Monday, June 18, 2018

శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారి కవి నిందాస్తుతులు




 శ్రీ మల్లంపల్లి  వీరేశ్వరశర్మ గారి

                               కవి   నిందాస్తుతులు
(Ironical praise of some Telugu poets)

మా గురుదేవులైన శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితులు,  మహాకవి , ఉత్తమోత్తమ అధ్యాపకులున్ను. వారు ఎన్నో ప్రాచ్య విద్యాకళాశాలల్లో(oriental colleges) అధ్యాపకునిగా  పనిచేశారు . వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా కూడ పనిచేశారు. ఆంధ్రజాతీయకళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొదలైన గొప్ప విద్యాసంస్థలలో Member Of Council కౌన్సిల్ సభ్యుని గాను , Member of Senate సెనేట్ సభ్యునిగానూ , Member of Acadamic Council  అకాడమిక్ కౌన్సిల్ సభ్యుని గాను  ఎన్నో హోదాలలో  భాషాసేవ చేశారు . మల్లంపల్లి వారిది పండిత వంశం . తాతముత్తాతల నాటి నుండి ఎంతోమంది గొప్ప కవులుగా పండితులుగా ప్రసిద్ధి పొందారు . మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు బహు గ్రంథకర్త .  ఎన్నో ఖండకావ్యాలు వెలయించి హరితకవి అనే పేరు పొందారు. .ఉత్తరనైషధం  రచించి అభినవ శ్రీనాథ అనే బిరుదు పొందారు . ఉత్తమమనుసంభవం  రచించి అభినవపెద్దన గా పేరొందారు . కాంచీఖండం  రచించి ఆంధ్రకాంచీఖండచతురానన అనే బిరుదు కైవశం చేసుకున్నారు.  తెలుగువ్యాకరణాన్ని అనితరసాధ్యమైన రీతిలో బోధించి అభినవ సూరి అని ప్రశంస లందుకున్నారు .
వారి శిష్యులలో ప్రముఖులు, భీమవరం D.N.R కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన శ్రీ N.V.K సుబ్బరాజు గారు సూరి మఱపించి అభినవ సూరియైన భర్గరూపగురుల కభివందనములు అని వారిని ప్రశంసించడం ఇందుకు నిదర్శనం . 
ఇక సంస్కృత , తెనుగుసాహిత్యాల్లో వారు చదువని గ్రంథం ఇంచుమించుగా లేదని చెప్పొచ్చు . నేను పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరసంస్కృతకళాశాలలో చదువుతున్నప్పుడు మాకందరికి  వ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . వ్యాకరణాన్ని సాహిత్యంలాగా ఆసక్తి కరంగా బోధించడం వారి ప్రత్యేకత. ఇక సాహిత్యవిషయానికొస్తే సాహిత్యానికి సంబంధించిన ఆయా అంశాలు చెప్పేటప్పుడు  తన్మయులై స్వయంగా రసప్రవాహంలో ఓలలాడుతూ విద్యార్థులను కూడ ముంచెత్తేశేవారు. ఒక్కొక్కప్పుడు ఆవేశంతో కవులను తిట్టేస్తూ ఉండేవారు.  ఎందుకు తిడుతున్నారని అడిగితే ఏం చెయ్యమంటావురా!  వారు రచించిన ఆయా పద్యాలు చదివి రసోద్రేకాన్ని ఆపుకోలేక తిడుతున్నాను అనేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కవిని ఉద్దేశించి ఒక్కొక్క పంక్తి చెబుతూ ఉండేవారు . అవన్నీ కొంతమంది  వెంటనే వ్రాసుకునే వాళ్ళ౦ . అవన్నీ చాల గమ్మత్తుగా, సహజసుందరంగా ఉండేవి . నేను కాలాంతరంలో కొన్ని పంక్తులు మర్చిపోయాను . వారి కుమార్తె ,  మా సోదరి, శ్రీమతి కాళహస్తీశ్వరి నేను మఱచిపోయిన పంక్తులు నాకు అందించారు . అవన్నీ ఒక చోటికి చేర్చి అందరికి అందించే నా ఈ సాహసానికి నన్ను మన్నించగోరెదను.  వారు ఆయా కవులపై చేసిన  నిందలకు తాత్పర్యం ప్రశంసలే గాని నిందమాత్రం కాదని  భావించాలి  . వారు వెలువరించిన అభిప్రాయాలు ఆయా కవుల కావ్యాలను చదవడానికి పాఠకులను పురిగొలుపుతాయనే ఆశాభావంతో వాటిని మీ ముందుంచుతున్నాను .   

౧. చిన్ననాడే పోయె నన్నయ్య మతిచెడి
అడవిలో పడి యంతునయిపు లేడు

౨. తిక్క శంకరయ్య తిక్కన్న చెడ గొట్టె
పదియేను పర్వముల భారతంబు
తిక్కశంకరయ్య తిక్కనగారికి
కీచక విరహంబు గీతులాయె

౩. ఎఱ్ఱన్న ఎంతటి వెఱ్ఱి పప్పయొ గాని
సంధించెనిద్దఱి సందు దూరి

౪. కేతన్న యొక బుడ్డ కేతిగాడు౦ బోలె
ధర్మపంనాలేడ్చి తగుల బెట్టె

౫. నైషధంబంతయు నాశనంబొనరించె
శ్రీ నాధునకు సిగ్గు శిరము లేదు

౬. పెద్దన్న ఎంతటి దద్దమ్మయో గాని
ప్రవరాఖ్యు నొక గోత (బాఱనూకె

౭. తలతోక తెలియని తలతిక్క కథ వ్రాసె
పింగళి సూరన్న వెంగళప్ప

౯. పెండ్లాము తన్నితే భేషు భేషన్నాడు
ముక్కు తిమ్మన్నకు బుద్ధి లేదు

౧౦. ముక్కఱకేడ్పి౦చె నక్కను చివరకు
రామలింగడు కొక్కె రాయి గాడు

౧౧. శ్లేష కవనం బేడ్చి చెడగొట్టె కావ్యంబు
భట్టు మూర్తి గాడు వట్టి శు౦ఠ

౧౨. రాయలవార్గచ్చ కాయపాకములోన
ఇనుప గుగ్గిళ్ళు సంధించినారు

౧౩. కూచిమంచి వాడు కోటికి తలయొగ్గి
పిచ్చపిచ్చగ వ్రాసెనచ్చతెనుగు

౧౪. కంకంటి పాపన్న ఎంకి పాటలుగాక
రామాయణం బేల వ్రాయవలయు

* ౧౫ పందిపురాణమా పలికిరిద్దరు గూడి
నంది మల్లయ్య ఘంటయ్య కవులు
   
**౧౬.  వాణి నా రాణన్న వాడెంత ఘనుడోయి
             వీరన్న తానేమి వెలగబెట్టె   

*నంది మల్లయ్య ఘంటసింగయ్య  అనే వారు తెలుగులో తొలి జంట కవులు . వారు వరాహపురాణాన్ని తెనిగించారు . కృష్ణమిశ్రుడు రచించిన ప్రబోధచంద్రోదయం అనే నాటకాన్ని కూడా తెనిగించారు .   

**కవి :- పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ( 'వాణి నా రాణి' అని గొప్ప చెప్పుకున్నాడు )  
రచన :- శృ౦ గార శాకుంతలం 

<><><> 

No comments: