Sunday, November 24, 2013

కోతలే కోతలు

-->
కోతలే కోతలు
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
/౧౦౬, ప్రేమ నగర్, దయాల్ బాగ్ , ఆగ్రా

శివుడు గంగాధరుడు. పరాయి ఆడుదాన్ని నెత్తెక్కించుకుని కూర్చున్నాడు. బహుశా తన జుట్టు అడవిలా దట్టంగా పెరిగి ఉండడం వల్ల కాబోలు ఎవరికి కనిపించకుండా ఎలాగో దాస్తున్నాడు. ఆమె కూడ ఏదోలాగ ఒదిగి ఒదిగి కాలక్షేపం చేస్తోంది . కాని ఏం లాభం. ఒకరోజున పార్వతికి తన భర్త తలపైన ఒక ఆడుది ఉన్నట్లుగా అనుమానమొచ్చింది . ఏమని అడగాలో తెలియలేదు . సూటిగా ఆయనతోనే ఇలా అంది.
ఏమండీ ! మీ తలపై ఏదో ఉన్నట్లు కనిపిస్తోంది అదేంటి?. ఏమీ లేదే గరళం మ్రింగాను కదా! శరీరం వేడెక్కకుండ ఉంచుకోడానికి నీళ్లు అన్నాడు శివుడు . అదేమిటండి ఏదో ఆడుదాని ముఖం కనిపిస్తోంటేను అంది. ముఖం కాదే పిచ్చిమొద్దూ! అది పద్మం నీళ్లల్లో పద్మాలుండవా ఏమిటి అన్నాడు . అదేంటండి నల్లని జడలాంటిదేదో స్పష్టంగా కనిపిస్తోంటేను అంది. అదా తుమ్మెదలబారు లేవే . పద్మాలున్న చోట తుమ్మెదలుండడం సహజం. తుమ్మెదలు నల్లగా ఉంటాయిగా అందుకే అది నీకు జడలా అనిపిస్తోంది. అది సరే లెండి మరి నా కళ్లకు మఱో రెండు కళ్లు స్పష్టంగా కనిపిస్తోంటే అలా మాట్లాడతారేమిటి అంది . అవి కళ్లు కావే పిచ్చిదానా! చేపలు. చేపలుకూడ పైకి కళ్లల్లాగే మిలమిలా మెరుస్తూ కనిపిస్తాయి తెలుసా అన్నాడు. అటైతే మరేవో ఎత్తుగా రెండు కనిపిస్తున్నాయి. అవి అచ్చం పాలిండ్లలా ఉన్నాయి వాటి సంగతి చెప్పండి అంది . ఓసి వెర్రిదానా! అవి చక్రవాకపక్షులే . ఒకేలాగ రెండుంటాయి. అందులోను జంటగా ఉంటాయి. నీకన్నీ అనుమానాలే అన్నాడు.
ఆవిడకు ఇక ఓపిక నశించింది. సరేలే ఏదైతేనాకే అని ఆవిడ సరిపెట్టుకుని ఊరుకుంది. భలే మోసం చేశానులే. బాగానే నమ్మించాను అని ఆయన లోలోపలే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆ విధంగా తన సతీమణిని సరదాగా ఓ ఆటపట్టించిన గంగాధరుడు మనందఱిని రక్షించుగాక
                                मौळौ किं नु महेश ! मानिनि ! जलं किंवक्त्रमंभोरुहं
किं नीलालकवेणिका ? मधुकरी किं भ्रूलता? वीचिका
किं नेत्रे ? शफरौ किमु स्तनयुगं? प्रेम्खद्रथाङ्गद्वयं
साशंकामिति वञ्चयन् गिरिसुतां गङ्गाधर: पातु व:

                     మౌళౌ కింను మహేశ! మానిని! జలం కిం వక్త్రమంభోరుహం
                     కింనీలాలకవేణికా?మధుకరీ కిం భ్రూలతా? వీచికా
                    కిం నేత్రే ? శఫరౌ కిము స్తనయుగం ? ప్రేంఖద్రధాంగద్వయం
                   సాశంకామితి వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతు న:
                                    ( సుభాషిత రత్నభాండాగారం -౬/౬౬)

No comments: