Wednesday, July 1, 2015

అమ్మభాష - తుమ్మల ఆవేదన

       అమ్మభాష - తుమ్మల ఆవేదన
 ఆంధ్రజాతి గర్వించదగిన మహాకవులలో శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు ఒకరు. ఆయన తన  కవితాగానంతో ఆంధ్రజాతిని జాగృతం చేసిన మహామనిషి . నిష్కళంక దేశభక్తుడు.మహాత్ముని యందనురక్తుడు. తెలుగులెంక. తాను రచించిన రాష్ట్రగానంతో యావదాంధ్రజాతి  మేల్కొన్నదనే విషయాన్ని  వారే స్వయంగా సగర్వంగా చాటుకున్నారు. వారి మాటల్లోనే  విందా౦.

నేననినoద్రిలింగధరణీహితగాఢతపోగ్నిదుర్భర
గ్లాని సహించినట్టి ఋషికల్పుడ మామకరాష్ట్రగానముల్
వీనులసోకి యీ తెనుగువిశ్వము మేల్కొనెనన్న సత్యముం
గానని విజ్ఞులు౦డెదరు గాక! నతుల్ పదివేలు వారికిన్

 ఇక తెలుగుభాష పట్ల ఆయనకున్న ప్రేమాదరాలు  వర్ణించనలవి కానివి . తెలుగువారు ఇరుగు పొరుగు భాషల పట్ల చూపిస్తున్న ప్రేమాదరాలు  తమ మాతృభాష పట్ల  చూపి౦చలెకపోవడం ఆయనను చాల కలవరపరిచిన విషయం. ఒక సందర్భంలో  తన ఆవేదనను ఎలా వ్యక్తం చేశారో స్వయంగా చూడండి .

బె౦గాలీకృతికర్తపాదములకర్పి౦చున్నమస్కారము
ప్పొ౦గున్బారశిలేఖినీ విలసనంబుల్ సూచి రావయ్య నా
బంగారంబ! యటంచు నా౦గ్లకవినాహ్వాని౦చు నేపాపమో !
రంగా ! మెచ్చడు తెన్గుబిడ్డ కవిసమ్రాట్టున్ స్వదేశీయునిన్

తెలుగువాడు బె౦గాలీకవికి పాదనమస్కారాలు చేస్తాడట . పారశీకవిత్వాన్ని విని ఉప్పొంగిపోతాడట. ఓ నా బంగారమా ! అని ఆ౦గ్లకవిని ఆదరంగా ఆహ్వానిస్తాడట. కాని ఎందుకో కవిచక్రవర్తిని సైతం ఆయన తెలుగువాడైతే ఆదరి౦చడట. ఎ౦త దారుణం! కాబట్టి మనం మన సంస్కృతి, సా౦ప్రప్రదాయాలను గౌరవిస్తూ తెలుగుభాషను, తెలుగుకవులను, రచయితలను ఆదరిస్తూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తే అదే శ్రీ తుమ్మలవారికి మనమిచ్చే అసలు సిసలైన నివాళి.             


      

No comments: