Sunday, November 24, 2013

అందుకే కొయ్యబాఱిపోయాడు


అందుకే కొయ్యబాఱిపోయాడు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్,ఆగ్రా

సాధారణంగా అన్ని దేవాలయాల్లోను విగ్రహాలు మట్టివి, రాతివి, లోహాల్తో చేసినవి ఉంటాయి. కాని పూరీలో జగన్నాథుని విగ్రహం మాత్రం కొయ్యవిగ్రహం. దానికి కారణం తెలుసుకోవాలంటే ఒక హాస్యకవి చెప్పిన కారణం ఏమిటో చదవండి. విష్ణుమూర్తికి ఇద్దఱు భార్యలు. మొదటి భార్య జ్యేష్ఠా దేవి . ఆవిడెప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అడ్డూ ఆపు లేదు. అతిగా మాట్లాడితే చాల ప్రమాదం కదా . పెదవి దాటితే పృథివి దాటుతుంది. రెండో భార్య లక్ష్మి. ఆవిడ సంగతి సరేసరి అందఱికి తెలిసిందే . స్థిరత్వం లేదు. ఇల్లిల్లూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడెక్కడుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఇక ఒకడే కొడుకు మన్మథుడు . ముల్లోకాల్లోను వాడికి ఎదురు లేదు. అజేయుడు. కాని తుంటరి. ఎవరి మాట వినడు.
పోనీ కనీసం నిద్రలోనైన సుఖం పొందుదామనుకుంటే అదీ కుదరడం లేదు. ఎందుకంటే పాము మీద పడుకోవాలి. ఎప్పుడైనా కఱిచే ప్రమాదముంది. అదేదోవిధంగా సరిపెట్టుకుందాం అనుకుంటే ఆ పడక కూడ సముద్రంలో. ఏ క్షణంలోనైన మునిగిపోయే ప్రమాదముంది . కాబట్టి నిద్రాసుఖం కూడ ఇంచుమించు లేనట్లే. కనీసం అటు ఇటూ సరదాగా తిరుగుతూ ఆనందిద్దామా అంటే వాహనం గరుత్మంతుడు. ఎంత దూరం తీసుకెళ్లగలడో తెలీదు ఎప్పుడు ఎక్కడ ఎలా పడేస్తాడో ఎవరికీ తెలీదు. ఈ విధంగా కుటుంబపరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. ఏ ఒక్కటి అనుకూలంగా లేదు. అందువల్ల ఆ మహావిష్ణువు తన కష్టాల్ని తలుచుకుని తలుచుకుని బాధతో కొయ్యబాఱిపోయాడట.

ఏకా భార్యా ప్రకృతిముఖరా చంచలా చ ద్వితీయా
పుత్రస్త్వేకో భువనవిజయీ మన్మథో దుర్నివార:
శేష: శయ్యా శయనముదధౌ వాహనం పన్నగారి:
స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి:
(ఘటఖర్పరకావ్యం. నీతి. ౧౪)

No comments: