Sunday, July 5, 2015

ప్రాచీనభారతo – మహిళాసాధికారత

      ప్రాచీనభారతo మహిళాసాధికారత
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
 భారతదేశంలో స్త్రీలకు స్వేచ్ఛాస్వాతంత్యాలు లేవని, వారికి పురుషులతో సమాన మైన ప్రతిపత్తి లేదని, వాళ్లను చాల హీనంగా చూసేవారనే అభిప్రాయం  నేటి సమాజంలోని మేధావివర్గంలో సైతం  ఉంది. ఈ అభిప్రాయాన్ని సమర్ధించుకోడానికి వారు న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి; న భజేత్ స్త్రీ స్వతంత్రతాంమొదలైన  మనువు వాక్యాలను ఉదాహరిస్తున్నారు.  అంతే కాక  భారతదేశంలో స్త్రీజాతి దుస్థితికి మనువే ప్రధానకారణమని భావించేవారు కూడ లేకపోలేదు.
కాని వాస్తవం విచారిస్తే వారి అభిప్రాయాలు కేవలం అపోహలు మాత్రమేనని తెలుస్తుంది.  ఎoదుకంటే  మనువు తన గ్రంథమైన మనుస్మృతిలో స్త్రీజాతిపట్ల ఎంతో గౌరవాదరాలు ప్రకటించడం మనం గమనిoచొచ్చు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:
యత్ర నార్యస్తు పూజ్యoతే రమంతే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యoతే సర్వాస్తత్రాఫలా: క్రియా:
ఎక్కడ స్త్రీలు గౌరవిoపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. ఎక్కడ స్త్రీలు నిరాదరణకు గురౌతారో అక్కడ చేపట్టిన కార్యాలన్నీ నిష్ఫలమౌతాయి.
 ఆ విధంగా స్త్రీజాతిపట్ల ఉన్నతభావాలను వ్యక్తం చేసిన మనువు స్త్రీకి స్వాతంత్ర్యం ఉండరాదు ఆమె స్వతంత్రిoచుటకు తగదు  అని  పరస్పరవిరుద్ధంగా చెప్పడం పొసగని మాట. ఎందుకంటే  మహా పురుషుల మాటలు,  శాస్త్రకారుల మాటలు  పరస్పరవిరుద్ధంగా ఉండవు.  ఒకవేళ పైకి పస్పరవిరుద్ధంగా కన్పిస్తే సమన్వయo చేసుకుని తాత్పర్యాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది. ఆవిషయాన్ని పరిశీలిoచే ముందు ప్రాచీనభారతదేశంలో మహిళామణుల స్థితిగతులను గురించి కొంత తెలుసుకోవడం అవసరం.
ప్రపంచసాహిత్యంలోనే మొట్టమొదటి గ్రంథమైన ఋగ్వేదాన్ని పరిశీలిస్తే  వైదికయుగంలో స్త్రీలకు  కుటుంబంలో ఎంత గౌరవo ఉండేదో తెలుస్తుంది
  సమ్రాజ్ఞీ శ్వశురే  భవ సమ్రాజ్ఞీ   శ్వశ్ర్యాం భవ
 ననాoదరి సమ్రాజ్ఞీ భవ  సమ్రాజ్ఞీ  అధిదేవృషు
నీ మామగారి యెడ మహారాణిలా ప్రవర్తించు. అత్తగారిపట్ల  మహారాణిలా మసలుకో . ఆడబడుచు వద్ద మహారాణిలా ఉండు.  నీ మరదుల యెడ మహారాణిలా వ్యవహరించు. ఈ మాటలు కుటుంబంలో స్త్రీకి గల స్థానాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇక విద్యావిషయానికొస్తే స్త్రీలు కూడ పురుషులతో సమానంగా ఉపయన౦ మొదలైన  సంస్కారాలు పొంది వేదాదివిద్యలు అభ్యసిoచేవారని తెలుస్తోంది
పురాయుగేషు నారీణాo మౌ౦జీబంధనమిష్యతే
వేదస్యాధ్యయనం సమ్యక్  గాయత్రీ వచనం తథా అనే శ్లోకం ఈ విషయాన్ని ధృవీకరిస్తో౦ది. వేదమంత్రప్రవక్తలలో స్త్రీల స౦ఖ్య కూడ చాల గణనీయంగానే కన్పిస్తోంది.  రోమశ, లోపాముద్ర. జరిత, సారంగ, యమి, ఇంద్రాణి, సావిత్రి  మొదలగు మహిళామణులు వారిలో కొందరు.

ఇక విద్యాబోధన విషయానికొస్తే  మాతృమాన్  పితృమాన్  ఆచార్యవాన్ పురుషో వేద అని శతపథబ్రాహ్మణం ఉపాధ్యాయులందరి  సరసన  స్త్రీమూర్తికే పెద్దపీట వేసింది. ఇది స్త్రీజాతి ఔన్నత్యానికి మరొక నిదర్శనం.
రామాయణ కాలంలో కూడ స్త్రీల స్థానం సమున్నతంగానే ఉంది.
శ్రీరాముడు తన పత్ని సీతకు  వనవాసకష్టం కలగకూడదనే ఉద్దే శ్యoతో ఆమెను తన వెంటతీసుకుపోడానికి నిరాకరిస్తాడు. ఆమె కూడ తనను వెంట తీసుకుపొమ్మని రాముని ప్రార్థిస్తుంది. రాముడు ఎంత చెప్పినా వినడు. చివరికి ఆమె రామునితో రామా! నువ్వు  పురుషరూపంలో ఉన్న ఆడుదానివి (నపుంసకుడివి), అట్టి నిన్ను నా తండ్రి  ఏమనుకుని తనకు అల్లునిగా చేసుకున్నాడో తెలియడం లేదు అంటుంది.  ఈటెల వంటి ఆ పదునైన మాటలు ఆమె ప్రౌఢత్వానికి, నిర్భీకతకు, ఔన్నత్యానికి ఉదాహరణ . ఆమె మాటల్లోనే  చెప్పాలంటే..
కిo త్వా మన్యత  వైదేహ:  పితా మే మిథిలాధిప:
రామ! జామాతరo ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహం
( అయోధ్యా కాండ, 30 సర్గ )
అదే విధంగా మహాభారతంలో దుష్యంతుడు  తనవద్దకు వచ్చిన శకుంతలను నిరాకరిస్తూ చాల దారుణంగా నిందిస్తాడు. అపుడు ఆమె చెప్పిన సమాధానం ఒక మగువ మనస్థైర్యానికి ఆత్మాభిమానానికి  మంచి ఉదాహరణ.
దుష్యంతుడు శకుంతలతో  ఈ  పిల్లవాడు నా వల్ల కలిగాడంటున్నావు. నీ మాటలెవడు నమ్ముతాడు? నీ తల్లి మేనక  దయలేనిది, వేశ్య . ఇక  నీ తండ్రి విశ్వామిత్రుడు కూడ ఎటువంటి కనికరం లేనివాడు, కాముకుడు, దురాశ కలవాడు. అందుకే క్షత్రియుడై యుండి బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. వాళ్ళ ఇద్దరికీ పుట్టిన నువ్వు వేశ్యలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు లేదా అంటాడు .

న పుత్రమభిజానామి  త్వయి జాతం శాకుoతలే!
అసత్యవచనాsసి త్వ౦ కస్తే శ్రద్ధాస్యతే వచ:
మేనకా నిరనుక్రోశా బంధకీ  జననీ తవ
స చాsపి నిరనుక్రోశ: క్షత్రయోని: పితా తవ
విశ్వామిత్రో బ్రాహ్మణత్వే లుబ్ధ: కామపరాయణ:
మేనకాప్సరసాం శ్రే ష్ఠా మహర్షీణాo  చ తే పితా
తయోరపత్యం కామా త్వం పు౦శ్చలీవాభిధాస్యసి
ఆశ్రద్ధేయమిదం వాక్యం  కథయన్తీ  న లజ్జసే .       

           ఆ మాటలకు మరొక స్త్రీ ఐతే తలొంచుకుని బయటకు వెళ్ళిపోయేది. కాని శకుంతల ధీరవనిత. ఎలాత్రిప్పి కొట్టిందో   చూడండి.
ఓ రాజా ! నువ్వు ఇతరుల్లో ఉండే ఆవగిoజ వంటి తప్పుల్ని  వెదుకుతున్నావు. నీలో ఉండే బిల్వఫలం వంటి తప్పులు నీకు కనిపించడం లేదు. నా తల్లి మేనక దేవవేశ్య . నేను ఆకాశంలో సంచరించేదాన్ని. ఇక నువ్వు భూమి మీద  తిరిగే సామాన్యమైన మనిషివి. నీకు, నాకు ఆవగిoజకు మేరుపర్వతానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఒక కురూపి తనముఖాన్ని అద్దంలో చూసుకునేoతవరకు  తానందరికంటే  అందగాడిననే  అనుకుoటూ  ఉంటాడు. పంది మలాన్ని ఇష్టపడే విధంగా మూర్ఖుడు ఇతరులలోని మంచిని విడిచిపెట్టి చెడునే స్వీకరిస్తాడు. కాని గుణవంతుడు  హంసవలె మంచిచెడులను పరికించి మంచినే స్వీకరిస్తాడు. మూర్ఖుడు స్వయంగా దుర్మార్గుడై ఉండి మంచివాణ్ణి దుర్మార్గుడని నిoదిస్తాడు. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయమేముంటుoది అని  అందంగా పందితో పోల్చి మెత్తటి చెప్పుతో సుతిమెత్తగా వాయించింది.       
 రాజన్ ! స ర్షపమాత్రాణి  పర చ్ఛిద్రాణి పశ్యసి
ఆత్మనో బిళ్వ మాత్రాణి పశ్యన్నపి  న పశ్య సి
మేనకా త్రిదశే ష్వేవ   త్రిదశశ్చానుమేనకాం
మమైవోద్రిచ్యతే  జన్మ  దుష్యంత ! తవ జన్మత:
క్షితావటసి రాజంస్త్వం  అంతరిక్షే చరామ్యహం
ఆవయోరంతరం మన్యే మేరుసర్షపయో రివ
 విరూపో యావదాదర్శే     నాత్మానం పశ్యతే ముఖం
మన్యతే తావదాత్మాన  మన్యేభ్యో రూపవత్తరం
మూర్ఖో  హి జల్పతాం పుంసాం శ్రుత్వా వాచ: శుభాశుభా:
అశుభం వాక్య మాదత్తే పురీషమివ సూకర:
ప్రాజ్ఞస్తు జల్పతాం  పుంసాం శ్రుత్వా  వాచ: శుభా శుభా:
గుణవద్వాక్యమాదత్తే హంస:   క్షీరమివాంభస:
అతో హాస్యతరం  లోకే  కిoచిదన్యన్న విద్యతే
యత్ర దుర్జన ఇత్యాహ  దుర్జన: సజ్జనం స్వయం

అలాగే కీచకునిచే అవమానింపబడిన ద్రౌపది, నిద్రపోతున్న భీముని ఓ భీమ ! నువ్వు చచ్చిన శవంలా పడుక్కున్నావేoటి ?లే ! అని లేపి కూర్చోబెట్టింది.
అదే విధంగా మాయజూదంలో ఓడిపోయిన ద్రౌపది నేను ధర్మవిజిత నా లేక అధర్మవిజితనా  అని నిలదీసి ప్రశ్నించింది.
గచ్ఛ  త్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛ సూతజ!
కిం ను పూర్వం పరాజేషీ: ఆత్మానం మాం ను భారత!
ఏతద్ జ్ఞాత్వా త్వమాగ చ్ఛ తతో మాం నయ సూతజ! 
         ఇక సావిత్రి మాటకొస్తే ఆమె సాక్షాత్తు యమధర్మరాజునే ఎదిరించి పతిప్రాణాలు దక్కించుకుంది. దమయంతి ఇంద్రాది దేవతల్ని ఎదిరించి, మెప్పించి , ఒప్పించి చివరకు తాను వలచిన నలుణ్ణి పొందగలిగింది. ఈ విధంగా మనం ఎవరిని తీసుకున్నా వారంతా నిబ్బరం గల కొమ్మలే గాని ఎలా వంచితే అలావంగే రబ్బరుబొమ్మలు కారు.

మనమిక్కడో  విషయం గమనించాలి. వారందరూ భర్తలను ఎదిరి౦చినా, చివరికి భగవంతుణ్ణి ఎదిరి౦ఛినా ధర్మం కోసమేగాని అహంకారంతో బరితెగి౦చి కాదు.
మధ్యయుగం మాటకొస్తే స్త్రీల స్థానం ఇంకా ఉన్నతంగా ఉంది. శ్రీ శంకరాచార్యులు శ్రీ మండనమిశ్రులకు మధ్య  జరిగిన శాస్త్రవివాదానికి మండనమిశ్రులవారి సతీమణి ఉభయభారతి అధ్యక్షురాలిగా వ్యవహరించడం; ఆమె నిష్పాక్షికంగా తన భర్తకు ప్రత్యర్ధియైన శంకరులను విజేతగా ప్రకటించడం బహుశ: ప్రపంచచరిత్రలోనే అపూర్వమైన సంఘటన. ఇక ఆధునికకాలానికొస్తే మహిళలు పురుషులతో సమానంగాను, కొంతమంది పురుషులకంటే ముందంజలోను కూడ ఉన్నారు.
ఇపుడు మనువు మాటలు విచారిద్దాం.  
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
తనయ: స్థవిరే భావే  న స్త్రీస్వాతంత్ర్యమర్హతి .
ఇది ఆయనన్న మాట . స్త్రీని చిన్నప్పుడు తండ్రి రక్షిస్తాడు; యౌవనంలో భర్త రక్షిస్తాడు; ముసలితనంలో కొడుకు రక్షిస్తాడు. స్త్రీ  స్వతంత్రి౦చుటకు తగదు. అని అర్థం . ఇక్కడ రక్షతి అనే పదం మూడు దశలలోనూ ప్రయోగించడం వల్ల ఏ దశలోను స్త్రీ రక్షణలేకు౦డ ఉ౦డకూడదు ( A woman should not be left without protectoin) అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఇక్కడ  మరొక సూక్ష్మమైన విషయముంది.
వేదవాక్యాలన్ని విధిని గాని నిషేధాన్ని గాని చెబుతాయి. ఒక వేళ అలా చెప్పకపోతే వాటికి ప్రామాణ్య౦ లేదని, క్రియకు భిన్నమైనట్టి సిద్ధవస్తువును ప్రతిపాదించే వాక్యాలన్నీ అనర్థకాలు, ప్రయోజనం లేనివి అని ఆమ్నాయస్య క్రియార్థత్వాదానర్థక్యమతదర్థానామ్(జైమిని సూత్రం 1-2-1)   అనే జైమినిమహర్షి  మాటల ద్వారా తెలుస్తోంది. అందువల్ల వేదవాక్యాల్లో ఉండే  వర్తమానకాలబోధకక్రియాపదానికి(present tense) కూడ విధ్యర్థమే (imperative mood) వర్తిస్తుంది.           
మనుధర్మశాస్త్రం స్మృతి. అది శ్రుతిని (వేదాన్ని)  అనుసరించే ప్రవర్తిస్తుంది కాబట్టి వేదంతో సమానం. శ్రుతేరివార్థం స్మృతిరన్వగ చ్ఛత్ అంటాడు కాళిదాసు . అందువల్ల ఇక్కడ రక్షించును (protects) అనే పదానికి రక్షి౦చవలెను( should protect) అనే అర్థం గ్రహించాలి . ఈవిధంగా అర్థం చేసుకోక పోవడం వల్లనే నేడు సమాజంలో తండ్రులు తమ కుమార్తెలను; భర్తలు తమ భార్యలను; కొడుకులు తమ తల్లులను చూడడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు, నిరాదరణకు గురి చేస్తున్నారు.  
మరోముఖ్యమైన విషయముంది. మనం చిన్నపిల్లల్ని గాని ఆడపిల్లల్నిగాని ఒంటరిగా బయటకు పంపం. ఒకవెల్ బయటకు వెళ్ళవలసొస్తే  పంపేటప్పుడు మరొకర్ని సహాయంగా పంపిస్తాం. అలా పంపించడం వాళ్లకి గౌరవాస్పదమే అవమానాస్పదం కాదు. అలాగే పూర్వం మనదేశం ఎన్నో దండయాత్రలకు గుఱి ఐంది. అ౦దువల్ల  విదేశీయులను౦డి స్త్రీజాతిని రక్షించడం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆంక్షలు విధించి ఉండవచ్చు. ఇక స్త్రీపురుషులంతా సమానమే అని మనం ఎంత బల్లగుద్ది వాదించినా పురుషునికంటే స్త్రీకి కొన్ని భౌతికమైన పరిమితులున్నాయి. ఇది ప్రకృతిధర్మం. దీని కెవరూ ఏమి చేయలేరు. ఉదాహరణకి ఒక పురుషుడు పొరబాటుగా  తన ఇంటితాళం మఱిచిపోయినా లేక పోగొట్టుకున్నా ఆ రాత్రి అరుగు మీదపడుక్కుని కాలం గడిపేస్తాడు. అదే పరిస్థితి ఒక స్త్రీ కి ఎదురైతే ఆమె ఆ పని చేయలేదు. ఎoదుకంటే రక్షణ లేకుండా ఆమె ఉండలేదు. అందుకే సర్వకాల సర్వావస్థల౦దు ఆమెకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో  మనువు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. అందువల్ల ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాని పూర్వాపరాలు గమనించి అర్థం చేసుకోవాలి. తొందరపాటు తగదు.                  
అందువల్ల నేటి స్త్రీమూర్తులు మనువుమాటల్లోని , పురాణవనితల చేతల్లోని ఆంతర్యాన్ని చక్కగా గమనించి, తమ హక్కులను, హక్కులతో పాటు బాధ్యతలను కూడ గుర్తెఱిగి మసలుకుంటే ఈ భూమి స్వర్గతుల్యం అవుతుంది . అటువంటి మంచి రోజులు త్వరలో వస్తాయని ఆశిద్దాం.

                                               *****

No comments: