Saturday, May 5, 2012

అమ్మో !అన్నికష్టాలే


ఆంధ్రభోజునిగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని పాలిస్తున్న రోజలవి. ఆయన సాహితీసమరాంగణ సార్వభౌముడు.అటు కత్తి ఇటు కలం రెండూ సమానంగా నడిపించగల నిపుణుడు. ఒక వ్యక్తికి అన్ని కష్టాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో వర్ణించమని ఒకసారి ఆయన తన ఆస్థాన కవుల్లో ఒకర్ని అడిగాడు. వెంటనే ఆశువుగా ఇలా చెప్పేడు కవి.
ఒక రోజున ఒకవ్యక్తికి తాను ప్రాణప్రదంగ భావించే గురువు గారు ఇంటికొచ్చారట. అప్పుడే తన ఇంట్లో అన్ని పన్లు చక్కబెట్టే దాసి చచ్చిపోయింది. ఆరోజే కొంతమంది దొంగలు గుర్రాల పై వచ్చి దాడి చేసి ఉన్నవన్నీ ఊడ్చుకు పోయారు. ఆసమయం లోనే అల్లుడు తానుకోరింది కొనివ్వలేదని అలుగుతూ అమ్మాయిని తీసుకుపొమ్మని బెదిరిస్తూ ఊత్తరం వ్రాశాడు. అంతట్లోనే తన ఇల్లాలొకప్రక్క పురిటి నెప్పుల్తో గిలగిల్లాడుతోంది. అదే రోజు మరో అమ్మాయి పెళ్లి జరగబోతోంది. నాడే చేలల్లో విత్తనాలు నాటే సమయం నిర్ణయించారు. ఇంతలో అప్పటి కప్పుడే పక్కింటివాడొచ్చి ' నా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిస్తావా చస్తావా ' అంటూ నిలదీసి అడుగుతున్నాడు. దాంతో అతనికెప్పుడూ లేని చెవిపోటు మొదలై తీవ్రంగా బాధిస్తోంది. ఈ లోపులోనే దొమ్మరివాళ్లు వచ్చి బీభత్సం గా డప్పులు వాయిస్తూ దొమ్మరాట మొదలెట్టారు. అసలే ఆ ప్రాంతం లో కరువు తాండవిస్తోంది. అందులోను ఆ రోజు ఎవరిదో తద్దినం పెట్టవలసిన అగత్యం ఏర్పడింది. ఇన్ని సమస్యలు ఒకేరోజునొస్తే మనిషి పరిస్థితి ఊహించండి.

గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు నల్లునల్కయున్
వరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తియున్
పొరుగున నప్పుబాధ చెవిపోటును వీధిన దొమ్మరాటయున్
కరవు దరిద్రమాబ్ధికము గల్గె నొకప్పుడు కృష్ణభూవరా!



ఒక్కమాటలో భరతుడు


రామాయణం లో రాముని తరువాత చెప్పుకోవలసిన వ్యక్తి భరతుడు. ఒకవిధంగా రామునితో సమానుడని అన్నా తప్పేమీ లేదు. ఆయనది అంతటి విశిష్ట వ్యక్తిత్వం. రాముడు వనాల్లో ఉండి వనవాసం చేస్తే భరతుడు నగరంలో నివసిస్తూనే వనవాసం చేశాడు. రాముడు తండ్రి ఆజ్ఞపై వనవాసం చేస్తే భరతుడు తనకు తానే వనవాస శిక్ష విధించుకున్నాడు. ఆయన గొప్పదనాన్ని పలువురు కవులు పలువిధాలుగా స్తుతించారు. ఇక కాళిదాసున్నాడు చూడండి ఆయన పద్ధతే వేరుగా ఉంటుంది. ఆయన వాల్మీకి మానస పుత్రుడు. వాల్మీకి మార్గానుయాయి. తక్కువ పదాల్లో ఎక్కువ భావాలను ప్రకటించడం వాల్మీకి నుండి సొంతం చేసుకున్నాడు. భరతుని గురించి ఆయన తన మనస్సులోని భావాలను ప్రకటించడం మొదలు పెడితే కొన్ని వందల పుటలు కూడా చాలవు. అందువల్ల ఒక్కమాటలోనే భరతుని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు. ఎలా పథకం వేశాడో సాధించాడో చూడండి. ఇది ఉత్తమ కవులకే సాధ్యం అవుతుంది గాని ఉత్త కవులకు మాత్రం సాధ్యం కానేకాదు.
రావణసంహారం అయింది. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యకు తరలి వస్తున్నాడు. భరతుడు వారిని సాదరంగా ఆహ్వానించడానికి పరివారసమేతుడై నిరీక్షిస్తున్నాడు. అంతలో రాముడు రానే వచ్చాడు. భరతుడు రామునికి భక్తితో నమస్కరించాడు. ఆ తరువాత లక్ష్మణుడికి దణ్ణం పెట్టాడు. చివరకు సీతామహాదేవి దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాలకు మోకరిల్లేడు. ఆయన శిరస్సు అమ్మవారి పాదాలను తాకింది. ఇక్కడే కాళిదాసు తానేమిటో నిరూపించుకున్నాడు. చక్కని శ్లోకం వ్రాశాడు. దానర్థంఇది.
సీతమ్మవారి పాదములు రావణాసురుని యొక్క ప్రార్థనలను త్రోసిపుచ్చినటువంటివి. రావణాసురుడు ఎన్నిసార్లు కాళ్లా వేళ్లా పడి మ్రొక్కినా లొంగక అతని కోరికను తిరస్కరించినటువంటివి. ఇక భరతుని శిరస్సు అన్నమార్గాన్ని అనుసరించడం వల్ల అనగా అన్నగారి రాకను నిరీక్షిస్తూ , తపస్సు చేస్తూ కాలం వెళ్లబుచ్చడంవల్ల ఎటువంటి కేశ సంస్కారం లేక జడలుకట్టినటువంటిది. అటువంటి పాదాలు ఇటువంటి శిరస్సు ఒకదానితో ఒకటి తాకడం వల్ల పరస్పరం పావనమయ్యాయంటాడు కవి. అంటే సీతమ్మవారి పాదాలు తాకడం వల్ల భరతుడు పవిత్రమయ్యాడట. భరతుని శిరస్సు తాకడం వల్ల సీతమ్మ పాదాలు పవిత్రమయ్యాయట. ఆయన శీలం సీతకు కూడా పవిత్రత చేకూర్చగల మహత్తరమయినది. సాధారణంగా సామాన్యమైన కవులు సీతవల్ల భరతుడు పవిత్రమయ్యాడని వర్ణిస్తారు. కాని భరతుని వల్ల సీత పావనమయిందని ఎవరూ అనరు. కాని అసమాన ప్రతిభావిశేషాలు గల కాళిదాసు భరతుని వల్ల సీతకూడ పావనమయిందని వర్ణించడం ద్వారా భరతుని శీలాన్ని ఉన్నతశిఖరాలమీదకెత్తాడు. ఇదంతా "అన్యోన్య పావనం" -అనే ఒక్క పదంతో వ్యక్తం చేశాడు కవి. ఇంతటి మహత్తరమయిన భావాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ శ్లోకాన్ని ఒక్కసారి స్వయంగా చదివి ఆనందిస్తారుగా మరి.
లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తత్
వంద్యం యుగం చరణయో: జనకాత్మజాయా:
జ్యేష్ఠానువృత్తి కుటిలం చ శిరోస్య సాధో
రన్యోన్య పావనమభూదుభయం సమేత్య.
ఈ శ్లోకాన్ని చదివి అర్థాన్ని మననం చేసుకునేకొద్దీ మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది.అందుకునేఅన్నారు కాబోలు 'సంగీత సాహిత్యాలు రెండు సరస్వతికి పాలిండ్ల వంటివి. మొదటిది అంటే సంగీతం అస్వాదించేకొద్దీ మధురం. రెండోది అంటే సాహిత్యం ఆలోచించేకొద్దీమధురం' అని
'సంగీతమపి సాహిత్యం
సరస్వత్యా:స్తనద్వయమ్
ఏకమాపాతమధుర
మన్యదాలోచనామృతం' .


పట్టుపరిశ్రమ


అఘాయిత్యమైనా ఉండాలి అక్షరమైనా ఉండాలి అన్నది ఆ నాటి మాట. పరిశ్రమైనా ఉండాలి లేక పట్టు పరిశ్రమైనా ఉండాలి అనేది ఈ నాటి మాట. కష్టపడి పై కొచ్చేవాళ్ళు ఈ సమాజం లో ఎంతో మంది ఉన్నారు. వారి ప్రగతికి కారణం పరిశ్రమ . కానీ ఏ కష్టం లేకుండానే పైకొచ్చే వాళ్లు ఇంకా ఎక్కువమంది కన్పిస్తారు. వారి పరిశ్రమ కేవలం పట్టుపరిశ్రమే. పట్టుపరిశ్రమంటే వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లూ పట్టుకుని అడ్డత్రోవలో ఏదో స్థానం సంపాదించడం. వారికి ఉద్యోగం లో చేరాక ఏ పని పాట ఉండదు. అందుకని ఆ రంగం లోను ఈ రంగం లోను చెయ్యి పెట్టి వీరంగం ఆడుతూ ఉంటారు. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ అన్నట్లు వీరికి సరుకు తక్కువ సణుగుడు ఎక్కువ. దానికి తగ్గట్టు పట్టు పరిశ్రమ ద్వారా అందర్ని ఆకట్టుకుంటారు. వారికెక్కడా ఎదురుండదు. వారే అందరికి ఎదురు. ఇటువంటి వాళ్ల గురించి సుప్రసిద్ధ సంస్కృత కవి జగన్నాథ పండితరాయలు ఒక చక్కని శ్లోకం రచించాడు.అది ఎంత బాగుంటుందో చూడండి. .
ఓ గాడిదా! ఎందుకే నువ్వు అనవసరంగా వాళ్ల బట్టలు వీళ్ల బట్టలు మోస్తూ ఆ గడ్డి ఈ గడ్డి తింటూ భారం తో కాలం గడుపుతున్నావ్. ఒక పని చెయ్యి. ఎవర్నో పట్టుకో . ఎలాగోలాగ రాజుగారి గుఱ్ఱపు శాల్లో దూరిపో. నీకు ఎటువంటి శ్రమ ఉండదు. కాలు కదపక్కరలేదు. అక్కడ నీకు చాల బలమైన ఆహారం దొరుకుతుంది. సెనగలు ఉలవలు ఇంకా మరెన్నో చక్కగా తినొచ్చు. అక్కడ ఉండే వాళ్లకి నువ్వేం భయపడక్కరలేదు. ఎందుకంటె తోకున్న ప్రతీ దాన్నీ గుఱ్ఱం అనే వాళ్లనుకుంటారు. రాజుకేం తెలీదు అందుకని వాళ్లు చెప్పిందే నమ్ముతాడు. మిగిలిన వాళ్లంతా ఏం పట్టించుకోరు. అధికారుల అజ్ఞానం, రాజు అసమర్థత, మిగిలినవారి ఉదాసీనత ఇవన్నీ నీకు చాలా కలిసొస్తాయి. భయపడకుండా నెను చెప్పింది చెయ్యి. సుఖపడతావ్.
ఇంత భావాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ సంస్కృత శ్లోకాన్ని కూడ తిలకించండి మరి.
-రేరే రాసభ ! వస్త్రభారవహనాత్కుగ్రాసమశ్నాసి కిమ్?
రాజాశ్వావసధం ప్రయాహి చాణకాభ్యూషాన్సుఖం భక్షయ
సర్వాన్ పుచ్ఛవతో హయా ఇతి వదంత్యత్రాధికారే స్థితా:
రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్ఠా: పరే

ఎక్కాలొస్తే చిక్కులు తప్పుతాయి


అవి ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులు. ఆయన స్వయంగా కవిత్వం చెప్పేవాడు. దాంతో పాటు కవిపోషకుడు కూడ. ఆయన ఆస్థానంలో ఎంతోమంది కవులుండేవారు. వారిలో ఒక కవి రామభక్తుడు. ఒకసారి సభలో 'రాముడు గొప్పవాడా లేక కృష్ణుడు గొప్పవాడా' అనే వాదన ప్రారంభించారు. ఆ మహారాజు కృష్ణభక్తుడు . అందువల్ల కృష్ణుడే గొప్పవాడన్నాడు. మిగిలినకవులంతా రాజును వ్యతిరేకించడమెందుకని కృష్ణుడే గొప్పవాడని వంత పలికేరు. కాని రామభక్తుడైన ఒకకవి మాత్రం ఇద్దరిలో రాముడే గొప్పవాడన్నాడు. రాజు అహం దెబ్బతింది. కాని ఏం చెయ్యగలడు?. ఆ కవితో ఏమయ్యా! స్వయంగా నేను నాతో పాటు ఇంతమంది సభ్యులు కృష్ణుడే గొప్పవాడని చెబుతోంటే నువ్వు రాముడంటున్నావ్. ఎంత ధైర్యం నీకు. నీ అభిప్రాయం మార్చుకో లేకపోతే సమర్థించుకో. నీకు ఒక రోజు గడువిస్తున్నాను. రేపు సభలో నీ అభిప్రాయం తెలియజెయ్యి . లేకపోతే నాసభలో నీకు చోటుండదు సరి కదా శిక్ష కూడ అనుభవించ వలసి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు. వెంటనే అక్కడనుంచి బయటికి పంపించేశాడు.
పాపం ఆ కవికి ఏం చెయ్యాలో తోచలేదు. ఉన్న ఉపాధి ఊడిపోయింది. 'నిరాశ్రయా: న శోభంతే పండితా: వనితా: లతా:' అన్నారు పెద్దలు. అంటే పండితులకు, స్త్రీలకు, లతలకు ఆశ్రయం ఉంటేనే కదా రాణింపు రేణింపును. అందువల్ల భారమంతా రాముని మీదే వేశాడు. నన్ను రక్షించే బాధ్యత నీదే కాబట్టి కాపాడమని రాముణ్ణి పదే పదే వేడుకున్నాడు. వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. సహజంగా కవి కదా! దాన్ని ఒక శ్లోకరూపంగా మార్చాడు. మరునాడు ధైర్యం గా సభకు హాజరయ్యాడు. ఏమిటి నీ సమాధానం అన్నాడు రాజు కవి వైపు చూస్తూ . అందుకున్నాడు కవి.
రాజా! సామాన్యులు ఎనిమిదో ఎక్కం లాంటి వారు. మహాత్ములు తొమ్మిదో ఎక్కం లాంటివారు. కృష్ణుడు ఎనిమిదో ఎక్కమైతే రాముడు తొమ్మిదో ఎక్కం. తమరొకసారి ఎనిమిదో ఎక్కాన్ని పరిశీలించండి.
8x1=8
8x2=16(1+6=7)
8x3=24(2+4=6)
8x4=32(3+2=5)
8x5=40(4+0=4)
8x6=48( 4+8=12.1+2=3)
8x7=56(5+6=11,1+1=2)
8x8=64( 6+4=10, 1+0=1
చూశారా మహారాజా! ఎనిమిదో ఎక్కం. అంకెల మొత్తం రాను రాను దిగజారుతు వచ్చింది. ఇక కృష్ణుడు అష్టమి నాడు పుట్టిన విషయం అందరికి తెలిసిందే. మరి తొమ్మిదో ఎక్కాన్ని పరిశీలించండి.
9x1=9
9x2=18(1+8=9)
9x3=27( 2+7=9)
9x4=36(3+6=9)
9x5=45(4+5=9)
9x6=54(5+4=9)
9x7=63(6+3=9)
9x8=72(7+2=9)
9x9=81(8+1=9)
9x10=90( 9+0=9)
9x11=99(9+9=18,1+8=9)
9x12=108(1+0+8=9)
ఇది రాను రాను పెరుగుతూ వస్తోంది. అంతే కాకుండా దాని లబ్ధం ఎటువంటి మార్పులు లేకుండ ఒకే విధంగా ఉంది. నవమి నాడు పుట్టిన వాళ్లు కూడ సుఖదు:ఖాల్లో ఎటువంటి ఒడుదుడుకులు లేకుండ ఒకేవిధంగా ఉంటారు. రాముడు నవమి నాడు పుట్టిన విషయం మీకు తెలియనిది కాదు మహారాజా! అందుకే రాముణ్ణి గొప్పవాడని అన్నాను తప్పంటారా! అన్నాడు.
వాస్తవమేదైన కవి యొక్క గణితశాస్త్ర పాండిత్యం, చమత్కారం, తెలివితేటలు రాజుకు బాగా నచ్చాయి. ఆస్థానంలో అందరికంటే ఎత్తు పీట వేసి కూర్చోపెట్టేడు. ఇది ఆయన చెప్పిన శ్లోకం
అసతాం చరితం చిత్ర మష్టభిర్గుణితం యథా
సతాం హి చరితం చిత్రం నవభిర్గుణితం యథా. -
చూశారా! ఎక్కాలొస్తే చిక్కులెలా తప్పుతాయో. కాబట్టి పిల్లలు ఎక్కాలుబాగ కంఠస్థం చేస్తే మంచిది.

Friday, May 4, 2012

నా పెళ్లమే నయం


పూర్వకాలం ఒక ఊళ్లో ఒక గురువు ఉండేవాడు. ఆయన వద్ద కొంతమంది శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆయన శిష్యుల్ని తన సొంత పిల్లల్లా ప్రేమించి ఆదరించేవాడు. పిల్లలకి ఆయనంటే ఎంతప్రేమో అంత భయం కూడ ఉండేది. ఆయన వాళ్లని పండుగలకు పబ్బాలకు ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పండుగనాడు ఇంటికి భోజనానికి రమ్మని అందర్ని పిలిచాడు.అందరు వెళ్లారు. గురువు గారి భార్య అందరికి వడ్డిస్తోంది. ఒక పిల్లవాడికి వడ్దన చేస్తుండగ అన్నం ఆకులో కాకుండ కొంచెం కిందపడింది. అంతే గురువుగారికి చాల కోపం వచ్చేసింది. "ఏమే! కళ్లు మూసుకుపోయాయా? కొంచెం చూసి వడ్డించు" అన్నాడు. అంతే ఆవిడ అపరకాళి ఐపోయింది. ఆ అన్నం కుండ ఆయన నెత్తిమీద గుమ్మరించింది. అనుకోని సంఘటనకి ఆయన విస్తుపోయాడు. శిష్యులముందు చాల అవమానం జరిగింది. కాని ఏమీ చెయ్యలేకపోయాడు. శిష్యులు తమలో తాము ఏవో గుసగుసలాడు కుంటున్నారు. అవేమీ సరిగా వినబడలేదుగానీ'ఒరేయ్! మన గురువుగారు మనకు పులిలా కనిపిస్తారు గాని ఆవిడ ముందు పిల్లేరా! అనే మాట మాత్రం వినిపించింది. ఆ మాటన్న కుర్రాణ్ణి కూడ గమనించాడు. కాని ఏమీ అనలేక పోయాడు. భోజన కార్యక్రమం ఎలాగో ముగిసింది.
కాలం కూడ చాల వేగంగా గడిచిపోయింది. శిష్యులు చదువు పూర్తి చేసుకునిఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లల్లో చాలామందికి పెళ్లిళ్లయ్యాయి. కాపరాలు కూడ చేసుకుంటున్నారు. ------ఒకనాడు గురువు గారు ఏదో పనిమీద పొరుగూరు వెళ్లారు. అక్కడొక శిష్యుడు కనిపించాడు. వాడెవడో కాకోరికమన్నించిదు పూర్వం ఆయన్ని ఆక్షేపించినవాడే. వాడు మరిచిపోయాడేమోగాని గురువుగారు మరిచిపోలేదు. సరే ఆ విషయం అలా ఉంచుదాం. వాడు గురువుతో ' అయ్యా! గురువుగారూ! మీరీ పూట నాకోరికమన్నించి మా ఇంటికి అతిథిగా విచ్చేయాలి అని వినయపూర్వకంగా అభ్యర్థించాడు. వాడి కోరిక కాదనలేకపోయారాయన. వాడి భార్యను ఒకసారి చూసినట్టు కూడ ఔతుందని సరే అన్నారు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. శిష్యుడు తనభార్యను గురువు గారికి పరిచయం చేశాడు. ఆమె భక్తితో ఆయనకు పాదాభివందనం చేసింది. ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యాడు. భోజనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆమె చిన్నపిల్లకదా! సిగ్గుతోను వినయం తోను మెల్లమెల్లగా వడ్డిస్తోంది. ఈ లోపుగా శిష్యుడికి విపరీతబుద్ధి పుట్టింది. ఏంటీ తాబేలు వాహనంలా అంత మెల్లగా వడ్డిస్తున్నావు. కొంచెం వేగంగా వడ్డించలేవూ!అన్నాడు వెటకారంగా. అంతే ఆమె క్షణంలో ప్రళయకాల చండికగా మారిపోయింది. అన్నం కుండని వాడి నెత్తిమీద బోర్లించింది. కుండతో బాటు వాడి గుండుకి కూడా చిల్లు పడింది. దాంతో సరిపెట్ట లేదు. కుండకు డబ్బులు ఇస్తావా చస్తావా అని జుట్టుపట్టు కుని నిలదీసింది. హఠాత్తు గా జరిగిన ఈ సంఘటనకి అదిరిపోయారు గురువుగారు. వెంటనే ఇలా అందుకున్నారు.
అహన్యహని భాండాని
భిన్నాని మమ మస్తకే
అహో ! గుణవతీ భార్యా
భాండమూల్యం న పృచ్ఛతి.

( ఇంతవరకు ప్రతిరోజు ఎన్నో కుండలు నానెత్తి మీద పడి పగిలిపోయాయి.ఆహా! నాభార్య ఎంత మంచిది. ఏనాడు కుండ కు డబ్బిమ్మని నన్ను నిలదీయలేదు. గుండు పగలకొట్టినా కుండ డబ్బులడగలేదు).****

సంస్కృతసాహిత్యంలో పేరడీ కవిత

-->
ఆధునిక సాహిత్యం లో ఎన్నో కవితా ప్రక్రియలున్నాయి. వాటిలో పేరడీ ఒకటి. వాస్తవానికి ఈ పేరడి పదం 'parioda'అనే గ్రీకుభాషాపదం నుండి ఆంగ్లసాహిత్యంలోకి వచ్చింది. ఇతరులు రచించిన ఒక పద్యాన్ని గాని గద్యాన్ని గాని మాటను గాని హాస్య రసాన్ని జోడిస్తూ అనుకరించడం పేరడీ అనవచ్చు.
 
Parody is a humorous imitation of a serious writing. A Parody follows the form of the original , but often changes its sense , thus making fun of the writer's characteristics (Sankaranarayana, English-English-Telugu Dictionary)
1. A humarous exhaggirated imitation of an author, literary work ,style etc.
  1. A feeble imitation.
సాధారణంగా కవులలో గల హాస్యప్రియత్వం, ఆక్షేపధోరణి, సంఘసంస్కరణాభిలాష ఈ పేరడీకవిత పుట్టడనికి కారణాలౌతున్నాయి. కారణాలేవైనా చమత్కారం పుట్టించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. పేరడి అనే ఈ ఆధునిక కవితా ప్రక్రియ అన్ని భాషా సాహిత్యాల్లోను పుష్కలంగ ఉంది. ఉదాహరణకి సుమతీ శతకం లో

అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడునెడ తెగకపాఱునేరును ద్విజుడున్
చొప్పడిననూరనుండుము
చొప్పడకున్నట్టియూరుచొరకుము సుమతీ!
అనే పద్యం ఉంది. దానికి పేరడీగా ఒకకవి ఇలా మరొక పద్యం వ్రాశాడు.

అప్పచ్చులతో వేడిగ
నెప్పుడు భోజనము పెట్టునిల్లోహొటలో
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతీ!

అతిప్రాచీనభాషల్లో ఒకటైన సంస్కృతంలో కూడ ఈ ప్రక్రియ కనబడడం ఒకవిశేషం. దీన్నిబట్టి సంస్కృతం ఆధునికంలో ఆధునికం ప్రాచీనంలో ప్రాచీనమని చెప్పక తప్పదు .
పేరడీ కవులు పరమపవిత్రమైన వేదాన్ని కూడా విడిచిపెట్టలేదు. దాన్ని కూడ పేరడీ చేశారు. భోజనప్రియులైన కొంతమంది పేరడీ కవులు వేదం లోని చమకాన్ని
' ఇడ్లీ చ మే ఉప్మా చ మే పూరీ చ మే చట్నీ చ మే చపాతీ చ మే
అని అనుకరించారు. ఇక లౌకికసాహిత్యం తీసుకుందాం. భగవద్గీ త కు సంబంధించిన కర్మయోగం లో ఒక శ్లోకం ఉంది.

"సన్యాస: కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ
తయోశ్చ కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతే "

కర్మలను విడిచిపెట్టడం సన్యాసం. ఫలితాలను ఆశించకుండాకర్మలను చేస్తూనే ఉండడం కర్మయోగం. మోక్షం పొందడానికి ఈ రెండు మార్గాలూ మంచివే. ఐతే ఈ రెండిట్లోను రెండోది అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మలను ఆ చరించడం ఇంకా చాల మంచిది. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. దీన్ని అనుకరిస్తూ చాయపానప్రియుడు, ప్రతిభావంతుడు ఐన ఒక హాస్య కవి 'టీ' యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ ఏ మంటున్నాడో చూడండి.

"కాఫీపానం చ టీపానం నిశ్రేయసకరే ఉభే
కాఫీటీపానయోర్మధ్యే టీపానం విశి ష్యతే "

కాఫీ త్రాగడం , టీ త్రాగడం రెండూ ఆరోగ్య కరమే. కాని ఈ రెండింటిలో 'కాఫీ ' కన్న 'టీ' మరింత ఆరోగ్యకరం. 'కాఫీ'మరియు 'టీ' ఈరెండూ ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కల్గిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని రెండిటిలోను'టీ'యే మంచిదంటాడు కవి. అసందర్భం అనుకోకుండా అదెందుకో తెలుసుకుందాం.
అమృతం కోసం దేవతలు రాక్షసులూ కలిసి పాలసముద్రాన్ని చిలికారు. ముందుగ కాలకూట విషం వచ్చింది. ఆ తరువాత 'పీయూషం ' అంటే అమృతం వచ్చింది. రాక్షసులకు కాలకూటం దొరికింది. దేవతలు అమృతం చేజిక్కించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న మనుషులకు ఒళ్లు మండి పోయింది. వెంటనే బ్రహ్మ దగ్గరకెళ్లారు. "అందరికి అన్ని అందాయి . మాకేమీ లేదా!” అనడిగారు నిష్ఠూరంగ. బ్రహ్మ వాళ్లను సంతృప్తి పరచడం కోసం కాలకూటం లోంచి 'కా' ను పీయూషం లోంచి "పీ" ని వేరు చేసి ''కాఫీ" తయారుచేసి ఇస్తేగాని వాళ్లు ఊరుకోలేదు. అందుకే

"కాలకూటంచ దైత్యానాం పీయూషం చ దివౌకసాం
ఉభౌ మిళిత్వా మర్త్యానాం కాఫీ భూలోకవాసినాం
అన్నారు పెద్దలు.
కాబట్టి కాలకూటవిషం లో ఉండే మాదకశక్తి , అమృతం ఉండే రుచి ఈ రెండూ కాఫీలో ఉన్నాయి. అందుకే కాఫీ కంటే టీ మంచిదన్నారేమో పెద్దలు. ఆ సంగతలా ఉంచుదాం. భగవద్గీతలో మరో శ్లోకముంది.

"చతుర్విధా: భజంతే మాం జనా: సుకృతినోర్జున!
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ!

ఓ అర్జున! నన్ను నాలుగు రకాల మనుష్యులు కొలుస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవారు, ఏదోతెలుసుకోవాలనే తపన గల వాళ్లు, ఏవో కోరికలు గలవారు మరియు జ్ఞానులు .
ఈ శ్లోకాన్ని మనసులో పెట్టుకుని సుప్రసిద్ధ పండితులు శ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఒక శ్లోకం రచించారు. అదెంతబాగుందో చూడండి.

చతుర్విధా: భజంతే మాం జనా: సుచతురా: ప్రభుం
కవయ: కార్యకర్తార: కాంతా: కార్యాక్షమాశ్చ యే

ప్రభువునైన నన్ను నాలుగు రకాల వాళ్లు కొలుస్తూ ఉంటారు. మొదటివారుకవులు. రెండోవారు పనులు కావలసిన వారు. మూడోవారు ఆడవాళ్లు. నాలుగోవారు ఏ పని చేయలేని వాళ్లు. ఈ శ్లోకం పొగడ్తలకు, ప్రలోభాలకు లొంగే ఈ నాటి రాజకీయనా యకులకు చాల బాగ వర్తిస్తుంది.

ఇంకోటి చూద్దాం. రామాయణం లో ఒక ఘట్టం ఉంది. రాముడు సీతావియోగదు:ఖంతో ఉన్నాడు. వానరులు కొన్ని బంగారు ఆభరణాలు రాముని ముందుంచి అవి సీతవి అవునో కావో చెప్పమన్నారు. ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. సీతమ్మ ఆభరణాలను గుర్తించే పరిస్థితిలో లేడు. అందుకని ఆ పని లక్ష్మణుడికి అప్పగించాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో అన్న మాటలివి.

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురే త్వభి జానామి నిత్యం పా దాభివందనాత్

అన్నయ్యా! నేనెల్లప్పుడూ వదిన గారి పాదాలు మాత్రమే చూసేవాణ్ణి దణ్ణం పెట్టుకునే వాణ్ణి. అందువల్ల ఆమె భుజాలకు పెట్టుకునే కేయూరాలెలా ఉంటాయో నాకు తేలీదు. అలాగే చెవులకు పెట్టుకునే కుండలాలెలా ఉంటాయో తెలీదు. కానీ కాళ్లకు పెట్టుకునే నూపురాలు మాత్రం వదినమ్మవో కావో చెప్పగలను అన్నాడు.
ఈ శ్లోకాన్ని అనుసరిస్తూ ఒక అద్భుతమైన పేరడీ సృష్టించారు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. పాఠాలు చెప్పకుండానే అందర్నీ కాకా పడుతూ కాలక్షేపం చేసే కుహనా ఉపాధ్యాయుల్ని దుయ్యబట్టేరు.

"నాహం జానామి పాఠ్యాంశాన్
నాహం జానామి పాఠనం
జానామిత్వధికారస్థాన్
నిత్యం పాదాభివందనాత్"

చెప్పవలసిన పాఠాలేమిటో నాకు తెలీదు. పాఠం ఎలాచెప్పాలో కూడ నాకు తెలీదు. కాని విద్యాశాఖలో పనిచేసే అధికారులెవరో వాళ్లు మాత్రం బాగా తెలుసు . ఎందుకంటే వాళ్ల కాళ్లకు రోజు నేను దణ్ణం పెడుతూ ఉంటాను కాబట్టి . మరొకటి చూద్దాం.
కాళిదాస మహాకవి రఘువంశం అనే మహాకావ్యాన్ని రచించారు. ముందుగా కావ్యనాయకులైన రఘువంశరాజుల గుణ గాణాలను వర్ణిస్తూ

'శైశవేభస్త విద్యానాం యౌవనే విషయైషిణాం
వార్ధకే మునివృ త్తీనాం యోగేనాంతే తనుత్యజాం'
అనే అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఆ రఘువంశ చక్రవర్తులు బాల్యంలో అన్ని విద్యలు నేర్చుకునేవారట . యౌవనంలో సకలసౌఖ్యాలూ అనుభవించేవారట. వార్ధక్యం లో మునులవలే తపస్సు చేసుకుంటూ చివరిదశలో యోగమార్గంలో శరీరాన్ని విడిచిపెట్టేవారట.

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒక ఆధునికకవి నేటి కాలం లో కొంతమంది దినచర్యను సున్నితం గా ఆక్షేపిస్తూ ఇలా వ్రాశారు.

'శైశవే ధ్వస్తవిద్యానాం యౌవనే విషయైషిణాం
వార్ధకే శనివృత్తీనాం రోగేణాంతే తనుత్యజాం'

ఆనాటి వాళ్లు అంతటి వారైతే ఈ నాటి వారు ఎంతటి వారో స్వయం గా చూడండి. వీరు బాల్యం లో చదువు మాటే ఎత్తరట. యౌవనంలో మాత్రం సకలభోగాలు అనుభవిస్తారట. ఇక ముసలితనం లో శనిగ్రహంలా అందరిని ఏడిపించుకు తింటూ చివరదశలో సకలరోగాలతో తీసుకు తీసుకు చస్తారట. మన సంస్కృతి ఏ స్థాయి నుండి ఏ స్థాయి కి దిగజారిందో తెలుసు కోడానికి ఈ రెండు శ్లోకాలు చాలు.
మరో పేరడి చూద్దాం

కాలో వా కారణం రాజ్ఞ: రా జా కాలస్య కారణం
ఇతి తే సంశయో మాభూద్రాజా కాలస్య కారణమ్.

రాజుకు కాలం కారణమా లేక రాజే కాలానికి కారణమాఅని సందేహించక్కరలేదు.రాజే కాలానికి కారణం.రాజు కాలాన్ని బట్టి మారతాడా! లేక రాజే కాలాన్నికూడ మరుస్తాడా!అంటే రాజే కాలాన్నికూడమార్చగలడని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒకకొంటె కవి హాస్య రసాన్ని మేళవించి మరోసరసమైన శ్లోకం వ్రాశాడు.

"కుక్కుట్యా: కారణం వాండం కుక్కుటీవాండకారణం
ఇతి వాం సంశయో మాభూదుభయం తృప్తి కారణం"

ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు.వారిలో ఒకడు గ్రుడ్డుకు కోడి కారణమంటాడు. రెండో వాడు కోడికే గ్రుడ్డు కారణమంటాడు. వాళ్లిద్దరు ఎప్పటికి ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కాలం గడిచినా వాదం ముగియడం లేదు. అంతలో హఠాత్తుగా మూడోవ్యక్తి ప్రవేశించాడు. ఇలా అందుకున్నాడు. కోడికి గ్రుడ్డు కారణమా! లేక గ్రుడ్డే కోడికి కారణమా! అని మీరు వాదులాడుకోవలసిన పనిలేదు. ఎందుకంటే పుంజు పెట్టల కలయికే ఈ రెండింటికి మూలకారణం అన్నాడు కొంటెగా. వాదోపవాదాలతో కాలహరణం చేసేవారికిదొక చురక.
ఇటువంటి పేరడీ కవితలు సంస్కృతంలో కోకొల్లలుగా ఉన్నాయి . కొన్ని మాత్రమే ఇందులో పేర్కోడం జరిగింది. ఈ పేరడిప్రక్రియలో కూడా సంస్కృత సాహిత్యం ఇతర సాహిత్యాలు దేనితోను తీసిపోదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సమాజం లో మంచిమార్పులు తీసుకురాడానికి ఈ ప్రక్రియ కూ డ ఇతోధికంగా తోడ్పడుతుందని ఆశిద్దాం.

పేరడీ కవిత సినిమా పాటల్లో ఎక్కువగా కనిపిస్తుంది . మచ్చుకు నన్ను దోచుకుందువటే  అనే డాక్టర్ . సి. నారాయణ రెడ్డి గారి గీతానికి   శ్రీ తాళాభక్తుల లక్ష్మీప్రసాద్ గారి పేరడీ గీతాన్ని ఆస్వాదించండి .

నన్ను పీక్కు తిందువటే వన్నెల నా భార్యా
అన్నములో  నంజుకొందు నిన్నే నా సూర్యా - నిన్నే నా సూర్యా
                                         --- నన్ను పీక్కు తిందువటే---
హరియి౦తును నీ సొమ్మును సరదాలకు ఖర్చు పెట్టి
గడ్డిపరక వోలె కర్పూరకళిక వోలె  - కర్పూరకళిక వోలె
ఎంతటి నెరజాణవొ నా కొంప ముంచినావు నీవు
కలకాలం ఊడని గొల్ళెమును వేసినావు -   గొళ్లెమును వేసినావు
                                     -- నన్ను పీక్కు తిందువటే---
నా మనసే గాలముగా నీవే చిఱు చేపవుగా
దొరికినావు బాబు  నే కొరికితిందు రోజు   కొరికి తిందు రోజు
ఏ నాటిదొ ఆ పాపం ఎరుగరాని విధి కోపం                                         
ఎన్ని యుగాలైనా ఇది వదలిపోని శాపం - వదలిపోని శాపం
                                 -- నన్ను పీక్కు తిందువటే---

రచయిత:-- శ్రీ తాళాభక్తుల లక్ష్మీప్రసాద్



..........................