Wednesday, November 13, 2013

అన్నీ ఆయనే


అన్నీ ఆయనే
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
3/106, ప్రేమ నగర్, దయాల్ బాగ్ , ఆగ్రా
09897959425
శివపార్వతుల వివాహం జరుగుతోంది. శుభముహూర్తానికి ముందు పెండ్లికుమార్తె వైపు ఏడుతరాలు పెండ్లికుమారునివైపు ఏడుతరాలు కీర్తిస్తూ ఏకరువు పెట్టడం సాంప్రదాయం . కనీసం మూడుతరాలవారినైనా అంటే తండ్రి, తాత, ముత్తాతలనైన కీర్తించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ఇక శివపార్వతుల వివాహమంటే సామాన్యమైన విషయమేమీకాదు . అపూర్వం అసదృశం. శివ పార్వతుల పెళ్లి కుదర్చడానికి వచ్చిన సప్తర్షులలో ఒకరైన అంగిరసుడు హిమవంతునితో ' ఓ హిమవంతుడా! పర్వతరాజువైన నీవు కన్యాదాతవు. నీ కుమార్తె పార్వతి వధువు. ముల్లోకాలకు ప్రభువైన ఈశ్వరుడు వరుడు. సప్తర్షులమైన మేము పెండ్లి పెద్దలం. నీ ఔన్నత్యానికి ఇంతకంటే ఏం కావాలయ్యా అంటాడు. పెళ్లికి వచ్చిన బంధువులు మిత్రులు సాక్షాత్తు ఇంద్రాది దేవతలు. పెండ్లి చేయిస్తున్న బ్రహ్మ ఎవరో కాదు స్వయంగా చతుర్ముఖ బ్రహ్మయే.
అంతా బాగానే ఉంది . పెళ్లి జరుగుతోంది. పార్వతి వైపు నున్న పురోహితుడు శివునితో నీ తండ్రి ఎవరు ? తాత ఎవరు ? ముత్తాత ఎవరో చెప్పునాయనా ! వాళ్లందరి పేర్లు ఏకరువు పెట్టాలి కదా! అని ఆడిగాడు. కాని శివుడు ఏమని చెబుతాడు . ఆయన పుట్టుక లేనివాడు . ఆదిమధ్యాంతరహితుడు. అసలు తండ్రి ఉంటే గదా తాత పేరు తెలియడానికి. తాత ఉంటే గదా ముత్తాత పేరు తెలియడానికి. అందుకని ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. సిగ్గుతో తలొంచుకోక తప్పలేదు . పరాత్పరుడై ఉండి కూడ మౌనంగా ఉండిపోయాడు. శివుని ముఖ కవళికలు గమనించిన బ్రహ్మ వెంటనే అందుకున్నాడు. “ అందఱు వినండి . ఆయనది హర కులం. ముందుగా వేద కంఠుడు మఱియు ఉగ్రకంఠుడు. ఆపై శ్రీకంఠుడు. ఆ తరువాత నీలకంఠుడు. ఇది ఆయన వంశవృక్షం" అని చెప్పగానే అందఱు ఆశ్చర్యచకితులయ్యారు. అందఱిలో తన గౌరవం కాపాడిన బ్రహ్మ వంక చూస్తూ చిఱునవ్వు చిందించిన చంద్ర శేఖరుడు మనందఱిని రక్షించుగాక.
తాతం తత్తాతతాతం కథయ హరకులే S లంకృతే సంప్రదానే
తచ్ఛ్రుత్వా చంద్రమౌళి: నతముఖకమల: జాతలజ్జో బభూవ
బ్రహ్మాSవాదీత్తదానీం శృణుత హరకులం వేదకంఠోగ్ర కంఠౌ
శ్రీకంఠాన్నీలకంఠ: ప్రహసితవదన: పాతు న: చంద్రచూడ:

No comments: