Thursday, July 2, 2015

విద్యాబోధనలో ఉచ్చారణ ప్రాముఖ్యం

విద్యాబోధనలో ఉచ్చారణ ప్రాముఖ్యం
డాక్టర్ చిలకమర్తి. దుర్గాప్రసాద రావు     
విద్యాబోధనలో ఉచ్చారణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. బోధన అనేది ఒక కళ . పాండిత్యం వేరు బోధన శక్తి వేరు . కొంతమందికి పాండిత్యం ఉంటుంది . ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగల సామర్థ్యం ఉంటుంది . కాని తమకర్థమైన విషయాన్ని ఇతరుకందించే నేర్పరితనం  ఉండదు .  కొంత మందికి పాoడిత్యం  చాల తక్కువగా ఉంటుంది . కాని తనకున్న జ్ఞానం  స్వల్పమైనా దాన్ని పూర్తిగా విద్యార్థి కందించగలిగే ప్రతిభ ఉంటుంది . దాన్నే బోధనశక్తి అంటాం . ఈ రెండు పుష్కలంగా ఉంటేనే ఉత్తమాధ్యాపకుడంటాం. లేకపోతే ఉత్త అధ్యాపకుడే అవుతాడు.
ఈ విషయాన్నే కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రంలో ...

శ్లిష్టా క్రియా కస్యచిదాత్మసంస్థా సంక్రాoతిరన్యస్య విశేషయుక్తా
యస్యోభయం సాధు స శిక్షకాణాo ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ --     అంటాడు.
 కాబట్టి తనకు తెలిసిన విషయాన్ని చక్కగా ఇతరులకు బోధించగలిగినవాడే మంచి ఉపాధ్యాయునిగా  పేరు తెచ్చుకుంటాడు. ముఖ కవళికలు , చేష్టలతో బాటుగా స్పష్టమైన ఉచ్చారణకూడ బోధనలో ఎంతో ప్రాధాన్యాన్ని  పొందుతోంది.
ఉపాధ్యాయ లక్షణాలు తొమ్మిదిoటిని  పేర్కొన్నారు.
శుచి: వచస్వీ వర్ఛస్వీ ధృతిమాన్ స్మృతిమాన్ వశీ
నమ్రోత్సాహీ చ జిజ్ఞాసు: దేశికో నవలక్షణ:
అని ఉపాధ్యాయునికి తొమ్మిది లక్షణాలు చెప్పారు. మొదటి లక్షణం శుచిగా ఉండడం . ఉపాధ్యాయుడు బాహ్యంగా ఆ౦తర్యంగా కూడా శుచిగా ఉండాలి. వచస్వి అంటే మంచి మాటకారిగా ఉండాలి . ఎంత కష్టమైన విషయాన్నైనా అవలీలగా బోధించగలిగే భాషాపటిమ కలిగి ఉండాలి. వర్చస్వి అంటే చక్కని  ముఖ వర్ఛస్సు కలిగి ఉండాలి. ధృతిమాన్ అంటే ధైర్యవంతుడై ఉండాలి. స్మృతిమాన్ అంటే మంచి జ్ఞాపకశక్తి గలవాడై ఉండాలి. వశీ అంటే ఆకర్షణ శక్తి కలవాడుగా ఉండాలి. విద్యార్థులoదరిని ఆకట్టుకునే శక్తి కలిగి ఉండాలి .  నమ్ర అంటే వినయసంపన్నుడై ఉండాలి . తాను బాగా చదువుకున్న వాడిననే అహంకారం ఎక్కడ ఉoడకూడదు  ఉత్సాహి అంటే ఉత్సాహంతో ఉండాలి . మందకొడిగా ఉండకూడదు.  ఇక చివరి లక్షణం జిజ్ఞాసు అని . అంటే జ్ఞానతృష్ణ కలిగి ఉండాలి .    
  
పూర్వకాలంలో అన్ని మౌఖికపరీక్షలే కావడం వల్ల ఉచ్చారణకు ప్రాధాన్యం ఉండేది . కాని రాను రాను మౌఖికపరీక్షలు మరుగుపడి వ్రాతపరీక్షల ప్రాముఖ్యం పెరగడం  వల్ల ఉచ్చారణకు విలువ తగ్గిoదనవచ్చు.
మన ప్రాచీనులు ఉచ్చారణకు చాల ప్రాధాన్యం ఇచ్చారు. అసలు ఉచ్చారణ విధానం వివరించడానికి ఒక వేదాంగమే ఉంది దాన్ని శిక్ష అంటాం.
స్వరవర్ణాద్యుచ్చారణ ప్రకారో  యత్ర శిక్ష్యతే సా శిక్షా   ( సాయణాచార్యుని ఋగ్వేద భాష్యం )
పదాలు ఉచ్చరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో,  లేకపోతే  ఎటువంటి అనర్థాలు కలుగుతాయో    చక్కగా వివరించారు.  

ఏక శ్శబ్ద: స్వరతోsర్థతో వా మిథ్యా ప్రయుక్తో న తదర్థ మా హ
స వాగ్వజ్ర: యజమానం  హినస్తి  యథేoద్రశత్రు: స్వరతో s పరాధాత్             

వృత్రాసురుడు  ఇంద్రుణ్ణి చంపాలనే కోరికతో ఒక  యజ్ఞం చెయ్యడం ప్రారంభించాడు. ఇంద్రశత్రు: వర్ధస్వ అని ఉచ్చరిస్తూ హోమాలు  చేస్తు న్నాడు .    ఇంద్రుని శత్రువైన తాను విజయం పొందాలి అనే ఆయన బావన. కాని ఇంద్రశత్రు అనే పదానికి రెండర్థాలున్నాయి .  ఇంద్ర: శత్రు: యస్య స: ఇoద్రశత్రు: అనే అర్థంలో ఇంద్రుడు శత్రువైన తాను సూచిoపబడతాడు. ఇది బహువ్రీహి సమాసం . ఇది మొదటి అక్షరం ఉదాత్తస్వరంలో ఉచ్చరించాలి. లేకపోతే అర్థం మారిపోతుంది.  ఇక ఇంద్రస్య శత్రు: ఇ౦ద్రశత్రు: . ఇంద్రుని యొక్క శత్రువు  ఇది అoత్యోదాత్తం.  ఇది  వృత్రాసురుణ్ణి  సూచిస్తుoది. దాని స్వరం వేరు దీని స్వరం వేరు . ఒక స్వరానికి బదులుగా మరొక స్వరం ఉచ్చరించాడు .   ఇంద్రుడు గెలిచాడు ఈయన ఓడిపోయాడు. చివరికి ఇంద్రుని చేతిలో మరణించాడు. కాబట్టి అక్షరాలను చాల జాగ్రతగా ఉచ్చరించాలి . లేకపోతే చాల  ప్రమాదం.    
 ఏ విధంగా పెద్దపులి తనపిల్లలకు దంతాలు గ్రుచ్చుకోకుండ జాగ్రత్తగా నోటితో పట్టుకుoటుoదో అదే విధంగా అక్షరాలను జాగ్రత్తగా ఉచ్చరిo చాలని పాణినీయశిక్ష అనే గ్రంథం  పేర్కొంది. గట్టిగా పట్టుకుంటే దంతాలు గుచ్చుకుంటాయి. గట్టిగా పట్టుకోకపోతే అవి  క్రిoదపడిపోతాయి.
వ్యాఘ్రీ యథా హరేత్పుత్రాన్ దంష్ట్రాభ్యాం న చ పీడయేత్
భీతా పతన బాధాభ్యాం తద్వద్వర్ణాన్ ప్రయోజయేత్
అక్షరాలను ఉచ్చరిoచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన వాళ్ళు చాల స్పష్టంగా చెప్పారు .
అక్షరాలను సాగదీయడం ,  వేగంగా చదవడం , తల ఎక్కువగా ఊపడం , ఎలా వ్రాసుంటే అలా చదివెయ్యడం , అర్థం తెలియకుండా చదవడం , ఎవరికీ వినిపిoచకుండ సన్నగా చదవడం అనేవి అధమపాఠకుని లక్షణాలు.
గీతీ శీఘ్రీ శిర: కంపీ యథాలిఖితపాఠక:
అనర్థజ్ఞాల్పకంఠశ్చ షడేతే పాఠకాధమా: (పాణినీయశిక్ష)
అలాగే  మధురమైన కoఠo,  అక్షరాలను స్పష్టంగా పలకడం, పదచ్ఛేదం , మంచిస్వరం,  ధైర్యం , లయబద్ధంగా ఉచ్ఛరించడం  అనేవి  మంచి ఉపాధ్యాయుని లక్షణాలుగా పాణినీయశిక్షా గ్రంథం పేర్కొంది .

మాధుర్యమక్షర వ్యక్తి : పదచ్ఛేదస్తు సుస్వర:
ధైర్యం లయసమర్థం చ షడేతే పాఠకా: గుణా:
గంభీరత్వమనైశ్వర్యం నిర్వ్యూఢిస్తారమంద్రయో:
సువ్యక్తవర్ణ లావణ్య మితి పాఠగుణా: స్మృ తా:

వీటితో బాటుగా ఉచ్చారణలో తరచుగా  వచ్చే దోషాలేమిటో పాణినీయశిక్ష  చాల స్పష్టంగా పేర్కొంది.
శంకితం1 భీత 2 ముద్ధృష్ట 3మవ్యక్త4 మనునాసికం5  
కాకస్వరం6 మూర్ధ్నిగతం 7తథా స్థానవివర్జితం 8
విస్వరం 9 విరసం చైవ10 విశ్లిష్టం 11 విషమాహతం12
వ్యాకులం 13 తాలహీనం14 చ పాఠదోషా: చతుర్దశ
అని 14 దోషాలు పేర్కోవడం జరిగింది .          

`1.  శంకితం అంటే doubtful గా చదవడం.
 2. భీతం అంటే భయం భయంగా (fearful)
3. ఉద్ధృష్టం అంటే (crushed-ness)  మధ్యలో అడ్డు ఆపు లేకుండా చదివెయ్యడం.
4. అవ్యక్తం (clumsy) అంటే అస్పష్టంగా చదవడం
5. అనునాసికం ముక్కుతో చదవడం (nasal sound).
6. కాకస్వరం అంటే  కర్కశంగా చదవడం changing of the voice under different emotions
7. మూర్ధ్నిగతం (Lingual sound) న కు బదులు ణ ఉచ్చరించడం
అంటే అనడానికి అనడం ; కు బదులు పలకడం ముదలైనవి. ఉదాహరణకు మా నాన్న గారు చదువుకునే రోజుల్లో ఒక టీచరు ఉండేవారు . ఆయన ఆంగ్లేయుడు , పలకడం రాదు . మణకు ఉట్టరముణ హిమాలయపర్వటములు కలవు . అవి ఎక్కుట నీ వల్లకాడు నావల్ల కాడు అనేవాడు . పిల్లలందరూ నవ్వేవారు. కాని వల్లకాడు అనే మాటకు ఆయనకు అర్థం తెలియక పిల్లలు నవ్వినందుకు వాళ్ళని మందలించేవాడు.
8 స్థాన వివర్జితం అంటే అక్షరాలు తారుమారు చెయ్యడం (changing the place of the letters) ఉదాహరణకి నాటకానికెల్లారు అనడానికి పొరబాటుగా నాకటానికెళ్ళారనడం .   ,
9. విస్వరం అంటే కొన్ని స్వరాలను సరిగా ఉచ్చరించలేక ఒక స్వరానికి మరొక స్వరం ఉచ్చరించడం. ఇది చాల ప్రమాదకరమైనది. నాకు చాలు అనే మాటలోని,  చకారాన్ని ఒకలా ఉచ్చరించడానికి బదులు మరోలా ఉచ్చరిస్తే కొ౦ప ములుగుతు౦ది.
10. విరసం harshness (unfeeling) ఉచ్చరిస్తున్న పదాల యొక్క అర్థాని feel అవకుండా ఏదో చదివెయ్యడం.      
11 . విశ్లిష్టం (disunion) కలిపి చదవవలసిన చోట విడదీసి చదవడం .
ఉదా:- రామునితో, కపివరు౦డిట్లనియెఅనడానికి బదులు రామునితోక,  పివరు౦డిట్లనియె మున్నగునవి.
12.  విషమాహతం (wrong stressing) బాధ అనడానికి బదులు భాద అనడం ; బోధ  అనవలసిన చోట భోద అనడం .
13 .వ్యాకులం (overtaking) కలగాపులగం చేసి చదవడం .
14. తాలహీనం- (rhythemlessness) లయబద్ధంగా చదవకుండా ఇష్టం వచ్చినట్లు చదవడం . దానివల్ల విద్యార్థి అర్థం పూర్తిగా గ్రహించలేడు.
, అలాగే:
అతితీర్ణ మతివిలంబిత ముల్బణ నాదశ్చ  నాదహీనశ్చ
అపదచ్ఛిన్న మనావృతమతిమృదుపరుషం చ నిందేత
అని మరెన్నో విశేషాలున్నాయి. వాటిని గురించి ముందు ముందు తెలుసుకుందాం .
ఉచ్చారణదోషాలు నివారించుకుందాం.
బోధనపటిమ పెంపొందించుకుందాం


No comments: