Tuesday, July 7, 2015

అభివాదములు పోతనామాత్య! గైకొమ్ము

అభివాదములు పోతనామాత్య! గైకొమ్ము
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

బంగారం మంచిదా కాదా తెలుసుకోవాలంటే నిప్పుల్లో పడేస్తే తెలుస్తుంది. భార్య ఉత్తమురాలా కాదా అనే విషయం తేల్చాలంటే కష్టాలొచ్చినప్పుడు తెలుస్తుంది. సంపదలున్నప్పుడు మనతో ఉండి కష్టాలు వచ్చినప్పుడు మీ తిప్పలేవో మీరే పడండి అని తాను పుట్టింటికి పోతే అది ఉత్తమురాలైన భార్య కాదు.  అలాగే ఒకవ్యక్తి మహావీరుడా కాదా అనే విషయం యుద్ధరంగంలో తెలుస్తుంది. శత్రువుల్ని చీల్చి చెండాడితే మహావీరుడౌతాడు. పాఱిపొతే పిరికివాడౌతాడు. యుద్ధంలో మరణించినా  మహావీరుడే ఔతాడు గాని పాఱిపోయినవాడు మాత్రం  యెన్నటికి మహావీరుడు కాలేడు. ఒకసారి ఒక  సైనికుడు నేను వందలకొలది శత్రువుల కాళ్ళు, చేతులు నరికేశాను అని గొప్పలు చెప్పుకు౦టున్నాడు. అదివిని ఒకాయన మరి తలకాయలెన్ని నరికావో చెప్పమన్నాడు.  దానికా సైనికుడు  ఓహో అదా! తలకాయలంతకుముందెవ్వరో నరికేశారన్నాడట. సరే! ఆ విషయం అలా ఉంచుదాం. ఇక ఒక వ్యక్తి పండితుడా కాదా అనే విషయం భాగవతం నిర్ణయిస్తుంది. అంటే   నేను చాల గొప్ప పండితుణ్ణి అని విర్రవీగే వ్యక్తికి భాగవతం చేతులో పెట్టి అర్థం చెప్పమంటే జలుబు కుదిరిపోతు౦ది.  అందుకే:
హుతాశనే హాటక స౦పరీక్షా
విపత్తికాలే గృహిణీపరీక్షా
రణస్థలే శస్త్రవతాం పరీక్షా
విద్యావతాం భాగవతే పరీక్షా”             అన్నారు
వ్యాసమహర్షి తన బుద్ధిబలాన్ని, ప్రతిభావిశేషాల్ని కలబోసి  భాగవతం రచి౦చాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అది కవితాకల్పద్రుమం, వేదాంతవిజ్ఞానపారిజాతం, రసాత్మకం, దురవగాహ్యం. అటువంటి ఆ సంస్కృతభాగవతాన్ని సరసంగా, ప్రత్యక్షరరమణీయంగా అనువదించిన ఘనత పోతనగారికే దక్కింది. అది పోతనగారు కాకుండా మరొకరు రచించి ఉంటే ఎలా ఉండేదో చెప్పలేం గాని  ఇ౦త రుచిగా మాత్రం ఉండేది కాదు. అ0దుకే కరుణశ్రీ గారు  ముద్దులుగార భాగవతమున్ రచియి౦చుచు జు౦టెతేనెలో నద్దితివేమొ గంటము అన్నారు. ఇక శ్రీవిశ్వనాథవారు  కూడ తమ రామాయణకల్పవృక్షంలో పోతనగారి కవిత్వాన్ని గురించి  ఒక మాటన్నారు.
విశ్వనాథవారికి శ్రీకొడాలి ఆంజనేయులు అనే గొప్ప కవిమిత్రుడుండేవారు. ఇద్దరూ కలిసి జంటకవిత్వం చెప్పేవారు. కాని శ్రీ కొడాలి వారు గాంధీమహాత్ముని పిలుపు విని కవితావ్యాసంగానికి స్వస్తిచెప్పి స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముని వెంట నడిచారు. విశ్వనాథవారు, తాను రామాయణం రచించే సమయంలో ఆయన తనతో లేక పోయినందుకు విచారిస్తూ, ఆయన కవిత్వ౦ గొప్పదని,   ఆయన తనకు తోడై ఉండి ఉంటే పోతనగారిలా కలకండలచ్చులుగా పొసి ఉండేవాళ్ళమని వివరించారు. కలకండమంటే పటికబెల్లం. ఆయన తనలో గల  లోపం కూడ నిర్భయంగ ప్రకటించారు. ఆయన మనస్సు మండుచున్న కొఱవి వలె చంచలమై౦దనీ, బొత్తిగా నిలకడలేనిదనీ, ఒక మంచి శబ్దం ఎంపిక చెయ్యడానికి క్షణం కూడ ఓపిక పట్టలేదని వివరించారు. ఇవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
తన మృదుజిహ్వపై రవలు దాల్చెడు నీలినిగారపు౦జిగుల్
సను కవితాసతిన్విడచి సాధుమహాహవశీలియౌ మహా
త్ముని యసి లేని సేనబడి పోయిన వాని కొడాలి యా౦జనే
యుని మును నాకు జంటకవియు౦బ్రియమిత్రము సంస్మరి౦చు చున్     
ఆతడె తోడు గల్గినను నచ్చముగా( గలకండలచ్చులుం
బోతలు పోసియు౦డెదము బోతన గారి విధాన దీపితా
లాతము వోలె సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగి  నా
చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావ తీవ్రతన్          

 నిజమే కవిత్వానికి భవ్యకవితావేశ౦ కావాలి, దివ్యమైన స౦యమనశక్తి కూడ కావాలి. అందుకే తిక్కన గారు వ్యాసమునిని  పొగుడుతు విద్వత్సంస్తవననీయ భావ్యకవితావేశు౦డు అన్నారు. ఆవేశం కవితకు పునాది. కాని అది సభ్యమైనది కావాలి, చవకబారుది కాకూడదు. ఆవేశానికి అడ్డుకట్ట  సంయమనమే.
  ` అందుకేనేమో   Wordsworth మహాకవి  ‘Poetry is the spontaneous overflow of powerful feelings, recollected in tranquility’ అని కవిత్వాన్ని నిర్వచించడం జరిగింది. 
   ఇక విశ్వనాథవారు వినయంతో అలా చెప్పుకున్నారు గాని ఆయన కవిత్వంలో అన్ని ఉత్తమగుణాలు పుష్కళంగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వ్యక్తులు యుగానికొకరు పుడితే చాల గొప్పే. విశ్వనాథ  తాను పోతనగారిలా రచన చేసి ఉ౦డేవాణ్ణి అని చెప్పుకోవడం ఆయన వినయాన్ని పోతనగారిపట్ల ఆయనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే అభివాదములు పోతనామాత్య! గైకొమ్ము అని  పోతనకు ఘనంగా  నివాళులర్పిద్దాం ..


No comments: