Saturday, May 5, 2012

ఒక్కమాటలో భరతుడు


రామాయణం లో రాముని తరువాత చెప్పుకోవలసిన వ్యక్తి భరతుడు. ఒకవిధంగా రామునితో సమానుడని అన్నా తప్పేమీ లేదు. ఆయనది అంతటి విశిష్ట వ్యక్తిత్వం. రాముడు వనాల్లో ఉండి వనవాసం చేస్తే భరతుడు నగరంలో నివసిస్తూనే వనవాసం చేశాడు. రాముడు తండ్రి ఆజ్ఞపై వనవాసం చేస్తే భరతుడు తనకు తానే వనవాస శిక్ష విధించుకున్నాడు. ఆయన గొప్పదనాన్ని పలువురు కవులు పలువిధాలుగా స్తుతించారు. ఇక కాళిదాసున్నాడు చూడండి ఆయన పద్ధతే వేరుగా ఉంటుంది. ఆయన వాల్మీకి మానస పుత్రుడు. వాల్మీకి మార్గానుయాయి. తక్కువ పదాల్లో ఎక్కువ భావాలను ప్రకటించడం వాల్మీకి నుండి సొంతం చేసుకున్నాడు. భరతుని గురించి ఆయన తన మనస్సులోని భావాలను ప్రకటించడం మొదలు పెడితే కొన్ని వందల పుటలు కూడా చాలవు. అందువల్ల ఒక్కమాటలోనే భరతుని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు. ఎలా పథకం వేశాడో సాధించాడో చూడండి. ఇది ఉత్తమ కవులకే సాధ్యం అవుతుంది గాని ఉత్త కవులకు మాత్రం సాధ్యం కానేకాదు.
రావణసంహారం అయింది. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యకు తరలి వస్తున్నాడు. భరతుడు వారిని సాదరంగా ఆహ్వానించడానికి పరివారసమేతుడై నిరీక్షిస్తున్నాడు. అంతలో రాముడు రానే వచ్చాడు. భరతుడు రామునికి భక్తితో నమస్కరించాడు. ఆ తరువాత లక్ష్మణుడికి దణ్ణం పెట్టాడు. చివరకు సీతామహాదేవి దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాలకు మోకరిల్లేడు. ఆయన శిరస్సు అమ్మవారి పాదాలను తాకింది. ఇక్కడే కాళిదాసు తానేమిటో నిరూపించుకున్నాడు. చక్కని శ్లోకం వ్రాశాడు. దానర్థంఇది.
సీతమ్మవారి పాదములు రావణాసురుని యొక్క ప్రార్థనలను త్రోసిపుచ్చినటువంటివి. రావణాసురుడు ఎన్నిసార్లు కాళ్లా వేళ్లా పడి మ్రొక్కినా లొంగక అతని కోరికను తిరస్కరించినటువంటివి. ఇక భరతుని శిరస్సు అన్నమార్గాన్ని అనుసరించడం వల్ల అనగా అన్నగారి రాకను నిరీక్షిస్తూ , తపస్సు చేస్తూ కాలం వెళ్లబుచ్చడంవల్ల ఎటువంటి కేశ సంస్కారం లేక జడలుకట్టినటువంటిది. అటువంటి పాదాలు ఇటువంటి శిరస్సు ఒకదానితో ఒకటి తాకడం వల్ల పరస్పరం పావనమయ్యాయంటాడు కవి. అంటే సీతమ్మవారి పాదాలు తాకడం వల్ల భరతుడు పవిత్రమయ్యాడట. భరతుని శిరస్సు తాకడం వల్ల సీతమ్మ పాదాలు పవిత్రమయ్యాయట. ఆయన శీలం సీతకు కూడా పవిత్రత చేకూర్చగల మహత్తరమయినది. సాధారణంగా సామాన్యమైన కవులు సీతవల్ల భరతుడు పవిత్రమయ్యాడని వర్ణిస్తారు. కాని భరతుని వల్ల సీత పావనమయిందని ఎవరూ అనరు. కాని అసమాన ప్రతిభావిశేషాలు గల కాళిదాసు భరతుని వల్ల సీతకూడ పావనమయిందని వర్ణించడం ద్వారా భరతుని శీలాన్ని ఉన్నతశిఖరాలమీదకెత్తాడు. ఇదంతా "అన్యోన్య పావనం" -అనే ఒక్క పదంతో వ్యక్తం చేశాడు కవి. ఇంతటి మహత్తరమయిన భావాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ శ్లోకాన్ని ఒక్కసారి స్వయంగా చదివి ఆనందిస్తారుగా మరి.
లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తత్
వంద్యం యుగం చరణయో: జనకాత్మజాయా:
జ్యేష్ఠానువృత్తి కుటిలం చ శిరోస్య సాధో
రన్యోన్య పావనమభూదుభయం సమేత్య.
ఈ శ్లోకాన్ని చదివి అర్థాన్ని మననం చేసుకునేకొద్దీ మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది.అందుకునేఅన్నారు కాబోలు 'సంగీత సాహిత్యాలు రెండు సరస్వతికి పాలిండ్ల వంటివి. మొదటిది అంటే సంగీతం అస్వాదించేకొద్దీ మధురం. రెండోది అంటే సాహిత్యం ఆలోచించేకొద్దీమధురం' అని
'సంగీతమపి సాహిత్యం
సరస్వత్యా:స్తనద్వయమ్
ఏకమాపాతమధుర
మన్యదాలోచనామృతం' .


No comments: