Monday, November 11, 2013

మెత్తవాణ్ణి చూస్తే మొత్తబుద్ధి


మెత్తవాణ్ణి చూస్తే మొత్త బుద్ధి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సూర్యగ్రహణం కంటే చంద్రగ్రహణం ఎక్కువసార్లు వస్తుంది. దానికి గల కారణం శాస్త్రీయంగా అందఱికి తెలిసిందే. దానికి సాహిత్యపరమైన మఱొక కారణం కూడ ఉంది . అదేమిటో కొంచెం తెలుసుకుందాం.

దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం హోరాహోరీగా పాలసముద్రాన్ని చిలికారు. ముందుగా కాలకూటవిషం వచ్చింది. అది శివుడికి అంటగట్టారు. ఆ తరువాత ఎన్నెన్నో విలువైన వస్తువులు వచ్చాయి. అందఱు ఎవళ్లకిష్టమైనవి వాళ్లు దక్కించుకున్నారు . సరే ఆ విషయం అలా ఉంచుదాం.

చిట్ట చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దేవతలకు అసలైన అమృతం దక్కాలని రాక్షసులకు దక్కకూడదని ముందే నిర్ణయం జరిగింది. రాక్షసులు ఒకవరుసలోను దేవతలొకవరుసలోను నిలబడి ఉన్నారు . పంపకాల కార్యక్రమం మొదలయ్యింది. జగన్మోహినీ రూపంలో ఉన్న విష్ణువు దేవతలకు మంచి అమృతాన్ని రాక్షసులకు కల్తీ అమృతాన్ని పంచుతున్నాడు. దేవతల కుతంత్రం గమనించిన రాహువు దొంగచాటుగా వచ్చి దేవతల వరుసలో దూరాడు .ఇది గమనించిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని జగన్మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తెలియజేశారు. కాని విష్ణువు తగిన చర్య తీసుకునే లోపుగానే అమృతం వాడి చేతుల్లో పడడం వాడు ఒక్క గుక్కలో త్రాగేయడం కూడ జరిగిపోయింది. విష్ణువు వెంటనే వాడి తలనరికేశాడు. కాని అప్పటికి అమృతం గొంతుకుదిగి క్రిందికి రాకపోవడంతో తల సజీవంగా ఉండిపోయింది. మొండెం చచ్చి పోయింది .

నాటినుండి వాడు సూర్యచంద్రులిద్దరి మీద పగబట్టాడు. ఆ పగచల్లారలేదు. నాటినుండి నేటి వఱకు కొనసాగుతూనే ఉంది. సమయం దొరికినప్పుడలా మ్రింగడానికి వస్తూ ఉంటాడు. విచిత్రమేమిటంటే సూర్య చంద్రు లిద్దఱు సమానంగానే తప్పు చేసినా రాహువు చంద్రుణ్ణి బాధించినంత ఎక్కువగా సూర్యుణ్ణి బాధించడంలేదు. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే మెత్తగా ఉండడమే కారణం అని అంటాడు మాఘుడు తన 'శిశుపాలవధ' అనే మహాకావ్యంలో. సూర్యుడు తీక్ష్ణంగా కర్కశంగా ఉంటాడు. అతనంటే అందఱికి భయమే. చంద్రుడలా కాదు. మృదుస్వభావం. అందువల్ల అందఱికి అతనంటే లోకువే.

' తుల్యేపSరాధే స్వర్భాను:
భానుమంతం చిరేణ యత్
హిమాంశు మాశు గ్రసతే
తన్మ్రదిమ్న:ఫలం స్మృతం'

రాహువు, తనకు జరిగిన ద్రోహంలో సూర్య చంద్రులిద్దరు సమానంగా బాధ్యులే ఐనప్పటికి
చంద్రుణ్ణి బాధించినంత ఎక్కువగా సూర్యుణ్ణి బాధించడు . దీనికి కారణం చంద్రుడు మెత్తని వాడు కావడమే
ఈ విధంగా శాస్త్రీయ సత్యానికి సాహితీ సౌరభం జతచేసిన మాఘుని ప్రతిభ అసదృశం.

No comments: