్యాంకులో ఉన్న సొమ్మంతా సంచితం అవుతుంది .
మనం కొంత డబ్బు తీసుకుని ఒక ఊరు వెళ్ళేమను
కోండి. అది ప్రారబ్ధం అవుతుంది . అక్కడ కూడ ఉద్యోగమో వ్యాపారమో చేసి కొంత సంపాదిస్తే
అది ఆగామి అవుతుంది .
ఆత్మ జ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారం కలుగగానే సంచితం నశిస్తుంది . ఆగామికర్మలు అంటవు.
ఇక ప్రారబ్ధం మాత్రం శరీరపాతం వరకు మిగిలిపోతుంది. అది అనుభవించాక విదేహముక్తి
కలుగుతుంది . ఇక ఆత్మజ్ఞానం కలిగిన క్షణంనుంచి
శరీరం విడిచే వరకు మధ్యగల కాలాన్ని జీవన్ముక్తస్థితిగా శాస్త్రకారులు
పేర్కొన్నారు. ఎ౦దుక౦టే మోక్షం యొక్క ప్రయోజనం బ్రహ్మానందప్రాప్తియే గాని శరీరం
విదిచిపెట్టడం కాదుకదా!. శ్రీ శంకరులు ఒక
అందమైన దృష్టా౦తం కూడ ఇచ్చారు.
కుమ్మరివాడు కుండ తయారు చెయ్యడం పుర్తయి౦తర్వాత
చక్రం తిప్పడం ఆపేస్తాడు . కాని ఆ చక్రం
వెంటనే ఆగిపోదు కొన్ని పర్యాయాలు తిరిగి ఆ తరువాత ఆగుతుంది . అలాగే మోక్షం వచ్చిన
వెంటనే శరీరం నశించదు. వాస్తవానికి మోక్షానికి
దేహం ప్రతిబంధకం కాదు. దేహాత్మభ్రాంతి అంటే దేహాన్ని ఆత్మగా గాని లేక ఆత్మను దేహమనుకోవడం ప్రతిబంధకాలౌతాయి
. ఇక మోక్షం కలుగగానే ఆత్మానాత్మలు వేటికవి విడివిడిగా గోచరిస్తాయి. శరీరం ఉన్నా
శరీరంతోఆత్మకు ఎటువంటి సంబంధం ఉండదు .
ఏ విధంగా కుబుసం వదలిన పాము ఆ కుబుసంతో ఎటువంటి సంబంధం పెట్టుకోదో అదే
విధంగా జీవన్ముక్తుడు శరీరంలోనే ఉన్నప్పటికి ఆ శరీర౦తో
సంబంధం లేకుండా అశరీరిగానే ఉంటాడు
.
ముక్తికోపనిషత్తు జీవన్ముక్తిస్థితిని వివరిస్తూ జ్ఞానం
కలిగినా ప్రారబ్ధకర్మలు నశి౦చేంత వరకు శరీరం ఉ౦టు౦దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది .
ఇక ఈ జీవన్ముక్త స్థితి గురూపదేశం వల్లనే సిద్ధిస్తుంది. ఆ గురువు శ్రోత్రియుడు బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి . గురువుకు
రెండు లక్షణాలు విధిగా ఉండితీరాలి . ఆత్మానుభూతి ఆ అనుభూతిని వివరించే నైపుణ్యం ,
లేదా ఇతరులకు అందించగలిగే నైపుణ్యం . ఈ రెండు కల్గిన గురువును ఆశ్రయించిన వారికి ముక్తి
లభిస్తుంది. ఈ విషయం ఆచార్యవాన్ పురుషో వేద (ఛాందోగ్యోపనిషత్తు
- 6-14-2) మొదలైన శ్రుతులు, “ఉపదేక్ష్యంతి తే
జ్ఞానం జ్ఞానిన: తత్త్వదర్శిన:” మొదలైన స్మృతులు
వివరిస్తున్నాయి.
జీవన్ముక్తివివేకంలో విద్యారణ్యస్వామి జీవన్ముక్తుని
లక్షణాలను వారు చేపట్టే చర్యలు ఆధారంగా
బ్రహ్మవిత్తు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు , బ్రహ్మవి ద్వరేణ్యుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు మొదలైన ఏడు దశలను వర్ణించారు. వ్యాస విస్తరభయంతో అవన్నీ
నేను ప్రసావి౦చడం లేదు . శ్రీ శంకరభగవత్పాదులు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తి: అని
చాల సంక్షేపంగా పేర్కొన్నారు .
అటువంటి జీవన్ముక్తులవలననే
లోకానికి శాశ్వతమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. కాబట్టి వారికొరకు అన్వేషించవలసిన
ఆవశ్యకత ఎంతో ఉంది. వారు ముక్తి పొంది నవారైనప్పటికి లోకకల్యాణం కోసం శరీరాన్ని
ధరిస్తారు. మనకు ముక్తిమార్గాన్ని చూపిస్తారు .
(**)
<><>(**)