Wednesday, October 3, 2018

ఎచటి నుండి వీచెనో...


ఎచటి నుండి వీచెనో...

సాధారణంగా మనకు ఆహ్లాదం కలిగించే  గాలికి  మూడు లక్షణాలు  ఉండాలి . ఒకటి చల్లదనం , రెండు మెల్లగా వీచడం , మూడు సువాసన.

గాలే కదా అని మనం తుఫాను  గాలిని, సుడిగాలిని తట్టుకోలే౦.  అందువల్ల గాలి వేగంగా కాకుండ  మెల్లగా వీచాలి  .  అలాగే వేసవికాలం రోహిణికార్తెలో మట్టమధ్యాహ్నం వీచే గాలిని మనం భరించలేం . ఎందుకంటే అది మెల్లగా వీచినా   చల్లగా ఉండదు . అందుకని గాలి చల్లగా ఉండాలి.  కేవల౦  చల్లగా ఉండి,  మెల్లగా వేస్తేనే సరిపోదు . గాలికి సౌరభం కూడ కావాలి . ఎందుకంటే తడిసిన పెంటకుప్ప పైనుంచి వీచే గాలి ఎంతో  చల్లగా ఉండి మెల్లగా వీస్తున్నా  మనం మెచ్చుకోలే౦ . ఎందుకంటే  ఆ గాలి ఎంత సొంపుగా ఉన్నా ఆ కంపు  మనం సహించలేం . కాబట్టి  శీత , సౌరభ , మంద పవనాలే అందమైన  పవనాలు .  
ఒక కవి ఆ మూడు లక్షణాలుగల గాలిని అంటే మెల్లగా, చల్లగా, సౌరభంతో వీచే గాలిని ఎంత సహజంగా వర్ర్నిస్తున్నాడో చూడండి . ఆ గాలికి ఆ మూడు లక్షణాలు ఎలా కలిగాయో ఎంత చక్కగా వివరించాడో గమనిద్దాం .  
ముందుగా శ్లోకం చూద్దాం .

లతాం  పుష్పవతీం స్పృష్ట్వా
స్నాతో విమలవారిణా  
పునస్పర్శన  శంకేవ
మందం చలతి మారుత:

 అది ఒక పిల్ల వాయువు . అది పుష్పవతిని { లతను}  తాకిందట . పుష్పవతి అంటే బహిష్ఠు అయిన ( స్త్రీ )దానిని తాకడం వల్ల మైలపడిపోయి౦దట . అందుకని పరిశుభ్రమైన  నీళ్ళలో స్నానం చేసిందట . స్నానం చేసిన తరువాత మళ్ళీ తాకుతానేమో అనే భయంతో మెల్లగా వీస్తో౦దట. ఒక పుష్పవాటిక, ఆ సమీపంలోని కాసారముల మీదుగా మెల్లగా వీస్తున్న గాలిని కవి ఎంత సహజంగా చక్కగా వర్ణించాడో చూడండి . ఇది కవి ప్రతిభకు ఒక మంచి ఉదాహరణ .   

No comments: