Tuesday, November 19, 2013

వాయువ్యాస్త్రం ౨


వాయువ్యాస్త్రం ౨
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

మానవుడు ప్రయోగించిన వాయువ్యాస్త్రం మనకే పరిమితం . ఇక రాక్షసులు ప్రయోగిస్తే ఏమౌతుందో తెలుసుకోవాలంటే శ్రద్ధగా చదవండి.
రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడు. ఆయనకు ఆఱు నెలలు నిద్ర ఆఱు నెలలు తిండి. ఇది మనందరికి తెలిసిన విషయమే. కాని ఆయన అస్త్రాలన్నీ నిద్రలోనే సంధిస్తాడు. ఆయనకే తెలీదు ఎప్పుడు సంధిస్తాడో. అందువల్ల అందరూ చాల జాగ్రత్త పడతారు. జాగ్రత్తగా ఉండమని సమస్త లోకాలకు చాటింపు కూడ వేస్తారు. దీని ప్రభావం మానవలోకానికే పరిమితం కాదు. పదునాలుగు లోకాలలోను ప్రభావం చూపిస్తుంది. క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకాలు. పైన భూలోక, భువర్లోక, స్వర్లోక ,మహాలోక ,జనోలోక,తపోలోక సత్యలోకాలు ఉన్నాయని మన విశ్వాసం. మొత్తం కలసి పదునాలుగు. ఆయన ప్రయోగించబోయే అస్త్రానికి ముందుగా వేసిన చాటింపు ఎంత ఇంపుగా ఉందో మీదే స్వయంగా చూడండి.
పదునాల్గు లోకాల్లో ఉండే సమస్త మహాజనులార! నిద్రపోతున్న కుంభకర్ణుడు అపానవాయువు విడిచిపెడుతున్నాడు. అది భయంకరమైన శబ్దం చేస్తూ భరింపరాని వాసనతో వెలువడేలా ఉంది. అందువల్ల మీరు వెంటనే మీ రెండు చేతులతో చెవి రంధ్రాలను గట్టిగా మూసేసుకోండి. ఓ సప్తకులపర్వతాల్లారా! మీరు భూమిపై గట్టిగా నిలదొక్కుకుని ఉండండి. లేకపోతే బంతుల్లా ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఓ రావణాసురుడా! నువ్వు వెంటనే గుడ్డలతో నీ పది ముక్కులలోని ఇరువది రంధ్రాలను నీ ఇరువది చేతులతో గట్టిగా మూసేసుకో. లేకపోతే నీ పని ఠా. ప్రకటన మీరే స్వయంగా చదువుకుని జాగ్రత్తపడండి.
రేరే లోకా: ! కురుధ్వం శ్రవణ పుటపిధానం ద్రుతం హస్తయుగ్మై:
శైలా: సర్వేSపి యూయంభవత గురుతరా: సావధానా: ధరిత్ర్యాం
శీఘ్రం రే రావణ! త్వం విరచయ వసనైర్నాసికానాం పిధానం
సుప్తోSయం కుంభకర్ణ: కటురవవికటం శర్ఘతే దీర్ఘముచ్చై:
(సుభాషిత రత్నభాండాగారం /౩౬౫/౫౬.)

No comments: