Tuesday, November 19, 2013

వాయువ్యాస్త్రం ౧


వాయువ్యాస్త్రం ౧

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

    భోపాల్ గ్యాస్ ట్రేజిడీ అందరికి తెలిసిన విషయమే. కాని హ్యూమన్ గ్యాస్ కామెడి చాల మందికి తెలీదు. తెలుసుకోవాలంటే చదవండి . విషవాయువు జనాల్ని ఒకే ఒక్కసారి చంపుతుంది. కాని మానవబాంబు అంటే మనుషులనుండి వెలువడిన వాయువు చంపదు గాని పదే పదే చంపినంత పని చేస్తుంది. ఒక స్కూల్లో టీచరు విద్యార్థిని అన్ని వాయువుల్లో ప్రమాదకరమైన వాయువేదిరా అనడిగారు. దానికి సమాధానంగా అపానవాయువు సార్ నేనెప్పుడు మా తాతయ్య గదిలోనే ఉంటాను. అందువల్ల అనుభవంతో చెబుతున్నాను అన్నాడు వాడు . పాపం టీచరు కూడ ఎందుకో కాదనలేకపోయారు. ఆ విషయం అలా ఉంచుదాం
ఇంటికి ఇనుము బలం మనిషికి మినుము బలం అన్నారు పెద్దలు. మినుము బలమేగాని అరగకపోతే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఒక మఠం . ఆమఠంలో ఒక యోగి ఉన్నారు. ఒకరోజున ఆయన మోతాదు మించి మినుపగారెలు తిన్నారు. అవెందుకోఅరగ లేదు. ఆ విషయం ఆయనకు తెలియ లేదు. యథాప్రకారం శిష్యులకు పాఠం చెప్పడానికి కూర్చున్నారు . పాఠ ప్రవచనం జరుగుతోంది. మధ్యలో ఫట్ఫట్ , ఫటా ఫట్'అంటూ పెద్ద శబ్దం వెలువడింది. అక్కడున్న పక్షులన్నీ ఆ శబ్దం విని భయపడి ఎగిరిపోయాయి. మంచినీళ్లకుండలన్నీ పగిలిపోయాయి.. గోడలన్నీ కదిలిపోయాయి. శిష్యులందరు పాఱిపోయారు. వాళ్లల్లో కొంతమంది అర్భకులున్నారు. వాల్లందరు క్రింద పడిపోయారు. ఇంత గందరగోళం జరిగింది. అప్పటిదాక ప్రశాతంగా ఉన్న ఆశ్రమవాతావరణమంతా చెల్లాచెదురైపోయింది. ఈ విషయం ఈ క్రింది శ్లోకంలో ఉంది. చదవండి.
జగ్ధ్వా మాషమయాన పూపవటకానా ధ్మాయ మానోదరే
ఫట్ఫట్ఫాడితి పాయవీయ పవనం యోగేశ్వరే ముంచతి
ఉడ్డీనం విహగైర్ఘటైర్విఘటితం దోలాయితం భిత్తిభి:
శిష్యైర్ధావితమర్భకైర్నిపతితం కోలాహలోSభూన్మఠే.
(సుభాషిత రత్నభాండాగారం /౩౬౫/౫౮)-

No comments: